• facebook
  • whatsapp
  • telegram

సమష్టి కృషితోనే పేదరికం నుంచి బయటకు

కొవిడ్‌తో కుదేలైన జీవితాలు

ఇండియాలో 2011తో పోలిస్తే 2019 నాటికి కడు పేదరికం 12.3శాతం తగ్గిందని ప్రపంచబ్యాంకు నివేదిక చెబుతోంది. 2021లో కొవిడ్‌ కారణంగా ప్రపంచంలో 7.7 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలోకి వెళ్ళిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది. ఈ రెండింటినీ చూస్తే భారత్‌లో పేదరికం తగ్గిందా, లేక పెరిగిందా అనే అనుమానం కలుగుతుంది. ప్రపంచ బ్యాంకు ఇండియా గురించే చెప్పింది. ఐక్యరాజ్య సమితి యావత్‌ ప్రపంచంపై దృష్టి సారించింది. నిజానికి కొవిడ్‌ మహమ్మారి కోరలు చాచడానికి ముందు దశాబ్ద కాలంలో భారత్‌ ఎంతోకొంత పురోగతిని సాధించింది. విద్యావకాశాలు పెరగడం, వాటివల్ల ఉపాధి లభించడం, తద్వారా అనేక కుటుంబాలు పేదరికం నుంచి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల్లోకి వెళ్ళడం లాంటి పరిస్థితులు కనిపించాయి. వాటిపై ప్రపంచ బ్యాంకు ఓ నివేదిక విడుదల చేసింది. 2011 నాటికి భారత్‌లో దాదాపు 22.5శాతం పేదలు ఉండగా, 2019కల్లా వారు   10.2శాతానికి తగ్గినట్లు చెప్పింది. పల్లెల్లో పేదరికం 14.7శాతం, పట్టణాల్లో 7.9శాతం చొప్పున తగ్గింది. రోజుకు దాదాపు రూ.145 కంటే తక్కువ ఆదాయంతో జీవించేవారిని పేదలుగా పరిగణిస్తారు. ఇండియాలో పేదరికం కొంత తగ్గిన మాట నిజమే. కానీ, అది  అంతకుముందు అనుకున్నంతగా తగ్గలేదని, కొవిడ్‌కు ముందూ కొంత ఆర్థిక మందగమనం ఉండటమే అందుకు కారణమని      నివేదికను రూపొందించిన ఆర్థికవేత్తలు విశ్లేషించారు.

తీవ్ర నష్టం

ఇండియాలో తీవ్రమైన పేదరికం 2019లో కేవలం 0.8శాతమేనని ఐఎంఎఫ్‌ వెల్లడించింది. 2020లో కొవిడ్‌ కోరలు చాచినా, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన లాంటి పథకాలతో పేదరికం చాలావరకు అదుపులోనే ఉంది. ప్రైవేటు వినియోగ వ్యయం వృద్ధి చెందినట్లు గణాంకాల్లో తెలుస్తోంది. దాన్నిబట్టే ప్రపంచబ్యాంకు పేదరికంపై అంచనాలు రూపొందించింది. వినియోగ తీరులో అసమానతలు 2011 తరవాత గణనీయంగా తగ్గాయి. చిన్న కమతాలు ఉన్న రైతుల ఆదాయమూ బాగా వృద్ధి చెందింది. ముఖ్యంగా 2013-19 మధ్య కాలంలో చిన్న రైతుల వార్షికాదాయం 10శాతం పెరిగింది. ఫలితంగా పల్లెల్లో పేదలు చాలావరకు తగ్గినట్లయింది. అయితే, ఇప్పటికీ ఉనికి చాటుకుంటూనే ఉన్న కొవిడ్‌- అన్ని దేశాలతో పాటు భారత్‌నూ తీవ్రంగానే ప్రభావితం చేసింది. ముఖ్యంగా చిరువ్యాపారులు, రైతులు, రోజువారీ కూలీలు, కర్మాగారాల్లో పనిచేసేవారు దానివల్ల బాగా దెబ్బతిన్నారు. వరస లాక్‌డౌన్ల వల్ల వారి ఉపాధి అవకాశాలకు గండిపడింది. రైతులు తాము పండించిన ఉత్పత్తులను అమ్ముకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. పండ్లతోటలపై ఆధారపడినవారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. అవి నిల్వ ఉండే కాలం తక్కువ కావడం, త్వరగా విక్రయిద్దామనుకుంటే, బయట ఆంక్షల కారణంగా రైతులు అల్లాడిపోయారు. ఏ రోజుకారోజు భుక్తి సంపాదించుకునే భవన నిర్మాణ కార్మికుల జీవితాలను 2020 మార్చి 25న విధించిన తొలి లాక్‌డౌన్‌ దారుణంగా దెబ్బతీసింది. అప్పటికి కొవిడ్‌పై ఉన్న తీవ్ర భయాలవల్ల లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలుచేయాల్సి వచ్చింది. అదే సమయంలో వలస కార్మికులు సొంత ఊళ్లకు కాలినడకన వందల కిలోమీటర్లు వెళ్ళిపోవడం అందరి మనసులను బరువెక్కించింది. నాటి పరిస్థితులు ఆ తరవాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంత తీవ్రమైన ప్రభావాలను చూపించాయో ఐక్యరాజ్యసమితి నివేదికలో స్పష్టమవుతాయి.

పెరగాల్సిన వ్యయం

ప్రపంచవ్యాప్తంగా 2021లోనే 7.7కోట్ల మంది ప్రజలు తీవ్రమైన పేదరికంలోకి వెళ్ళిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదిక విశ్లేషించింది. అభివృద్ధి చెందుతున్న ప్రతి అయిదు దేశాల్లో ఒకదాని తలసరి జీడీపీ 2023 అంతానికీ 2019 నాటి స్థాయికి చేరదని వెల్లడించింది. విద్యారంగం, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పెట్టుబడి వ్యయాలపై బడ్జెట్‌ను చాలా వరకూ అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాల్సి వచ్చిందని అది తెలిపింది. అంతేకాకుండా ఆ దేశాల్లో పదేళ్ల వయసున్న పిల్లల్లో 70శాతం పుస్తకాలు చదవలేని పరిస్థితికి చేరుకున్నారనీ వెల్లడించింది. అల్పాదాయ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 60శాతం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయాయని, వాటి నుంచి అవి కోలుకునే అవకాశాలు చాలా తక్కువని వివరించింది. టీకాల అసమానతలూ ఆ దేశాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికితోడు వాతావరణ మార్పులూ ఆయా దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఊతం అవసరం. పేద దేశాల్లో కీలక రంగాలపై చేసే వ్యయం 20శాతమైనా పెరగాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచంలోని నిరుపేదల ఆకలి తీరి, పేదరికం తగ్గాలంటే అన్ని దేశాలూ సమష్టి బాధ్యత తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ అమీనా మొహమ్మద్‌ చేసిన సూచన ఆచరణీయం. ప్రజలందరికీ సామాజిక భద్రత, ఆరోగ్యం, విద్య, ఉపాధి లాంటివి అందించే విషయంలో ఏ ఒక్కరినీ విడిచిపెట్టకూడదని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలన్నీ ఆ దిశగా ముందడుగు వేస్తేనే సంక్షోభాన్ని నివారించడానికి ఆస్కారం లభిస్తుంది.

- పి.కామేశ్వరరావు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుడమికి రక్షణ తక్షణావసరం

‣ భేదాలు కట్టిపెట్టి... గట్టిమేలు తలపెట్టి

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధం!

‣ జల సంరక్షణకు జన భాగస్వామ్యం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 03-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం