• facebook
  • whatsapp
  • telegram

ప్రాంతీయ సహకారానికి బిమ్‌స్టెక్‌ భరోసా

భారత్‌ పెద్దన్న పాత్ర

ఉక్రెయిన్‌ సంక్షోభంతో అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నవేళ శ్రీలంక సారథ్యంలో తాజాగా జరిగిన ‘బిమ్‌స్టెక్‌’ శిఖరాగ్ర సదస్సు ప్రాంతీయ సహకారంపై కొత్త ఆశలు చిగురింపజేసింది. బిమ్‌స్టెక్‌ (బే ఆఫ్‌ బెంగాల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ మల్టీ-సెక్టోరల్‌ టెక్నికల్‌, ఎకనామిక్‌ కోఆపరేషన్‌) సభ్యదేశాల మధ్య భద్రత సహా పలు రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసేందుకు బాటలు పరిచింది. ముఖ్యంగా రవాణా అనుసంధానతపై కుదిరిన ఒప్పందం మున్ముందు ప్రాంతీయంగా వాణిజ్యాభివృద్ధిలో, సరఫరా గొలుసు పటిష్ఠీకరణలో కీలకంగా మారే అవకాశాలున్నాయి. ఈ కూటమి దక్షిణాసియా, ఆగ్నేయాసియాలను అనుసంధానించే వంతెన వంటిది. భారత్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక ఇందులో సభ్యదేశాలు. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్‌) దాదాపు పడకేసిన దృష్ట్యా- ఇండియా సైతం ఇకపై బిమ్‌స్టెక్‌కు మరింత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కూటమి సచివాలయ నిర్వహణ ఖర్చుల కోసం 10 లక్షల డాలర్లు అందించనున్నట్లు తాజా సదస్సులో ప్రకటించడం ద్వారా ఈ విషయంలో భారత్‌ తన అభిమతాన్ని స్పష్టం చేసింది.

ఆశలు రేపిన తాజా సదస్సు

పలు కారణాలవల్ల క్రమంగా నీరుగారిపోతున్నట్లు కనిపిస్తున్న బిమ్‌స్టెక్‌లో- శ్రీలంక అధ్యక్షతన జరిగిన అయిదో శిఖరాగ్ర సదస్సు మళ్ళీ జవసత్వాలు నింపింది. కూటమి లక్ష్యాలు, దీర్ఘకాలిక దృక్పథాన్ని స్పష్టంగా నిర్వచించే బిమ్‌స్టెక్‌ చార్టర్‌కు ఇందులో సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. భూతల, జల, వాయు మార్గాల్లో ఆటంకాల్లేని నిరంతర రవాణా అనుసంధానత కోసం రూపొందించిన బృహత్తర ప్రణాళికకూ ఆమోదముద్ర వేశాయి. బంగాళాఖాతంలో మత్స్యసంపదను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకురావాలని నిర్ణయించాయి. అంతర్జాతీయ నేరాలకు సంబంధించిన వ్యవహారాల్లో పరస్పరం న్యాయసహాయం అందించుకోవడం, సాంకేతిక బదిలీ సదుపాయ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం, దౌత్యపరమైన శిక్షణలో సహకార పెంపుదల వంటి అంశాలకు సంబంధించి కీలక ఒప్పందాలు ఖరారయ్యాయి. సభ్యదేశాల మధ్య మున్ముందు పరస్పర తోడ్పాటు, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఇవి పునాదిరాళ్లుగా ఉపయోగపడనున్నాయి. భద్రత, విపత్తు నిర్వహణ, పర్యావరణ మార్పులపై పోరాటం తదితర ఏడు రంగాలను కూటమి కార్యకలాపాలకు మూలస్తంభాలుగా తాజా సదస్సు పేర్కొంది. ఈ ఏడింటిలో- ఒక్కో రంగంలో పరస్పర సహకారం పెంపుదల బాధ్యతను ఒక్కో సభ్యదేశం పర్యవేక్షించనుంది. అత్యంత కీలకమైన భద్రత అంశంలో నాయకత్వ బాధ్యత దిల్లీకి దక్కింది. పాతికేళ్ల కిందట ‘బిస్ట్‌’గా (బంగ్లాదేశ్‌, ఇండియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లతో) ప్రారంభమైన ఈ కూటమి- కాలక్రమంలో బిమ్‌స్టెక్‌గా రూపుదిద్దుకొంది. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రవాణా, పర్యాటకం, వ్యవసాయం, ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన, ఉగ్రవాదంపై పోరాటం, పర్యావరణ మార్పులు తదితర రంగాల్లో పరస్పర సహకారంతో పురోగతి సాధించడం కూటమి లక్ష్యం. ప్రపంచ జనాభాలో 22శాతం బిమ్‌స్టెక్‌ దేశాల్లోనే నివసిస్తున్నారు. ఈ దేశాల మొత్తం జీడీపీ దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్లు. ఇందులో మూడొంతులు ఇండియాదే. 2021లో ప్రపంచ జీడీపీలో బిమ్‌స్టెక్‌ వాటా నాలుగు శాతం.

విస్తరణ ద్వారా బలోపేతం

ఇండియా-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న విభేదాల కారణంగా 2016 నుంచి సార్క్‌ మూలనపడింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయంగా తన పట్టు నిలుపుకొనేందుకు, సార్క్‌ వైఫల్యంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు బిమ్‌స్టెక్‌ను ఉపయోగించుకోవాలని దిల్లీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. భారతదేశం ప్రాధాన్యమిచ్చే ‘యాక్ట్‌ ఈస్ట్‌, పొరుగుదేశాలకు తొలి ప్రాధాన్యం’ విధానాలు రెండూ ఈ కూటమిలో ప్రయోజనకరంగా ఉండటం మరో సానుకూలాంశం. ప్రధానమంత్రిగా మోదీ రెండోదఫా ప్రమాణ స్వీకారానికి బిమ్‌స్టెక్‌ దేశాల నేతలను ఇండియా ఆహ్వానించింది. సార్క్‌లో విభేదాలున్నాయని, రాబోయే అయిదేళ్లలో బిమ్‌స్టెక్‌కే ఇండియా ప్రాధాన్యమివ్వబోతోందని 2019లో విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే జైశంకర్‌ స్పష్టంగా చెప్పారు. ఈ పరిణామాలన్నీ కూటమికి దిల్లీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పేవే. ఇండియాతో భూ సరిహద్దు కలిగి ఉన్న ఏకైక ఆగ్నేయాసియా దేశం మయన్మార్‌. ఆగ్నేయాసియాలోని ఇతర దేశాల(ఆసియాన్‌)తో అనుసంధానమయ్యేందుకు, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు బిమ్‌స్టెక్‌ను భారత్‌ ఉపయోగించుకోవచ్చు. ఇండో-పసిఫిక్‌ దృక్కోణంలోనూ దిల్లీకి ఈ కూటమి అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ‘క్వాడ్‌’కు, బిమ్‌స్టెక్‌కు మధ్య సత్సంబంధాలు నెలకొల్పే బాధ్యతను భారతదేశమే భుజాలకెత్తుకోవాలి. అవసరమైతే బిమ్‌స్టెక్‌ను విస్తరించి- మలేసియా, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, కంబోడియా వంటి భావసారూప్య దేశాలతో కలిసి ముందుకుసాగే అవకాశాలను పరిశీలించాలి. చైనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రస్తుతం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న ఈ సమయంలో ఐరోపాలో ఆ ప్రాజెక్టును విస్తరించే ఆలోచనను జిన్‌పింగ్‌ సర్కారు కొన్నాళ్లు దూరం పెట్టి, ఆసియాలో దాని విస్తరణకు ప్రయత్నించే అవకాశముంది. బిమ్‌స్టెక్‌లో ఇండియా, భూటాన్‌ మినహా మిగతావన్నీ బీఆర్‌ఐ సభ్యదేశాలే. ఈ పరిస్థితుల్లో మోదీ సర్కారు క్రియాశీలకంగా వ్యవహరించాలి. పలు ప్రాజెక్టుల పేరిట చిన్నదేశాలను డ్రాగన్‌ రుణాల ఊబిలోకి దించుతున్న తీరును పరోక్షంగానైనా సహ సభ్యదేశాలకు తెలియజేయాలి. క్వాడ్‌తో బిమ్‌స్టెక్‌కు బంధాన్ని ఏర్పరిస్తే ఈ విషయంలో ప్రయోజనం చేకూరే అవకాశముంది. బిమ్‌స్టెక్‌కు పెద్దన్నగా వ్యవహరించడం ద్వారా ప్రాంతీయంగా ఇండియా పట్టు పెంచుకునేందుకు ఇదే సరైన తరుణమని చెప్పవచ్చు.

స్వేచ్ఛాయుత వాణిజ్య ఆకాంక్ష

బంగాళాఖాతంలో పుష్కలంగా ఉన్న మత్స్యసంపద, సహజవాయు నిక్షేపాలను సద్వినియోగం చేసుకోగలిగితే ఈ కూటమి ప్రగతి పథంలో వేగంగా పరుగులు తీయవచ్చు. తాజా సదస్సులో వర్చువల్‌ విధానంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ- ఉక్రెయిన్‌ సంక్షోభంతో అంతర్జాతీయ పరిస్థితులు అస్థిరంగా తయారయ్యాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ భద్రతకు పెద్దపీట వేస్తూ పరస్పరం సహకరించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. బంగాళాఖాతాన్ని సభ్యదేశాల మధ్య అనుసంధానత, అభివృద్ధి, భద్రతల వంతెనలుగా మార్చుకుందామంటూ పిలుపునిచ్చారు. బిమ్‌స్టెక్‌ దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమలులోకి రావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. బిమ్‌స్టెక్‌ ఎఫ్‌టీఏ 2004 నుంచి చర్చల్లోనే నలుగుతోంది. ఆ సంప్రతింపులు విజయవంతమై సమగ్ర ఎఫ్‌టీఏ రూపుదాలిస్తే- సభ్యదేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహం, వాణిజ్య కార్యకలాపాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతాయి.

- మండ నవీన్‌ కుమార్‌ గౌడ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మాల్దీవుల్లో చైనా చిచ్చు

‣ శ్రామిక సంక్షేమానికి భరోసా

‣ ఒప్పందాలకు తిలోదకాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం