• facebook
  • whatsapp
  • telegram

ఓటర్లపై తాయిలాల వర్షం

విపరీత హామీలు విమర్శలపాలు

ఇండియాలో ఎన్నికలు రాగానే జనంపై ఉచిత హామీల వర్షం కురుస్తుంది. మాఫీలు, ఉచితాలకు ఎక్కువగా రైతులే లక్ష్యంగా మారుతున్నారు. అధికారం తరచూ చేతులు మారుతుండే రాష్ట్రాల్లో ఈ ధోరణి మరింత అధికంగా ఉంటోంది. కాకపోతే, ఉచితాల పేరిట తాయిలాలు అందుకుంటున్న లబ్ధిదారులు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలు, లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య కోసం ప్రైవేటు బడులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇదే భారత్‌లో కనిపించే వైచిత్రి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాలూ తాయిలాల ఆశలకు లాకులెత్తాయి. ఈ విషయంలో భాజపా, కాంగ్రెస్‌, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆమ్‌ఆద్మీ తదితర పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్తు, డీఏపీ, యూరియా, రుణమాఫీ, వడ్డీలేని రుణం, బీమా, పింఛన్లు, మహిళలకు గ్యాస్‌ సిలిండర్లు, నెలనెలా నగదు వంటివన్నీ ఆయా పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోల్లో కొలువుతీరాయి. ప్రజారవాణాలో ఉచిత ప్రయాణం, ఉచిత చికిత్స, అమ్మాయిలకు స్కూటీలు, అబ్బాయిలకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల వితరణ, యువతుల పెళ్లికోసం నగదు సహాయం తదితర హామీలతో అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తొలి వరస సిబ్బందికి ఉచిత స్కూటర్లు, ద్విచక్రవాహనదారులకు లీటరు పెట్రోలు, ఆటోలకు ప్రతినెలా మూడు లీటర్ల పెట్రోలు, ఆరుకిలోల సీఎన్‌జీ వంటివీ వరాల జాబితాలో కనిపిస్తాయి.

కఠిన చర్యలు అవసరం

రుణమాఫీ హామీలకు ఎన్నికల్లో దాదాపు 80శాతానికిపైగా విజయాల రేటు ఉండటం అన్ని పార్టీలనూ ఆకర్షిస్తోంది. దాన్ని గెలుపునకు దగ్గరి దారిగా విశ్వసిస్తున్నట్లు విదితమవుతోంది. రుణమాఫీలు, ఉచితాలతో రైతుల కష్టాలన్నీ తొలగిపోతే, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అవే హామీలను ఎందుకు ఇవ్వాల్సి వస్తోందన్న సందేహం రావాల్సిందే! ఇలాంటి అడ్డగోలు హామీలతో ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో ‘ఉచిత హామీల బడ్జెట్‌ సాధారణ బడ్జెట్‌ను మించిపోతోంది’ అని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పక్షాలూ పోటీలుపడి ఉచిత హామీలు గుప్పిస్తుండటం తీవ్రమైన అంశమేనని సుప్రీం ధర్మాసనం ఇటీవల వ్యాఖ్యానించింది. దాని కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాలని గతంలోనే ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఆదేశాలిచ్చినట్లు వెల్లడించింది. దేశ పురోగతికి అడ్డంకిగా మారిన ఇలాంటి తిరోగమన చర్యల కట్టడికి ఈసీ గతంలోనే మార్గదర్శకాలు రూపొందించింది. వాటిలో ఏమాత్రం పస లేదనేందుకు నానాటికీ పెచ్చరిల్లుతున్న హామీల పర్వమే ఉదాహరణ. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఉచిత హామీలిచ్చిన పార్టీలు, అభ్యర్థులు, నేతలను అక్రమాలకు ప్రయత్నిస్తున్నట్లుగా గుర్తించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పేర్కొన్న హామీలకు ఆయా రాజకీయ పార్టీలనే జవాబుదారీ చేయాలంటూ మరో అర్జీ అందింది.  

భారత్‌ వంటి సంక్షేమ రాజ్యంలో పేదల అభ్యున్నతి కోసం పథకాల రూపకల్పన, అమలు బాధ్యత అధికార స్థానాల్లో కొలువుదీరే ప్రజాప్రభుత్వాలదే. ఉచిత హామీలనేవి ఓట్లు రాల్చే ఆకర్షణ మంత్రాల్లా కాకుండా, దీర్ఘకాలంలో నిరుపేదల జీవన స్థితిగతులు మెరుగయ్యేందుకు పాదులు వేసేలా ఉండాలి. ఒక్కో పౌరుడిపై మూడు లక్షల రూపాయలదాకా రుణభారం మోస్తున్న రాష్ట్రాలు కొన్ని భారత్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో ఉచిత పందేరాల భారాన్ని దేశం ఇంకెంతమాత్రం మోయలేదన్న విషయాన్ని రాజకీయ పక్షాలు గుర్తెరగాలి. నిర్హేతుక, అనుచిత ఉచితాలు, హామీలు గుప్పించే పార్టీల గుర్తింపు రద్దు, ఎన్నికల గుర్తు జప్తు వంటి కఠిన చర్యలు ఉండాలి. అప్పుడే ఈ ప్రహసనానికి అడ్డుకట్ట పడటానికి ఆస్కారం లభిస్తుంది. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరవాతే కాకుండా, అధికారంలో ఉన్న ప్రభుత్వం చివరి ఆరునెలల వ్యవధిలో ఎలాంటి ఉచిత హామీలు ఇవ్వకూడదనే నిబంధననూ ఈసీ పరిశీలించవచ్చు.

ప్రజా చైతన్యం కీలకం

రాజకీయ హామీలు ఏవైనా ఆర్థిక అంశాలతోనే ముడివడి ఉంటాయన్న సంగతిని ప్రజలు గుర్తించాలి. హామీలు ఇచ్చేటప్పుడే వాటిని నెరవేర్చేందుకు వనరులు, తగిన కార్యాచరణను, కాలావధిని ఎన్నికల ప్రణాళికలో పొందుపరచాలన్న నిబంధన తీసుకురావాలి. నెరవేర్చని పక్షంలో తీసుకోవాల్సిన చర్యలపైనా స్పష్టత ఉండాలి. హామీలు నెరవేర్చడంపై చట్టబద్ధమైన హామీతో కూడిన ప్రమాణపత్రాన్ని ఈసీ వద్దగాని, న్యాయస్థానాల వద్దగాని సమర్పించేలా కొత్త నిబంధనలను రూపొందించాలి. ఇలాంటి అంశాలపై అన్ని పార్టీలూ పార్లమెంటులో దేశ విశాల ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకుంటూ సమగ్రంగా చర్చించాలి. అందరి ఆమోదంతో ఉల్లంఘనలకు వీలులేని రీతిలో పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాలి. ఉల్లంఘనలపై ఫిర్యాదులు, విచారణలు, జరిమానాలు, శిక్షలకోసం అవసరమైతే స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటుకూ బాటలు వేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలు, మార్గదర్శకాలు వంటి కట్టుబాట్లు ఎన్ని చేసుకున్నా ఉల్లంఘన రాజకీయాలు అంతేస్థాయిలో పొంచి ఉంటాయి. అడ్డగోలు హామీల వెనక ఓట్లు, సీట్ల స్వార్థం దాగుందా, నిజంగానే నిరుపేదల అభ్యున్నతికి తోడ్పడే ఆకాంక్షలు ఉన్నాయా అనేది ప్రజలే గుర్తించాలి. దాన్నిబట్టి విజ్ఞతతో వ్యవహరించినప్పుడే భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అప్పుడే ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు గాలివాటు పరిణామాలకే ఊగిపోకుండా సుదృఢంగా, సుస్థిరంగా నిలుస్తాయి.

తగ్గిన నిధుల కేటాయింపులు

ఉచితాలు, మాఫీల హామీలను నిలబెట్టుకొనేందుకు ప్రభుత్వాలు అప్పులను ఆశ్రయించడం, దొడ్డిదారిన పన్నుల భారం మోపడం, ఇతర శాఖలకు నిర్దేశించిన నిధుల్ని మాఫీ పద్దులకు సర్దుబాటు చేయడం పరిపాటిగా మారింది. సంపద సృష్టికి, అప్పులు తీర్చేందుకు ఉద్దేశించిన పెట్టుబడి నిధులూ హామీల పద్దులకే చెల్లిపోతున్నట్లు విమర్శలున్నాయి. విద్యుత్తు, జలవనరులు, ప్రజాపనులు, ఆరోగ్యం, కుటుంబ, సామాజిక, కార్మిక సంక్షేమం, నీటి పారుదల, పరిశ్రమలు వంటి ముఖ్యమైన రంగాలకు కేటాయించాల్సిన నిధులు గణనీయంగా తగ్గిపోయినట్లు పంజాబ్‌, మహారాష్ట్ర, యూపీల్లో చేపట్టిన ఓ పరిశీలన స్పష్టం చేసింది. మరోవైపు, రైతులకు ఒక ఏడాది రుణమాఫీ చేసినంత మాత్రాన వారేమీ అప్పుల ఊబి నుంచి పూర్తిగా బయట పడిపోవడం లేదు. విత్తనాలు, ఎరువుల భారం, పంట నష్టం, అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులు, మార్కెట్‌ మోసాలతో లాభాలు దక్కక, పెట్టుబడినీ దక్కించుకోలేక తిరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సాగులో తిష్ఠవేసిన సమస్యల మూలాల్ని వ్యవస్థాగతంగా, నిర్మాణాత్మకంగా సమూలంగా పరిష్కరించకుండా పైపై మెరుగులు దిద్దినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు.

- శ్రీనివాస్‌ దరెగోని
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పంజాబ్‌లో రాజకీయ ఉత్కంఠ

‣ ఉక్రెయిన్‌పై తొలగని యుద్ధమేఘాలు

‣ నదుల అనుసంధానానికి కసరత్తు

‣ ప్రోత్సహిస్తే కాసుల రాశులు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం