• facebook
  • whatsapp
  • telegram

మౌలిక వృద్ధికి నిధుల సమీకరణే కీలకం

అడ్డంకులను అధిగమిస్తేనే ప్రగతి

దేశీయంగా జనావళికి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించి, వారి జీవన నాణ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక (నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌-ఎన్‌ఐపీ)ను పట్టాలకు ఎక్కించింది. ప్రాజెక్టుల రూపకల్పనను పరుగులెత్తించి, వాటికి నిధులను అందించడం దీని ప్రధాన ఉద్దేశం. మౌలిక సదుపాయాల కల్పనకోసం 2020-25 సంవత్సరాల మధ్య కాలంలో రూ.111 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను నిర్ణీత కాలానికి ప్రైవేటు రంగానికి అప్పగించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ ప్రణాళికకు వెచ్చించాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరసగా 39శాతం, 40శాతం నిధులను సమకూరుస్తాయి. మిగిలిన మొత్తాన్ని ప్రైవేటు రంగంనుంచి సమీకరించాలన్నది ప్రణాళిక. దేశంలో ఆర్థిక మందగమనం, ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో జాప్యం తదితర పరిస్థితుల్లో జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక సమర్థంగా ముందుకు సాగుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఘనమైన అంచనాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తిలో పెరుగుదల 9.2శాతం మేర ఉండవచ్చని అంచనాలు చెబుతున్నాయి. 2022-23లో జీడీపీలో పెరుగుదల 8.0శాతం నుంచి 8.5శాతందాకా ఉంటుందని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగ వ్యయంలో ఏడు శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చాటుతున్నాయి. 2019-20లో జీడీపీలో పెట్టుబడుల వ్యయం 1.6శాతం. 2021-22 నాటికి అది 2.5శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులకోసం కేంద్రం ఇప్పటిదాకా రూ.5.54 లక్షల కోట్లు ఖర్చు చేసింది. కేవలం బడ్జెట్‌ పద్దులో ప్రత్యేకించిన నిధులే కాకుండా అదనంగానూ అందిస్తోంది. అలా గత ఆరేళ్లలో రూ.6.04 లక్షల కోట్ల నిధులను సమీకరించి ఖర్చుపెట్టింది. వాటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల కోసం కేంద్రం ఇప్పటిదాకా రూ.6.02 లక్షల కోట్లు ఖర్చు చేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్‌లో రూ.7.50 లక్షల కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. ఇందులో కేంద్రం లక్ష కోట్ల రూపాయలను రాష్ట్రాలకు యాభై ఏళ్ల కాలానికి పెట్టుబడుల వ్యయం కోసం  వడ్డీ లేని రుణాలుగా అందిస్తుంది. దాన్ని మినహాయిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఖర్చుచేసిన నిధులకన్నా అదనంగా దాదాపు రూ.47వేల కోట్లు కేటాయించినట్లు అవగతమవుతుంది.

జాతీయ మౌలిక వనరుల ప్రణాళికలో తొలుత 6835 ప్రాజెక్టులు ఉండగా, గతేడాది బడ్జెట్‌లో వాటి సంఖ్య అదనంగా మరో అయిదు వందలకు పైగా పెరిగింది. ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా సమకూరిన ధనంతో- ఇంధనం, రోడ్లు, రైలు మార్గాలు, ఓడ రేవులు, విమానాశ్రయాలు, నగరాలు, గ్రామాల్లో మౌలిక  సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. అలాగే డిజిటల్‌ కమ్యూనికేషన్‌, నీటిపారుదల, వ్యవసాయం, ఆహార పరిశ్రమ, సామాజిక, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం తన వాటా కింద అందించాల్సిన రూ.43.29 లక్షల కోట్లలో, ఆరు లక్షల కోట్ల రూపాయలను తన పరిధిలోని కీలకమైన ఆస్తుల లీజు ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. కాల పరిస్థితులు, పెట్టుబడిదారుల ఆసక్తి, విధి విధానాల ఖరారునుబట్టి ఈ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందని అని నీతి ఆయోగ్‌ తన నివేదికలో వ్యాఖ్యానించింది.

తీవ్ర జాప్యం

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆరేళ్లుగా ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా కరోనా  మహమ్మారి అకస్మాత్తుగా ప్రపంచాన్ని కమ్మేసింది. అది అన్ని రంగాలపైనా ప్రభావం చూపి స్థూల దేశీయోత్పత్తిని కుంగదీసింది. ఈ తరుణంలో జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళికకోసం నిధుల సమీకరణ అంత తేలిక కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిధుల సేకరణలో పారదర్శకతకోసం పలు స్థాయుల్లో వివిధ కమిటీలను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సేకరించిన నిధులను ఆయా ప్రాజెక్టులకోసం కేటాయించడం, వినియోగానికి సంబంధించి జవాబుదారీకి బాటలువేసేలా అవసరమైన కమిటీలను కొలువుతీర్చాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం కారణంగా అంచనా వ్యయాలు నాలుగైదు రెట్లు పెరిగిపోయాయి. భూసేకరణ, అటవీ, పర్యావరణ శాఖల అనుమతుల్లోనూ విపరీతమైన ఆలస్యం, మౌలిక సదుపాయాల్లో లోపాల వల్ల కేంద్ర ప్రాజెక్టులు నత్త నడకన సాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళికను చేపట్టడం సాహసంగానే తోస్తోంది. ప్రజల్లో నెలకొన్న సందేహాలను తొలగిస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలంటే ప్రాజెక్టులకు కావాల్సిన అనుమతులను సరళీకృతం చేయాలి. ఒకే అధికార వ్యవస్థ కింద ఏకీకృత విధానంలో అనుమతులు మంజూరు చేసేలా విధివిధానాలను సత్వరం రూపొందించాలి. జవాబుదారీతనంతో నడచుకొంటూ నిధులను సక్రమంగా వ్యయం చేయాలి.

- డాక్టర్‌ బి.యన్‌.వి.పార్థసారథి

(ఆర్థిక రంగ నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రైతుల్లో అవగాహనతోనే సక్రమ వాడకం

‣ దేశ రక్షణలో నారీ శక్తి

‣ అందరికీ దక్కని ఉపాధి హామీ

‣ జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పు

‣ యుద్ధం... ప్రపంచార్థికానికి శాపం!

‣ యూఏఈతో సరికొత్త వాణిజ్య బంధం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 08-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం