• facebook
  • whatsapp
  • telegram

చదువులపై తుపాకీ ఆంక్షలు

బాలికా విద్యపై తాలిబన్ల నిషేధాజ్ఞలు

అఫ్గాన్‌ బాలికల కలలు కల్లలైపోయాయి. తాలిబన్లు తమను విద్యాభ్యాసానికి అనుమతిస్తారని కోటి ఆశలతో బాలికలు బడిబాట పట్టారు. వెళ్ళిన కొద్దిసేపటికే తాలిబన్ల నుంచి హుకుం జారీ అయింది. ఆరో తరగతి దాటిన తరవాత అమ్మాయిలెవరూ విద్యాసంస్థలకు వెళ్ళడానికి వీల్లేదని, వచ్చినవారంతా తిరిగి వెళ్ళిపోవాలని తాలిబన్లు ఆదేశించారు. తాము చదువుకొంటామని, స్కూలు వదిలి వెళ్లబోమని ఆ పిల్లలు తమవద్ద మారాం చేస్తూ ఏడుస్తుంటే తాను నిస్సహాయంగా ఉండిపోయానని కాబుల్‌ నగరంలోని ఒమ్రాఖాన్‌ బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు ఒకరు ఆవేదన వ్యక్తం చేయడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. తాలిబన్లు ఇలా వ్యవహరించడం దారుణమని అఫ్గాన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న డెబ్రా లియోన్స్‌ సైతం ఆవేదన వ్యక్తంచేశారు.

చెదిరిన స్వప్నం

అఫ్గానిస్థాన్‌లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే మార్చి 23 నుంచి అమ్మాయిలందరినీ విద్యాసంస్థలకు అనుమతిస్తామని గతంలో తాలిబన్లు హామీ ఇచ్చారు. అయితే వారు అబ్బాయిలతో కలిసి కాకుండా, ప్రత్యేకంగా వేరే తరగతి గదుల్లో కూర్చుని చదువుకోవాలని తాలిబన్ల అధికార ప్రతినిధి అజీజ్‌ అహ్మద్‌ రయాన్‌ ప్రకటించారు. దాంతో అక్కడి బాలికలు, యువతులతో పాటు, అంతర్జాతీయ సమాజం సైతం ఎంతో సంతోషించింది. కానీ, ఇంతలో ఏమైందో తెలియదు. అమ్మాయిలను పాఠశాలలకు అనుమతించకూడదని తాలిబన్‌ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తమకు సమాచారం అందిందని తాలిబన్ల మరో అధికార ప్రతినిధి ఇనాముల్లా సమంగనీ వెల్లడించారు. ఈ నిర్ణయంపై వ్యాఖ్యానించే అధికారం తమకు లేదని రయాన్‌, సమంగనీ అంటున్నారు. గత సంవత్సరం ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టేసరికి కొవిడ్‌ మహమ్మారి కారణంగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. రెండు నెలల తరవాత వాటిని తెరిచినా, అబ్బాయిలను... ఆరో తరగతిలోపు అమ్మాయిలను మాత్రమే అనుమతించారు. అప్పటి నుంచీ బాలికావిద్య విషయంలో తాలిబన్లపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఒత్తిడి తెస్తూనే ఉంది. దాంతో మూడు వారాల క్రితం- తాము అందుకు సుముఖంగానే ఉన్నామని, ఇస్లామిక్‌ నిబంధనలను అనుసరించి కొన్ని షరతులు మాత్రం వర్తింపజేస్తామని చెప్పారు. ఫలితంగా అఫ్గాన్‌ యువతులు తమ భవిష్యత్తును రంగుల కలల్లో చూసుకున్నారు. స్వల్పకాలంలోనే వారి కలలన్నీ కల్లలయ్యాయి.

తాలిబన్లు తొలిసారిగా అఫ్గాన్‌ పాలనాపగ్గాలను చేజిక్కించుకున్నప్పుడు మహిళలపై లెక్కలేనన్ని ఆంక్షలు విధించారు. ఇంటిబయట కాలుపెడితే బురఖా తప్పనిసరి చేశారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఇంట్లో ఒక మగవారిని తోడు తీసుకెళ్ళాలని ఆంక్షలు విధించారు. ఆస్పత్రుల్లో వైద్యసేవలూ మహిళలకు అందుబాటులో ఉండేవి కావు. దాంతో ఎంతటి తీవ్ర అనారోగ్యం వచ్చినా ఇంట్లో మగవారు తెచ్చిచ్చే మందుబిళ్ళే శరణ్యం అయ్యేది. విద్య, వైద్యం, ఉద్యోగాలు... వేటిలోనూ వారికి అవకాశం ఉండేది కాదు. ఒక్క గంజాయితోటల పెంపకం, వాటి నుంచి గంజాయి సేకరణ తప్ప. అమెరికా సైన్యం జోక్యంతో తాలిబన్లు తోకముడిచిన తరవాత 2004లో వచ్చిన కొత్త రాజ్యాంగం మహిళల పాలిట వరంగా పరిణమించింది. వారికి అన్ని రకాల హక్కులూ కల్పించారు. దాంతో వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. 2003 నాటికి అఫ్గాన్‌ ప్రాథమిక పాఠశాలల్లో బాలికల చేరిక పదిశాతం లోపే; 2017 నాటికి అది 33 శాతానికి పెరిగింది. మాధ్యమిక పాఠశాలల్లో ఆరు నుంచి 39 శాతానికి చేరుకుంది. దాదాపు 35 లక్షల మంది అఫ్గాన్‌ బాలికలు పాఠశాలలకు, లక్ష మందికి పైగా విశ్వవిద్యాలయాలకు వెళ్ళసాగారు. 2001లో అక్కడి మహిళల సగటు ఆయుఃప్రమాణం 56 ఏళ్లు. 2017 నాటికి అది 66కు చేరింది. 2000 సంవత్సరంలో ప్రతి లక్ష జననాలకు 1,100 శిశు మరణాలు నమోదయ్యాయి. 2015కల్లా ఆ సంఖ్య 396కు తగ్గింది.

కారణాలెన్నో...

బాలికలు, యువతుల విద్యపై నిషేధం శాశ్వతం కాదని తాలిబన్లు చెబుతున్నా- వాళ్లు తమమాట ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది అనుమానమే. నిపుణులైన ఇంజినీర్లు లేకపోవడం వల్లే వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం విదేశాలపై అఫ్గాన్‌ పాలకులు ఆధారపడాల్సి వస్తోంది. సొంత దేశంలో సాంకేతిక విద్యకూ అవకాశాలు కల్పించి, అందులో పట్టభద్రులైన వారికి ఉద్యోగాలు చేసే స్వేచ్ఛ ఇస్తే తామూ అద్భుతాలు చేసి చూపించగలమని అక్కడి యువతులు అంటున్నారు. అఫ్గానిస్థాన్‌లో బాలికల ప్రత్యేక పాఠశాలలు 16 శాతమే. వాటిలోనూ పారిశుద్ధ్య వసతులు సరిగ్గా లేవన్నది ‘యునిసెఫ్‌’ చెబుతున్న మాట. సహజంగానే అలాంటి పాఠశాలలకు వెళ్ళేందుకు బాలికలు సుముఖత చూపరు. చాలాచోట్ల పాఠశాలలకు వెళ్ళేందుకు తగిన రవాణా సదుపాయాల్లేవు. సదుపాయాల కొరతతోపాటు సామాజిక-సాంస్కృతిక అంశాలు, మత విశ్వాసాలు, పాలకుల ధోరణి అఫ్గాన్‌లో బాలికల విద్యావకాశాలను దెబ్బతీస్తున్నాయి. అఫ్గాన్‌ బాలికల్లో ఎక్కువ మందికి 15 ఏళ్లలోపే పెళ్ళిళ్లవుతున్నాయి. ఫలితంగా వారు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితులన్నీ మారి- అఫ్గాన్‌ బాలికలు, యువతులకు చదువుకునేందుకు, ఆపై ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం ఎప్పటికి దొరుకుతుందన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే!

- పి.రాఘవ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముట్టడి వ్యూహంతో ముందుకు

‣ భూసారం... ఆహార భద్రతకు వరం!

‣ సరిహద్దు వివాదాల పీటముడి

‣ దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 05-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం