• facebook
  • whatsapp
  • telegram

ఎరువుల విపణి అతలాకుతలం

యుద్ధ ప్రభావంతో పెరుగుతున్న ధరలు

 

 

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ఆహారోత్పత్తుల విపణిని అతలాకుతలం చేస్తోంది. ఈ దేశాలకు సుదూరంగా ఉన్న బ్రెజిల్‌, ఇండియా, చైనాలాంటి అతిపెద్ద దేశాల వ్యవసాయంపై యుద్ధం ప్రభావం అధికంగా పడుతోంది. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని ఇష్టారాజ్యంగా ఎరువుల ధరలు పెంచితే సహించేది లేదని అమెరికా వ్యవసాయశాఖ ఇటీవల అక్కడి ఎరువులు, ఇతర వ్యవసాయ సామగ్రి తయారీ కంపెనీలను హెచ్చరించడం రైతులపై ఆర్థిక భారం తీవ్రతను చాటుతోంది. భారతదేశానికి అవసరమైన పొటాష్‌, డైఅమ్మోనియం ఫాస్ఫేట్‌, అమ్మోనియం నైట్రేట్‌ వంటి రసాయన ఎరువులు రష్యా, ఉక్రెయిన్‌లతో పాటు వాటి పక్కనే ఉన్న బెలారస్‌ నుంచి ఏటా దిగుమతి అవుతున్నాయి. వాటి దిగుమతులు తగ్గిపోవడం; పెట్రోలు, డీజిలు ధరల మంట వల్ల ఎరువుల రవాణా, నిల్వ వ్యయాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే జూన్‌ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఖరీఫ్‌ (వానాకాలం) పంటల సీజన్‌లో ఎరువుల ధరలు పెంచేందుకు కంపెనీలకు కేంద్రం అనుమతిస్తుందా, లేక రాయితీని మరింత పెంచి ఆ భారాన్ని తానే భరిస్తుందా అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

 

విదేశాలే దిక్కవుతున్న వైనం

భారతదేశంలో పంటలు పండాలంటే విదేశాల నుంచి నౌకల్లో ఎరువులు రావాలి. భారతీయుల ఇళ్లలో వంటలు చేయాలంటే విదేశాల నుంచే నౌకల్లో వంటనూనెలు రావాలి. ఇప్పుడు యుద్ధంతో నౌకలు రావడం తగ్గి ఇక్కడ వంటనూనెల ధరలూ మండుతున్నాయి. ఎరువుల ధరల్ని పెంచేందుకు అనుమతించాలని కంపెనీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ, రాయితీని పెంచి ధరల పెంపును అడ్డుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. కొత్త (2022-23) ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ఎరువుల దిగుమతులు, రాయితీలపై ఈ నెలాఖరులోగా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆ తరవాతే ఎరువుల దిగుమతుల ధరలు, రైతులకు అమ్మేందుకు కంపెనీలు నిర్ణయించే ‘గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)’ ఖరారు కానున్నాయి.

 

అమెరికాలోని ఓర్లాన్స్‌ ప్రాంతంలో గతేడాది ఫిబ్రవరిలో టన్ను యూరియాను 359 డాలర్ల (సుమారు రూ.27,250)కు అమ్మితే 2022 ఫిబ్రవరిలో ఏకంగా 705 డాలర్ల(సుమారు రూ.53,500)కు విక్రయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను యూరియా ధర 846 డాలర్లకు చేరింది. యూరియాపై భారత ప్రభుత్వం అత్యధికంగా రాయితీ భరిస్తున్నందువల్ల ఇక్కడి రైతులకు టన్ను రూ.5,360(సుమారు 71.50 డాలర్ల)కే అమ్మాలని కేంద్రం నిబంధన విధించింది. మిగతా సొమ్మును రాయితీగా కంపెనీలకు చెల్లిస్తోంది. ప్రపంచంలోనే ఇంత తక్కువ ధరకు రైతులకు యూరియా అమ్ముతున్నందువల్లే భారత ప్రభుత్వం భారీగా రాయితీ భరించాల్సి వస్తోంది. మనదేశంలో 45 కిలోల యూరియా బస్తా ధర రూ.266.70; పక్కనే ఉన్న పాకిస్థాన్‌లో 50 కిలోల బస్తా రూ.791. చైనాలో రూ.2,100, అమెరికాలో రూ.3,060, బ్రెజిల్‌లో రూ.3,600 పలుకుతోంది. రైతులపై భారం పడకుండా ఉండాలని కేంద్రం ఎప్పటికప్పుడు ఎరువులపై రాయితీ పెంచుతూ వస్తోంది. ఉదాహరణకు గతేడాది (2021-22) బడ్జెట్‌లో తొలుత ఎరువుల రాయితీ పద్దు కింద రూ.79,529.68 కోట్లు కేంద్రం కేటాయించింది. కానీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల, భారత్‌లో ఎరువుల వినియోగం కారణంగా బడ్జెట్‌ను సవరించి ఏడాది చివరికి ఏకంగా 1.40 లక్షల కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసింది. ఈ ఏడాది (2022-23) బడ్జెట్‌లో 1.05 లక్షల కోట్ల రూపాయలు రాయితీకి కేటాయించినా- ఇప్పుడు రష్యా యుద్ధంవల్ల ఈ ఏడాది చివరినాటికి లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా పెంచవచ్చనేది తాజా అంచనా. గతేడాది రాయితీ ప్రకటించినా పలు రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడ్డారు. నిరుటితో పోలిస్తే యూరియాపై 17శాతం, కాంప్లెక్స్‌ ఎరువులపై 35శాతం రాయితీని ఈ ఏడాది కేంద్రం తగ్గించింది. ఎరువుల ధరలు పెరిగితే రైతుల్లో వ్యతిరేకత వస్తుందని రాయితీ పెంచి భారం భరిస్తున్న కేంద్రం వాటి వినియోగాన్ని తగ్గించేందుకు పెద్దగా నిధులివ్వడం లేదు.

 

 

అవగాహన కల్పించాలి

రసాయన ఎరువుల వినియోగం తగ్గాలంటే రైతులకు అవగాహన పెంచేందుకు వ్యవసాయ శాఖలు కృషిచేయాలి. ప్రస్తుతం రాయితీ ఎరువుల కంపెనీలకు ఇస్తున్నందువల్ల అది పూర్తిస్థాయిలో సద్వినియోగం కావడం లేదని కేంద్రం భావిస్తోంది. భూసార పరీక్షలు చేయించి, అవసరమైన మేరకే రసాయన ఎరువులు వాడితే- ఇప్పుడు వినియోగిస్తున్న వాటిలో మూడో వంతు వరకు మిగులుతాయని అంచనా. యూరియా తప్ప మిగిలిన ఎరువులకు పోషకాల ఆధారంగా రాయితీ ఇచ్చే ‘సూక్ష్మ పోషక ఆధారిత రాయితీ (ఎన్‌బీఎస్‌)’ విధానాన్ని 2010లో కేంద్రం తెచ్చింది. దీని ఫలితంగా రాయితీ, ధరల భారం తగ్గుతుందని కేంద్రం అప్పట్లో ప్రకటించింది. కానీ, రాయితీ ఏమాత్రం తగ్గకపోగా రెట్టింపైంది. ఉదాహరణకు డీఏపీ ఎరువు 50కిలోల బస్తాపై కేంద్రం 2015-16లో రూ.617.50 రాయితీ ఇవ్వగా 2021-22లో రూ.1,211.55 ఇచ్చింది. ఇదే బస్తా ధర రూ.1,250 నుంచి రూ.1,450కి పెరిగింది. పొటాష్‌ ధర రూ.825 నుంచి రూ.1,750కి పెరిగింది. దేశంలో ఎన్నో రకాల వాతావరణ మండలాలు, భూములున్నందువల్ల ఎక్కడ ఏ పంట పండుతుందనేది గుర్తించి పంటల కాలనీలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏ పంటకు ఎంత ఎరువు వేయాలనేది కూడా నిర్ణయించి అంతే మొత్తం రైతులు వాడేలా చైతన్యపరిస్తేనే ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా రాయితీ భారం మిగులుతుంది. లేకపోతే ప్రజాధనం వృథా కావడంతో పాటు, భూములు రసాయనాలతో నిండి నిస్సారమై- భవిష్యత్తులో పంటల దిగుబడులు మరింత తగ్గే ప్రమాదమూ ఉందని గుర్తించాలి!

 

సాగువ్యయం తగ్గాలంటే?

ఏ భూమిలో ఏయే పోషకాలు ఎంత ఉన్నాయనేది ముందుగా తెలిస్తే అందులో ఏ పంట వేయాలి, దానికి ఏయే రసాయనాలు వాడాలనే స్పష్టత సీజన్‌కు ముందే వస్తుంది. కానీ ఈ వివరాలు రైతులకు ఎవరూ చెప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల వ్యవసాయ భూముల్లో పలుచోట్ల భాస్వరం, మరికొన్నిచోట్ల నత్రజని పోషకాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. భాస్వరం ఎక్కువగా ఉంటే డీఏపీ, నత్రజని అధికంగా ఉంటే యూరియా పంటలకు వాడాల్సిన అవసరముండదు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో యూరియా, డీఏపీ ఎరువుల వినియోగం ఏమాత్రం తగ్గకపోగా, ఏటా భారీగా పెరుగుతున్నందువల్ల పంటల సాగువ్యయం హెచ్చుతోంది.

 

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అప్పుల ఊబిలో రాష్ట్రాలు

‣ ఉభయతారక వాణిజ్య బంధం

‣ హక్కులు హరించే కొత్త ఆయుధం!

‣ నేపాల్‌తో బ‌ల‌ప‌డ‌తున్న బంధం

‣ ఇంధన ధరల జోరు

‣ చదువులపై తుపాకీ ఆంక్షలు

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం