• facebook
  • whatsapp
  • telegram

పటిష్ఠ వాణిజ్య బంధంపై అనురక్తి

బ్రిటన్‌ చూపు భారత్‌ వైపు

 

 

ఉక్రెయిన్‌ సంక్షోభం రెండో ప్రచ్ఛన్న యుద్ధాన్ని తీసుకొస్తుందని, అమెరికా ఆధిపత్యాన్ని రష్యా-చైనాలు సవాలు చేయబోతున్నాయని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ప్రపంచదేశాలు మళ్ళీ రెండు వైరి పక్షాలుగా మారితే ఎవరు ఎటువైపు ఉంటారనేది కీలక ప్రశ్నగా మారింది. 2024కల్లా ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించనున్న భారత్‌ తమవైపే ఉండాలని అమెరికా, బ్రిటన్‌లు ఆకాంక్షిస్తున్నాయి. రష్యాతో భారత్‌కు చిరకాల రక్షణ బంధం ఉన్నా, సరిహద్దులో చైనా అతిక్రమణలను అడ్డుకోవడానికి మాస్కో తోడ్పడుతుందా అనేది దిల్లీ ఆలోచించుకోవాలంటున్నాయి. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో భారత స్వావలంబన సాధనకు తోడ్పడతామంటున్నాయి. ఈ తరుణంలో మార్చి 31న బ్రిటిష్‌ విదేశాంగమంత్రి ఎలిజబెత్‌ ట్రస్‌ జరిపిన భారత పర్యటన విశేష ప్రాముఖ్యం సంతరించుకుంది. ఆమె ఇక్కడ భారత్‌-బ్రిటన్‌ వ్యూహపరమైన పొత్తుకు సంబంధించిన ‘స్ట్రాటజిక్‌ ఫ్యూచర్స్‌ పోరమ్‌’లో ప్రసంగించారు.  

 

ఎఫ్‌టీఏతో ముందుకు

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా చర్యలను భారత్‌ ఖండించకపోవడం, అక్కడి చమురును కొనుగోలు చేస్తూనే ఉండటం బ్రిటన్‌, అమెరికాలకు అభ్యంతరకరమే. కానీ, దిల్లీతో అన్ని రంగాల్లో సహకారాన్ని వృద్ధి చేసుకోవడానికి అవి కట్టుబడి ఉన్నాయి. తమ బంధాన్ని మరింత పటిష్ఠపరచుకోవడానికి భారత్‌, బ్రిటన్‌లు నిరుడు మే నెలలోనే వ్యూహపరమైన సమగ్ర భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి. ఆ ఒప్పందం 2030 వరకు రెండు దేశాల సంబంధాలను నిర్దేశిస్తుంది. దీన్నే ‘2030 రోడ్‌మ్యాప్‌’ అంటున్నారు. ఆగ్నేయాసియాలో సముద్ర భద్రతకు భారతదేశం చేపట్టిన హిందూ-పసిఫిక్‌ మహాసముద్రాల రక్షణ పథకంలో బ్రిటన్‌ చేరుతోంది. ఈ రెండు మహాసముద్రాల్లో బ్రిటన్‌ ప్రధాన శక్తిగా నిలుస్తోంది. ఒమన్‌, సింగపూర్‌, బహ్రెయిన్‌, కెన్యాల్లో బ్రిటిష్‌ నౌకాదళ స్థావరాలు ఉన్నాయి. టాంజానియా నుంచి ఇండొనేసియా వరకు విస్తరించిన వందలాది చిన్న దీవుల్లోనూ బ్రిటన్‌ నౌకాదళ వసతులు ఉన్నాయి. వీటిని బ్రిటిష్‌ హిందూమహాసముద్ర ప్రాంతంగా వ్యవహరిస్తున్నారు. 54,000 చదరపు కిలోమీటర్ల సముద్ర జలాల్లో విస్తరించిన ఈ ప్రాంతంలో దీవుల భూభాగం కేవలం 60 చదరపు కిలోమీటర్లే. వీటిలో ఒకటి డియెగో గార్సియా దీవి. ఆనాటి బ్రిటిష్‌ సామ్రాజ్య అవశేషంగా మిగిలిన ఈ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవడంలో వ్యూహపరంగా చాలా ప్రాముఖ్యం ఉంది. 2021లో బంగాళాఖాతంలో భారత్‌, బ్రిటిష్‌ నౌకాదళాలు సంయుక్త విన్యాసాలు జరపడం ఇక్కడ గమనార్హం. బ్రిటన్‌తో భారత్‌కు 2015 నుంచి ఉన్న రక్షణ-అంతర్జాతీయ భద్రతా భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఇటువంటి విన్యాసాలు జరుగుతున్నాయి. సైబర్‌ భద్రత, సైనిక సాంకేతికతల్లోనూ రెండు దేశాల సహకారం వృద్ధి చెందనుంది. తమ ఆర్థిక, రక్షణ యంత్రాంగాలను సైబర్‌ దాడుల నుంచి కాపాడుకోవడానికి రెండు దేశాలూ త్వరలోనే ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించనున్నాయి. వాతావరణ మార్పుల నిరోధానికి హరిత సాంకేతికతల వినియోగంలో బ్రిటన్‌ ముందున్నది. భారత్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించడానికి లండన్‌ ఏడు కోట్ల యూరోలను పెట్టుబడి నిధిగా అందించదలచింది.

 

ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి బ్రిటన్‌ నిష్క్రమణ (బ్రెగ్జిట్‌) అనంతరం లండన్‌ విడివిడిగా వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందా(ఎఫ్‌టీఏ)లను కుదుర్చుకొంటోంది. తదనుగుణంగా భారత్‌తోనూ ఎఫ్‌టీఏ కోసం తొలి దఫా చర్చలు పూర్తిచేసింది. ఎఫ్‌టీఏ కింద బ్రిటన్‌కు తన మత్స్య, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలను తేలిగ్గా ఎగుమతి చేసే అవకాశం ఉండాలని భారత్‌ కోరుతోంది. కార్మికులను అధికంగా వినియోగించే పరిశ్రమల ఉత్పత్తులకు సుంకాల్లో రాయితీ ఇవ్వాలని కోరింది. ఐరోపా సమాఖ్య నుంచి బయటికొచ్చిన తరవాత భారత్‌, ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య వృద్ధికి బ్రిటన్‌ కృషి చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాను భారతీయ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కొవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేయడం తెలిసిందే. బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ త్వరలోనే భారత్‌కు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపనున్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌టీఏ ఒప్పందం కుదుర్చుకొనే అంశం మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎఫ్‌టీఏ రోడ్‌ మ్యాప్‌ 2030లో అంతర్భాగమే.

 

పెరిగిన వీసా ధరఖాస్తులు

ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఏటా 2,400 కోట్ల పౌండ్ల వ్యాపారం జరుగుతోంది. దీన్ని 2030కల్లా రెట్టింపు చేయడానికి ఎఫ్‌టీఏ ప్రాతిపదికగా నిలుస్తుంది. 2050కల్లా ప్రపంచంలో అమెరికా, చైనాల తరవాత భారతదేశమే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనాలు వెలువడుతున్నందువల్ల భారత్‌తో వాణిజ్య వృద్ధికి బ్రిటన్‌ అత్యంత ఉత్సాహం ప్రదర్శిస్తోంది. బ్రెగ్జిట్‌ తరవాత రెండు దేశాల మధ్య ఏటా 3,000 మంది విద్యార్థుల, ప్రతిభావంతుల రాకపోకలను సులభతరం చేయనున్నారు. వారు ఎదుటి దేశంలో పనిపరంగా కొత్త అనుభవం గడించడానికి అనువైన వాతావరణం కల్పిస్తారు. నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా వంటి ఆర్థిక నేరస్థుల అప్పగింతకు తగిన విధివిధానాలను అనుసరించడానికి బ్రిటన్‌ సుముఖంగా ఉంది. బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించిన తరవాత భారతీయ విద్యార్థులకు అక్కడే పని చేసే అవకాశం కల్పించాలని లండన్‌ నిర్ణయించడంతో ఈ ఏడాది భారతీయ విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులు ఒక్కపెట్టున పెరిగిపోయాయి. 21వ శతాబ్దంలో అగ్రశ్రేణి ఆర్థిక, సైనిక శక్తిగా అవతరించాలని దృఢ సంకల్పంతో ముందుకువెళుతున్న భారతదేశానికి కీలక భాగస్వామిగా అవతరించాలని బ్రిటన్‌ ఆశిస్తోంది.

 

- వరప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

‣ ఉత్కంఠభరితం ఫ్రాన్స్‌ అధ్యక్ష సమరం

‣ నేత మారినా... కథ అదేనా?

‣ మానవ మనుగడకు గొడ్డలిపెట్టు

‣ షాంఘైలో ఆకలి మంటలు

‣ ఆర్థిక సంక్షోభంలో పాక్‌

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 18-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం