• facebook
  • whatsapp
  • telegram

ఉక్రెయిన్‌లో జీవాయుధాల రగడ

అమెరికాపై అనుమానాలు!

ఉక్రెయిన్‌లో అమెరికా రక్షణ శాఖ, ఒక ప్రైవేటు కంపెనీ కలిసి జీవాయుధాలపై పరిశోధనలు సాగిస్తున్నాయని ఇటీవల రష్యా రక్షణ శాఖ ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ 30 జీవశాస్త్ర ప్రయోగశాలలను కనుగొన్నామని ఆ శాఖ వెల్లడించింది. తమ సైనిక చర్యలో కీవ్‌లోని ప్రయోగశాలల ఆనవాళ్లు దొరక్కుండా అమెరికా, ఉక్రెయిన్‌లు హడావుడిగా ప్రక్షాళన చేశాయని ఆరోపించింది. ఉక్రెయిన్‌లోని ప్రయోగశాలల్లో ప్లేగు, ఆంథ్రాక్స్‌, కలరా వంటి ప్రమాదకర వ్యాధులను కలిగించే సూక్ష్మజీవుల జన్యువుల్లో కృత్రిమంగా మార్పుచేర్పులు చేసి జీవాయుధాలుగా మార్చడానికి ప్రయోగాలు జరిగాయని ఐక్యరాజ్య సమితిలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా ఆరోపించారు. ఉక్రెయిన్‌ ప్రయోగశాలలను జీవాయుధ రూపకల్పనకు అమెరికా ఉపయోగించుకొంటోందని చైనా సైతం అనుమానిస్తోంది.

భద్రతామండలి ఉదాసీనత

కరోనా వైరస్‌ అమెరికా సృష్టేనని రష్యా, చైనాలు ఇప్పటికే పరోక్షంగా నిందిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో అగ్రరాజ్యం రహస్యంగా జీవాయుధ తయారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అమెరికాలో అతిమితవాద కుట్ర సిద్ధాంతకారులు, డొనాల్డ్‌ ట్రంప్‌ను సమర్థించే వెబ్‌సైట్లు, టీవీ ఛానళ్లు సైతం ఆరోపిస్తున్నాయి. మరోవైపు రష్యా సైన్యం తనపై తాను బూటకపు దాడులు జరుపుకొని, ఆ సాకుతో ఉక్రెయిన్‌పై జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించవచ్చని బ్రిటిష్‌ రక్షణ శాఖ ఇటీవల ట్వీట్‌ చేసింది. ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలు ప్రయోగిస్తే రష్యా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. రష్యా రసాయనాస్త్రాలను ప్రయోగించే అవకాశం ఉందని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోల్టెన్‌ బర్గ్‌ సైతం ఆరోపిస్తున్నారు.

గతంలో సోవియట్‌ యూనియన్‌ జీవాయుధ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉక్రెయిన్‌ ప్రయోగశాలలను అమెరికా, నాటో, ఐరోపా సమాఖ్య (ఈయూ)లు స్వాధీనం చేసుకుని, ఇప్పుడు జీవాయుధ పరిశోధనలు సాగిస్తున్నాయని రష్యా, చైనాలు అనుమానిస్తున్నాయి. జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధులపై పరిశోధనల కోసం ఉక్రెయిన్‌ సైన్యానికి అమెరికా రక్షణ శాఖ 2021 నుంచి 1.18 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చిందని రష్యా సైన్యాధికారి జనరల్‌ ఇగోర్‌ కిరిలోవ్‌ ప్రకటించారు. హానికర సూక్ష్మజీవులను సేకరించి పంపాలని ఉక్రెయిన్‌ను అమెరికా కోరిందని కిరిలోవ్‌ ఆరోపించారు. ఉక్రెయిన్‌లో కనిపించే కాంగో-క్రిమియా రక్తస్రావ వ్యాధి, లెప్టోస్పైరోసిస్‌, మెనింజైటిస్‌, వివిధ హంటా వైరస్‌లపై 2020-21లో అక్కడి సైన్యంతో కలిసి జర్మన్‌ రక్షణ శాఖ అధ్యయనం జరిపిందని కిరిలోవ్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, నివారణ, చికిత్సల పేరిట ఉక్రెయిన్‌లోని స్లావిక్‌ జాతివారి రక్తం, కళ్లె నమూనాలను సేకరించి అమెరికా సైన్యానికి చెందిన వాల్టర్‌ రీడ్‌ పరిశోధన కేంద్రానికి పంపారనీ ఆరోపించారు.

గతంలో అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి విక్టోరియా నులాండ్‌ సైతం ఉక్రెయిన్‌లో జీవశాస్త్ర పరిశోధనశాలలు ఉన్నాయని సెనెట్‌కు తెలిపారు. అక్కడి పరిశోధనల వివరాలు, సామగ్రి రష్యన్ల చేతిలో పడకుండా జాగ్రత్తపడుతున్నామని ప్రకటించారు. గతంలో రష్యా జీవాయుధాల రూపకల్పనకు వాడుకున్న ఈ ప్రయోగశాలలను ప్రజారోగ్య సంరక్షణ పరిశోధనలకోసం ఇప్పుడు వినియోగిస్తున్నామని అమెరికా ప్రభుత్వ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రష్యా ఒత్తిడితో ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఉక్రెయిన్‌లోని జీవశాస్త్ర ప్రయోగశాలల గురించి చర్చించింది. ఉక్రెయిన్‌లో జీవాయుధ కార్యక్రమం నడుస్తున్నట్లు ఐరాస దృష్టికి రాలేదని సమితి ప్రతినిధి ఇజుమి నకామిట్సు ప్రకటించారు. నిజానికి ఉక్రెయిన్‌ ప్రయోగశాలల నుంచి ప్రమాదకర వైరస్‌, బ్యాక్టీరియాలు బయటి ప్రపంచంలోకి పాకకుండా తక్షణం వాటి నమూనాలను ధ్వంసం చేయాలని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచించింది. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు భద్రతా మండలి వెంటనే రంగంలోకి దిగి జీవాయుధాలపై విచారణ చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

విధ్వంస శక్తి

జీవ, రసాయన ఆయుధాలను నిరోధించడానికి 183 దేశాలు కుదుర్చుకున్న జీవ, విషపూరిత ఆయుధాల నిషేధ ఒప్పందం (బీటీడబ్ల్యూసీ) 1975 మార్చి 26నుంచి అమలులోకి వచ్చింది. ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల్లో రష్యా, ఉక్రెయిన్‌లూ ఉన్నాయి. తరవాత 1997 ఏప్రిల్‌ 29నుంచి రసాయన ఆయుధాల నిషేధ ఒప్పందం (సీడబ్ల్యూసీ)అమలులోకి వచ్చింది. సీడబ్ల్యూసీ అమలును తనిఖీ చేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఉంది. బీటీడబ్ల్యూసీకి అలాంటి ఏర్పాట్లేవీ లేవు. నిజానికి రసాయన ఆయుధాలకన్నా జీవాయుధాలే ఎక్కువ ప్రమాదకరం. సమస్త మానవాళినీ తుడిచిపెట్టే విధ్వంస శక్తి జీవాయుధాలకు ఉంది. కరోనా వైరస్‌ దానికి ఉదాహరణ. ప్రస్తుత పరిస్థితుల్లో బీటీడబ్ల్యూసీ ఒప్పంద ప్రాముఖ్యాన్ని సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి గుర్తుచేశారు. ఈ ఒప్పందం కచ్చితంగా అమలయ్యేలా చూడటానికి తక్షణం ప్రత్యేక సంస్థ, సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు తేలిన దేశాలపై అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి.

- ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కౌలురైతుకు కవుకు దెబ్బలు

‣ రసాయన దాడుల ముప్పు

‣ ఈశాన్యంలో వేళ్లూనుకొంటున్న భాజపా

‣ ఏడున్నర దశాబ్దాలుగా తప్పటడుగులే!

‣ సమగ్ర వికాసానికి ఆయువుపట్టు

‣ ఉత్తరాఖండ్‌లో కమల వికాసం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం