• facebook
  • whatsapp
  • telegram

నేపాల్‌తో బ‌ల‌ప‌డ‌తున్న బంధం 

నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా తాజా ఇండియా పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు దోహదపడింది. ఇరు దేశాల నడుమ వైరానికి కారణమవుతున్న సరిహద్దు వివాదాలపై ఈ సందర్భంగా తొలిసారి అత్యున్నత స్థాయి దౌత్య భేటీ జరిగింది. చైనా చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించిన నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ ఓలీ- కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్‌ ప్రాంతాలన్నీ తమవేనంటూ సరిహద్దు పటాలను సవరించారు. పార్లమెంటులో వాటికి ఆమోదముద్ర వేయించుకుని వివాదాన్ని వీలైనంత జటిలం చేశారు. అలా ఆ సమస్య తమ దేశ సార్వభౌమత్వంతో ముడివడటం, వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతుండటంతో దాని పరిష్కారానికి దేవ్‌బా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ప్రయత్నించలేని పరిస్థితి నెలకొంది. కాకపోతే సరిహద్దు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనేందుకు ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అది ప్రతిపాదించింది.  

రూపే కార్డుకు అంగీకారం

రైల్వే రంగంలో సాంకేతిక సహకారం, పెట్రో ఉత్పత్తుల సరఫరాలతో పాటు ఇండియా నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమిలో నేపాల్‌ చేరేందుకు వీలుగా రెండు దేశాల మధ్య తాజాగా ఒప్పందాలు జరిగాయి. విద్యుత్తు రంగంపై ‘భారత్‌-నేపాల్‌ సంయుక్త దార్శనిక ప్రకటన’ వెలువడటం కీలక ముందడుగు. మహాకాళి నదిపై పంచేశ్వర్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు సమగ్ర నివేదికకు తుదిరూపు ఇచ్చేందుకు ఇరు దేశాధినేతలు అంగీకరించారు. భారతదేశం సాయంతో నేపాల్‌లో నిర్మితమవుతున్న 132 ఆరోగ్యకేంద్రాల పనులను వేగవంతం చేయాలనీ నిర్ణయించారు. తమ దేశంలో ఇండియా చేపట్టిన కాభ్రేపలామ్‌చౌక్‌, నేపాల్‌గంజ్‌, భైర్‌హవా సమీకృత చెక్‌పోస్టులు, రామాయణ సర్క్యూట్‌లోని కీలక ప్రాజెక్టులకు అడ్డంకుల తొలగింపునకు దేవ్‌బా సుముఖత వ్యక్తంచేశారు. మరోవైపు, స్థానికంగా భారత రూపే కార్డుల వినియోగానికి నేపాల్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూటాన్‌, సింగపూర్‌, యూఏఈల తరవాత అలా ఆ కార్డును వాడుతున్న నాలుగో దేశంగా నేపాల్‌ నిలిచింది. ఇరుపక్షాల మధ్య ఆర్థిక సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు దాంతో అవకాశం లభించినట్లయింది. నేపాల్‌ కొన్నేళ్లుగా చైనాతో అంటకాగుతోంది. ఆ క్రమంలోనే 2017లో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బీఆర్‌ఐ) ప్రాజెక్టుల్లో భాగమైంది. చైనా ప్రాపకం కోసం నాటి నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ భారత్‌పై ఉద్దేశపూర్వకంగా విషంకక్కారు. కాలాపానీ, లిపులేఖ్‌  భూవివాదాలను పెంచి పోషించడమే కాదు, భారత సైన్యంలోని గుర్ఖా రైఫిల్‌ రెజిమెంట్లలో సమస్యలు సృష్టించేందుకూ ఓలి తెగించారు. భారత సైన్యంలో గుర్ఖాల చేరికకు దశాబ్దాల నాడు కుదిరిన ఒప్పందం పునస్సమీక్షకూ ప్రయత్నించారు. అయోధ్యపై ఆయన అనుచిత వ్యాఖ్యలకు దిగడం వంటివి ద్వైపాక్షిక బంధాలను బీటలువార్చాయి. ‘భారత్‌ వేరియంట్‌ ప్రమాదకరం’ అంటూ కరోనా సమయంలో వ్యాఖ్యానించిన ఓలి- ఇరు దేశాల నడుమ దూరాన్ని మరింతగా పెంచారు. చైనా కోసం అంత చేసినా అక్కడ బీఆర్‌ఐ ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ప్రధాని పదవిని సుస్థిరం చేసుకొనేందుకు ఓలి సాగించిన యత్నాలు అంతర్గత రాజకీయ కుమ్ములాటలకు కారణమయ్యాయి. పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ వర్గం మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన పదవిలోంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం ఆ బాధ్యతలను స్వీకరించిన దేవ్‌బా- డ్రాగన్‌ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

కొవిడ్‌ పేరిట చైనా సరిహద్దులు మూసివేయడంతో గడచిన రెండేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం దెబ్బతింది. అదే సమయంలో డ్రాగన్‌ సరిహద్దు అతిక్రమణలకు పాల్పడుతోందంటూ నేపాల్‌ అంతర్గత నివేదికలు వెలుగుచూశాయి. దాంతో కాఠ్‌మాండూకు బీజింగ్‌పై నమ్మకం సన్నగిల్లింది. తత్ఫలితంగా వివిధ ప్రాజెక్టుల కోసం అమెరికాకు చెందిన ఎంసీసీ (మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌) నుంచి దాదాపు రూ.3,700 కోట్ల వరకు సాయం పొందేందుకు 2017లో కుదుర్చుకొన్న ఒప్పందానికి నేపాల్‌ పార్లమెంట్‌ ఇటీవల ఆమోదముద్ర వేసింది. నేపాల్‌ను ఇండియాతో అనుసంధానించేలా గుట్వాల్‌-గోరఖ్‌పూర్‌ హైఓల్టేజ్‌ విద్యుత్తు లైను నిర్మాణం వంటివి అందులో ఉన్నాయి. కాఠ్‌మాండూలోని చైనా ప్రేరేపిత కమ్యూనిస్టు పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఆ రుణాలు వద్దేవద్దు!

ఎంసీసీ ఒప్పందానికి నేపాల్‌ పార్లమెంటు ఆమోదం తెలిపిన కొద్ది రోజుల్లోనే చైనా మంత్రి వాంగ్‌ యీ కాఠ్‌మాండూను సందర్శించారు. ఆ సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వశాఖలు విభిన్నంగా స్పందించడం గమనార్హం. బీఆర్‌ఐలో నేపాల్‌ కీలక భాగస్వామ్యానికి బీజింగ్‌ మద్దతు కొనసాగుతుందని చైనా వెల్లడించింది. నేపాల్‌ విదేశాంగ శాఖ మాత్రం దాని గురించి ప్రస్తావించనే లేదు. వాస్తవానికి బీఆర్‌ఐ ప్రాజెక్టుల కోసం అధిక వడ్డీతో చైనా ఇచ్చే స్వల్పకాల రుణాలపై దేవ్‌బా కార్యవర్గం ఆసక్తి చూపడం లేదు. వాంగ్‌ పర్యటనలో పట్టాలకెక్కిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో బీఆర్‌ఐకి సంబంధించినది ఒక్కటీ లేకపోవడానికి అదే కారణం. బీఆర్‌ఐ రుణాలు తీసుకొని తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న పాకిస్థాన్‌, శ్రీలంకలను గమనించిన తరవాత ఆ దుస్సాహసం చేసేందుకు నేపాల్‌ వెనకడుగు వేస్తున్నట్లు అర్థమవుతోంది.

- ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

=

‣ ప్రాంతీయ సహకారానికి బిమ్‌స్టెక్‌ భరోసా

‣ మాల్దీవుల్లో చైనా చిచ్చు

‣ శ్రామిక సంక్షేమానికి భరోసా

‣ ఒప్పందాలకు తిలోదకాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 06-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం