• facebook
  • whatsapp
  • telegram

బందిఖానాలో మానవహక్కులు

సంస్కరణాలయాలుగా విలసిల్లాలన్న జైళ్ల ప్రవచిత లక్ష్యం నేటికీ కార్యాచరణలో దారుణంగా కొల్లబోతోంది. తరతమభేదాలతో దేశంలోని కారాగారాలు దుస్సహ స్థితిగతుల్లో కునారిల్లుతుండగా, ఖైదీల ప్రాథమిక హక్కులకూ తూట్లు పడుతున్నాయి. నిర్బంధితుల్ని యమయాతనలకు గురిచేస్తున్న దేశాల్లో ఇండియా ఒకటని దాదాపు ముప్ఫై ఏళ్లక్రితం ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌’ నివేదిక ఆక్షేపించింది. రెండున్నర దశాబ్దాలనాడు దేశవ్యాప్తంగా జైళ్ల పరిస్థితిని ప్రత్యక్షంగా తిలకించి, అవి నరకానికి నకళ్లని జాతీయ మానవహక్కుల సంఘం ఛైర్మన్‌గా జస్టిస్‌ రంగనాథ మిశ్రా వాపోయారు. ఇన్నేళ్ల తరవాతా చీకటి కొట్టాల్లో మానవ హక్కుల హననం కొనసాగుతూనే ఉంది! తెలంగాణ కేంద్ర కారాగారంలో కరకు లాఠీ దాష్టీకానికి గురైన ఏడుగురు జీవితఖైదీల ఫిర్యాదుతో ఉన్నతాధికారికి స్థానభ్రంశం కలిగిన తాజా ఉదంతం- దశాబ్దాల అంతులేని అకృత్యాల కథకు ‘మచ్చ’తునక. బందిఖానాలు సమస్యల నెలవులుగా భ్రష్టుపడుతున్నాయని ‘కాగ్‌’ నివేదికలు తూర్పారపట్టినా, దీటైన దిద్దుబాటు చర్యలు ఎండమావుల్ని తలపిస్తున్నాయి. నేరం రుజువై జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులకు సైతం రాజ్యాంగదత్తమైన ప్రాథమిక హక్కుల రక్షణ లభించాల్సిందేనని న్యాయస్థానాల తీర్పులు విశదీకరిస్తున్నాయి. పౌరులందరికీ రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సంక్రమించిన ‘గౌరవప్రదంగా జీవించే హక్కు’ అనుల్లంఘనీయమైనది. జరుగుతున్నదేమిటి? దండధరుల కండకావరం మూలాన పోలీస్‌ ఠాణాల్లోనూ ఆ హక్కులు దిక్కులేనివవుతున్నాయి. చిత్రహింసలకు, లాకప్‌ చావులకు అడ్డుకట్ట పడనే లేదంటున్న జాతీయ నేరగణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికాంశాలే అందుకు బలమైన దృష్టాంతం. సామర్థ్యానికి మించి కిలకిటలాడుతున్న జైళ్లలో చిలవలు పలవలు వేసుకుపోతున్న అవినీతి, లైంగిక దోపిడి, కస్టడీ హింస- సత్వర సంస్కరణల అత్యావశ్యకతను ఎలుగెత్తుతున్నాయి!

ఖైదీల పట్ల నిర్లక్ష్యం వహించడం, తగినంత ఆహారాన్ని దుస్తుల్ని సమకూర్చకపోవడం రాజ్యహింస కిందకే వస్తాయన్నది న్యాయపాలిక భాష్యం. సత్వర విచారణకూ నోచకుండా ఏళ్లూపూళ్లూ జైళ్లలోనే గడిపేయాల్సి రావడం ఎవరి పాపం? దేశంలోని చెరసాలల్లో మొత్తం ఖైదీలు 4.83లక్షల మంది. అందులో 3.68 లక్షల మంది (76శాతం) విచారణ ఖైదీలే. విచారణకు నోచుకోకుండా వేర్వేరు ఆరోపణలకింద విధించదగ్గ గరిష్ఠ శిక్షాకాలంలో సగందాకా ఖైదులోనే గడిపేసిన అందరినీ వదిలిపెట్టాలని 2014లోనే సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. కొన్ని నిబంధనలకు లోబడి విచారణ ఖైదీలకు సత్వర బెయిలు మంజూరు చేయాలని న్యాయసంఘం సైతం సిఫార్సులందించింది. వాటికి సరైన మన్నన దక్కని పర్యవసానంగా పౌరస్వేచ్ఛ చెరలో కపోతమై విలపిస్తోంది. ‘కనీసం అభియోగాలైనా నమోదుచేయకుండా పదకొండేళ్లపాటు జైలులో ఉంచుతారా?’ అని ఆరునెలలక్రితం సుప్రీంకోర్టు నిగ్గదీయాల్సిరావడం- నేరన్యాయ వ్యవస్థకే నగుబాటు. సామాన్యుల్ని మానవమాత్రులుగానే గుర్తించని అధికార సిబ్బందిలో కొంతమంది- చేతులు తడిపినవాళ్లకు జైళ్లలో రాజభోగాలు సమకూర్చి తరించిపోతుండటం సిగ్గుచేటు. విచారణ ఖైదీలకు ఉపశమనం ప్రసాదించే కీలక శాసన సంస్కరణలకోసం ఇప్పటికే న్యాయసంఘం ఎన్నో విలువైన సిఫార్సుల్ని సమర్పించింది. చట్టాల్లో లెక్కకు మిక్కిలి లొసుగుల్ని సూటిగా తప్పుపట్టిన లా కమిషన్‌- విచారణ ప్రక్రియలో విపరీత జాప్యాన్నీ దుయ్యబట్టింది. ఖైదీల దయనీయావస్థ, కారాగారాల్లో వారిపట్ల అమానవీయ ధోరణుల్ని పలుమార్లు గర్హిస్తూ న్యాయపాలిక చెప్పినట్లు- బందీలూ మనుషులే. దురదృష్టవశాత్తు- పాలకశ్రేణుల్లో, అధికార యంత్రాంగంలో ఆ స్ఫూర్తి పోనుపోను అడుగంటుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలతో జైళ్ల గదిగోడలు ఇలా ఇంకెన్నేళ్లు పొగచూరిపోవాలి?

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

‣ వందేభారత్‌ కొత్త పరుగు

‣ జల సరిహద్దుల్లో జగడం

‣ తీరాలను మింగేస్తున్న కడలి

‣ చైనా దూకుడుకు ముకుతాడే లక్ష్యం

‣ బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక దన్ను

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 26-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం