• facebook
  • whatsapp
  • telegram

శ్రామిక సంక్షేమానికి భరోసా

ఈ-శ్రమ్‌ కార్డుల ఆసరా

దేశార్థికాభివృద్ధి శ్రామిక శక్తిపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల కారణంగా ప్రస్తుతం అసంఘటిత రంగంలోనే చాలామంది శ్రామికులకు జీవనోపాధి లభిస్తోంది. జాతీయ నమూనా సర్వే లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 46.5 కోట్ల శ్రామిక శక్తి ఉంది. అందులో సింహభాగం అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతోంది. గ్రామాలు, పట్టణాల్లో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు సరైన హక్కులు, రక్షణ కొరవడి అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొవిడ్‌ వ్యాప్తితో అసంఘటిత రంగం ఎన్నో ఒడుదొడుకులకు లోనయింది. ఎక్కడికక్కడ కొలువులు తెగ్గోసుకుపోయి కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాలని 2004లో ఏర్పాటైన అర్జున్‌ సేన్‌గుప్తా కమిషన్‌ సూచించింది. ఆ కమిషన్‌ సిఫార్సుల మేరకు అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతా చట్టం-2008 అమలులోకి వచ్చింది. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులతోపాటు, సామాజిక భద్రతా పథకాలు వర్తించని కార్మికులందరికీ ఆ చట్టం ద్వారా భద్రత కల్పించాల్సి ఉంటుంది. అది సరిగ్గా అమలుకు నోచుకున్న దాఖలాలు కనిపించవు. నిజానికి దేశీయంగా అసంఘటిత రంగ కార్మికుల లెక్కలపై నేటికీ సరైన స్పష్టత లేదు. వారికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇప్పటికీ ప్రభుత్వాల వద్ద లభించడంలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అసంఘటిత రంగ కార్మికుల జాతీయ డేటాబేస్‌ రూపకల్పనకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సంకల్పించింది. అందులో భాగంగా ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను గతేడాది ఆగస్టులో అందుబాటులోకి తెచ్చింది. పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికీ పన్నెండు అంకెలతో కూడిన యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ గల ఈ-శ్రమ్‌ కార్డును జారీ చేస్తున్నారు. తద్వారా రెండు లక్షల రూపాయల ప్రమాద బీమాతోపాటు, శాశ్వత వైకల్యానికి రెండు లక్షల రూపాయలు, పాక్షిక అంగ వైకల్యానికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఆ కార్డుతో దేశంలో ఎక్కడైనా సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందే వీలుంది. వ్యవసాయం వంటి సంప్రదాయ రంగాల్లో పనిచేసేవారు, కుటుంబ పరిశ్రమలు, చేతివృత్తులు, రవాణా, సమాచార, వస్త్ర, వీధి వ్యాపారులందరూ ఈ-శ్రమ్‌ కార్డును తీసుకోవచ్చు.

ఈ-శ్రమ్‌ పోర్టల్‌ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 26.98 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకుని, కార్డులు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో 41.48 లక్షల మంది, తెలంగాణలో 33.73 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో అత్యధికంగా 8.25 కోట్ల మంది, బిహార్‌లో 2.79 కోట్ల మంది, పశ్చిమ్‌ బెంగాల్‌లో 2.53 కోట్ల మంది నమోదయ్యారు. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికులు సుమారు 31 విభాగాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. వాటిలో వ్యవసాయ రంగంలో 13.96 కోట్ల మంది, గృహ సంబంధ పనుల్లో 2.72 కోట్ల మంది, నిర్మాణ రంగంలో 2.49 కోట్ల మంది, ఆటొమొబైల్‌, రవాణా విభాగంలో 74 లక్షల మంది, తోళ్ల పరిశ్రమ కార్మికులు 51 లక్షల మంది నమోదయ్యారు. ఇప్పటిదాకా పేర్లు నమోదు చేసుకున్న వారిలో మహిళలు దాదాపు 53శాతం, పురుషులు 47శాతం.

ఈ-శ్రమ్‌ కార్డులు పొందినవారిలో మరణించిన వారికి పరిహారం అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలాంటి అవాంతరాలను తొలగించి కార్డుల విషయంలో ప్రజల్లో విశ్వాసం పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. శ్రామికుల సమాచారాన్ని కార్మిక శాఖకు అందజేసేలా వ్యవసాయ, పట్టణ, గ్రామీణాభివృద్ధి వంటి శాఖల మధ్య సమన్వయాన్ని పెంచాలి. స్థానిక సంస్థలను యూనిట్‌గా తీసుకుని అందరికీ కార్డులు జారీచేసేలా జిల్లా యంత్రాగం చొరవ చూపాలి. సామాజిక భద్రతను అందించడంతోపాటు విపత్కర పరిస్థితుల్లో ఈ-శ్రమ్‌ కార్డులు కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తాయన్న అవగాహన అందరిలో పెంపొందించడం తప్పనిసరి. దానివల్ల కార్మికులందరూ ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేరు నమోదుకు ఆసక్తి చూపుతారు. ఈ-శ్రమ్‌ కార్డును అన్ని రకాల పథకాలకు అనుసంధానించడం మరో ముఖ్య అంశం. శ్రామికులకు జీవిత బీమాతోపాటు వారి పిల్లల చదువులు, ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం అందించేలా పాలకులు తగిన చర్యలు తీసుకోవాలి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలను భాగస్వాములను చేసి మహిళలు, పలు పథకాల లబ్ధిదారులందరికీ ఈ-శ్రమ్‌ కార్డులు జారీ చేయడమూ తప్పనిసరి.

- ఎ.శ్యామ్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఒప్పందాలకు తిలోదకాలు

‣ ముట్టడి వ్యూహంతో ముందుకు

‣ భూసారం... ఆహార భద్రతకు వరం!

‣ సరిహద్దు వివాదాల పీటముడి

‣ దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 29-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం