• facebook
  • whatsapp
  • telegram

పరిశోధనలే జవజీవాలు

జాతీయ సైన్స్‌ దినోత్సవం

విజ్ఞానశాస్త్రాల్లో పరిశోధనలు దేశార్థికానికి బలమైన పునాది వేసి, అభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తాయి. దైనందిన సమస్యలకే కాకుండా కొవిడ్‌ వంటి అవాంతరాలను ఎదుర్కోవడంలో సైన్స్‌ పాత్ర ఎనలేనిది. దశాబ్దాలుగా గడించిన అనుభవం, సేకరించిన పరిజ్ఞానం ఆధారంగా శాస్త్రవేత్తలు స్వల్పకాలంలోనే కొవిడ్‌ టీకాలను ఉత్పత్తి చేసి వేగంగా జనబాహుళ్యానికి అందించగలిగారు. విధానకర్తలు బడ్జెట్‌లో శాస్త్రసాంకేతిక రంగాలలో పరిశోధన, అభివృద్ధికి గణనీయంగా నిధులు కేటాయించాలి. దీనిపై ప్రపంచ దేశాల కేటాయింపులు భారీగా ఉండగా, భారతదేశంలో మాత్రం ఈ వ్యయం మొదటి నుంచీ తక్కువగానే కనిపిస్తుంది. 2022-23 కేంద్ర బడ్జెట్‌లో సైన్స్‌, టెక్నాలజీ శాఖకు రూ.14,217 కోట్లు కేటాయించారు. ఇది అంతకుముందు సంవత్సరంకన్నా బాగా తక్కువ. భారత జీడీపీలో కేవలం 0.7శాతాన్నే పరిశోధనలపై వెచ్చిస్తున్నాం. చైనా, జపాన్‌, అమెరికా ఇంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. భారత్‌ సైతం నిధులను కనీసం రెండు శాతానికి పెంచాలని 2020-21 ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది. పరిశోధనల రంగానికి హెచ్చు నిధులు కేటాయిస్తేనే వివిధ రంగాల్లో పెద్దయెత్తున నవీకరణలు సాధించగలుగుతాం.

నూతన ఆవిష్కరణలు

ప్రపంచ మేధా హక్కుల సంస్థ (విపో) నవీకరణల సూచీలో భారత్‌ 2015లో 81వ స్థానంలో నిలిచింది. 2021లో 46వ స్థానానికి ఎగబాకింది. అయితే ఇదే చాలదు. ప్రపంచంలో ఆర్థికంగా పది అగ్రశ్రేణి దేశాల జాబితాలో చోటు సంపాదించిన భారత్‌- నవీకరణల సాధనలోనూ అదేస్థాయికి ఎదగాలి. 2021 ప్రపంచ పోటీ సామర్థ్య సూచీలో భారత్‌ 43వ ర్యాంకుతో సరిపెట్టుకొంది. నవీకరణలతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుంది. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) ఊతంతో భవిష్యత్తులో అనేక నవ్య ఆవిష్కరణలు అందుబాటులోకి రానున్నాయి. మెదడులో భావ తరంగాలను చదివే రోబోలు, త్రీడీ ముద్రిత గృహాలు, హైడ్రోజన్‌ విమానాలు, కృత్రిమ నేత్రాలు, ఎగిరే ట్యాక్సీలు, డ్రోన్‌ విమానాశ్రయాలు, తేలే పొలాలు సాకారం కానున్నాయి. సముద్రంపై, నగరాల సమీపంలోని జలాశయాలపైన తేలియాడే పొలాలు ఆహారోత్పత్తిలో కీలకంగా మారనున్నాయి. 2050 నాటికి పెరిగే ప్రపంచ జనాభా ఆహార అవసరాలు ఇప్పటికన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని తీర్చేందుకు సన్నద్ధమవ్వాలి. తమకుతామే ఎరువులను తయారు చేసుకొనే పంటలు, గిరాకీ మేరకు ప్రత్యేక మందులను తయారు చేసే కర్మాగారాలు పరిశోధనల ఫలితంగా సాకారం కానున్నాయి. పెరిగే జనాభాతోపాటు కాలుష్యమూ అధికమై పర్యావరణ విధ్వంసం జరగకుండా చూడాలంటే హరిత ఇంధనాలకు మారడం తప్పనిసరి. విద్యుత్తు వాహనాల్లో ఎక్కువ సామర్థ్యంగల బ్యాటరీలను వాడితే వాటి వినియోగం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ వాహనాల కోసం మరింత మెరుగైన బ్యాటరీలు అందుబాటులోకి రావాల్సి ఉంది. కుతూహలమే విజ్ఞాన శాస్త్రానికి పునాది. ఎందుకు, ఎలా అనే ప్రశ్నల నుంచే విజ్ఞానశాస్త్రం పుడుతుంది. సమస్యలకు పరిష్కారాన్ని ప్రతిపాదించి, ప్రయోగాలతో నిగ్గు తేల్చడం సైన్స్‌, టెక్నాలజీల విజయ రహస్యం. సమాజంలో, ముఖ్యంగా బాలలు, యువతలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించినప్పుడు సైన్స్‌ అభివృద్ధికి బలీయమైన పునాది పడుతుంది. ఆ పునాదిని ఏర్పరచేది విద్యే. పాఠశాల స్థాయి నుంచే ప్రయోగశాలలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థులు బట్టీ చదువులకు అంకితమైపోకుండా తరగతి గది వెలుపలి ప్రపంచాన్ని అవగాహన చేసుకొనేలా ప్రేరేపించాలి. నిత్య జీవిత సమస్యల పరిష్కారానికి విజ్ఞానశాస్త్రాన్ని అన్వయించే పద్ధతులపై వారికి అవగాహన కల్పించడం తప్పనిసరి.

ప్రశ్నించడం నేర్పాలి

పాఠశాలలు, కళాశాలల్లో ఆధునిక ప్రయోగశాలల ఏర్పాటుపై పాలకులు దృష్టి సారించడం అత్యవసరం. వాటిని ఉపాధ్యాయులు సమర్థంగా వినియోగించి పిల్లలను తీర్చిదిద్దాలి. విద్యార్థులకు తార్కికంగా, విమర్శనాత్మకంగా ఆలోచించే వాతావరణాన్ని కల్పించాలి. ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలి. నేటి విద్యార్థులు చిన్న వయసునుంచే డిజిటల్‌ సాధనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. జటిలమైన అంశాలను అవగాహన చేసుకొనే నవ్య రీతులను అత్యధిక విద్యార్థులకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన కళాశాలలు, విశ్వవిద్యాలయాలు డిగ్రీ పట్టాల చదువులకే అంకితమయ్యాయి తప్ప పరిశోధనలను ప్రోత్సహించడం లేదు. దేశంలో సైన్స్‌, టెక్నాలజీ రంగంలో పేరు మోసిన 100 పరిశోధన సంస్థల నుంచి మాత్రమే పరిశోధన పత్రాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. సాధారణ విద్యాసంస్థల్లోనూ పరిశోధనలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడాలి. బాలల్లో సృజనాత్మకతను పెంపొందించే సంస్కృతిని భారతీయ సమాజం అలవరచుకోవాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణానికి దెబ్బ

‣ కశ్మీర్‌పై డ్రాగన్‌ వ్యూహాత్మక అడుగులు

‣ ఒకే దేశం... ఒకే రిజిస్ట్రేషన్‌!

‣ ఉత్తరాఖండ్‌లో ఉత్కంఠ పోరు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని