• facebook
  • whatsapp
  • telegram

ఉద్యాన పంటలపై రైతుల ఆశలు

ప్రోత్సహిస్తే కాసుల రాశులు

భారత వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలది కీలక పాత్ర. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార సరళి మారుతున్నందువల్ల ఉద్యాన పంటల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. కొవిడ్‌ సమయంలో పండ్ల వినియోగం అధికమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులకు పలు రాయితీలనూ అందిస్తున్నాయి. ఫలితంగా ఆ పంటల విస్తీర్ణం, ఉత్పత్తి ఏటా అధికమవుతున్నాయి. దేశీయంగా 2016-17లో 2.4 కోట్ల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేశారు. 2020-21 నాటికి అది 2.72 కోట్ల హెక్టార్లకు పెరగడంతో- మొత్తం ఉత్పత్తులు 32.98 కోట్ల టన్నులకు చేరతాయన్నది అంచనా. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అది దాదాపు మూడు శాతం అధికం. వాటిలో కూరగాయల దిగుబడులు 19.62 కోట్ల టన్నులు, పండ్ల దిగుబడులు 10.27 కోట్ల టన్నులు. ఆపరేషన్‌ గ్రీన్‌ పథకం కింద టమాటా, ఆలుగడ్డలు, ఉల్లిపాయల మాదిరిగా కొన్ని ఇతర ఉద్యాన పంటల శుద్ధి, నిల్వ సదుపాయాలు పెంచడం ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ఎగుమతులను ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అరకొర ఎగుమతులు

ఉద్యాన పంటల్లో పండ్లు, కూరగాయలు, పూలసాగు ప్రధానమైనవి. సుగంధ ద్రవ్యాలు, ఔషధ పంటలు, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం వంటివీ ఈ కోవలోకే వస్తాయి. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల సాగు విపరీతంగా పెరిగింది. వాటి దిగుబడులతో గోదాములు నిండిపోతున్నాయి. వరి, గోధుమలకు బదులుగా ఇతర పంటలను సాగుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నాయి. ఈ తరుణంలో ఉద్యాన పంటలు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో ఉన్న వాతావరణ పరిస్థితులు, భూముల స్వరూపం- వివిధ రకాల పండ్లు, నూనెగింజలు, కూరగాయల పంటల సాగుకు ఎంతో అనుకూలం. తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయాన్ని పొందడానికి ఉద్యాన పంటల సాగు తోడ్పడుతుంది. పైగా తక్కువ నీటితోనే వాటిని పండించవచ్చు. దేశీయంగా చిన్న కమతాలు ఉన్న రైతులే అధికం. ఉద్యాన పంటలను పండించడం వారికి చాలా అనుకూలం. ఉద్యాన పంటల సాగులో ప్రపంచంలో చైనా అగ్ర భాగంలో నిలుస్తోంది. భారత్‌ది రెండో స్థానం. ఆ తరవాతి వరసలో అమెరికా, టర్కీ దేశాలున్నాయి. గతేడాది గణాంకాల ప్రకారం భారత్‌లో అత్యధికంగా 13శాతం ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచే జరిగింది. ఆ తరవాతి స్థానాల్లో పశ్చిమ్‌ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాలు ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి పలు రాయితీలను అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ విస్తీర్ణాన్ని పెంచడంపై దృష్టి సారించింది. భారతదేశ ఉద్యాన పంటల ఉత్పత్తులు 70 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. యూఏఈ, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ దేశాలు మన ఉత్పత్తులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. 2018-19లో ఇండియా ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.63,724 కోట్లు. 2001-02లో అవి రూ.7,998 కోట్లు మాత్రమే. ప్రపంచ మొత్తం ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇండియా వాటా రెండు శాతం కంటే తక్కువే. భారత్‌లో చాలా రకాలను సాగు చేస్తున్నప్పటికీ కొన్నింటిని మాత్రమే ఎగుమతి చేస్తున్నాం. ఎక్కువ శాతం దేశీయ అవసరాలకు వినియోగిస్తున్నాం. వాటి ఎగుమతులకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొంటే మన రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుంది. అందుకోసం పంటకోత, గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌లో అత్యాధునిక పద్ధతులను అనుసరించేలా చూడాలి. కూరగాయలు, పండ్లు, పూలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు శీతల గిడ్డంగుల సౌకర్యాలను పెంచాల్సిన అవసరమూ ఉంది.

ఎన్నో ప్రయోజనాలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. ఉద్యాన పంటల సాగులోనూ ఆ దిశగా రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కొన్ని రకాల కూరగాయలు, పూలను సీజన్‌ కాని సమయంలోనూ పాలీహౌస్‌లలో పండించవచ్చు. వాటి ఏర్పాటుకు ప్రభుత్వాలు రాయితీలు అందించాలి. ఉద్యాన పంటలకు బిందుసేద్యం చాలా అనుకూలం. దానికి సరైన ప్రోత్సాహకాలు కల్పించాలి. ఉద్యాన పంటలు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడతాయి. పండ్లు, ఇతర తోటలు నేల కోతను నిరోధించి భూసారాన్ని పరిరక్షిస్తాయి. కొన్ని రకాల పక్షులకు ఆవాసాలుగానూ ఉపయోగపడతాయి. ఒక్కోసారి ఉద్యాన పంటల ఉత్పత్తుల ధరల్లో నిలకడ లేకపోవడం రైతులకు తీవ్ర సమస్యాత్మకంగా మారుతోంది. ప్రభుత్వాలు మద్దతు ధరలను ప్రకటించి అమలయ్యేలా చూడాలి. అలా చేస్తే- ఎక్కువ మంది రైతులు ఆ పంటల సాగువైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది.

- దేవవరపు సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నూనెగింజల్లో స్వయంసమృద్ధికి బాటలు

‣ డిజిటల్‌ కరెన్సీతో మేలెంత?

‣ ఉద్యోగరహిత అభివృద్ధి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 18-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం