• facebook
  • whatsapp
  • telegram

రైతుల్లో అవగాహనతోనే సక్రమ వాడకం

విచ్చలవిడి ఎరువుల వల్ల అనర్థమే

ఎరువుల రాయితీ భారాన్ని మోయలేక కేంద్రం కొత్తదారులు వెదుకుతోంది. ‘సూక్ష్మ పోషక ఆధారిత రాయితీ’ (ఎన్‌బీఎస్‌) విధానం తెచ్చిన పుష్కర కాలంలోనే చాపచుట్టేసి కొత్త విధానం తేవడానికి రంగం సిద్ధం చేస్తోంది. గత పదేళ్లలోనే రసాయన ఎరువులపై కంపెనీలకు చెల్లించాల్సిన రాయితీ భారం 180శాతం అదనంగా పెరిగింది. పంట దిగుబడులు ఒక్కశాతం అధికమైతే ఎరువులపై ఇవ్వాల్సిన రాయితీ పదిశాతం అదనంగా పెరుగుతోంది. దీన్ని తప్పించుకునేందుకు ఎన్నో అంచనాలతో తెచ్చిన ఎన్‌బీఎస్‌ విధానం వికటించడంతో ఎరువుల ధరలు ఆకాశన్నంటుతూ రైతులకు గుదిబండగా మారాయి. మరోవైపు కంపెనీలకు చెల్లించాల్సిన రాయితీలతో కేంద్రం సైతం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ భారం నుంచి గట్టెక్కేందుకు తాజాగా ‘సమగ్ర మొక్కల పోషక నిర్వహణ బిల్లు’ ముసాయిదాను ప్రజల ముందు పెట్టింది. ఎరువుల తయారీ, దిగుమతులు, విక్రయాలు, నిల్వ వంటి వాటన్నింటినీ నియంత్రించి కేంద్రం చెప్పుచేతుల్లో పెట్టుకోవాలన్నదే ఈ బిల్లు సారాంశం. ఎన్‌బీఎస్‌ విధానంలో యూరియా మినహా మిగిలిన అన్ని రకాల ఎరువులపై నియంత్రణలను ఎత్తివేసి ‘స్వేచ్ఛాయుత విక్రయాల’కు అనుమతించారు. ఇప్పుడు మళ్ళీ నియంత్రణలోకి తేవడానికి బిల్లు ముసాయిదాను ముందుకు తెచ్చారు. దానివల్ల తమపై నియంత్రణలు అధికమై ఎరువుల తయారీ, అమ్మకాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ధరలకు కళ్ళెం వేసి రైతులకు సులభంగా ఎరువులను సరైన ధరలకు సరఫరా చేయాలన్నదే తన లక్ష్యమని కేంద్రం చెబుతోంది.

విపరీత భారం

దేశీయంగా రైతులకు తోచినంత రసాయన ఎరువులను పైరుకు చల్లుకొనే స్వేచ్ఛ ఉంది. అదే నేలతల్లికి శాపంగా మారింది. పంట సాగుచేసే భూమిలో ఉన్న పోషకాలేమిటి, ఏవి తక్కువగా ఉన్నాయనేది తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖలు భూసార పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించడంలేదు. ఒకవేళ మట్టి నమూనాలు సేకరించినా వాటి ఫలితాలను పంట సాగు ప్రారంభానికి ముందే రైతులకు చేరవేయడం లేదు. ఫలితంగా కర్షకులు ఇష్టారీతిగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. దేశంలో అత్యధికంగా రసాయనాలను పొలాల్లో గుమ్మరించే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు తొలి పది స్థానాల్లో నిలుస్తాయని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల పార్లమెంటులో వెల్లడించింది. 2019-20లో జాతీయస్థాయిలో హెక్టారు పంటకు సగటున 133.44 కిలోల రసాయన ఎరువులను రైతులు వినియోగించారు. జాతీయ సగటును మించి బిహార్‌లో 245 కిలోలు, తెలంగాణలో 206 కిలోలు, ఏపీలో 196 కిలోల చొప్పున రసాయన ఎరువులు చల్లారు. ఏపీ, తెలంగాణల్లోనే ఏడాదికి 70 లక్షల టన్నులకు పైగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. ప్రస్తుత రబీ (అక్టోబర్‌-మార్చి) సీజన్‌లో తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే, 20.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ కేంద్రానికి నివేదించింది. దేశంలో 2015-16లో 5.10 కోట్ల టన్నుల రసాయన ఎరువులను చల్లితే, 2019-20కల్లా అది 5.98 కోట్ల టన్నులకు పెరిగింది. ఈ స్థాయిలో రసాయనాల వినియోగం వల్ల భూమి గుల్లబారుతోంది. పంటల్లో జీవం సన్నగిల్లుతోంది. ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణమూ దెబ్బతింటోంది. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల 2040 తరవాత ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీత మార్పులు సంభవించి తీవ్ర దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఐరాస అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజా నివేదికలో హెచ్చరించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపి రైతులను చైతన్యపరచిన రాష్ట్రాల్లో రసాయనాల వాడకం తక్కువగా ఉంటోంది. 2015-20 మధ్యకాలంలో హెక్టారు పంటపొలంలో రసాయన ఎరువుల సగటు వినియోగం జమ్మూ కశ్మీర్‌లో 61శాతం, కేరళలో 58శాతం తగ్గింది. సిక్కిం సేంద్రియ సేద్యంలో దూసుకెళ్తోంది. దేశీయంగా రసాయన ఎరువుల వాడకం పెరిగేకొద్దీ రాయితీ భారంతో కేంద్రం సతమతమవుతోంది. 2007-08లో ఎరువుల రాయితీ పద్దు కింద రూ.32,490 కోట్లు కేటాయిస్తే, 2021-22లో మరో రూ.1.8 లక్షల కోట్లు అదనంగా కేంద్రం భరించాల్సి వచ్చింది. దేశీయంగా మొత్తం ఎరువుల వినియోగం 5.98 కోట్ల టన్నులుంటే అందులో కోటీ 37 లక్షల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం, వారికి దన్నుగా కేంద్రం రాయితీలు భరిస్తుండటంతో విదేశీ కంపెనీలు అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెటులో టన్ను యూరియా ధర 2021 ఆగస్టులో రూ.33,149 ఉంటే, డిసెంబరుకల్లా రూ.67,229కి ఎగబాకింది. అదే కాలానికి డైఅమోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ) ధర రూ.44,739 నుంచి రూ.56,276కి చేరింది. దానివల్ల కేంద్రం తొలుత కేటాయించిన రూ.79 వేల కోట్ల రాయితీకి బదులు ఏకంగా రూ.1.40 లక్షల కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారాన్ని మోయలేకనే ఎన్‌బీఎస్‌ విధానాన్ని పక్కన పెట్టి మళ్ళీ రసాయన ఎరువులపై నియంత్రణ విధించేందుకు కొత్త విధానాన్ని తెస్తూ బిల్లు ముసాయిదాను ఇటీవల విడుదల చేసింది.

చైతన్యంతోనే సత్ఫలితాలు

ఎరువులపై పూర్తి నియంత్రణ 2010కి ముందు కేంద్రం చేతిలోనే ఉండేది. నియంత్రణతో ఏమీ సాధించలేకపోతున్నామనే ఎన్‌బీఎస్‌ తెచ్చారు. ఇప్పుడు అదీ విఫలమైనట్టేనని అవగతమవుతోంది. ఈ తరుణంలో రసాయనాలనుంచి అసలు పుడమికి విముక్తి లభిస్తుందా అనేది సందేహంగా మారింది. నిజానికి ఎరువులపై రాయితీని కేంద్రం ఇస్తోంది. ధరలను కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. వాటి విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ మూడూ వేటికవే పనిచేస్తున్నాయి. రైతులు ఎంత ఎరువు వినియోగిస్తున్నారు, వారిని ఎలా చైతన్యపరచాలనే విషయంలో వాటి మధ్య సమన్వయం అవసరం. పంటల సాగు ప్రారంభమయ్యే జూన్‌కు ముందే మూడు నెలలపాటు రాష్ట్రమంతా భూసార పరీక్షలు చేయించాలి. ఏ పొలంలో ఏయే పోషకాలున్నాయనేది సాగు ప్రారంభానికల్లా రైతులకు తెలియజెప్పాలి. ఏ పంటకు ఎన్ని కిలోల ఎరువులు వేయాలో సమాచారం అందించాలి. అంతే మొత్తం ఎరువులు విక్రయించేలా వ్యవస్థలను క్రమబద్ధీకరించడం తప్పనిసరి. ఎక్కువగా ఎరువులు చల్లడంవల్ల అదనంగా పెరిగే దిగుబడి ఏమీ ఉండదని రైతులకు గట్టిగా వివరించాలి. రైతులను చైతన్యపరచకుండా ఎరువుల విక్రయాలు, ఉత్పత్తిని నియంత్రించేందుకు జాతీయ సమగ్ర పోషక నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయంవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని గ్రహించాలి.

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పరిశోధనలే జవజీవాలు

‣ ఓటర్లపై తాయిలాల వర్షం

‣ నిస్సారమవుతున్న పంటభూములు

‣ పటిష్ఠ క్షిపణివ్యవస్థ భారత్‌ బలం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం