• facebook
  • whatsapp
  • telegram

సరిహద్దుల్లో సం‘గ్రామాలు’

దురాక్రమణపర్వంలో చైనా కుయుక్తులు

భారత సరిహద్దు వెంబడి మౌలిక వసతులను చైనా జోరుగా విస్తరిస్తోంది. ప్యాంగ్యాంగ్‌ సరస్సు వద్ద అక్రమంగా చేపట్టిన వంతెన నిర్మాణం ముగింపు దశకు వచ్చింది. లద్దాఖ్‌ సరిహద్దులో చైనా వైపు 400 మీటర్ల పొడవు, ఎనిమిది మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ వంతెన- చుషుల్‌ ప్రాంతంలోని భారతీయ సైనిక స్థావరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. వంతెనకు తోడు ఇటీవల లద్దాఖ్‌ సమీపంలోని హాట్‌స్ప్రింగ్స్‌ వద్ద చైనా కొత్తగా మూడు మొబైల్‌ ఫోన్‌ టవర్లను నెలకొల్పింది. 2020లో భారత్‌, చైనా సేనలు పరస్పరం తలపడిన లద్దాఖ్‌ ప్రాంతంలో సెల్‌ టవర్లను బీజింగ్‌ స్థాపించడం వెనక ఉద్దేశమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. చైనా ఈ ప్రాంతంలో అదనపు సైనిక దళాలను మోహరించదలచిందా, లేక కొత్త జనావాసాలను ఏర్పాటు చేయదలచిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

భారత్‌పై నిఘా

చైనా సెల్‌ టవర్ల గురించి లద్దాఖ్‌ స్వయంపాలిత పర్వత మండలిలో చుషుల్‌ నియోజకవర్గ ప్రతినిధి అయిన కొంచోక్‌ స్టాన్జిన్‌ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తన నియోజకవర్గంలోని 12 గ్రామాల్లో కేవలం ఒకదానిలోనే 4జీ సేవలు లభ్యమవుతున్నాయని, మిగిలిన వాటిలో 2జీ సేవలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. చైనా ఏకంగా 4జీ సెల్‌ టవర్లను ఏర్పాటుచేసి అధునాతన మొబైల్‌ సేవలను అందుబాటులోకి తెస్తోందని స్టాన్జిన్‌ చెప్పారు. చైనా తన సరిహద్దుల్లో కొత్త జనావాసాలను నెలకొల్పి వాటికి రహదారులు, వంతెనలు, ఇంటర్నెట్‌, మొబైల్‌ నెట్‌వర్కులను వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా నెలకొల్పిన మొబైల్‌ టవర్లు భారతదేశంపై నిఘావేయడానికి తోడ్పడతాయని స్టాన్జిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

షియావోకాంగ్‌ (స్వయం సమృద్ధ పల్లెల) పథకం కింద 2021 చివరికల్లా సరిహద్దుల్లో 628 గ్రామాలను నిర్మించాలని 2017 చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో దేశాధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ పిలుపిచ్చారు. తదనుగుణంగా టిబెట్‌ దగ్గర నుంచి తూర్పు లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, భూటాన్‌లదాకా సరిహద్దు వెంబడి కొత్త గ్రామాల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇవి ఆదర్శ గ్రామాలు మాత్రమే కావు, రక్షణ దుర్గాలు కూడా. ఇక్కడ ప్రధానంగా చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, విధేయులు నివసిస్తారు. పొరుగు దేశాల భూభాగాల్లోకి మొదట రైతులు, పశువుల కాపరులను పంపి, తరవాత ఆ ప్రాంతాలు తమవేనంటూ జెండా పాతడం- చైనా విధానం. షియావోకాంగ్‌ గ్రామస్థులు భారత్‌ మీద కళ్లూచెవులూ వేసి చైనా సైన్యానికి వర్తమానం అందిస్తూ ఉంటారు. ఈ సరిహద్దు గ్రామాల్లో రోడ్లు, విద్యుత్‌, తాగు నీరు, ఇంటర్నెట్‌, విద్య, వైద్య వసతులను కల్పించారు. రేపు చైనా సైన్యం భారతదేశంతో పోరుకు దిగదలచుకుంటే ఆ సదుపాయాలు అక్కరకొస్తాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, లద్దాఖ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారతీయ గ్రామాలు దిగాలుగా కనిపిస్తుంటే, సరిహద్దుకు ఆవల చైనా గ్రామాలు అధునాతన సదుపాయాలతో కళకళలాడుతున్నాయి. లద్దాఖ్‌, అరుణాచల్‌ వంటి సరిహద్దు ప్రాంతాల్లో జన సంఖ్య బాగా తక్కువ. అందువల్ల అక్కడ మొబైల్‌ సేవల విస్తరణ గిట్టుబాటు కాదని ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్లు భావిస్తారు. ప్రభుత్వ విభాగాలూ అదే కారణంతో నెట్‌, మొబైల్‌ సేవల విస్తరణకు ముందుకు రావడంలేదు. దీనికి భవిష్యత్తులో సైనిక పరంగా పెద్ద మూల్యం చెల్లించుకోవలసి రావచ్చు.

మౌలిక వసతుల లేమి

సరిహద్దుల్లో టెలికాం, మౌలిక వసతుల విస్తరణ లాభ నష్టాలకు అతీతంగా సాగాలి. దేశ రక్షణకు ఇది అనివార్యమైన వ్యయమని గుర్తించాలి. చైనా సరిహద్దులో ఇప్పటికీ భారీగా సేనల మోహరింపు కొనసాగుతున్నందువల్ల ప్రభుత్వం వెంటనే మేలుకోవాలన్న డిమాండ్లు అధికమవుతున్నాయి. గల్వాన్‌ సంఘర్షణల తరవాత చైనా సరిహద్దు వెంబడి 32 కొత్త రహదారులను మంజూరు చేశామని, వాటిలో ఎనిమిది రోడ్ల పనులు మొదలయ్యాయని గత నెలలో రాజ్యసభకు సమర్పించిన నివేదికలో కేంద్ర హోం శాఖ తెలిపింది. రోడ్లకు తోడు మరో 32 హెలీప్యాడ్‌ల నిర్మాణమూ చేపట్టామని వెల్లడించింది. చైనా ఏర్పాటుచేసిన షియావోకాంగ్‌ గ్రామాలకు దీటుగా అయిదు సరిహద్దు రాష్ట్రాల్లో చైతన్యశీల గ్రామాలను నిర్మిస్తామని 2022-23 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. మరోవైపు మౌలిక వసతులు లేవని భారతీయ సరిహద్దు గ్రామాలను జనం ఖాళీ చేస్తున్నారు. రవాణా, కమ్యూనికేషన్‌ సదుపాయాలను అందించి ప్రజలు అక్కడే కొనసాగేలా చూడటం చైతన్యశీల గ్రామాల పథకం లక్ష్యం. దానివల్ల చైనా కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచడానికి వీలవుతుంది.

- కైజర్‌ అడపా
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కశ్మీరంలో ప్రగతి సమీరం

‣ పుడమికి రక్షణ తక్షణావసరం

‣ భేదాలు కట్టిపెట్టి... గట్టిమేలు తలపెట్టి

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధం!

‣ జల సంరక్షణకు జన భాగస్వామ్యం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 24-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం