• facebook
  • whatsapp
  • telegram

ముట్టడి వ్యూహంతో ముందుకు

ఉక్రెయిన్‌ దిగ్బంధనమే రష్యా పంతం

ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించి నెల గడిచినా రష్యా తన లక్ష్యం నెరవేర్చుకోలేకపోయింది. పైగా నగరాలు, ఆస్పత్రులపై రష్యన్‌ సేనల దాడిలో భారీ ప్రాణ నష్టం జరుగుతున్నందువల్ల వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రపంచం దృష్టిలో యుద్ధ నేరస్థుడిగా నిలబడవలసి వచ్చింది. వేగంగా ఉక్రెయిన్‌ను స్వాధీనపరచుకుని అక్కడ తాను ఆడమన్నట్లు ఆడే ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించాలన్న పుతిన్‌ వ్యూహం ఇప్పటికైతే విఫలమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా, నాటో దేశాలు సరఫరా చేస్తున్న అత్యాధునిక ఆయుధాల వల్లనే రష్యన్‌ సేనలకు ఎదురొడ్డి ఉక్రెయిన్‌ పోరాడగలుగుతోంది. ఆరంభంలో దూసుకొచ్చిన రష్యన్‌ దళాల జోరు ఇప్పుడు తగ్గిపోవడమే దీనికి నిదర్శనం అంటున్నారు. మరికొందరు నిపుణుల అంచనా వేరేలా ఉంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తోపాటు మరియుపోల్‌, ఖార్కివ్‌ నగరాలను చుట్టుముట్టి రష్యన్లు ఎడతెగకుండా బాంబు దాడులు చేయడాన్నిబట్టి వారు ముట్టడి వ్యూహాన్ని చేపడుతున్నట్లు అర్థమవుతోంది. ఖార్కివ్‌లో పెద్దసంఖ్యలో పాఠశాలలు, ఒక మానసిక చికిత్సాలయం బాంబు దాడిలో ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా నుంచి డాన్‌బాస్‌ వరకు సురక్షితమైన కారిడార్‌ను ఏర్పరచుకోవడం, తరవాత ఒదెస్సా రేవును ఆక్రమించి ఉక్రెయిన్‌కు నల్ల సముద్రం అందుబాటులో లేకుండా చేయడం పుతిన్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. భూ, సముద్ర మార్గాల నుంచి ఉక్రెయిన్‌కు ఎటువంటి సహాయం అందకుండా దిగ్బంధించాలని ఆయన చూస్తున్నారు.

గగనతలంలో హోరాహోరీ

యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌ గగనతలాన్ని పూర్తిగా తన అదుపులోకి తీసుకోవడంలో రష్యా విఫలమైంది. దీనికి ప్రధాన కారణం- అమెరికా, నాటోలు ఉక్రెయిన్‌కు అందించిన స్టింగర్‌ క్షిపణులే. గతంలో అఫ్గాన్‌ యుద్ధంలో సోవియట్‌ సేనలకు సింహస్వప్నంగా నిలిచిన స్టింగర్లు ఇప్పుడు ఉక్రెయిన్‌లో రష్యాను అడ్డుకొంటున్నాయి. అమెరికా, నాటోలు ఇప్పటి వరకు రెండువేల స్టింగర్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాయి. వీటితోపాటు రష్యా స్వయంగా రూపొందించిన ఎస్‌300 క్షిపణి వ్యవస్థ కూడా రష్యన్‌ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేయడానికి తోడ్పడుతోంది. ఒకప్పుడు సోవియట్‌ కూటమిలోని ఉక్రెయిన్‌, పోలాండ్‌ తదితర దేశాల వద్ద ఎస్‌300 వ్యవస్థలు ఉన్నాయి. అవే ఇప్పుడు రష్యాపై ఎదురొడ్డి పోరాడేందుకు తోడ్పడుతున్నాయి. ఎక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను ఎస్‌300 వ్యవస్థలు కూల్చివేయగలవు. అందుకే రష్యన్‌ విమానాలు, హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగరక తప్పడం లేదు. కానీ, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను స్టింగర్లు కూల్చివేస్తున్నాయి. తమ క్షిపణులతో మార్చి 16వ తేదీ నాటికి మొత్తం 81 రష్యన్‌ యుద్ధ విమానాలు, 95 హెలికాప్టర్లు, తొమ్మిది మానవ రహిత డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. అందుకు సంబంధించిన వీడియోలుగా కొన్నింటిని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అవి ఎంతవరకు నిజమో చెప్పలేం. కనీసం 20 రష్యన్‌ విమానాలు కూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని బ్రిటిష్‌ వర్గాలు వెల్లడించాయి. యుద్ధం మొదలయ్యేటప్పటికి ఉక్రెయిన్‌ ఒక యుద్ధ విమానాన్ని మోహరిస్తే రష్యా మూడు విమానాలను రంగంలోకి దింపింది. ఇంత సంఖ్యాబలమున్నా రష్యా ఇప్పటికీ ఉక్రెయిన్‌ గగనతలాన్ని అదుపులోకి తీసుకోలేకపోయిందంటే కారణం స్టింగర్‌, ఎస్‌300 క్షిపణులేనని నిపుణులు అంటున్నారు. వీటి దెబ్బకు రష్యా రాత్రిపూట మాత్రమే తన విమానాలను పంపుతోందని చెబుతున్నారు. అలాగని గగనతలంలో పూర్తిగా ఉక్రెయిన్‌దే పైచేయి అనీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌ వైమానిక సేనలో ఇప్పుడు తక్కువ సంఖ్యలో విమానాలు ఉండటంతో, రష్యా రోజుకు 200 విమానాలను దాడులకు పంపుతుంటే ఉక్రెయిన్‌ అయిదు, పది దాడులతో సరిపెట్టుకొంటోంది.

విజయసాధనకు విశ్వప్రయత్నం

ఏదిఏమైనా అమెరికా, నాటోలు అందించిన క్షిపణులు, డ్రోన్లు ఆత్మరక్షణకు మాత్రమే ఉపకరిస్తాయి. పాశ్చాత్య దేశాలు ఇప్పటికైతే ఉక్రెయిన్‌కు ఫైటర్‌ విమానాలను, ట్యాంకులను, భారీ శతఘ్నులను సరఫరా చేయడానికి సిద్ధంగా లేవు. అందుకే, పోలాండ్‌ 28 ‘మిగ్‌-29’ విమానాలను ఇస్తానన్నా వాటిని స్వీకరించి ఉక్రెయిన్‌కు బదలాయించడానికి అమెరికా అంగీకరించలేదు. అంతేకాదు- రష్యన్‌ యుద్ధ విమానాలు, డ్రోన్లు రాకుండా ఉక్రెయిన్‌ గగనతలాన్ని నిషిద్ధ మండలంగా ప్రకటించాలని ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌ స్కీ కోరినా అమెరికా అందుకు నిరాకరించింది. అలా ప్రకటిస్తే రష్యాతో నేరుగా యుద్ధానికి తలపడినట్లేనని అమెరికా, నాటోలు కలవరపడుతున్నాయి. భారీ శతఘ్నులు, ట్యాంకులు, గగనతలంలో యుద్ధ విమానాలు లేకుండా రష్యన్‌ దళాలను ఉక్రెయిన్‌ ఎంతోకాలం ఎదుర్కోలేదు. ప్రస్తుతం కీవ్‌, ఖార్కివ్‌ తదితర నగరాలను ముట్టడిస్తున్న రష్యన్లను అటకాయించడంలో ఉక్రెయిన్‌ దళాలు సఫలమవుతున్నా- రష్యన్లు పూర్తిస్థాయిలో ఫిరంగులు, ట్యాంకులను మోహరించాక పరిస్థితి మారుతుంది. చివరకు నగరాల్లో వీధి పోరాటాలకు, గ్రామ ప్రాంతాల్లో గెరిల్లా దాడులకు ఉక్రెయిన్‌ పరిమితం కావచ్చు. అదే జరిగితే రష్యన్లు దీర్ఘకాలం ఉక్రెయిన్‌లోని నగరాల్లో పౌరులు, మౌలిక వసతులపై బాంబు దాడులు చేస్తూ అంతర్జాతీయ ఆగ్రహాన్ని మూటగట్టుకోవలసి వస్తుంది. అప్పుడు ఉక్రెయిన్‌ గగనతలాన్ని రష్యా విమానాలకు నిషిద్ధ మండలంగా ప్రకటించినా ఆశ్చర్యం లేదు. అయినా దీర్ఘకాల యుద్ధానికే సై అంటే ఆర్థిక ఆంక్షల వల్ల రష్యా చితికిపోతుంది. అలాగని రష్యన్లు వెనక్కుమళ్లితే స్వదేశంలో పుతిన్‌ ప్రతిష్ఠ దెబ్బతిని ఆయన అధికారానికే ఎసరు రావచ్చు. దీన్ని నివారించడానికి ఆరు నూరైనా ఉక్రెయిన్‌లో విజయ సాధనకు పుతిన్‌ విశ్వప్రయత్నం చేస్తారని నిపుణులు భావిస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం తరవాత మొదటిసారిగా రష్యా అణ్వస్త్ర బలగాలను అప్రమత్తం చేస్తానని ప్రకటించడం ద్వారా పుతిన్‌ ఉక్రెయిన్‌లో ప్రత్యక్ష జోక్యం చేసుకోవద్దని అమెరికా, నాటోలను హెచ్చరించారు. ఇదంతా చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న భయాలు అందరినీ ముప్పిరిగొంటున్నాయి.

ఉపకరించిన క్షిపణులు

నేల మీద రష్యన్‌ ట్యాంకులను ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్‌కు అమెరికా పంపిన జావెలిన్‌ క్షిపణులు, బ్రిటన్‌ అందించిన ఎన్‌ లాస్‌ క్షిపణులు ఉపకరిస్తున్నాయి. మార్చి నెల తొమ్మిదో తేదీ నాటికి 17వేల ట్యాంకు విధ్వంసక క్షిపణులు, రెండువేల స్టింగర్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించినట్లు అమెరికన్‌ రక్షణ వర్గాలు తెలిపాయి.  800 స్టింగర్‌, రెండువేల జావెలిన్‌, 100 డ్రోన్లు పంపబోతున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. ప్రస్తుతం పశ్చిమ ఉక్రెయిన్‌ను ఆనుకుని ఉన్న పోలాండ్‌, లాత్వియా, లిథువేనియా వంటి దేశాల నుంచి ఆయుధాలు వస్తున్నాయి. అమెరికా, నాటోలు ఇలా ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపుతూనే ఉంటే ఊరుకోబోమని, ఆయుధ ట్రక్కులపై దాడులు చేస్తామని రష్యా హెచ్చరించింది. అదే జరిగితే అమెరికా, నాటోలు నేరుగా రష్యాతో తలపడవలసి వస్తుంది.

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరిహద్దు వివాదాల పీటముడి

‣ దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

‣ ఉక్రెయిన్‌లో జీవాయుధాల రగడ

‣ వన హననం... భవితకు ప్రమాదం

‣ కౌలురైతుకు కవుకు దెబ్బలు

‣ రసాయన దాడుల ముప్పు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం