• facebook
  • whatsapp
  • telegram

ఒప్పందాలకు తిలోదకాలు

పాలనలో పెడపోకడలు

మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన న్యాయసూత్రాలను కాలరాస్తే పరిపాలనపైనే కాదు, ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. పెట్టుబడులు ముఖం చాటేసి అభివృద్ధి అధోముఖమవుతుంది. పటిష్ఠమైన ఆర్థిక విధానాలను రూపొందించి సమర్థంగా అమలు చేసే బాధ్యత- కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్రాలు దాన్ని సక్రమంగా నెరవేరిస్తే కేంద్రంకన్నా మెరుగైన ఫలితాలను సాధించగలుగుతాయి. ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి చేకూర్చగలుగుతాయి. ప్రభుత్వ విధానాలను అమలు చేయడం యంత్రాంగం విధి. పూర్వ ప్రభుత్వ విధానాలను అమలుచేసిన అధికార గణంపై తదుపరి ప్రభుత్వం కక్షసాధించడం, లోగడ కుదుర్చుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కడం ఏమాత్రం సరికాదు. సుప్రీంకోర్టు దానిపై కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటువంటి అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడిన రాష్ట్రాల జాబితా చిన్నదేమీ కాదు. అందులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం ఆక్రమిస్తోంది.

అమరావతికి ఎస్టోపెల్‌

సుప్రీంకోర్టు ఆందోళన వెనక రెండు కీలక న్యాయసూత్రాలు ఉన్నాయి. అవి... ఒప్పంద నిబంధనలను నెరవేర్చి తీరాలనే ప్రామిసరీ ఎస్టోపెల్‌ సిద్ధాంతం, న్యాయబద్ధ ఆకాంక్షల సాఫల్య సిద్ధాంతం. ఒకసారి చట్ట బద్ధంగా ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని నెరవేర్చాల్సిందేనని అవి నిర్దేశిస్తున్నాయి. ప్రభుత్వం తన పౌరులతో ఎలా సంబంధాలు నెరపాలో నిర్దేశించేది ఆ రెండు సూత్రాలే. వాటికి రాజ్యాంగం, వివిధ చట్టాలు భరోసా ఇస్తున్నాయి. ఎటువంటి సందర్భాల్లో, ఏ ప్రకారంగా ఒప్పందాలను రద్దు చేసుకోవచ్చో అవి నిర్దేశించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదు. పాత ఒప్పందాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు మొదలుకొని అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాల వరకు ఇక్కడ ఉదాహరించాలి. గత ప్రభుత్వ హయాములో పనులు చేపట్టి పూర్తిచేసిన గుత్తేదారులకు ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించడంలో ప్రస్తుత సర్కారు వైఖరి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒప్పంద నిబద్ధత ఆర్థిక కార్యకలాపాలకు పునాది వంటిది. వ్యక్తులు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఆందోళనకరమైతే, ప్రభుత్వాలు ఆ పని చేయడం ఆర్థిక వినాశానికి దారితీస్తుంది. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం. పాలకపక్షం మారవచ్చు కానీ- ప్రభుత్వ యంత్రాంగం, అది అనుసరించాల్సిన పద్ధతులూ మారవు. కేంద్రమైనా, రాష్ట్రమైనా ఆ ప్రకారంగా నడుచుకోవాల్సిందే. ఏ ప్రభుత్వమైనా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు, విధానాలు రూపొందించేటప్పుడు చట్టం నిర్దేశించిన పద్ధతులను పాటించాలి. చట్టం పరిధిలో కుదిరిన ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేస్తే- ప్రామిసరీ ఎస్టోపెల్‌, న్యాయబద్ధ ఆకాంక్ష సూత్రాల ప్రాతిపదికపై న్యాయవ్యవస్థ దాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రభుత్వాలు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ముందే జాగ్రత్తపడాలి. అలా కాకుండా అధికార పార్టీ తన మానాన తాను న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ, అది ఎదురుతన్నితే కోర్టులను నిందిస్తూ, చట్టం గురించి అవగాహన ఉండని సామాన్య ప్రజల నుంచి రాజకీయ సానుభూతి పొందాలని చూడటం అవాంఛనీయం. తాత్కాలికంగా అధికారంలో ఉండే రాజకీయ నాయకులు శాశ్వత ప్రభుత్వ యంత్రాంగానికి, న్యాయవ్యవస్థకు తంపులు పెట్టాలని చూడటం తప్ప ఇది మరేమీ కాదు.

ప్రభుత్వాలు కానీ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కానీ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ప్రామిసరీ ఎస్టోపెల్‌ సూత్రం అమలులోకి వస్తుంది. ఒప్పంద ఉల్లంఘన జరిగితే కోర్టుల ద్వారా పరిష్కారం కోరవచ్చుననే ఆ సూత్రం ఇంగ్లాండ్‌లో 1946 నుంచి, భారత్‌లో కనీసం 1968 నుంచి అమలులో ఉంది. 1970లలో బడ్జెట్‌లో చక్కెర మిల్లులకు రాయితీలు ప్రకటించి, కంపెనీల నుంచి పెట్టుబడులు పొందాక వాటిని ఉన్నపళాన రద్దు చేశారు. దాంతో బాధితులు న్యాయవ్యవస్థను ఆశ్రయించారు. గత ఒప్పందాలను సర్కారు గౌరవించాల్సిందేనంటూ ప్రామిసరీ ఎస్టోపెల్‌ సూత్రం ఆధారంగా 1979లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అప్పటి నుంచి దేశంలోని న్యాయస్థానాలన్నీ ఆ సూత్రాన్ని పాటిస్తున్నాయి. అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రామిసరీ ఎస్టోపెల్‌ సూత్రాన్ని వర్తింపజేసింది. గత ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మిస్తాననే వాగ్దానంతో చట్టం తెచ్చి రైతుల నుంచి వేల ఎకరాల భూములు సేకరించింది. తాము భూములు ఇవ్వడం వల్ల రాజధాని ఏర్పడి తమ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేరతాయని రైతులు ఆశించారు. ఇక్కడ ప్రామిసరీ ఎస్టోఫెల్‌, న్యాయబద్ధ ఆకాంక్షలు అనే రెండు న్యాయసూత్రాలూ వర్తిస్తాయి. కానీ, ప్రభుత్వం మారగానే రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు. తద్వారా పైన ప్రస్తావించిన రెండు న్యాయసూత్రాలూ ఆతిక్రమణకు గురయ్యాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల న్యాయబద్ధ ఆకాంక్షలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. అదే రాజ్యాంగ సమ్మతం. రైతులతో చేసుకున్న చట్టబద్ధ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఉల్లంఘించాయి కాబట్టే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని హైకోర్టు ఉద్ఘాటించింది.

తీవ్ర ఆర్థిక ప్రభావం

పరిపాలన, అధికార యంత్రాంగ నిర్వహణలాగానే ఆర్థికాభివృద్ధి సాధన సైతం జటిలమైన ప్రక్రియ. ప్రభుత్వం సరైన విధానాలను రూపొందించి, న్యాయంగా అమలు చేసినప్పుడు పెట్టుబడులు పోటెత్తుతాయి. విధానం, న్యాయబద్ధ ఆచరణ, పెట్టుబడులకు అవినాభావ సంబంధం ఉంది. ఆ మూడింటి మధ్య సమన్వయం ఉంటే ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో దూసుకుపోగలుగుతుంది. విధానాలు ఉన్నట్టుండి మారిపోవనే భరోసా ఉంటేనే పెట్టుబడిదారులు ముందుకొస్తారు. ప్రభుత్వం వారి నమ్మకాన్ని వమ్ముచేస్తే అభివృద్ధికి ఇంధనమైన పెట్టుబడులు సమకూరవు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు ప్రభుత్వమే వాగ్దాన భంగానికి పాల్పడితే రేపు జనావళి, కంపెనీలూ అలానే ప్రవర్తించవనే నమ్మకం ఏముంటుంది? ప్రభుత్వం వాగ్దాన భంగానికి పాల్పడినప్పుడు బయటి నుంచి పెట్టుబడులు వచ్చే సంగతి అటుంచి, లోపలి నుంచి పెట్టుబడులు బయటకు తరలిపోతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితి అదే. రాష్ట్రంలో విధానపరమైన అనిశ్చితి, ఒప్పందాల ఉల్లంఘన జరుగుతోంది కాబట్టి- అక్కడి నుంచి సొమ్ము వెలుపలకు వెళ్ళిపోతోంది. తద్భిన్నంగా తెలంగాణలోని వివిధ రంగాల్లోకి పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. రాజకీయ పార్టీలను అందలం ఎక్కించడానికి లేదా గద్దె దించడానికి ప్రజలు తమ ఓటును అస్త్రంగా వాడినట్లే- పెట్టుబడిదారులు తమ ఆర్థిక బలాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. ఓటర్ల తీర్పు అందరి దృష్టినీ ఆకర్షిస్తే, పెట్టుబడిదారుల వెనకడుగు రాష్ట్రానికి క్రమక్రమంగా ఆర్థిక ఆమ్లజనిని హరించేస్తుంది.

కుంటిసాకులు కుదరవు

ప్రతి ఒప్పందమూ అనుల్లంఘనీయమని ప్రామిసరీ ఎస్టోపెల్‌, న్యాయబద్ధ ఆకాంక్షల సాఫల్య సిద్ధాంతాలు చెప్పడం లేదు. ఒప్పంద రద్దు ఒక పద్ధతి ప్రకారం జరగాలని మాత్రమే అవి నిర్దేశిస్తున్నాయి. మోసం జరిగినప్పుడు, చట్టవిరుద్ధంగా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, చట్టానికి ఆమోదయోగ్యం కాని వాగ్దానం చేసినప్పుడు ప్రామిసరీ ఎస్టోపెల్‌ సూత్రం వర్తించదు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిధులు అవసరమనో పూర్వ ఒప్పందాలను రద్దు చేయడం కుదరదు. ఏవో అవసరాలు, అనివార్యతల పేరిట పాత ఒప్పందాలకు చెల్లుకొట్టడం కుదరదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టీకరించింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముట్టడి వ్యూహంతో ముందుకు

‣ భూసారం... ఆహార భద్రతకు వరం!

‣ సరిహద్దు వివాదాల పీటముడి

‣ దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 26-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం