• facebook
  • whatsapp
  • telegram

స్థిరాదాయం కరవు... బతుకే బరువు!

అన్నదాత ముఖచిత్రం నానాటికి తీసికట్టు

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో భారతదేశం అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఇరుసులాంటి సాగురంగాన్ని మాత్రం పటిష్ఠంగా తీర్చిదిద్దుకోలేకపోయాం. సేద్యరంగంలో సగటు రైతుల కష్టాలను తీర్చలేకపోయాం. హరితవిప్లవం తరవాత వ్యవసాయంలో ఆ స్థాయి పరిణామం మళ్ళీ చోటుచేసుకోలేదు. ఏటా పెద్దయెత్తున రైతులు సేద్యం నుంచి వైదొలగుతున్నారు. సాగురంగం భరోసా ఇస్తుందన్న గ్యారంటీ వారికి లేకుండా పోయింది. ఇందుకు ప్రధాన కారణం సేద్యంపై ప్రభుత్వాల దృష్టికోణం సక్రమంగా లేకపోవడమే. గ్రామీణ భారతంలో ఉన్న 58శాతం జనాభాకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంపై శ్రద్ధ లోపించింది. ఫలితంగా సాగుదారుల ఆదాయాలు ఆశించిన రీతిలో పెరగక, బడుగు రైతులు తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

కొండలా రుణాలు

ప్రపంచంలో అత్యధికంగా పాలు, పప్పుధాన్యాలు, సుగంధద్రవ్యాలు ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. గోధుమ, వరి, పత్తి విస్తీర్ణంలో అగ్రస్థానంలో; చెరకు, పండ్లు, కూరగాయలు, చేపలు, జంతు మాంసం ఉత్పత్తుల్లో రెండోస్థానంలో ఉన్నాం. అయినా భారతీయ రైతులు మాత్రం దుర్భర దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతుండటమే వైచిత్రి. వ్యావసాయికంగా భారత్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో కీలకమైనది పంట దిగుబడి అత్యల్పంగా ఉండటం. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు కొన్ని వర్ధమాన దేశాలతో పోల్చినా మన దిగుబడులు 30-50శాతం తక్కువగా ఉన్నాయి. కమతాల పరిమాణం తగ్గిపోతోంది. రైతులు సాంకేతికతను ఉపయోగించుకుని వినూత్న పద్ధతులను అవలంబించలేక పోతున్నారు. విచ్చలవిడి ఎరువుల వినియోగంతో పెట్టుబడులు భారీగా పెరిగిపోతున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు అందక, ఆదాయాలు క్షీణించి వరస నష్టాలతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాగుదారులను సంక్షోభం నుంచి బయట పడేసేందుకు దీటైన పరిష్కారాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వివిధ రంగాల్లో ఎంతోకొంత అభివృద్ధి సాధ్యపడింది కానీ, అన్నదాత చితికిపోయాడు.

భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల (2022) నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటూ 2015-16లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ గణాంక నివేదిక 2018లో నిర్వహించిన సర్వే ప్రకారం, దేశంలో 57శాతం రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 93శాతం, తెలంగాణ 91శాతంతో మొదటి, రెండు స్థానాల్లో ఉండటం కలవరపెడుతోంది. ఈ సర్వే ప్రకారం 2002-03లో రైతుల నెలవారీ ఆదాయం రూ.2,115గా ఉంది. 2012-13 నాటికి ఇది రూ.6,496కు, 2018-19 నాటికి రూ.10,218కు చేరింది. రెట్టింపు ఆదాయం అంటే... ఈ ఏడాదిలో రైతుకు నెలకు రూ.21,146కు చేరాల్సి ఉండగా- నిజానికి ఇది రూ.13వేలు కూడా దాటలేదని రైతు ఆదాయం రెట్టింపు కమిటీ (డీఎఫ్‌ఐ) నివేదిక చెబుతోంది. రైతులు ఉత్పాదకాలకు పెడుతున్న ఇతర ఖర్చుల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది రూ.11 వేలకు మించదని అంచనా. ఈ లెక్కన రైతుల రోజువారీ ఆదాయం రూ.366 మాత్రమే. 2018-19 లెక్కల ప్రకారం 28 రాష్ట్రాల్లో రైతుల నెలవారీ సగటు ఆదాయాన్ని చూస్తే మేఘాలయలో గరిష్ఠంగా రూ.29,348గా నమోదైంది. 12 రాష్ట్రాల్లో రైతుల నెలవారీ ఆదాయం రూ.10వేలకు పైగా ఉండగా- వాటిలో నాలుగు ఈశాన్య రాష్ట్రాలే. మిగిలిన 16 రాష్ట్రాల్లో రైతుల ఆదాయం రూ.3,013 నుంచి రూ.9,995 మధ్య నమోదైంది. వీటిలో బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి ఆరు రాష్ట్రాల రైతుల ఆదాయం జాతీయ సగటు కంటే తక్కువ. ఈ లెక్కన 2022-23లోగా రైతుల ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఏ కోశానా లేదు.

మెరుగైన జీవనానికి భరోసా అవసరం

రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకునే విషయంలో మోసపోతుండటమే వారికి అల్పాదాయాలు దక్కడానికి ప్రధాన కారణం. దేశంలో 88శాతం రైతులు తమ ఉత్పత్తులను కనీస ధరకు అమ్ముకోలేకపోతున్నారు. ఈ తరుణంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటే కేంద్రం ఉత్పత్తి లక్ష్యాల కంటే మార్కెట్‌ ఆధారిత విధానంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఉత్పత్తిని సేకరించడంలో అవసరమైన సదుపాయాలను పటిష్ఠపరచకుండా మద్దతు ధరలను పెంచినా ప్రయోజనం ఉండదని గ్రహించాలి. ప్రతి పంటలోనూ కనీసం 20-25శాతం మేర ఉత్పత్తిని సేకరించే విధానాన్ని కేంద్రం అమలు చేయాలి. వాస్తవ సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరలను నిర్ణయించాలి. మద్దతు ధరకు విపణి ధరకు మధ్య ఉన్న తేడాను భర్తీ చేయడానికి అమలు చేస్తున్న మార్కెట్‌భరోసా పథకాన్ని కేంద్రం చిత్తశుద్ధితో అమలు చేయాలి. 2007లో ప్రొఫెసర్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించినట్లు- మార్కెట్‌ జోక్య పథకం (ఎంఐసీ) ద్వారా దేశంలో ఉత్పత్తుల ధరలు పతనమైనప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని మార్కెట్‌ జోక్య నిధి ద్వారా రైతుల్ని ఆదుకోవాలి. సాగు చేసే ప్రతి రైతూ పంటల బీమా పరిధిలోకి వచ్చేలా ప్రీమియం ధరలు తగ్గించి అమలు చేయాలి. సేద్యంలో కౌలుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో- దుక్కి దున్నే ప్రతి రైతుకూ బ్యాంకు రుణం, ఉత్పాదకాల రాయితీలు అందేలా దేశవ్యాప్త సమగ్ర విధానం అవసరం. ప్రతి గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పరచి వాటికి మౌలిక వసతులు కల్పించేందుకు తోడ్పడాలి. రైతులు ఉత్పత్తి ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వ్యవసాయ యంత్రాంగం అవగాహన కల్పించాలి. ప్రతి ఉత్పత్తికీ విలువ జోడించే ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. సేద్యంలో పెద్దయెత్తున మౌలిక వసతులు కల్పించాలి. ఇవన్నీ అమలు చేస్తే పీఎం కిసాన్‌, రైతుబంధు వంటి పథకాల అవసరమే ఉండబోదు. పాడి, కోళ్లు, చేపలు, పుట్టగొడుగులు, పట్టు, జీవాల పెంపకంతో సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరించడం ద్వారా అదనపు ఆదాయం పొందేలా రైతుల్ని ప్రోత్సహించాలి. ప్రతికూల పరిస్థితుల్లో సేద్యం కలిసి రానప్పుడు ఇటువంటి అనుబంధ వ్యాపకాలు రైతుల ఆదాయాన్ని స్థిరంగా ఉంచగలుగుతాయని పాలకులు గుర్తించాలి. రైతులు స్థిరమైన ఆదాయాలు పొందేలా పటిష్ఠ చర్యలు చేపట్టగలితేనే అన్నదాతలకు జీవన భద్రత లభిస్తుంది.

దోపిడి మూలాలను పెకలించాలి

క్షేత్రస్థాయిలో రైతులు ఎక్కడెక్కడ నష్టపోతున్నారు, వారి ఆదాయాన్ని ఇతరులు ఎలా కొల్లగొడుతున్నారని పరిశీలిస్తే- ఎన్నో వాస్తవాలు కళ్లకు కడతాయి. వీటికి పరిష్కారాల కోసం డాక్టర్‌ స్వామినాథన్‌ నేతృత్వంలోని జాతీయ రైతు కమిషన్‌ సహా ఎన్నో కమిటీలు విలువైన సిఫార్సులనేకం చేశాయి. కానీ, అవేమీ అమలుకు నోచుకోలేదు. విత్తనాల విక్రయం నుంచి మార్కెట్ల దోపిడి వరకు అన్నింటా అవినీతికి వత్తాసు పలుకుతున్నవారివల్ల రైతుల బతుకులు దుర్భరమవుతున్నాయి. అవినీతి వృక్షాన్ని సమూలంగా పెకిలించే సాహసం దేశంలోని ఏ రాజకీయపక్షమూ చేయడంలేదు. కారణం... ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోసపూరిత హామీలు, రుణమాఫీలు, పంటసాయాల పేరిట రైతులకు తాత్కాలిక ఉపశమనం అందించే అవకాశం చేజారుతుందని వారికి తెలుసు. జాతీయ విత్తన విధాన ముసాయిదా తెస్తే అందులో కంపెనీలకు మేలు చేసే అంశాలుంటాయి. క్రిమి సంహారకాల బిల్లు తెస్తే రైతుల్ని దోపిడి చేసే సంస్థలకు మద్దతునిచ్చే మార్పులుంటాయి. ఇలా ఏ చట్టం తీసుకున్నా రైతుల్ని వంచించేవారికి వత్తాసు పలికేవే కానీ- అన్నదాతల కష్టాలను గుర్తెరిగి వాటిని శాశ్వతంగా తొలగించే తరుణోపాయాలను ఏ ప్రభుత్వమూ ఆవిష్కరించలేకపోతోంది.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కాలుష్య భూతం.. ఉక్కిరిబిక్కిరవుతున్న భారతం

‣ ప్రాంతీయ సహకారానికి బిమ్‌స్టెక్‌ భరోసా

‣ మాల్దీవుల్లో చైనా చిచ్చు

‣ శ్రామిక సంక్షేమానికి భరోసా

‣ ఒప్పందాలకు తిలోదకాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 04-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం