• facebook
  • whatsapp
  • telegram

వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ సాంకేతికత

వెనకబడితే వెనకేనోయ్‌

 

 

డిజిటల్‌ పారిశ్రామిక విప్లవం ప్రస్తుతం ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తోంది. వ్యాపార రంగంలోనే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం, ఆర్థికం, సేవలు తదితర రంగాల్లోనూ ఈ సాంకేతికత వినియోగంలోకి వస్తోంది. డిజిటల్‌ సాంకేతికతను ప్రపంచంలోని ప్రతి దేశం అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి అనివార్యమవుతోంది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదలకు సైతం డిజిటల్‌ పెట్టుబడులు, అంకుర పరిశ్రమలు సహకరిస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం గతేడాది ఏర్పాటైన 14 వేల అంకుర పరిశ్రమలు మన జీడీపీ వృద్ధికి ఊతమిచ్చాయి. ఇవి పూర్తిగా సమాచార సాంకేతికత (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ), వైజ్ఞానిక (నాలెడ్జ్‌ బేస్డ్‌) రంగాలకు చెందినవే. ఈ ప్రభావంతో మన దేశం 2021లో అమెరికా, చైనా తరవాత మూడో అతిపెద్ద నూతన ఆవిష్కరణ వ్యవస్థగా అవతరించింది. దేశంలో రూ.100కోట్ల డాలర్ల ఆదాయానికి పైబడిన (యూనికార్న్‌) అంకుర సంస్థల సంఖ్య 2019లో 11; 2021 డిసెంబరు నాటికి ఆ సంఖ్య 83కు పెరిగింది. దీన్నిబట్టి డిజిటల్‌ సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతోందో అంచనా వేయవచ్చు.

 

ఆన్‌లైన్‌ విద్యకు బాటలు

గడచిన రెండేళ్ల కరోనా సంక్షోభంలో అంతర్జాలం, యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రజలు నివాసాలకే పరిమితమై విద్య, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, వస్తు సేవలకు అంతర్జాలాన్ని విరివిగా ఉపయోగించడం ప్రారంభించారు. గత సంవత్సరం అక్టోబరు వరకు భారత్‌లో 120 కోట్ల సెల్‌ఫోన్లు ఉన్నట్లు అంచనా. అందులో 60కోట్ల వరకు- అంతర్జాల సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్లే. ప్రతి మూడు నెలలకు 2.50కోట్ల మంది సెల్‌ఫోన్లు కొంటున్నారని అంచనా. ఫిన్‌టెక్‌ సేవల వృద్ధిరేటు భారత్‌లో 87శాతం. ప్రపంచ సరాసరి వృద్ధి రేటు 64శాతం. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, భీమ్‌ మొదలైన డిజిటల్‌ వ్యవస్థల ద్వారా ఆర్థిక సేవలను దేశ ప్రజలు విరివిగా ఉపయోగిస్తున్నారు. అతిత్వరలో భారత్‌ ప్రపంచంలోనే ఒక పెద్ద డిజిటల్‌ మార్కెట్‌గా అభివృద్ధి చెందుతుందని ఆర్థికరంగ నిపుణుల అంచనా. పెరుగుతున్న డిజిటల్‌ సేవలకు తగినట్లు మౌలిక వసతులను కల్పించాలంటే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో సంవత్సరానికి రూ.3500కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని అంచనా. భారత జనాభాలో 35 ఏళ్లలోపు యువజనం 65శాతం. వీరందరికీ డిజిటల్‌ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం దేశం ముందున్న లక్ష్యం. దానికనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత విద్యాలయాలు డిజిటల్‌ కోర్సులను వివిధ డిగ్రీల రూపంలో అందిస్తున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, రోబొటిక్స్‌, డాటా ఎనలిటిక్స్‌, బిగ్‌డేటా మొదలైన వాటిని పాఠ్యాంశాలుగా చేర్చి డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయి. ప్రపంచస్థాయి డిజిటల్‌ యూనివర్సిటీని భారత్‌లో స్థాపించేందుకు ఇటీవలి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. యువతకు డిజిటల్‌ నైపుణ్యాల సాధనకు 750 వర్చువల్‌ ప్రయోగశాలలు, 75 నైపుణ్య ప్రయోగశాలల స్థాపనకు ఆమోదం లభించింది. ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో డిజిటల్‌ కోర్సులు ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ-విద్యను అందుబాటులోకి తెస్తున్నారు.

 

సర్కారీ ప్రోత్సాహం అవసరం

డిజిటల్‌ విద్యను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి ప్రణాళికలు అవసరం. గ్రామీణ విద్యార్థులకు డిజిటల్‌ సేవలు, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించాలి. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ ఆర్థిక సేవల ఉపయోగాలను మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. నూతన పరిశ్రమల స్థాపనకు దేశీయ వ్యవస్థాపకులకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. ప్రిన్స్‌ ట్రస్ట్‌ పరిశోధన సంస్థ ఇటీవలి అధ్యయనం ప్రకారం- 85శాతం భారత యువత పర్యావరణహితకరమైన ప్రయోజనాలను అందించే సంస్థల్లో ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది. అలాంటివారికి డిజిటల్‌ శిక్షణ ఇచ్చి నూతన దేశీయ ఆవిష్కరణలకు నాంది పలకడం చాలా అవసరం. ప్రపంచంలో మారుతున్న సాంకేతిక యుగానికి తగ్గట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి యువతను ఉత్తేజపరచి డిజిటల్‌ ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సహించాలి. తద్వారా యువత కోరుకుంటున్న ఉపాధి మార్గాలు ఏర్పరచడంతో పాటు జీడీపీ వృద్ధిచెంది- భారత్‌ 2030 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు ఏర్పడతాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎగుమతుల వృద్ధిలో అసమానతలు

‣ డ్రాగన్‌కు యుద్ధపోటు

‣ ఆధునిక యుగంలోనూ అసమానతలు

‣ మౌలిక వృద్ధికి నిధుల సమీకరణే కీలకం

‣ రైతుల్లో అవగాహనతోనే సక్రమ వాడకం

‣ దేశ రక్షణలో నారీ శక్తి

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 12-03-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం