• facebook
  • whatsapp
  • telegram

ఏడున్నర దశాబ్దాలుగా తప్పటడుగులే!

బాలల ఆరోగ్యం భవితకు ప్రాణావసరం

నేటి బాలలే రేపటి పౌరులు... కనుకనే వారి ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. రేపటి ఆరోగ్యకర సమాజానికి నేడే బాటలు పడాలి. కానీ ఈ దిశగా ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఏ పాటి శ్రద్ధ కనబరచాయో పరిశీలిస్తే విస్మయపరచే అంశాలెన్నో కళ్లకు కడతాయి. బాలల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలకపాత్ర పోషించే వైద్యుల కొరత భారత్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. స్వాతంత్య్రానికి ముందు ముంబయి, దిల్లీ వంటి నగరాలకు మాత్రమే పరిమితమై- కేవలం 12 మంది చిన్నపిల్లల వైద్య నిపుణులు దేశవ్యాప్తంగా సేవలందించినట్లు ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50వేల మంది చిన్న పిల్లల వైద్యులు ఉండవచ్చని అది అంచనా వేస్తోంది. ఏటా సుమారు 1,500 మంది చిన్నపిల్లల వైద్యంలో పట్టా పుచ్చుకొంటున్నారు. అయినప్పటికీ పది వేల జనాభాకు ఒక చిన్న పిల్లల వైద్యుడు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదు. 82శాతం గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో చిన్నపిల్లల వైద్యుల జాడే లేదు. బాలల ఆరోగ్య సంరక్షణకు దశాబ్దాలుగా ఎలాంటి ప్రత్యేక కృషీ జరగలేదనడానికి ఇది ప్రబల నిదర్శనం. 

అడుగడుగునా ఆటంకాలు

భారతదేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలను నిర్వహించుకొనేందుకు సిద్ధమవుతున్న దశలోనూ- జనాభాలో 39శాతం(దాదాపు 47.2 కోట్లు)గా ఉన్న 18 ఏళ్ల లోపు పిల్లల ఆరోగ్య సంరక్షణలో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది. భారత్‌లో దీర్ఘకాలంగా వేళ్లూనుకుని ఉన్న ఆర్థిక అసమానతలు, కులమతాల అడ్డు గోడలు, లింగ దుర్విచక్షణవంటివి శిశువుల ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. విద్యావికాసం, వృత్తి, ఉపాధితోపాటు ఆర్థికపరమైన అంశాలపైనా పరోక్ష ప్రభావం కనబరుస్తున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత ఇందుకు తోడుకావడంతో నేటికీ హెచ్చు సంఖ్యలో బాలలు పోషకాహార లోపం, రక్తహీనతలతో కునారిల్లుతున్నారు. కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం- 2021 అక్టోబరు నాటికి మన దేశంలో తీవ్రమైన పోషకాహార లోపంతో 33 లక్షలమంది పిల్లలు సతమతమవుతున్నారు. చిన్నారుల మరణాల్లో 69శాతం ఈ కారణంవల్లే సంభవిస్తున్నాయి. 6-23 నెలల మధ్య వయసు బిడ్డల్లో దాదాపు పది శాతానికి పోషకాహారం అందడం గగనంగా ఉంది. కేవలం 63శాతం పిల్లలు మాత్రమే పోలియో, డీపీటీ, తట్టు వంటి వ్యాధి నిరోధక టీకాలు పొందగలుగుతున్నారు. బాలుర కంటే 11శాతం హెచ్చుగా బాలికలు మరణిస్తున్నారు. ఈ మరణాల వెనక లింగ దుర్విచక్షణ కోణం విస్మరించలేనిది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అణగారిన పేద వర్గాలకు చెందిన చిన్నారులు- వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి సదుపాయాలకు దూరంగానే బతుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా చిన్నారుల వైద్యరంగం పరిణతి సాధించినప్పటికీ- చిన్నారుల మరణాల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. ప్రతి వెయ్యి జననాల్లో... 23 మంది శిశువులు నెల తిరిగే లోపు, 29 మంది చిన్నారులు తమ మొదటి పుట్టినరోజు లోపే మృత్యువాత పడటం అత్యంత ఆందోళనకరం. 2022 నాటికి నవజాత శిశుమరణాలను 16కు తగ్గించాలనే లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించుకుంది. తల్లిగర్భంలో ఎదిగే పిండంపై, జనన సమయంలో బిడ్డపై చోటు చేసుకునే ప్రతికూలతలు శిశువు మెదడు, గుండె, శ్వాసకోశాలు, రోగ నియంత్రణ వ్యవస్థల పనితీరుపై కలిగించే చెడు ఫలితాల వల్ల జీవితకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నవజాత శిశువుల రక్షణలో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులు రెండు దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్న పిల్లల్లో గుండె, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ మొదలైన విభాగాల్లో ప్రత్యేక వైద్యులు ఇటీవల అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలందిస్తున్నారు. దాంతో 1971లో 140గా ఉన్న ఏడాది లోపు వయసున్న చిన్నారుల మరణాల రేటు 2020 నాటికి 29.03గా నమోదయింది.

ప్రభుత్వాల బాధ్యత

చిన్న పిల్లల జీవన ప్రమాణాలను మెరుగుపరచే లక్ష్యంతో 2015లో ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలను నిర్దేశించింది. ఆమేరకు పోషకాహారం నూరుశాతం అందించగలగాలి. గృహహింస, లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలి. స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేయాలి. చిన్నారుల్లో క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు సత్వరమే చికిత్స అందించగలగాలి. వారి కుటుంబ సభ్యులతో తరచూ సంభాషిస్తూ వారి అవసరాలు, ప్రాధాన్యాలను గమనిస్తూ ఉండాలి. చిన్న పిల్లల హక్కులను గౌరవిస్తూ వారికి సమాజంలో తగిన రక్షణ కల్పించాలి. ప్రపంచవ్యాప్తంగా 2018-2050 మధ్య కాలంలో 200 కోట్ల జననాలు సంభవించవచ్చని యునిసెఫ్‌ అంచనా. ఇందులో అయిదో వంతు మన దేశంలోనే జన్మించే అవకాశం ఉంది. పుట్టబోయే శిశువుల మనుగడపై ముందస్తుగానే దృష్టి సారించాలి. భారత వారసత్వ సంపదగా భాసిల్లుతున్న రేపటి పౌరులను కంటికి రెప్పలా కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత. చిన్నారుల శ్రేయస్సు సమాజహితానికి ప్రాణావసరం. బాలలు రేపటి పౌరులుగా- మేధాసంపత్తి, నైపుణ్యాలు, శక్తి యుక్తుల సమ్మేళనంగా దేశానికి దిక్సూచిగా నిలుస్తారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి ఆరోగ్య సంరక్షణకు భరోసా కల్పించాలి. ఆరోగ్యవంతులైన చిన్నారుల ప్రతిభకు పదును పెట్టి ఫలవంతం చేసుకోగలిగితే- భారత్‌ ఆర్థికంగా, సాంకేతికంగా, రాజకీయంగా బలీయ శక్తిగా రూపొందగలదు. అడుగడుగునా ఆటంకాలతో నత్తనడకన సాగుతున్న చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ప్రస్థానాన్ని పరుగులెత్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!

విదేశాల ఆదర్శం...

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా చిన్న పిల్లల మరణాలను గణనీయంగా అదుపు చేయగలిగింది. మిలీనియం అభివృద్ధి లక్ష్యాన్ని రెండింతల వేగంతో సాధించి- చిన్నారులు, కిశోర బాలల ఆరోగ్య సంరక్షణలో పలు సంస్కరణలు తెచ్చింది. దాదాపు రెండు లక్షల మంది చిన్నపిల్లల వైద్యుల కొరత ఉన్నా... జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా లక్ష్యాలను సాధించింది. చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణలో థాయ్‌లాండ్‌ ఉన్నత ప్రమాణాలు సాధించి ప్రపంచ గుర్తింపు పొందింది. పేదరికానికి చిరునామాగా ఉన్న కొన్ని ఆఫ్రికా దేశాలు సైతం చిన్న పిల్లల మరణాలను 60శాతం వరకు నియంత్రించి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి.

లక్ష్యం చేరని పథకాలు

చిన్నారుల్లో పోషకాహార సమస్యను అధిగమించే దిశగా 1975లో చిన్నపిల్లల సమగ్రాభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌) ప్రారంభమైంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలవుతున్న ఈ పథకం పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించలేక పోయింది. 2017 నాటి గణాంకాల మేరకు అయిదేళ్ల లోపు పిల్లలు 25శాతం దాకా పోషకాహార లోపంతో సతమతమవుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ్‌ అభియాన్‌(నేషనల్‌ న్యూట్రిషన్‌ మిషన్‌)కు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో దేశ సమగ్రాభివృద్ధి ప్రదాతలుగా ఆవిర్భవించనున్న చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వాలు పూర్తి భరోసాను అందించలేకపోయాయనేది చేదు వాస్తవం.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మూడో ధ్రువంగా ఆప్‌

‣ వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ సాంకేతికత

‣ ఎగుమతుల వృద్ధిలో అసమానతలు

‣ డ్రాగన్‌కు యుద్ధపోటు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం