• facebook
  • whatsapp
  • telegram

నదుల అనుసంధానానికి కసరత్తు

రాష్ట్రాల్ని ఒప్పించేందుకు కేంద్రం యత్నాలు

కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానంపై కార్యాచరణను ముమ్మరం చేసింది. దక్షిణాదిలో కీలకమైన గోదావరి-కావేరి అనుసంధానంపై రాష్ట్రాలను ఒప్పించే పనికి శ్రీకారం చుట్టింది. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి తమిళనాడులో కావేరిపై గల గ్రాండ్‌ ఆనకట్ట వరకు నీటిని మళ్లించే ఈ పథకంపై తమిళనాడు మినహా ఏ రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేయకపోగా, పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. నీటి లభ్యత మొదలుకొని వినియోగం వరకు రాష్ట్రాలు సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో- ఏకాభిప్రాయం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 247 టీఎంసీల నీటిని మళ్లించి రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో 9.44 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరు అందించడంతోపాటు చెన్నై తాగునీటికి, పారిశ్రామిక అవసరాల కోసం రూ.90వేల కోట్లు ఖర్చయ్యే ఈ పథకాన్ని కేంద్రం ప్రతిపాదించింది. ఇటీవల బడ్జెట్‌లోనూ చోటుకల్పించడంతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

నీటి లభ్యతపై అభ్యంతరాలు

నదుల అనుసంధానంలో భాగంగా మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరిలను కలపాలన్నది ప్రణాళిక. మహానదిలో మిగులు జలాలు లేవని ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ప్రత్యామ్నాయంగా మొదట గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి అనుసంధానాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున మళ్లిస్తారు. ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఇందులో 247 టీఎంసీలు మాత్రమే మళ్లిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని 147 టీఎంసీలతోపాటు, శ్రీరామసాగర్‌-ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్ని మళ్లిస్తామని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఇంద్రావతిలో తమ వాటా నీటిని మళ్ళించేందుకు వీల్లేదని పేర్కొంది. తమ వద్ద మిగులు జలాలు లేవని, తాజాగా నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోరింది. 75శాతం నీటి లభ్యత ప్రకారం కాకుండా 50శాతం నీటి లభ్యతతో అంచనా వేసి తమ భవిష్యత్తు అవసరాలకు పోనూ మిగులు ఉంటేనే ఆలోచించాలని కోరింది. మిగులు జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వాడుకొనే స్వేచ్ఛ ఉందని, తమ అవసరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ కోరింది. ఛత్తీస్‌గఢ్‌ తమ వాటా నీటిని వాడుకొనేలా ప్రాజెక్టులు నిర్మించుకొంటే ఈ అనుసంధానానికి నీటి మళ్లింపు కష్టమే. గోదావరి-కావేరి అనుసంధానంపై రాష్ట్రాలను అంగీకరింపజేయడానికి నేడు (ఫిబ్రవరి 18న) దిల్లీలో జాతీయ జల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌కు ఆహ్వానం కూడా లేదు. మరోవైపు ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మిస్తే దిగువన తుపాకులగూడెం, ఎగువన మేడిగడ్డ బ్యారేజీ ఉన్నాయి. తుపాకుల గూడెం బ్యాక్‌వాటర్‌ ప్రభావం ఇచ్చంపల్లిపై, ఇచ్చంపల్లి బ్యాక్‌వాటర్‌ ప్రభావం మేడిగడ్డపై ఏ మేరకు ఉంటుందన్నదీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇచ్చంపల్లి నుంచి మళ్లించే వరద నీటిని నాగార్జునసాగర్‌కు పంపి వాడుకోవడం కూడా సమస్యగా మారుతుంది. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా రిజర్వాయర్‌ నిర్మించాల్సి ఉంటుంది. గోదావరి-పెన్నా అనుసంధానంలో బొల్లేపల్లి వద్ద ఆంధ్రప్రదేశ్‌ రిజర్వాయర్‌ను ప్రతిపాదించింది. ప్రస్తుత అనుసంధానంలో దీన్ని భాగం చేయవచ్చు. నాగార్జునసాగర్‌ దిగువన ప్రస్తుతం ప్రతిపాదించిన అనుసంధానంలో 164 టీఎంసీల వినియోగం ఉంది కాబట్టి కొత్త రిజర్వాయర్‌ నిర్మాణమే సరైంది. ఇవన్నీ నీటిని మళ్లించడానికి తెలంగాణ, ఏపీ అంగీకరిస్తేనే సాధ్యం.

ఆయకట్టు విషయంలోనూ...

ఈ అనుసంధానం కింద తెలంగాణలో ప్రతిపాదించిన ఆయకట్టు 3.67 లక్షల హెక్టార్లు. శ్రీరామసాగర్‌ రెండోదశ కింద 1,78,005 హెక్టార్లు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద 1,09,250 హెక్టార్లు స్థిరీకరణ కాగా, మిగిలింది మూసీ ఎగువ ప్రాంతంలో. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రెండోదశ స్థిరీకరణ జరుగుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పని పూర్తయితే శ్రీశైలం నుంచి కూడా నీటిని తీసుకోవచ్చు. ఇక మిగిలింది 80వేల హెక్టార్ల కొత్త ఆయకట్టు. ఇచ్చంపల్లి నుంచి మళ్లించే నీటిని మూసీలో వేసి అందించేలా ప్రతిపాదించారు. అయితే దిండి ఎత్తిపోతల కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గొట్టిముక్కల వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను కూడా నిర్మించారు. కాబట్టి కొత్త ఆయకట్టును గుర్తించే ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టాల్సి ఉంది. ఏపీలో నాగార్జునసాగర్‌ కుడి కాలువ కింద లక్షా 26వేల హెక్టార్ల స్థిరీకరణ, లక్షా 68వేల హెక్టార్ల కొత్త ఆయకట్టును  ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన గోదావరి-పెన్నా అనుసంధానం ఇంకా పట్టాలెక్కలేదు కాబట్టి ఇక్కడ అదనపు ఆయకట్టుకు అవకాశం ఉంది. సోమశిల నుంచి కావేరి వరకు 2.82 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంటే- ఇందులో 28వేల హెక్టార్లు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉండగా, తమిళనాడులో 2.55 లక్షల హెక్టార్లు ఉంది. ఇందులో కావేరి డెల్టాలోనే 78,250 హెక్టార్ల ఆయకట్టును ప్రతిపాదించారు. అంటే 1,211 కి.మీ. దూరం నీటిని తీసుకెళ్లి ఆయకట్టుకు అదీ స్థిరీకరణకు ఇచ్చేలా ప్రతిపాదించారు. తాగునీటి అవసరాల కోసం నీటిని ఎంత దూరమైనా తరలించవచ్చు కానీ, ఆయకట్టు స్థిరీకరణకు చాలాదూరం మళ్లించడం ఆమోదయోగ్యం కాదు. చెన్నై తాగునీటి అవసరాలకు శ్రీశైలం నుంచి ఏటా 15 టీఏంసీలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. నెల్లూరు జిల్లాలోని కండలేరు నుంచి ఈ నీటిని విడుదల చేయాలి. ఆరేడు టీఎంసీలకు మించి ఇవ్వడమే గగనంగా మారింది. చెన్నై తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు ప్రస్తుత పథకంలో 36 టీఎంసీలు ఉంది. ఈ నీటిని గొట్టాల ద్వారా మళ్లించవచ్చు కానీ, మధ్యలో ఆయకట్టుకు ఇస్తూ తాగు, పారిశ్రామిక అవసరాలకూ ఇవ్వాలనుకోవడం ఆచరణ సాధ్యం కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆయకట్టును తెలంగాణ, ఏపీలకు పరిమితం చేసి తమిళనాడుకు తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 40 టీఎంసీలు ఇచ్చేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ అనుసంధాన ప్రక్రియలో భాగస్వాములయ్యే రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాకపోతే ముందడుగు కష్టమే!

తాజా మార్గదర్శకాలూ సమస్యే

జాతీయ ప్రాజెక్టులు చేపట్టడానికి సంబంధించి తాజాగా కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నదుల అనుసంధానం కింద చేపట్టే ప్రాజెక్టులూ దీని పరిధిలోకి వస్తాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంలో 90 శాతాన్ని కేంద్రం భరిస్తే, రాష్ట్రం పది శాతం ఖర్చు చేయాల్సి వచ్చేది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్రం 60 శాతం నిధులను మాత్రమే ఇస్తుంది. గోదావరి-కావేరి అనుసంధానం వ్యయ అంచనా 2018-19 ధరల ప్రకారం రూ.86వేల కోట్లు. మరో ఏడాదిలో ఈ ప్రాజెక్టును చేపట్టినా అంచనా వ్యయం లక్ష కోట్ల రూపాయలకు చేరుతుంది. ఇందులో రూ.40వేల కోట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు భరించాల్సి ఉంటుంది. కేంద్రం ఒక ప్రాజెక్టుపై ఏడాదికి మూడునాలుగు వేల కోట్ల రూపాయలకు మించి ఇచ్చే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టే ఇందుకు ఉదాహరణ. ఈ లెక్కన తాజా అనుసంధాన ప్రక్రియను చేపట్టినా దశాబ్దాలపాటు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ, ఏపీ, తమిళనాడు తలా కనీసం రూ.14వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ స్థాయిలో నిధులు వెచ్చిస్తే తామే సొంతంగా ఓ ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని ఆయా రాష్ట్రాలు తలపోస్తాయి.

- ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కశ్మీర్‌పై డ్రాగన్‌ వ్యూహాత్మక అడుగులు

‣ ఒకే దేశం... ఒకే రిజిస్ట్రేషన్‌!

‣ ఉత్తరాఖండ్‌లో ఉత్కంఠ పోరు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 18-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం