• facebook
  • whatsapp
  • telegram

నిస్సారమవుతున్న పంటభూములు

మేలుకోకుంటే తీవ్ర పరిణామాలు

పెరుగుతున్న జనాభావల్ల పంట భూములపై ఒత్తిడి అధికమవుతోంది. మరోవైపు వాతావరణ మార్పులు, చీడపీడల వల్ల పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో నానాటికీ తెగ్గోసుకుపోతున్న భూసారం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా 2018-19 నాటికి 9.78 కోట్ల హెక్టార్ల భూసారం (మొత్తం భూభాగంలో దాదాపు 30శాతం) క్షీణతకు గురైంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ విడుదల చేసిన ‘ఎడారీకరణ, భూసార క్షీణత అట్లాస్‌’ చేదు నిజాలను వెల్లడించింది. దేశీయంగా 2011-2019 మధ్య కాలంలో అదనంగా 14 లక్షల హెక్టార్లకుపైగా భూమి సారం కోల్పోయినట్లు తెలిపింది. అదే కాలానికి పదిలక్షల హెక్టార్లకు పైగా భూమి ఎడారీకరణకు గురైంది. తాజా పరిశీలనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సైతం భూసార క్షీణత పెరిగినట్లు తేలింది.

కరవు పరిస్థితులు, భూమి కోతకు గురికావడం, అటవీ నిర్మూలన, కాలుష్యం వంటివి భూసార క్షీణతకు కారణాలు. రసాయన ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడి వాడకం వల్లా సహజ సారం దెబ్బతిని భూమి విషతుల్యంగా మారుతోంది. మెట్ట ప్రాంతాల్లో భూసారం క్షీణించడాన్నే ఎడారీకరణగా పేర్కొంటున్నారు. ఇండియాలో నిస్సారంగా మారిన 2.6 కోట్ల హెక్టార్ల భూమిని 2030 నాటికి సారవంతం చేసుకోవడానికి భారత్‌ కృషి చేస్తోందని గతేడాది ఐక్యరాజ్యసమితి అత్యున్నత సమావేశంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నిజానికి ఎడారీకరణకు అడ్డుకట్ట వేసేందుకు వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌, జాతీయ అటవీకరణ కార్యక్రమం వంటి వాటిని గతంలోనే భారత్‌ పట్టాలకెక్కించింది. ఎడారీకరణపై పోరాటానికి ఐరాస ఒప్పందం(యూఎన్‌సీసీడీ)పై సంతకమూ చేసింది. భూసారం పరిరక్షణ విషయంలో ఇండియా పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని తాజా పరిస్థితులు తెలియజెబుతున్నాయి.  

దేశీయంగా నేటికీ అరవై శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. భూసార క్షీణత వల్ల వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది. ఫలితంగా గ్రామీణ ప్రజల జీవితాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రతపైనా అది ప్రభావం చూపుతుంది. సారం కోల్పోయిన భూమి వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌, గ్రీన్‌హౌస్‌ వాయువులను పట్టి ఉంచే గుణాన్ని కోల్పోతుంది. దానివల్ల భూతాపం పెరుగుతుంది. కాలుష్యభరితమైన భూమి వల్ల ఉపరితల జలవనరులు, భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారతాయి. మెట్ట ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. రసాయన ఎరువులు, పురుగు మందులనుంచి మన పంట భూములకు విముక్తి కల్పించాలని మోదీ తాజాగా పిలుపిచ్చారు. దాన్ని అందిపుచ్చుకొని రైతాంగం సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి. అవసరం మేరకే రసాయన ఎరువులు, పురుగుమందులను వాడాలి. అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవడమూ తప్పనిసరి. ప్రకృతి వ్యవసాయంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరమూ ఉంది. పాలకుల చర్యలతోపాటు ప్రజల క్రియాశీల చొరవ పెరిగితేనే పంటభూముల ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది.  

- ఎం.అక్షర
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జల సరిహద్దుల్లో జగడం

‣ తీరాలను మింగేస్తున్న కడలి

‣ చైనా దూకుడుకు ముకుతాడే లక్ష్యం

‣ బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక దన్ను

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం