• facebook
  • whatsapp
  • telegram

సరిహద్దు వివాదాల పీటముడి

చైనాతో కొలిక్కిరాని చర్చలు

దేశ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలు కొన సాగుతునే ఉన్నాయి. మార్చి 11న చుషూల్‌-మోల్దో సరిహద్దు భేటీ వేదిక వద్ద భారత్‌-చైనా మధ్య జరిగిన 15వ విడత చర్చలు కూడా సమస్యకు పరిష్కారం చూపకుండానే ముగిశాయి. ఈసారి సంయుక్త ప్రకటన వెలువడటం మాత్రమే కొంతమేర సానుకూల అంశం. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టిన తరవాత అంతర్జాతీయ పరిణామాలు మారుతున్న సమయంలో భారత్‌-చైనా మధ్య జరిగిన తొలి చర్చలు ఇవే. ఇప్పటిదాకా జరిగిన చర్చల్లో గల్వాన్‌లోయ, పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో, గోగ్రా పోస్ట్‌ వద్ద దళాల ఉపసంహరణపై అవగాహనకు వచ్చారు. మిగిలిన మూడు వివాదాస్పద ప్రాంతాలైన డెప్సాంగ్‌ మైదానాలు, డెమ్‌చోక్‌, హాట్‌స్ప్రింగ్‌ వ్యూహాత్మకమైనవి కావడంతో ఇరు దేశాలు పట్టువీడటం లేదు. ఇప్పటిదాకా జరిగిన చర్చల తీరును పరిశీలిస్తే ఇరుదేశాలు వేగంగా పరిష్కారానికి అవకాశం ఉన్న ఒక్కో ప్రాంతంపై దృష్టిపెట్టి ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది. ఈసారి చాంగ్‌ చెన్మో నది సమీపంలోని హాట్‌స్ప్రింగ్స్‌ (పెట్రోలింగ్‌ పాయింట్‌ 15) వద్ద వివాద పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. డెప్సాంగ్‌పై చర్చలకు కూడా చైనా అంగీకరించలేదని ప్రచారం జరిగింది. అక్కడ ‘వై’జంక్షన్‌ ప్రాంతాన్ని పీఎల్‌ఏ దళాలు ఆక్రమించుకొని, భారత బలగాలను అత్యంత వ్యూహాత్మకమైన అయిదు పెట్రోలింగ్‌ పాయింట్ల వైపు వెళ్లనీయకుండా చేస్తున్నాయి. డెమ్‌చోక్‌ వద్ద దళాల ఉపసంహరణపై చర్చలకు కూడా డ్రాగన్‌ సానుకూలంగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు ప్రాంతాలతో పోలిస్తే హాట్‌స్ప్రింగ్స్‌కు పరిష్కారం కొంత వేగంగా సాధించే అవకాశం ఉంది.

ఆగని నిర్మాణాలు

వాస్తవానికి మూడు ప్రాంతాలపై పరిష్కార నిర్ణయాలు ఇరుపక్షాల్లోని అత్యున్నత శ్రేణి నాయకత్వాల నుంచి వెలువడాల్సిందే. ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరులో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బహుశ ఈ పర్యటన తరవాత సైనిక చర్చల్లో మరింత పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరుగుతున్నా, చైనా వైపు నిర్మాణాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఖుర్నాక్‌ వద్ద వంతెన నిర్మాణం, సరిహద్దుల్లో గ్రామాలను, సైనిక వసతులను నిర్మించడం వంటి చర్యలతో అనుమానాలను పెంచుతోంది. గత డిసెంబర్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టింది. పరస్పర విశ్వాసం దెబ్బతీసే రీతిలో ఇలాంటి చర్యలకు డ్రాగన్‌ పూనుకోవడం చర్చలకు విఘాతంగా మారే అవకాశం ఉంది. ‘ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నా, సరిహద్దుల్లోని దళాలు అత్యున్నత స్థాయి యుద్ధ సన్నద్ధతతో ఉంటాయి’ అని భారత సైన్యాధిపతి పునరుద్ఘాటించడంతో ఎల్‌ఏసీ వద్ద మోహరించిన లక్ష మంది సైనికులు ఇప్పట్లో వైదొలగే అవకాశం లేదని తేలిపోయింది. ఈ క్రమంలో రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకొని పరస్పర విశ్వాసం పెంచుకొంటేనే ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న సమయంలో అమెరికా వైఖరి భారత్‌కు ఓ కీలక అంశాన్ని వెల్లడిస్తోంది. రక్షణకు హామీ ఒప్పందం లేని మిత్ర దేశాల తరపున అమెరికా నేరుగా బరిలోకి దిగే అవకాశం లేదు. అంతేకాదు తన సమాంతర శక్తి అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అడ్డుకోవడానికి అమెరికా ఆసక్తి చూపదని అర్థమైపోయింది. మరోపక్క బీజింగ్‌ నేరుగా వాషింగ్టన్‌కు వ్యతిరేకంగా మాస్కోకు మద్దతు తెలిపింది. ఇది అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయడమే.

అప్రమత్తత అవసరం

యుద్ధం కారణంగా రష్యా ఎల్‌ఏసీ వివాదంపై అంతగా ఆసక్తి చూపే అవకాశం లేదు. భారత్‌ తటస్థ వైఖరిపై అమెరికా సహా పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనదేశం పశ్చిమ దేశాలు లేదా రష్యాపై ఆధారపడే పరిస్థితి లేదు. భారత సైన్యం అత్యధికంగా రష్యా, ఉక్రెయిన్‌ ఆయుధాలనే  వినియోగిస్తుంది. ఇప్పుడు ఈ రెండు దేశాలు యుద్ధంలో మునిగాయి. ఇదే సమయంలో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు తలెత్తితే, భారత్‌కు ఆయుధ విడిభాగాల సరఫరాలో తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడిని విశ్లేషించిన బీజింగ్‌- సుదీర్ఘ యుద్ధం కాకుండా మెరుపుదాడులతో ఆక్రమణ యత్నాలు చేసే ప్రమాదం పొంచి ఉంది. కానీ, లద్దాఖ్‌ భౌగోళికంగా కఠిన ప్రాంతం కావడంతో చైనా సైనికులు చురుగ్గా కదిలే అవకాశాలు తక్కువ. నదులనే ఆయుధాల్లా మలిచే అవకాశాలూ ఉన్నాయని వ్యూహకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కీలక వైమానిక స్థావరమైన దౌలత్‌బేగ్‌ ఓల్డీని భారత్‌ నుంచి వేరుచేయాలని చైనా ఎప్పటి నుంచో భావిస్తోంది. ఈ క్రమంలో చైనా చేసిన ప్రయత్నం గల్వాన్‌ ఘర్షణలకు కారణమైంది. అప్పట్లో గల్వాన్‌ నది నియంత్రణకు చైనా యత్నించిందనే వార్తలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌ సొంత దౌత్య, సైనిక శక్తిపైనే ఆధారపడి చైనాను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సి ఉంది.

- పి.ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

‣ ఉక్రెయిన్‌లో జీవాయుధాల రగడ

‣ వన హననం... భవితకు ప్రమాదం

‣ కౌలురైతుకు కవుకు దెబ్బలు

‣ రసాయన దాడుల ముప్పు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 23-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం