• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక సంక్షోభంలో పాక్‌

గుదిబండలా రుణభారం

 

 

పాకిస్థాన్‌లో రాజకీయ కల్లోలం వెనకే తీవ్ర ఆర్థిక సంక్షోభం పొంచి ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత, తీవ్ర వాణిజ్య లోటు, చుక్కలను తాకే ధరలు దాయాది దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో సహజంగానే పేదరికం, నిరుద్యోగం, స్వదేశీ, విదేశీ రుణభారం పెరిగిపోతున్నాయి. పాక్‌ కరెంటు ఖాతా లోటు నేడు 2,000 కోట్ల డాలర్లకు చేరింది. దేశ జీడీపీలో అది ఆరు శాతానికి సమానం. పాక్‌ విదేశ మారక ద్రవ్య నిల్వలు 700 కోట్ల డాలర్ల లోపునకు పడిపోనున్నాయి. కరెంటు ఖాతా లోటుకు విత్తలోటూ తోడవుతోంది. నేడు పాక్‌ జీడీపీలో విత్తలోటు 8.2శాతానికి చేరుకుంది. ఒక దేశ ఎగుమతులకన్నా దిగుమతులు ఎక్కువైనప్పుడు కరెంటు ఖాతా లోటు సంభవిస్తుంది. ప్రభుత్వ ఆదాయంకన్నా ఖర్చులు ఎక్కువైతే విత్తలోటు ఏర్పడుతుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకుని గట్టెక్కుతుంటాయి. పాక్‌ మొత్తం విదేశీ రుణభారం ఇప్పటికే పాకిస్థానీ రూపాయల్లో దాదాపు 51 లక్షల కోట్లకు చేరుకుంది. అందులో 20.7 లక్షల కోట్ల పాక్‌ రూపాయల అప్పు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం చేసినదే. దాంతో పాక్‌కు విదేశాలనుంచి, అంతర్జాతీయ సంస్థలనుంచి కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత విదేశీ రుణభారం పాకిస్థాన్‌ మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 93.7 శాతానికి సమానం.

 

ఇమ్రాన్‌ పాలనలో పాక్‌ ప్రజల తలసరి రుణభారం 50శాతం పెరిగిందని ఆర్థిక శాఖ ఇటీవల పాక్‌ పార్లమెంటు నేషనల్‌ అసెంబ్లీకి తెలిపింది. ఒకవైపు సామాన్య ప్రజలు తిండికి కటకటలాడుతుంటే ఇమ్రాన్‌ ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో దేశ రక్షణకు భారీగా నిధులు కేటాయించింది. కొవిడ్‌ కాలంలో ఆరోగ్య రంగానికి అరకొర నిధులు విదిల్చింది. ఎన్ని అప్పులు తెచ్చినా సగటు పాకిస్థానీ పౌరుడికి ఒరుగుతున్నది ఏమీ లేదు. భారత్‌, బంగ్లాదేశ్‌ వంటి వాటితో పోలిస్తే పాక్‌లో విద్యుత్‌ ఛార్జీలు రెట్టింపయ్యాయి. గతేడాదికన్నా ఈసారి తీసుకున్న అప్పులు 18శాతం (58 కోట్ల డాలర్లు) ఎక్కువని పాక్‌ ఆర్థిక శాఖ వెల్లడించింది. అత్యధిక విదేశీ రుణభారం మోస్తున్న 10 దేశాల జాబితాలో పాకిస్థాన్‌ సైతం ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. కొవిడ్‌ సంక్షోభం తెచ్చిపెట్టిన గడ్డు పరిస్థితులవల్ల పాకిస్థాన్‌ పాత అప్పులు తీర్చడానికి అధిక వడ్డీకి వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది.

 

తాహతుకు మించి అప్పులు చేయడంతో పాక్‌ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. నేడు ఒక డాలర్‌ సుమారు 185 పాక్‌ రూపాయలకు సమానం. ఒక భారతీయ రూపాయి దాదాపు 2.43 పాక్‌ రూపాయలకు సమానం. ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు మూలంగా త్వరలోనే ఒక డాలరు విలువ 200 పాక్‌ రూపాయలకు చేరనున్నది. పాక్‌ రూపాయి మరింత పతనం కాకుండా చూడటానికి ఇమ్రాన్‌ ప్రభుత్వం 36,000 కోట్ల పాక్‌ రూపాయలతో మినీ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. అయినా ఆర్థిక పరిస్థితి కుదుటపడలేదు. పాత విదేశీ రుణాలను తీర్చడానికి దాయాది దేశం అంతకంతకూ చైనాపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా బీజింగ్‌ రుణ ఊబిలో ఇస్లామాబాద్‌ కూరుకుపోతోంది. పాక్‌ విదేశీ రుణభారంలో 27శాతం చైనాకు చెల్లించవలసిందేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెబుతోంది. అసలు రుణ ఊబి నుంచి ఎప్పటికైనా పాక్‌ బయటపడుతుందా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

 

- నీరజ్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అప్పుల ఊబిలో రాష్ట్రాలు

‣ ఉభయతారక వాణిజ్య బంధం

‣ హక్కులు హరించే కొత్త ఆయుధం!

‣ నేపాల్‌తో బ‌ల‌ప‌డ‌తున్న బంధం

‣ ఇంధన ధరల జోరు

‣ చదువులపై తుపాకీ ఆంక్షలు

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం