• facebook
  • whatsapp
  • telegram

ఉభయతారక వాణిజ్య బంధం

ఆస్ట్రేలియాతో ఇండియా ‘ఎక్టా’ ఒప్పందం

విదేశాలతో వాణిజ్య ఒప్పందాల పరంగా భారత్‌ ఇటీవల రెండు కీలక మైలురాళ్లను అధిగమించింది. ఫిబ్రవరిలో యూఏఈతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ-సెపా) కుదుర్చుకొంది. ఆస్ట్రేలియాతోనూ అదే తరహా ఒడంబడిక దిశగా తాజాగా పెద్ద ముందడుగు పడింది. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందానికి (సీఈసీఏ-సెకా) పూర్వరంగంగా భావిస్తున్న ‘ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం’ (ఈసీటీఏ-ఎక్టా)పై ఇండియా, ఆస్ట్రేలియా మంత్రులు పీయూష్‌ గోయల్‌, డాన్‌ టెహాన్‌ కొద్దిరోజుల క్రితం సంతకాలు చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఆస్ట్రేలియాతో 2011లోనే చర్చలు మొదలైనా, భారత ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరవాతే ఆ ప్రయత్నాలు ఊపందుకొన్నాయి. రెండేళ్లుగా వివిధ స్థాయుల్లో విస్తృతంగా జరిగిన చర్చలకు ఫలశ్రుతిగా ‘ఎక్టా’ సాకారమైంది. ఇరుదేశాల నడుమ వస్తుసేవల సరఫరాలు, నిపుణులు, పర్యాటకుల రాకపోకలను ‘ఎక్టా’ పెంచుతుంది. పసిఫిక్‌ ప్రాంతంతో భారతదేశ భౌగోళిక సంబంధాలను సుసంపన్నం చేసేందుకు అమితంగా అక్కరకొస్తుంది.

సుంకాల శృంఖలాలు తెంచేసి...

‘ఎక్టా’ ప్రకారం ఇండియా సుమారు ఆరు వేల రకాల వస్తు ఉత్పత్తులను కస్టమ్స్‌ సుంకం లేకుండా ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయనుంది. వస్త్ర, చర్మ, కలప ఉత్పత్తులు, ఆభరణాలు, పాదరక్షలు, ఆట వస్తువులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, యంత్ర విడిభాగాలు, రైల్వేవ్యాగన్లు వంటి సుమారు 95శాతం ఎగుమతులు పన్నురహిత జాబితాలోకి చేరాయి. ఫలితంగా ఆయా వస్తువుల ఉత్పత్తి ఊపందుకొని, వచ్చే ఏడేళ్లలో కొత్తగా పది లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. దేశీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడకుండా బియ్యం, గోధుమలు, నూనెలు, పాల ఉత్పత్తుల వంటి వాటిని ‘ఎక్టా’ నుంచి మినహాయించారు. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చే వస్తువుల్లో 85శాతంపై ఇండియా సైతం సుంకాన్ని రద్దు చేయనుంది. బొగ్గు, అల్యూమినియం, మాంగనీస్‌, రాగి, నికెల్‌, జర్కోనియం, టైటానియం వంటి ముడి ఖనిజాలు, శుద్ధి చేసిన ఇతర ఉత్పత్తులతో పాటు గొర్రె మాంసం, ఉన్ని, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ఆ జాబితాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 74శాతం వాటా బొగ్గుదే. సుంకాల తొలగింపువల్ల దేశీయ కర్మాగారాలకు చౌకగా ఇంధనం లభించనుంది. ‘భారత్‌లో తయారీ’కి ఆలంబన కానుంది. ప్రస్తుతం 2750 కోట్ల డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే అయిదేళ్లలో 5000 కోట్ల డాలర్ల వరకు ఎగబాకవచ్చునని పీయూష్‌ గోయల్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. వస్తూత్పత్తిలో పాటించే నాణ్యతాప్రమాణాలు, మార్కెటింగ్‌ మెలకువలే వాణిజ్య వృద్ధికి గీటురాళ్లు కానున్నాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య సమతూకం పాటించడం, ఒప్పందానికి ఆవలి దేశాల ఉత్పత్తులకు సుంకం మినహాయింపులు వర్తించకుండా పర్యవేక్షించడం కీలకంగా నిలవనున్నాయి.  

దిల్లీ-కాన్‌బెర్రాల నడుమ వేళ్లూనుకున్న గాఢానుబంధానికి ప్రతీకగా ‘ఎక్టా’ను ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘ఇరు దేశాలకే కాదు, పసిఫిక్‌ ప్రాంతంతో ప్రపంచ వాణిజ్య అవసరాలు తీర్చడంలో ఈ ఒప్పందం ఒక మైలురాయి. ఆహార, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా గొలుసును ఇది సుస్థిరపరుస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. రెండు దేశాల ప్రభుత్వాలతోపాటు, ప్రజల మధ్యా సంబంధాలు సుసంపన్నం కావాలని ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌ ఆకాంక్షించారు. ఆ కార్యాచరణలో భాగంగా ఏటా 1800 మంది యోగా శిక్షకులు, పాకశాస్త్ర ప్రవీణులు, వృత్తినిపుణులకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఏటా వెయ్యి మంది పట్టభద్రులకు నాలుగు నెలల కాలపరిమితితో కూడిన వర్క్‌ అండ్‌ హాలిడే వీసాలు జారీ చేయనుంది. దేశీయ కంపెనీలు ఎదుర్కొంటున్న ద్వంద్వ పన్నుల సమస్యను ఆస్ట్రేలియా నాయకత్వం పరిష్కరించాల్సి ఉంది. భారత్‌లో స్థాపితమై ఆస్ట్రేలియాలో సేవలందిస్తున్న ఆఫ్‌షోర్‌ సంస్థలపై సుంకాల విధానం పునస్సమీక్షను అది వేగవంతం చేయాలి.

విశ్వవిపణిలో కొత్త అవకాశాలు

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకొనే క్రమంలో అమెరికా, జపాన్‌, ఇండియా, ఆస్ట్రేలియాలతో ఏర్పడిన చతుర్భుజ కూటమి ‘క్వాడ్‌’ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. కూటమిలోని మిగిలిన రెండు దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న ఆస్ట్రేలియా- ‘ఎక్టా’తో భారత్‌తోనూ బలమైన వ్యాపార బంధాన్ని ఏర్పరచుకుంది. రాజకీయ, సైనిక సహకారానికి వాణిజ్య ఒప్పందాలు తోడైతే క్వాడ్‌ లక్ష్యాల్లో కీలకమైన సమ్మిళిత వృద్ధి సాధ్యపడుతుంది. పన్నురహిత వస్తు రవాణా ద్వారా విశ్వవిపణిలో భారత్‌ తన వాటాను పెంచుకోవచ్చు. తద్వారా విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంతోపాటు స్వదేశంలో తయారీరంగానికి ఊతం ఇవ్వవచ్చు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ప్రపంచం భిన్న శిబిరాలుగా చీలిపోతున్న తరుణంలో ఇండియా ఇప్పటికీ తటస్థ వైఖరికే కట్టుబడి ఉంది. అమెరికా, ఐరోపా దేశాలకు అది రుచించకపోయినా- దిల్లీని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒడుదొడుకులకు లోనవుతున్న దృష్ట్యా వాణిజ్య వ్యాపారాల్లో కొత్త అవకాశాల అన్వేషణ ఇండియాకు అనివార్యమే కాదు, లాభదాయకమూ అవుతుంది.

- బి.అశోక్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బెంగాల్‌లో హింసా రాజకీయాలు

‣ నీటి బొట్టు... నేరుగా మొక్కకు

‣ స్థిరాదాయం కరవు... బతుకే బరువు!

‣ కాలుష్య భూతం.. ఉక్కిరిబిక్కిరవుతున్న భారతం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 09-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం