• facebook
  • whatsapp
  • telegram

కశ్మీర్‌పై డ్రాగన్‌ వ్యూహాత్మక అడుగులు

చైనా వైఖరి మారిందా?

జిన్‌జియాంగ్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ, పలువురు దేశాధినేతలు బీజింగ్‌ శీతాకాల ఒలింపిక్స్‌ వేడుకలను దౌత్యపరంగా బహిష్కరించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ చైనా పర్యటనకు ఉన్నతస్థాయి బృందాన్ని వెంటేసుకుని వెళ్లడం- పలు దేశాల దృష్టిని ఆకర్షించింది. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ, ఆర్థికమంత్రి షౌకత్‌ తారిన్‌, జాతీయ భద్రతా సలహాదారు మోయిద్‌ యూసఫ్‌, సీపెక్‌ (చైనా-పాక్‌ ఆర్థిక నడవా) ప్రత్యేక సహాయకుడు ఖాలిద్‌ మన్సూర్‌... ఈ నెల మొదటివారంలో నాలుగు రోజుల పర్యటనలో ఇమ్రాన్‌ వెంటే ఉన్నారు. ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో పాల్గొని, చైనాతో తమకున్న సోదర భావాన్ని మరోమారు చాటిచెప్పింది ఇమ్రాన్‌ బృందం. భారీ బలగంతో ఇమ్రాన్‌ అక్కడికి వెళ్లడం... అర్థిక, వ్యూహాత్మక అవసరాల కోసం చైనా మీద పాక్‌ ఎంతలా ఆధారపడుతోందో కళ్లకు కట్టింది.

ఇమ్రాన్‌ బృందానికి ఆశాభంగం 

ఇమ్రాన్‌ చైనా పర్యటన విజయవంతమైందని పాక్‌ సమాచారశాఖ మంత్రి ఫావద్‌ చౌద్రి ప్రకటించినా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి మరింత ఆర్థిక సహాయాన్ని తెచ్చుకోవడంలో పాక్‌ ప్రధాని విఫలమైనట్లు పర్యటన అనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. దిగుమతి బిల్లు, విదేశీ అప్పుల చెల్లింపులు, బడ్జెట్‌ లోటును పూడ్చేందుకు మూడు వందల కోట్ల డాలర్లను సమకూర్చుకోవడమే లక్ష్యంగా ఇమ్రాన్‌ పర్యటన ఉంటుందని గత నెలలో వార్తలు వెలువడ్డాయి. సీపెక్‌, చైనా-పాక్‌ రక్షణ సహకారంపై ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపినా... ఆర్థిక వ్యవహారాలపై, పెట్టుబడులపై చైనా నుంచి ఎలాంటి ప్రకటనా లేకపోవడం ఆశ్చర్యపరచింది. పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని తెహ్రీకే-ఇన్సాఫ్‌పై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. సైన్యం నుంచి ఆయనకు మళ్ళీ మద్దతు లభించడం ప్రశ్నార్థకంగా మారింది. తాజా పరిస్థితులపై ముందే లెక్కలేసుకున్న చైనా... ఇమ్రాన్‌ఖాన్‌ మళ్ళీ ప్రధాని బాధ్యతలు చేపట్టడం కష్టమని భావించి, దౌత్యపరంగా పెద్దగా పట్టించుకోవడంలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌- పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భేటీ అనంతరం ఇరువర్గాల నుంచి 33 అంశాలతో సంయుక్త ప్రకటన వెలువడింది. జమ్మూకశ్మీర్‌ అంశం సైతం ప్రస్తావనకు వచ్చింది. పాకిస్థాన్‌ ఇచ్చిన సమాచారంతో స్పందించిన చైనా- ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలతో కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలంటూ వ్యాఖ్యానించింది. చైనా నుంచి ఈ తరహా ప్రకటనలు వెలువడటం కొత్తేమీ కాదు. ఆర్టికల్‌ 370ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్‌ అంశాన్ని ప్రత్యక్షంగానే లేవనెత్తుతోంది. తాజా ప్రకటనలో కశ్మీర్‌ను ప్రస్తావించినా అది 27వ అంశంలో ఉంది. అదే సమయంలో ‘ఒకే చైనా’ విధానం, ‘తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం, జిన్‌జియాంగ్‌, టిబెట్‌’పై పాక్‌ మద్దతు తెలపాలని అయిదో అంశంలో పేర్కొంది. పాక్‌ ‘కశ్మీర్‌ కలల’ పట్ల చైనా వైఖరి ఎలా ఉంటుందనేదీ అస్పష్టంగానే మిగిలిపోయింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను లెక్కచేయకుండా.. భద్రత సమస్యలపైనే పాక్‌ విదేశీ విధానం రూపుదిద్దుకుంటోంది. ప్రాంతీయ సమస్యలపై గతంలో అమెరికా మీద ఆధారపడిన పాక్‌, ఇప్పుడు చైనాపై ఆశలు పెట్టుకుంటోంది. వాస్తవానికి కశ్మీర్‌ అంశంలో భారత్‌ను ఎదుర్కొనేందుకు దౌత్యపరమైన మద్దతు లభించక పాక్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  

మరో కుయుక్తి దిశగా... 

కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం ద్వారా భారత్‌తో కొనసాగుతున్న సరిహద్దు వివాదంలో పైచేయి సాధించేందుకు జిన్‌పింగ్‌ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దక్షిణాసియాపై పట్టుసాధించాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్న భారత్‌ను... కశ్మీర్‌, పాకిస్థాన్‌ సమస్యలవైపు దృష్టి మళ్ళించాలనే కుయుక్తితో చైనా ఈ ఎత్తుగడ వేసింది. ఏడు దశాబ్దాలుగా కశ్మీర్‌పై చైనా వైఖరి అస్థిరంగానే ఉంది. అమెరికాను ఎదుర్కొనేందుకు ఇతర దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక ఒప్పందాలతో కూడిన బంధం చైనాకు అవసరం. పాక్‌ మినహా మరే ఇతర ప్రాంతీయ దేశంతోనూ చైనాకు భద్రతాపరమైన మైత్రి లేదు. ఒప్పందాలు లేని ఈ తరహా మైత్రితో అమెరికాకే ఎక్కువ లాభం కలిగే అవకాశముంది. కరోనా అనంతర    ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలని దృఢనిశ్చయంతో ఉన్న చైనాకు ఇది ప్రతికూల విషయమే. కశ్మీర్‌ అంశంపై చైనా-పాక్‌ చేసిన సంయుక్త ప్రకటన, భారత విదేశాంగశాఖను ఆశ్చర్యపరచలేదు. వాస్తవ రాజకీయ పరిస్థితులు, కశ్మీర్‌ అంశంలో చైనా-పాక్‌ అనుసరిస్తున్న కుటిల నీతిపై భారత్‌కు స్పష్టత ఉంది. అందుకే ఆయా దేశాల ప్రకటనను వ్యూహాత్మకంగా తిరస్కరించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న సీపెక్‌పై ఆక్షేపణలు తెలిపింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఇరు దేశాలకు స్పష్టం చేసింది. 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్‌ ప్రకటనకు తగ్గట్లు సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత్‌ ఇప్పటికే అనేకమార్లు ప్రకటించింది. అయితే పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదానికి ముగింపు పడితేనే అది సాధ్యపడుతుంది.

- వీరేశ్‌ కందూరి 

(అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉత్తరాఖండ్‌లో ఉత్కంఠ పోరు

‣ నూనెగింజల్లో స్వయంసమృద్ధికి బాటలు

‣ డిజిటల్‌ కరెన్సీతో మేలెంత?

‣ ఉద్యోగరహిత అభివృద్ధి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 16-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం