• facebook
  • whatsapp
  • telegram

పుడమికి రక్షణ తక్షణావసరం

అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం

 

 

పుడమి తల్లిని పరిరక్షించుకోవలసిన బాధ్యతను గుర్తు చేస్తూ అయిదు దశాబ్దాలకుపైగా ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ధరణి పచ్చని అడవులతో ఆరోగ్యంగా ఉంటేనే జీవరాశి మనుగడ, భవిష్యత్‌ సజావుగా సాగుతాయి. వ్యవస్థీకృత లోపాలకు తోడు మితిమీరిన అవసరాలతో సహజ వనరులపై ఒత్తిడి పెరిగిపోతోంది.  మానవాళితో సహా సమస్త జీవరాశి క్షేమం కోరే పుడమి తల్లి నిత్య క్షోభ అనుభవిస్తోంది. అడ్డూఅదుపు లేకుండా అడవుల కోత, సున్నితమైన తీర వ్యవస్థల ధ్వంసం, సహజ నిక్షేపాల విచ్చలవిడి వెలికితీత మూలంగా భూమిపై పర్యావరణ సమతౌల్యం తీవ్రంగా దెబ్బతింటోంది. మానవాళి వివిధ రోగాలను ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవస్థలు రక్షణ కవచంగా నిలుస్తాయి. నేలపై విశిష్టమైన జీవ వైవిధ్యం- వ్యాధికారక క్రిములు వేగంగా వ్యాప్తి చెందకుండా నిలువరిస్తుంది. నేడు పది లక్షలకు పైగా జంతు, వృక్ష జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయంటే జీవవైవిధ్యానికి ఏ మేరకు చేటు దాపురించిందో అర్థం చేసుకోవచ్చు. విరుచుకు పడుతున్న భూకంపాలు, వరదలు, సునామీలు, కరవు, వర్షాభావ పరిస్థితులు, తీర ప్రాంతాల కోత వంటి విపత్తులతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముప్పు పొంచి ఉన్నా వ్యవస్థల్లో తగిన రీతిలో చలనం కనిపించడం లేదు.  

 

ప్రకృతి వ్యవస్థల విధ్వంసం  

ఇతర పర్యావరణ వ్యవస్థలతో పోలిస్తే అడవులు భూగోళంపై జీవవైవిధ్య మనుగడ రక్షణలో అత్యంత ప్రభావశీలమైన పాత్ర పోషిస్తున్నాయి. అంతటి విశిష్టత కలిగిన అటవీ వనాలను కాపాడుకోవడంలో మాత్రం ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ప్రపంచ ఆహార సంస్థ నివేదికల ప్రకారం వ్యవసాయం కోసం వనాలను పంట భూములుగా మార్చడం, నగరాల విస్తరణ, మౌలిక సదుపాయాలు, ఖనిజ తవ్వకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు అడవులపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. గడచిన మూడు దశాబ్దాల కాలంలో పెద్దయెత్తున అడవుల్ని కోల్పోయాం. 2030 నాటికి, ప్రపంచంలోని వర్షారణ్యాల్లో కేవలం పది శాతమే మిగిలి ఉండవచ్చనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రత పుడమిని ప్రమాదంలోకి నెడుతోంది. ప్రపంచ దేశాలు తమ విధానాల ద్వారా నిర్దుష్టమైన పరిమితులను అమలు చేసి భూతాపం తగ్గించడం ద్వారా భూగోళ పరిరక్షణకు నడుం కట్టాలని రెండు దశాబ్దాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఈ చర్చల ఫలితంగా ప్యారిస్‌ వేదికగా కుదిరిన చారిత్రక ఒప్పందం కూడా కార్యాచరణలో విఫలం కావడం విచారకరం. సామాజిక, ఆర్థిక, భౌగోళిక తారతమ్యాలు లేకుండా భూతాపాన్ని నిలువరించేందుకు పటిష్ఠ కార్యాచరణ అమలు చేయాలనే ఉద్దేశంతో ఆ ఒప్పందం కుదిరింది. భూతాపాన్ని తగ్గించడం, కర్బన ఉద్గారాల నియంత్రణలో పేద, అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థిక చేయూత అందించడం అందులోని కీలకాంశాలు. అయితే, కాప్‌-26 సదస్సులో కూడా ప్యారిస్‌ ఒప్పందం అమలుకుగాను నిర్దుష్టమైన కార్యాచరణకు దిగకపోవడం విచారకరం. భూతాపం తగ్గించడంతో పాటు పర్యావరణ వ్యవస్థలు, అడవుల పరిరక్షణ, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ వంటి విషయాల్లో అంతర్జాతీయ స్థాయి వేదికలపై భారత్‌ అభివృద్ధి చెందిన దేశాలతో గట్టిగా వాదిస్తోంది. క్షేత్ర స్థాయిలోకి వచ్చేసరికి దేశంలో వివిధ పర్యావరణ చట్టాలు, విధానాల అమలులో మాత్రం అభివృద్ధి చెందిన దేశాల ప్రమాణాలను సైతం పాటించలేకపోతోంది.

 

కనిపించని చిత్తశుద్ధి

పర్యావరణ న్యాయాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో జాతీయ హరిత ట్రైబ్యునళ్ల చట్టం అమలులోకి వచ్చి దశాబ్దం దాటింది. అటవీ, పర్యావరణ, కాలుష్య సంబంధిత వివాదాలను విచారించడానికి దేశవ్యాప్తంగా ఆరు ధర్మాసనాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. కనీసం రాష్ట్రానికి ఒక ధర్మాసనమైనా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది. ఎడాపెడా అటవీ భూముల్లో ప్రాజెక్టులకు అనుమతిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ అడవుల పెంపకంపై శ్రద్ధ పెట్టడంలేదు. భోపాల్‌ ఉదంతం తరవాత అంతటి భయానక పరిస్థితిని విశాఖలో ఎల్జీ పాలిమర్‌ గ్యాస్‌ దుర్ఘటన కలిగించింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీలు- పరిశ్రమలు కాలుష్య నియంత్రణ, నిబంధనలు పాటించడంలో జవాబుదారీతనాన్ని పెంచే విషయంలో తీసుకోవాల్సిన అంశాలపై ఎన్నో కీలక సిఫార్సులు చేశాయి. వాటిని సమీక్షించి అత్యవసరంగా విధానపరంగా మార్పులు తీసుకురావాలనే ఆసక్తి కనిపించకపోవడం విచారకరం. వనాల పరిరక్షణ, పెంపకం, తీరప్రాంతాల పరిరక్షణ, వాతావరణ మార్పులపై క్రమబద్ధంగా చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడింది. వాతావరణ మార్పులు, తీరప్రాంతం, చిత్తడి నేలల పరిరక్షణ వంటి సున్నితమైన పర్యావరణ అంశాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు రాష్ట్రాల స్థాయుల్లో ప్రత్యేక విభాగాలు లేవు. వాటన్నింటినీ అటవీ యంత్రాంగమే పర్యవేక్షిస్తుంది. దైనందిన జీవితంలో నీరు, విద్యుత్‌, ఇంధనం వంటి వనరుల వినియోగం, ప్లాస్టిక్‌ వాడకంలో నియంత్రణ వంటి అంశాల్లో పౌరసమాజం జాగ్రత్తగా నడుచుకునేలా ప్రభుత్వం అవగాహన కలిగించాలి. పర్యావరణ పరిరక్షణలో కీలకమైన చిత్తడి నేలలు, తీరప్రాంతాలు, అటవీ భూములు వంటి వనరుల కేటాయింపులో ప్రభుత్వ వ్యవస్థలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ప్రజల ఉమ్మడి ఆస్తిగా ఉన్న సహజ వనరుల కేటాయింపులో అక్రమాలు, అవినీతి, అత్యాశలకు తావివ్వకుండా వ్యవహరిస్తేనే- ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. రేపటి తరాలకు మెరుగైన భవితను అందించాలంటే, ప్రభుత్వ వ్యవస్థలతో పాటు పౌర సమాజమూ ప్రకృతి వ్యవస్థలను విధ్వంసం నుంచి కాపాడటంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

 

వణికిస్తున్న ప్లాస్టిక్‌ భూతం

మితిమీరిన ప్లాస్టిక్‌ వినియోగం ప్రకృతి వ్యవస్థలను దారుణంగా దెబ్బతీస్తోంది. ప్రజల జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన పెనుమార్పులవల్ల ప్లాస్టిక్‌ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. 1950-1970 మధ్య కాలంలో తక్కువ మొత్తంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి, వినియోగం ఉండేది. ఫలితంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ సులువుగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏటా వందల కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతోంది. నదులు, సరస్సుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయి సముద్ర కాలుష్యానికి దారితీస్తోంది. ప్రస్తుత ప్లాస్టిక్‌ ఉత్పత్తి, వినియోగం, రీసైక్లింగ్‌ విధానాల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రస్థాయిలో ఇలాంటి వ్యర్థాలు సముద్రాల్లో పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలతో చేపలు, ఇతర సముద్ర జీవుల మనుగడ ప్రమాదంలో పడటంతోపాటు మానవాళి ఆరోగ్యంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం ప్రసరిస్తుంది.

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భేదాలు కట్టిపెట్టి... గట్టిమేలు తలపెట్టి

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధం!

‣ జల సంరక్షణకు జన భాగస్వామ్యం

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 22-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం