• facebook
  • whatsapp
  • telegram

క్షేత్ర పాలన... ప్రజాస్వామ్యానికి ఆలంబన!

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం

 

 

స్వతంత్ర భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి పెద్ద వైఫల్యం స్థానిక ప్రభుత్వాలను బలంగా ఏర్పాటు చేయకపోవడం! ప్రభుత్వ సేవల్లో అతి పెద్ద వైఫల్యం మంచి ప్రమాణాల పాఠశాల విద్యను ప్రతి బిడ్డకూ అందించకపోవడం!! ఈ రెండూ వేర్వేరు అంశాల్లా అనిపించవచ్చు. రెండింటి మధ్యా సంబంధం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1970 దశకం తొలినాళ్లదాకా స్థానికంగా నాణ్యమైన పాఠశాల విద్య అందడం చాలావరకు స్థానిక ప్రభుత్వాల నాయకుల చొరవ వల్లే సాధ్యమైంది. అప్పట్లో స్కూళ్లకు భవనాలు, మరుగుదొడ్లు లేవు. ఉపాధ్యాయులూ అరకొరే. వారికి జీతాలూ తక్కువే. అయినా, స్థానిక ప్రభుత్వాలు, సమాజం భాగస్వామ్యంతో సామాన్య కుటుంబాల్లోని లక్షల మంది పిల్లలు మంచి విద్యను పొంది వివిధ రంగాల్లో అపార సేవలు అందించారు. విద్యాసంస్థల్ని కేంద్రీకరించిన తరవాత స్థానిక ప్రభుత్వాల పాత్ర నామమాత్రమైపోయింది. ఫలితంగా దేశంలో వేల కోట్ల రూపాయల్ని అదనంగా పాఠశాల విద్యకోసం ఖర్చు పెడుతున్నా నూటికి 80 మంది పిల్లల ప్రతిభ వికసించడం లేదు. అధికార కేంద్రీకరణ, విద్యారంగ వైఫల్యం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. స్థానిక ప్రభుత్వాలు కేవలం ప్రజాస్వామ్య సౌధాలు మాత్రమే కాదు, ఈ దేశంలో సామాన్యుడికి అవకాశాలు, ప్రభుత్వ సేవలు సక్రమంగా అందడానికి అవి కీలకమైనవి.

 

తగ్గని పేదరికం

భారత్‌లో అధికారమంతా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌- ఈ ముగ్గురి చేతుల్లోనే 90శాతం దాకా కేంద్రీకరించారు. రాజ్యాంగ నిర్మాణంలో జరిగిన పొరపాటువల్ల- యూనియన్‌ ప్రభుత్వం, రాష్ట్రాలు ఏర్పడి ఎన్నికలు జరుగుతున్నా, స్థానిక ప్రభుత్వాలకు సరైన ప్రాధాన్యమే లేకుండా పోయింది. స్వాతంత్య్రం వచ్చాక 12 ఏళ్లకు కొన్ని రాష్ట్రాల్లో చట్టాల ద్వారా స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. మంచి ప్రమాణాల నాయకత్వం వాటిద్వారా ఎదిగి అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఆనాడు ఒక సమితి ప్రెసిడెంట్‌ పదవి ఎమ్మెల్యే కంటే ప్రతిష్ఠాత్మకమైంది. జడ్పీ అధ్యక్షులు మంత్రుల కంటే బలమైనవాళ్లు. 1970 దశకంలో దేశమంతా అధికార కేంద్రీకరణతో అన్నిచోట్లా స్థానిక ప్రభుత్వాలు బలహీనపడ్డాయి. అనంతర కాలంలో స్థానిక శాసన సభ్యులు, ఉన్నతాధికారులు స్థానిక ప్రభుత్వాలను తమకు పోటీగా భావించి అవి బలపడకుండా అడ్డుకుంటున్నారు. చాలా ఆర్భాటంగా 1990 దశకంలో 73, 74 రాజ్యాంగ సవరణలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇందుకు మొదటి కారణం- స్థానిక ప్రభుత్వాల నిర్మాణాన్ని స్థానిక పరిస్థితులను బట్టి మార్పులకు అవకాశం లేకుండా ఒక మూసలో ఏర్పాటు చేయడం. రెండోది, వాటికి స్పష్టమైన అధికారాల్ని నిర్వచించలేకపోవడం. ఫలితంగా అవి పూర్తిగా ఉత్సవ విగ్రహాలుగా నీరుగారిపోయాయి.

 

స్థానిక ప్రభుత్వాలకు ప్రజలకు సరైన సేవలందించే అధికారమూ లేదు. అందుకు తగ్గ వనరులూ కొరవడ్డాయి. దాంతో మంచినీటి ఏర్పాటు, మురుగు, వరదనీటి పారుదల, రోడ్ల నిర్మాణం, దోమల నివారణ వంటివన్నీ అస్తవ్యస్తమైపోయాయి. కేంద్రీకరించిన పాలనలో మనం కట్టే పన్ను డబ్బులకు, వాటితో మనకందాల్సిన సేవలకు మధ్య ఏ సంబంధమూ లేకుండా పోయింది. దాంతో ఎన్నికలు ఒక కోలాహలంగా, కొందరు పెద్దల మధ్య అధికార క్రీడగా, ధన ప్రవాహంగా మారిపోయాయి. పైగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం నేతలు- పేదరికాన్ని నిర్మూలించడం, ప్రజల ఆదాయాల్ని పెంచడం వంటి వాటికి తిలోదకాలిచ్చి తాత్కాలిక తాయిలాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఉచిత హామీలతో ప్రజల డబ్బును ప్రజలకే పంచి దానకర్ణుల్లా కీర్తి పొందుతున్నారు. పుట్టుకతో సంబంధం లేకుండా మంచి ప్రమాణాల విద్య, వైద్యం, నైపుణ్యాలు, ఆర్థికాభివృద్ధి, ఉత్పాదక కార్యక్రమాల్లో పెట్టుబడులు, ఉపాధి కల్పన, దాన్నుంచి వచ్చే ఆదాయం- ఇవే పేదరికాన్ని తొలగించడానికి మార్గం. కేంద్రీకృత పాలనలో ఈ దీర్ఘకాలిక దృక్పథం కొరవడింది.

 

 

భారత్‌ తీసికట్టు

మన ప్రజాస్వామ్యం నిజంగా పటిష్ఠం కావాలంటే, స్వపరిపాలన ఫలితాలు ప్రజలకు అందాలంటే- బలమైన, స్పష్టమైన అధికారాలు, బాధ్యతలతో కూడిన, వనరులున్న, జవాబుదారీతనమున్న స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి. ప్రజాస్వామ్య సంప్రదాయంలో బలహీనంగా ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలోనూ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉన్నాయి. నియంతృత్వం రాజ్యమేలుతున్న చైనాతోపాటు, ప్రపంచంలో ప్రతి ప్రజాస్వామ్య దేశంలో స్థానిక ప్రభుత్వాలు భారత్‌కంటే దృఢమైనవి. చట్టబద్ధ పాలన, ప్రజల సాధికారత, జనావళికి జవాబుదారీగా ఉన్న సమర్థమైన స్థానిక ప్రభుత్వాలు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా వేగంగా స్పందించి పొరపాట్లను సవరించే ఏర్పాట్లు- ఇవన్నీ ఉంటేనే అది నిజమైన ప్రజాస్వామ్యం. మన రాజ్యాంగ నిర్మాతలు అపారమైన ఆత్మవిశ్వాసంతో, ఆశావాదంతో మన ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పారు. స్థానిక ప్రభుత్వాలు మూడో అంచెలో బలహీనంగా ఉండటంతో ఫలితాలు పరిమితం అయ్యాయి. ఇప్పటికైనా గతానుభవాలు, ప్రపంచ పరిస్థితులనుంచి పాఠాలు నేర్చుకోవాలి.  పటిష్ఠమైన స్థానిక ప్రభుత్వాల ద్వారా నిజమైన, అర్థవంతమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటుచేయడం మన పిల్లల భవిష్యత్తుకు అత్యవసరం.

 

నాణ్యమైన పౌరసేవలు

చిన్న పట్టణాల్లో మంచినీరు, మురుగు నీటి పారుదల, 24 గంటల విద్యుత్తు, మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్య వసతులు కల్పిస్తే పెద్ద నగరాలకు వలసలు తగ్గుతాయి. తద్వారా సొంత ఊళ్లో వ్యవసాయం చేసుకుంటూ, పట్టణాల్లో నివాసముంటూ వృత్తినో వ్యాపారాన్నో చేపట్టవచ్చు. కాలక్రమేణా సహజమైన పట్టణీకరణ జరిగి ఆర్థికాభివృద్ధి ఫలితాలు గ్రామీణ ప్రాంతాలకూ అందుతాయి. మరోవైపు మహానగరాల అవసరాలు, సమస్యలు ప్రత్యేకమైనవి. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు నగరాల ప్రాధాన్యం దృష్ట్యా నగర ప్రభుత్వాల నిర్మాణానికి, ప్రపంచ ప్రమాణాలతో ప్రత్యేకమైన ఏర్పాట్లుండాలి. వీటన్నింటితోపాటు స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ప్రతి జిల్లాకు, నగరానికి బలమైన, స్వతంత్ర ఆంబుడ్స్‌మన్‌ వ్యవస్థను, ప్రజలకు విధిగా సకాలంలో సేవలు అందించేందుకు పటిష్ఠ సిటిజన్స్‌ చార్టర్లను (పౌర సేవల పత్రాల్ని) అమలు చేయాలి.

 

అవసరాలకు అనుగుణంగా...

ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్పు రావాలంటే 11, 12 షెడ్యూళ్లలో నిర్వచించిన బాధ్యతల్ని కేవలం సూచనలుగా కాకుండా విధిగా స్థానిక ప్రభుత్వాలు చేపట్టేలా రాజ్యాంగంలో స్పష్టమైన ఏర్పాట్లు చేయాలి. అంటే ఏడో షెడ్యూల్‌లో స్పష్టంగా రాష్ట్రాలకు అధికారాల్ని, బాధ్యతల్ని పంపిణీ చేసినట్లుగా- స్థానిక ప్రభుత్వాలకూ స్పష్టమైన అధికారాలు, బాధ్యతలు దఖలుపడాలి. ఆయా రాష్ట్రాల అనుభవాలు, అవసరాలను బట్టి స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అధికారం ఉండాలి. వనరుల పంపిణీకి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలి. రాజ్యాంగంలో రాష్ట్ర ఆర్థిక సంఘాల ఏర్పాట్లు జరిగినా, దాదాపు అన్నిచోట్లా అవి పేలవంగా, నిరర్థకంగా ఉన్నాయి. ఇప్పటిదాకా 15 జాతీయ ఆర్థిక సంఘాలు ఏర్పాటయ్యాయి. వాటిద్వారా యూనియన్‌, రాష్ట్రాల వనరుల పంపిణీ చాలా పటిష్ఠంగా, నిష్పాక్షిక పద్ధతిలో సాగుతోంది. స్థానిక ప్రభుత్వాల వనరుల విషయంలోనూ అలాంటి బలమైన ఏర్పాట్లు చేయాలి. కేరళలో సుమారు 3.5 కోట్ల జనాభా ఉన్నా, దాదాపు 900 పంచాయతీలే ఉన్నాయి. ఇరవై అయిదు వేల నుంచి ముప్ఫై వేల జనాభాతో కొన్ని గ్రామాల్ని కలిపి ఒక పంచాయతీగా ఏర్పాటు చేస్తే ఉమ్మడి సేవల కల్పన, కార్యాలయాల నిర్మాణం, కంప్యూటరీకరణ, రికార్డుల నిర్వహణ వంటివి సులభమవుతాయి. ప్రజాస్వామ్యంలో, ఎన్నికల్లో కులం, ఫ్యూడల్‌ శక్తుల ప్రభావాలూ బలహీనపడతాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కడలిపై పట్టుకు వ్యూహం

‣ పటిష్ఠ వాణిజ్య బంధంపై అనురక్తి

‣ సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

‣ ఉత్కంఠభరితం ఫ్రాన్స్‌ అధ్యక్ష సమరం

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 24-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం