• facebook
  • whatsapp
  • telegram

భూసారం... ఆహార భద్రతకు వరం!

మేలుకోకుంటే తీవ్ర పరిణామాలు

 

 

వ్యవసాయానికి ఆరోగ్యకరమైన నేల అవసరం. పకృతి విపరిణామాలు, మానవ చర్యలవల్ల నేలలోని సారం క్రమంగా తరిగిపోతోంది. ఇది వ్యవసాయంతోపాటు పర్యావరణ పరిరక్షణపైనా ప్రభావం చూపుతోంది. నేల తన స్వాభావిక లక్షణాలను కోల్పోవడంవల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గి ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 2011-13 నుంచి 2018-19 మధ్య కాలంలో 14.4 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయినట్లు ఇస్రో ఇటీవలి నివేదిక వెల్లడించింది. 2018-19 నాటికి దేశంలో మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77శాతం) భూమి క్షీణతకు గురైంది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూసార క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ఆరు, తెలంగాణ 17వ స్థానాల్లో ఉన్నాయి. 4.80 లక్షల హెక్టార్ల భూమి ఎడారీకరణ/క్షీణతతో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ఇస్రో ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్‌ కేంద్రం ఇటీవల విడుదల చేసిన ‘ఎడారీకరణ, భూసార క్షీణత అట్లాస్‌’ ప్రకారం- నీటి కోత, పచ్చదనం తరిగిపోవడం, లవణీకరణ, మానవ చర్యలు తదితరాలు భూసారం దెబ్బతినడానికి ప్రధాన కారణాలు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 30శాతం భూమి క్షీణతకు గురైందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.

 

నేలకోతే ప్రధాన కారణం

భారత్‌లో భూసార క్షీణతకు నేలకోత ప్రధాన కారణంగా నిలుస్తోంది. వాననీరు నేల ఉపరితలంపై ప్రవహించినప్పుడు, వరదలు సంభవించినప్పుడు నేల కోతకు గురవుతోంది. ఏటవాలుగా ఉన్న భూమిలో నీటి ప్రవాహం వల్ల కోతకు గురైన సారవంతమైన మన్ను దిగువ ప్రాంతానికి ప్రవహిస్తుంది. ఫలితంగా ఎగువ ప్రాంతంలో ఉండే నేల నిస్సారంగా మారుతోంది. వర్షపాతం, భూమి వాలు, నేల స్వభావం, భూవినియోగం వంటి వాటిపై నేల కోత తీవ్రత ఆధారపడి ఉంటుంది. మరోవైపు వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జనాభా ఒత్తిడి, భూ వినియోగంలో లోపాలు వంటి కారణాలతో భవిష్యత్తులో నేల కోత అధికం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేలపై పచ్చదనం క్షీణించడమూ ఎడారీకరణకు మరో ముఖ్యమైన కారణం. నానాటికీ పెరుగుతున్న జనాభా, నివాసాలు, పరిశ్రమల విస్తరణ వల్ల చెట్లను విపరీతంగా కొట్టేస్తున్నారు. అడవులను నరికేసిన ప్రాంతంలో గాలులు, నీటి ప్రవాహాల కారణంగా నేల అధికంగా కోతకు గురవుతోంది. బలమైన గాలులు వీచినప్పుడు సేంద్రియ పదార్థంతోపాటు భూమిపై ఉండే సారవంతమైన మట్టి ఒకచోటు నుంచి మరో చోటుకు తరలిపోతుంది. భూమిపై గడ్డి, మొక్కలు వంటివి ఉన్నప్పుడు అది చాలా తక్కువగా జరుగుతుంది. బలమైన గాలులు తరచూ వీచే ఎడారి, పాక్షిక ఎడారి ప్రాంతాల్లో భూసార క్షీణత ఎక్కువగా కనిపిస్తుంది. ఒకే ప్రాంతంలో పశువులను, ఇతర జీవాలను పదేపదే మేపడంవల్ల అక్కడున్న గడ్డిని అవి పూర్తిగా తినేస్తాయి. అది నేలకోతకు దారితీస్తుంది. భూముల్లో లవణీయత పెరగడమూ భూసారం తగ్గడానికి మరో కారణం. నేలలో కరిగే లవణాల సాంద్రత పెరగడాన్ని లవణీకరణగా వ్యవహరిస్తాం. కొన్ని రకాల రసాయన ఎరువులను అధికంగా వాడటంవల్ల భూముల్లో క్షారత్వం పెరుగుతుంది. భూమి తన సారం కోల్పోవడంవల్ల పంటల ఉత్పాదకత తగ్గిపోతుంది. అది ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. ఎఫ్‌ఏఓ అంచనా ప్రకారం నేలకోత కారణంగా 2050 నాటికి పంటల దిగుబడి 10శాతం తగ్గనుంది!

 

పరిరక్షణ చర్యలు అత్యవసరం

నేల కోతను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు మైదాన ప్రాంతాల్లో మొక్కలను అధికంగా నాటాలి. రైతులు తమ పొలాల చుట్టూ మొక్కలు పెంచితే- బలమైన గాలులు, నీటి ప్రవాహాలవల్ల సారవంతమైన నేల కొట్టుకుపోవడాన్ని తగ్గించవచ్చు. నదులకు ఇరువైపులా కట్టలు నిర్మించడంద్వారా భారీ వర్షాల సమయంలో సమీపంలోని పొలాలు ముంపునకు గురికాకుండా కాపాడవచ్చు. తద్వారా భూమి క్రమక్షయాన్ని తప్పించవచ్చు. కొండ ప్రాంతాల్లోని వాలులో వ్యవసాయం చేయడంద్వారా నేల కోతను నివారించవచ్చు. ఈ పద్ధతి కొండ ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేస్తుంది. అలాగే పంటలకు రసాయన మందుల వాడకాన్నీ గణనీయంగా తగ్గించాలి. సేంద్రియ సాగును ప్రభుత్వాలు పెద్దయెత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సాగులో శాస్త్రీయ పద్ధతులపై అన్నదాతలకు అవగాహన కల్పించడమూ తప్పనిసరి. నీటి పారుదల పద్ధతులను ఆధునికీకరించడమూ మరో కీలకాంశం. బిందుసేద్యం, స్ప్రింక్లర్లు వంటి పద్ధతులతో నేల కోతను చాలావరకు అరికట్టవచ్చు. వరద నియంత్రణ చర్యలపైనా పాలకులు దృష్టి సారించాలి. ప్రాంతాలను, భూములనుబట్టి ఇలా పలు రకాల చర్యలు చేపడితే భూసార పరిరక్షణ చాలావరకు సాధ్యమవుతుంది.

 

- డి.ఎస్‌.బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరిహద్దు వివాదాల పీటముడి

‣ దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

‣ ఉక్రెయిన్‌లో జీవాయుధాల రగడ

‣ వన హననం... భవితకు ప్రమాదం

‣ కౌలురైతుకు కవుకు దెబ్బలు

‣ రసాయన దాడుల ముప్పు

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-03-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం