• facebook
  • whatsapp
  • telegram

హక్కులు హరించే కొత్త ఆయుధం!

క్రిమినల్‌ ప్రొసీజర్‌ బిల్లుపై వివాదం

 

 

లోక్‌సభలో తాజాగా ఆమోదం పొందిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లు వివాదాస్పదమవుతోంది. అధునాతన పద్ధతుల్లో నేరస్థుల వివరాల సేకరణకు ఇది వీలు కల్పిస్తున్నా- జైలు శిక్ష అనుభవిస్తున్న వారితోపాటు ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం కింద ముందస్తుగా అరెస్టయినవారు, ‘ఇతరుల’ వ్యక్తిగత వివరాల సేకరణకు కొత్త క్రిమినల్‌ ప్రొసీజర్‌(గుర్తింపు)ను అనుమతించడం ఆందోళనలకు కారణమవుతోంది. ఇక్కడ ఇతరులు అంటే ఎవరో స్పష్టంగా నిర్వచించకపోవడం పెద్ద లోపం. ఏదైనా కేసులో దర్యాప్తునకు లోనవుతున్న వ్యక్తులతోపాటు అనుమానితుల వివరాలనూ సేకరించడం వ్యక్తి స్వేచ్ఛకు, జీవించే హక్కుకు భరోసా ఇస్తున్న 21వ రాజ్యాంగ అధికరణకు విరుద్ధమని ప్రతిపక్షం విమర్శిస్తోంది. పుట్టస్వామి వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు వ్యక్తుల గోప్యతా హక్కును సమర్థించింది. ఈ బిల్లు ఆ హక్కును ఉల్లంఘిస్తోంది. ఇన్ని హక్కులను అతిక్రమిస్తున్న చట్టాన్ని తీసుకొచ్చే అధికారం పార్లమెంటుకు లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

 

విస్తృత డేటాబేస్‌ తయారీ

నేరస్థులు, నిర్బంధితుల వేలి ముద్రలతోపాటు అరచేతి ముద్రలు, ఫొటోలు, కనుపాప, రెటీనా స్కాన్‌లు, శారీరక కొలతలు, రక్తం, డీఎన్‌ఏ తదితర జీవసంబంధ నమూనాలు, సంతకాలు, చేతి దస్తూరి తదితర వివరాలను సేకరించి భద్రపరచడానికి ఈ బిల్లు అనుమతిస్తోంది. పైన చెప్పిన నమూనాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించే అధికారం మేజిస్ట్రేట్‌కు ఉంటుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ ర్యాంకు వరకు పోలీసు సిబ్బంది వాటిని తీసుకోవచ్చు. నమూనాలు ఇవ్వడానికి నిరాకరించే లేక ప్రతిఘటించే వ్యక్తుల నుంచీ వాటిని తీసుకునే అధికారం పోలీసు, జైలు అధికారులకు ఉంటుంది. ఇవ్వడానికి నిరాకరిస్తే భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లో 186వ సెక్షన్‌ కింద నేరంగా పరిగణిస్తారు. ఇప్పుడు అమలులో ఉన్న 1920నాటి చట్టం- వేలి ముద్రలు, పాద ముద్రలను తీసుకోవడానికి మాత్రమే అనుమతిస్తోంది. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులపై నేరస్థులు, కొందరు ఇతర వ్యక్తుల ఫొటోలను తీసుకోవచ్చునంటోంది.

 

క్రిమినల్‌ ప్రొసీజర్‌ (గుర్తింపు) బిల్లు కింద జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వ్యక్తుల వివరాలను సేకరించి కనీసం 75 ఏళ్లపాటు డిజిటల్‌, ఎలెక్ట్రానిక్‌ రూపాల్లో భద్రపరుస్తుంది. బ్యూరో తన దగ్గరున్న రికార్డులను ఇతర ప్రభుత్వ సంస్థలతో పంచుకోవచ్చు. నేర పరిశోధనకు తోడ్పడవచ్చు. నేరస్థులకు సంబంధించి కట్టుదిట్టమైన ఆధారాలను కోర్టులకు సమర్పించడం ద్వారా నేర నిరూపణకు మార్గాన్ని సుగమం చేసే బిల్లు ఇది. ప్రస్తుతం నేరస్థుల గుర్తింపునకు అమెరికా, ఐరోపా దేశాలు ఆధునిక శాస్త్రసాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. అమెరికాలో ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్‌బీఐ డేటాబేస్‌లో నాలుగు కోట్ల వేలి ముద్రలు ఉండగా, భారత్‌లో కేంద్ర వేలిముద్రల బ్యూరో (సీఎఫ్‌పీబీ) వద్ద కేవలం 10లక్షల వేలి ముద్రలు ఉన్నాయి. డేటాబేస్‌లోని వేలి ముద్రలతో నిందితులు, నేరస్థుల నుంచి సేకరించే వేలిముద్రలను సరిపోల్చడానికి ఎఫ్‌బీఐ వాడుతున్న ‘నిస్ట్‌ వేలిముద్రల ఇమేజ్‌ సాంకేతికత (ఎన్‌ఎఫ్‌ఐఎస్‌)’ను భారత్‌ కూడా చేపట్టాలనుకొంటోంది. దీన్ని సీఎఫ్‌పీబీ డేటాబేస్‌తో అనుసంధానించదలచింది. తరవాత వేలిముద్రలను, ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించి నేర పరిశోధనలో వేగం, కచ్చితత్వం తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. భారత్‌లో ఇప్పటికీ 1920 నాటి చట్టాన్ని ఉపయోగిస్తున్నందువల్ల అధునాతన సంవిధానాలను ప్రవేశపెట్టే వీలు లేకుండా పోతోంది. ఆ లొసుగును సరిదిద్దడానికి కొత్త సీపీసీ బిల్లు తెచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లోక్‌సభలో వెల్లడించారు. కేంద్రం ఇంకా ఈ-పరిపాలనలో భాగంగా నేరాలు, నేరస్థుల ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌, సిస్టమ్స్‌ (సీసీటీఎన్‌ఎస్‌) ప్రాజెక్టునూ చేపట్టదలచింది. అందులో డిజిటలీకరించిన వేలి ముద్రలను భద్రపరుస్తారు. సీపీసీ బిల్లు చట్టరూపం ధరించిన తరవాత నేరస్థుల బయోమెట్రిక్‌ నమూనాలను, సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానిస్తారు.

 

దుర్వినియోగానికి ఆస్కారం

రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు ప్రసాదిస్తున్నా సాధారణ పౌరులకు ఉండే హక్కులన్నీ ఖైదీలకు ఉండవనేది స్పష్టం. కనీసం కొన్ని హక్కులను తొలగించడం శిక్షలో భాగమే. అయితే, కేవలం అనుమానం మీద అరెస్టయినవారిని, ఖైదీలను ఒకే గాటన కట్టి హక్కులు హరించడం సమంజసం కాదు. రాజ్యాంగం పౌరుల సమానావకాశాలకు భరోసా ఇస్తున్నా- జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చిన ఖైదీలకు ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కోసుకుపోవడం చూస్తూనే ఉన్నాం. మరి నేరస్థులుగా నిరూపణ అయినవారిని, కేవలం అనుమానం మీద అరెస్టయినవారిని ఒకే తరహాలో పరిగణనలోకి తీసుకోవడం భావ్యమా? అనుమానితుల వివరాలు పోలీసు, జైలు డేటాబేస్‌లలో నిక్షిప్తం కావడం వారి భవిష్యత్తును దెబ్బతీయదా అనే ప్రశ్నా మార్మోగుతోంది. వ్యక్తిగత గుర్తింపు వివరాలను 75 ఏళ్లపాటు భద్రపరచడమంటే, ఆ సమాచారాన్ని హానికరమైన రీతిలో ఉపయోగించడానికి ఆస్కారమివ్వడమే. విస్మృతపథంలోకి జారిపోకుండా నిత్యం నిందితుడివని, నేరస్థుడివని ములుగర్రలా పొడవడానికి డేటాబేస్‌లు తోడ్పడకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని శిక్షార్హమైన నేరస్థులుగా నిరూపణ కాని వ్యక్తుల వివరాలను రికార్డుల నుంచి తొలగించాలని, ఆ మేరకు బిల్లులో సవరణలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

బలప్రయోగంతో వివరాల సేకరణ

రాజకీయ నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేవారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని వారి వ్యక్తిగత వివరాలను సేకరించడానికి బిల్లు అనుమతిస్తోందని- ఇది రాజ్యాంగంలోని 20 (3) అధికరణకు విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బలప్రయోగంతోనైనా వ్యక్తిగత వివరాలను సేకరించడానికి పోలీసులకు అధికారమివ్వడం నిరంకుశత్వమని ఆరోపిస్తున్నాయి. ఏ వ్యక్తీ తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యమిచ్చేలా ఒత్తిడి చేయకూడదని పై అధికరణ స్పష్టం చేస్తోంది. నిందితుడి వివరాలను బలవంతంగా సేకరించి, వాటిని తిరిగి అతడిపైనే ప్రయోగించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఐరాస మానవ హక్కుల ప్రకటనకూ ఇది వ్యతిరేకమే. ఏకే గోపాలన్‌ (1950), ఖరగ్‌ సింగ్‌ (1964), శోభరాజ్‌ (1978), షీలా బర్సే (1983), ప్రమోద్‌ కుమార్‌ సక్సేనా (2008) కేసుల్లో ఖైదీల హక్కుల్ని సుప్రీంకోర్టు నిర్వచించింది. నేరస్థులు, నిర్బంధితుల నుంచి బలవంతంగా నమూనాలు సేకరించడం ఆ హక్కులకు భంగకరం. ఆధార్‌ చట్టంలోని 29వ సెక్షన్‌ పౌరుల బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని నిషేధిస్తోంది. దీన్ని అధిగమించి నేరస్థులు, నిందితుల వ్యక్తిగత వివరాలను సేకరించడానికి ప్రభుత్వం చట్టపరంగా ప్రత్యేక మినహాయింపు నిబంధనను తీసుకువచ్చే అవకాశం ఉంది. వ్యక్తుల నుంచి బలవంతంగా వేలిముద్రలు ఇతర వివరాలు సేకరించడం నార్కో ఎనాలిసిస్‌కు, మెదడు మ్యాపింగ్‌కు దారి తీయవచ్చని కాంగ్రెస్‌ నాయకుడు మనీశ్‌ తివారీ ప్రభృతులు విమర్శిస్తున్నారు.

 

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంధన ధరల జోరు

‣ చదువులపై తుపాకీ ఆంక్షలు

‣ బెంగాల్‌లో హింసా రాజకీయాలు

‣ నీటి బొట్టు... నేరుగా మొక్కకు

‣ స్థిరాదాయం కరవు... బతుకే బరువు!

‣ కాలుష్య భూతం.. ఉక్కిరిబిక్కిరవుతున్న భారతం

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 06-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం