• facebook
  • whatsapp
  • telegram

పాక్‌ స్నేహ పల్లవి

సైన్యం కనుసన్నల్లోనే సమస్తం

దాయాది దేశం పాకిస్థాన్‌లో షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా నూతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో ఉభయదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రధానిగా షరీఫ్‌ బాధ్యతలు చేపట్టిన సమయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ఆయన్ను అభినందిస్తూ లేఖ రాశారు. మూడేళ్లుగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో మోదీ లేఖవల్ల ఉభయదేశాల మధ్య సంబంధాలు తిరిగి గాడిన పడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పాక్‌తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా ఉపఖండంలో శాంతి, సుస్థిరత నెలకొంటాయని మోదీ చెబుతున్నారు. మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ షెహబాజ్‌ రాసిన ప్రత్యుత్తరంలో ఉభయదేశాలు పేదరికం, నిరుద్యోగంపై సంయుక్తంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, పాక్‌ నేతల ప్రకటనకు, చేతలకు ఎలాంటి పొంతనా ఉండదు.

గతంలో ఇమ్రాన్‌ఖాన్‌ అధికారంలోకి వచ్చిన తరవాత ఇరుదేశాల మధ్య సంబంధాలకు భారత్‌ ఒక అడుగు ముందుకేస్తే పాక్‌ మూడు అడుగులు ముందుకు వేస్తుందన్నారు. దానికి భిన్నంగా పుల్వామా ఉగ్రదాడి జరిగింది. కశ్మీర్‌లో 370 అధికరణ రద్దుకు వ్యతిరేకంగా పాక్‌ ప్రకటనలు చేసింది. పలు అంతర్జాతీయ వేదికలపై ఆ అంశాన్ని లేవనెత్తింది. దాంతో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాస్తవానికి పాక్‌లో అధికార పగ్గాలు ఎవరు చేపట్టినా సైన్యం కనుసన్నల్లో మెలగాల్సిందే. షెహబాజ్‌ తన లేఖలో కశ్మీర్‌ సమస్యను సైతం పేర్కొనడం పాక్‌ అసలు పన్నాగాలను వెల్లడిస్తోంది. పాక్‌ పాలకులు భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకన్నా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకే యత్నిస్తుంటారు. పాక్‌ విదేశాంగ విధానాలు అక్కడి సైన్యం అభీష్టం మేరకే రూపొందుతాయి. గతంలోనూ ఎన్నోసార్లు ఉభయదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం కోసం యత్నించినా, పాక్‌ సైనిక నాయకత్వం కారణంగా ఆ యత్నాలు నిలిచిపోయాయి.

పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జాతీయ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షెహబాజ్‌ భారత్‌తో ప్రస్తుతమున్న యథాతథ స్థితిని కొనసాగించేందుకు మొగ్గుచూపవచ్చు. ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలతో పాక్‌ ప్రస్తుతం సతమతమవుతోంది. మరోవైపు విరుద్ధ భావాలు కలిగిన రాజకీయపక్షాలతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై పలు సందేహాలు నెలకొన్నాయి. షెహబాజ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (నవాజ్‌ షరీఫ్‌), బిలావల్‌ భుట్టో సారథ్యంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ సుదీర్ఘకాలం నుంచి రాజకీయంగా భిన్న ధ్రువాలు. వారి మధ్య పొత్తు ఎన్నాళ్లు ఉంటుందన్నదానిపై రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్‌ రాజకీయాల్లో పంజాబ్‌, సింధ్‌ రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తాయి. ముస్లింలీగ్‌ పంజాబ్‌లో బలంగా ఉంది. సింధ్‌లో పీపీపీ ప్రధాన పక్షం. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పక్షాలతో పాటు సంకీర్ణంలో ఉన్న పార్టీలు వేర్వేరుగా పోటీచేసే అవకాశముంది. దాంతో ఎన్నికల్లోపు ఉన్న కాలాన్ని పూర్తిగా గెలుపు కోసం వినియోగించుకునేందుకు షరీఫ్‌ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపరంగా పాక్‌ నాయకత్వానికి పరిమితమైన స్వేచ్ఛే ఉందన్నది కాదనలేని సత్యం. గతంలోనూ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో లాహోర్‌కు బస్సుయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో ఇరు దేశాల ప్రధానులు వాజ్‌పేయీ- నవాజ్‌ షరీఫ్‌లు లాహోర్‌ డిక్లరేషన్‌ పేరిట ప్రకటన చేశారు. 1999లో కుదిరిన ఆ ఒప్పందంలో ద్వైపాక్షిక సంబంధాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొద్ది నెలలకే మన దేశంలోని కార్గిల్‌ ప్రాంతాల్లో పాక్‌ సైనికులు, చొరబాటుదారులు తిష్ఠవేశారు. తరవాత జరిగిన కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ ఘోర పరాజయం పాలైంది. ఇరు దేశాల సయోధ్యకు ఎన్ని యత్నాలు జరిగినా పాక్‌సైన్యం, దాయాది దేశం పెంచి పోషించే ఉగ్రవాద మూకలు గండి కొడుతూనే ఉన్నాయి. 2015లో ప్రధాని మోదీ ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా లాహోర్‌కు చేరుకొని అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో చర్చలు జరిపారు. తరవాత కొద్ది నెలలకే పఠాన్‌కోట్‌, ఉరీ ప్రాంతాలపై పాక్‌ ప్రాయోజిత ఉగ్రదాడులు జరిగాయి. సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అందుకు భిన్నంగా కశ్మీర్‌ అంశాన్ని పాక్‌ అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తోంది. పాక్‌ కుట్రలను దృష్టిలో పెట్టుకొని ద్వైపాక్షిక సంబంధాల అంశంలో భారత్‌ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరముంది.

- కొలకలూరి శ్రీధర్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ

‣ సరిహద్దుల్లో సం‘గ్రామాలు’

‣ క్షేత్ర పాలన... ప్రజాస్వామ్యానికి ఆలంబన!

‣ కశ్మీరంలో ప్రగతి సమీరం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 30-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని