• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణానికి దెబ్బ

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపై ఆందోళన

ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో విద్యుత్తు రంగం చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇండియాలో మొత్తం విద్యుదుత్పత్తి   సామర్థ్యం 1947లో 1362 మెగావాట్లు కాగా, 2020 మార్చి నాటికి అది అనేకరెట్లు పెరిగి 448.11 గిగావాట్లకు చేరింది. అదేకాల వ్యవధిలో విద్యుత్‌ తలసరి వినియోగం 16.3 యూనిట్ల నుంచి 1208 యూనిట్లకు పెరిగింది. దేశీయంగా 65శాతానికి పైగా విద్యుత్తును బొగ్గు ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. విశ్వవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచుకొనే విషయంలో భారత్‌ అయిదో స్థానంలో నిలుస్తోంది. దేశంలో 267కుపైగా థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలున్నాయి. బొగ్గు దహనానికి గురైనప్పుడు పెద్ద మొత్తంలో ఉష్ణ శక్తి, కాలుష్య కారకాలు విడుదల అవుతాయి. అవి పర్యావరణానికి, మానవాళికి చాలా ప్రమాదకరం. ఆ ఉద్గారాల ప్రభావం 400 కిలోమీటర్ల దాకా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లు ఉష్ణ శక్తిని విద్యుత్తు శక్తిగా మారుస్తాయి. ఆ క్రమంలో సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి కర్బన ఉద్గార వాయువులు, బూడిదతో పాటు బోరాన్‌, ఆర్సెనిక్‌, పాదరసం, క్రోమియం, జింక్‌, సీసం వంటి భార లోహాలు వెలువడతాయి. 2030 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే సల్ఫర్‌ డయాక్సైడ్‌ తీవ్ర స్థాయిలో వాతావరణంలోకి చేరే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు రకాన్నిబట్టి దానిలో సగటున 0.1శాతం నుంచి 3.5 శాతం వరకు సల్ఫర్‌ ఉంటుంది. బొగ్గును మండించినప్పుడు వెలువడే సల్ఫర్‌ డయాక్సైడ్‌ వల్ల ఆమ్ల వర్షం కురుస్తుంది. దానివల్ల నేల సహజ ఆమ్లత్వం కోల్పోయి భూసారం దెబ్బతింటుంది. పురాతన కట్టడాలు అసలు రూపును కోల్పోతాయి. నైట్రిక్‌ ఆక్సైడ్‌ సైతం మనుషుల్లో శ్వాసకోశ సమస్యలకు కారణమవుతోంది. అది వాతావరణంలోని తేమతో కలిసి ఆమ్ల వర్షం, పొగమంచు ఏర్పరుస్తుంది. కర్బన ఉద్గార వాయువులు వాతావరణంలో వేడి పెరగడానికి కారణమవుతాయి. దాంతో పర్యావరణంలో శరవేగంగా మార్పులు సంభవిస్తాయి. వర్షాలు సకాలంలో పడకపోవడం లేదా కుండపోత వానలు, ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరిగి సముద్ర జల మట్టాలు పెరగడం వంటి అసాధారణ పరిస్థితులు నెలకొంటాయి. పీఎం 2.5గా పేర్కొనే అతి సూక్ష్మ ధూళి కణాలు చాలా సులభంగా ఊపిరి తిత్తుల్లోకి ప్రవేశించి, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. ఆసియాలో అవి నిర్దేశిత స్థాయి కంటే 10-20 రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నుంచి విడుదలయ్యే బూడిదలో భార లోహాలు ఉంటాయి. బూడిద వేగంగా నీటి మార్గాలలోకి, మట్టిలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా నీరు తాగడానికి పనికిరాదు. వ్యవసాయ భూములు నిరుపయోగంగా మారతాయి. థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్ల నుంచి అధిక స్థాయిలో వెలువడే వేడి- ఉష్ణ కాలుష్యానికి కారణమవుతుంది. థర్మల్‌ ప్లాంట్లలో వ్యర్థ జలాలను తరచూ స్థానిక నీటి వనరుల్లోకి విడుదల చేస్తారు. ఆ నీటి ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. అది స్థానిక నీటి సహజ ఉష్ణోగ్రతను పెంచి అందులోని జీవజాలానికి నష్టం కలిగిస్తుంది. ఆ వ్యర్థ జలంలోనూ భార లోహాలు ఉంటాయి. అవి స్థానిక పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తాయి. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నుంచి వచ్చే బూడిదతో ఇటుకలు, సిమెంటు వంటివి తయారు చేయవచ్చు. వాటి నుంచి వెలువడే వ్యర్థ జలాల కోసం కృత్రిమ సరస్సులను ఏర్పాటు చేసి, అందులో నిల్వచేసిన నీటిని పునర్వినియోగించేలా చూడాలి. ప్రజలు వీలైనంత ఎక్కువగా విద్యుత్తును ఆదా చేయడంవల్ల బొగ్గును మండించాల్సిన అవసరం తగ్గుతుంది. రాబోయే రోజుల్లో బొగ్గు వినియోగాన్ని కుదించేలా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై అధికంగా దృష్టి సారించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలి. దీర్ఘకాలంలో పుడమిని పెను క్షోభ నుంచి కాపాడాలంటే ఈ చర్యలు తప్పనిసరి.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రణాళిక కొరవడి... ప్రగతి తడబడి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

‣ భూతాపం ఉత్పాదకతకు శాపం

‣ డ్రాగన్‌ వైపు రష్యా మొగ్గు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 18-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం