• facebook
  • whatsapp
  • telegram

విచక్షణాధికారం పేరిట ఏకపక్ష నిర్ణయాలా?

బెయిల్‌ తీర్పులపై సుప్రీం ఆందోళన

వ్యక్తి ప్రాణాలు, స్వేచ్ఛలకు 21వ రాజ్యాంగ అధికరణ హామీ ఇస్తోంది. విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిలు ఇవ్వడమనేదీ ఈ అధికరణ పరిధిలోకి వస్తుంది. సీఆర్‌పీసీలోని 436 నుంచి 450 వరకు గల సెక్షన్లలో బెయిలుకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. నిందితుడికి బెయిలు కచ్చితంగా లభిస్తుందనే భరోసా ఇచ్చే అంశాలు భారతీయ న్యాయవ్యవస్థలో లేవు. కచ్చితత్వం లేకపోవడం ఏకపక్ష నిర్ణయాలకు దారితీస్తుంది.  బెయిలు దరఖాస్తులను అంగీకరించడమా, నిరాకరించడమా అనే విచక్షణాధికారం న్యాయస్థానాలకు ఉన్న మాట నిజమే కానీ, విచక్షణ అనేది కొన్నిసార్లు ఏకపక్ష నిర్ణయాలకు దారితీయవచ్చు. ఏతావతా వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణకు బెయిలు అవసరం. అలాగని ఎడాపెడా దాన్ని మంజూరు చేయాలనీ కాదు. ఇటీవలి కాలంలో న్యాయస్థానాలు తగిన కారణాలు చూపకుండానే బెయిలు ఇవ్వడమో, నిరాకరించడమో చేస్తున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధోరణి తగదని పదేపదే తీర్పులు ఇచ్చినా అవి తీరు మార్చుకోవడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించింది.

‘అతి ఖరీదైన సరకు’!

న్యాయం జరగడమొక్కటే చాలదు, న్యాయం చేస్తున్నట్లూ కనిపించాలని సర్వోన్నత న్యాయస్థానం లోగడ ఉద్ఘాటించింది. అందుకే న్యాయమూర్తులు తమ తీర్పునకు కారణాలు స్పష్టం చేయాలి. అది న్యాయమైనదని అందరినీ ఒప్పించగలగాలి. నేరాన్ని బట్టి శిక్ష తీవ్రత ఆధారపడి ఉంటుంది. నిందితుడి ప్రమేయం ఎంత అన్నదీ ముఖ్యమే. ఇటువంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తరవాతే బెయిలు ఇవ్వాలా వద్దా అన్నది న్యాయస్థానాలు నిర్ణయించాలని సుప్రీంకోర్టు సూచించింది. సీఆర్‌పీసీకి 2008లో చేసిన సవరణ ప్రకారం ఏడేళ్లు, అంతకులోపు శిక్షలు పడే కేసుల్లో ఇష్టారాజ్యంగా అరెస్టులు చేయడానికి వీల్లేదు. అరెస్టుకు కారణాలు చూపాలి. నిందితుణ్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా అని పోలీసులు, అధికారులు ప్రతి కేసులో తమను తాము ప్రశ్నించుకోవాలని అర్నేష్‌ కుమార్‌ కేసు(2014)లో సుప్రీంకోర్టు నిర్దేశించింది. మరోవైపు, నేరాలు రెండు రకాలు. బెయిలు పొందడానికి అర్హమైనవి కొన్ని అయితే, బెయిలు ఇవ్వడానికి వీల్లేనివి రెండో రకం. మొదటి కోవలోకి వచ్చే కేసుల్లో నిందితుడు ఒక హక్కుగా బెయిలును డిమాండు చేయవచ్చు. రెండో తరహా నేరాల్లో బెయిలు ఇవ్వాలా వద్దా అనేది న్యాయమూర్తి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. బెయిలుకు అర్హమైన నేరాల్లో- దాన్ని పొందడానికి నిందితుడికి తిరుగులేని హక్కు ఉంటుందని రసిక్‌లాల్‌ కేసు(2009)లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విషయంలో ఎవరి విచక్షణా అవసరం లేదంది.

అపరిష్కృత అభ్యర్థనల భారం

భారతీయ న్యాయస్థానాల ముందు నేడు బెయిలు దరఖాస్తులు కొండల్లా పేరుకుపోయాయి. బెయిలు, శిక్షల నిలుపుదల అభ్యర్థనలపై 2020 డిసెంబరు 18నాటికి సుప్రీంకోర్టులో 1,072 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 931 పిటిషన్లు బెయిలుకు సంబంధించినవే. ఇక హైకోర్టుల్లో 91,568 బెయిలు దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నట్లు ఏడాది క్రితం సుప్రీంకోర్టే వెల్లడించింది. జిల్లా న్యాయస్థానాల ముందైతే సుమారు రెండు లక్షల బెయిలు పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. అసలు సుప్రీంకోర్టు బెయిలు దరఖాస్తులను పరిశీలించాల్సి వస్తుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ సైతం ఊహించి ఉండరని జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ లోగడ ఒకసారి వ్యాఖ్యానించారు. రాజ్యాంగపరమైన అంశాలను పట్టించుకోవాల్సిన సర్వోన్నత న్యాయస్థానం బెయిలు దరఖాస్తులపై దృష్టి పెట్టాల్సి రావడం- దాని అసలు పనికి అడ్డు తగులుతోంది. సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన తీర్పుల్లో కేవలం ఏడు శాతమే రాజ్యాంగ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలనూ కలిపినా అది సుమారు పది శాతమే అవుతుందని ఇటీవలి అధ్యయనం ఒకటి చాటుతోంది. బెయిలు నిబంధనలను నిర్ణయించే అధికారాన్ని రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాట నిజమే కానీ, పూర్తిగా ఆ పనిలోనే పడితే కీలక సమస్యల పరిష్కారం వెనకబడిపోతుంది. రాజ్యాంగపరమైన ప్రాధాన్యం కలిగిన అంశాలపై సుప్రీంకోర్టు మరింతగా దృష్టి సారించేలా వ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకతను సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఇటీవల గుర్తుచేశారు.

మరణశిక్ష కానీ, యావజ్జీవ కారాగార శిక్ష కానీ, పదేళ్ల జైలు శిక్ష కానీ విధించడానికి అవకాశమున్న నేరాల్లో సైతం నిందితుడికి బెయిలు పొందే హక్కు ఉందని సీఆర్‌పీసీలోని 167వ సెక్షన్‌ నిర్దేశిస్తోంది. అటువంటి కేసుల్లో విచారణ 90 రోజుల్లో, ఇతర కేసుల్లోనైతే 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి కావాలని... అలా జరగని పక్షంలో బెయిలు కోసం డిమాండ్‌ చేసే హక్కు నిందితుడికి ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. బెయిల్‌ ఇవ్వాలా వద్దా అనే విషయంపై సీఆర్‌పీసీ 437(1) సెక్షన్‌లో నిర్దేశించిన పరిమితులకు లోబడి న్యాయస్థానాలు విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకోవాలని 1958లో రావు హరినారాయణ్‌ సింగ్‌ కేసులో సుప్రీం పేర్కొంది. నేర తీవ్రత, ఆరోపణ స్వభావం, శిక్ష తీవ్రత, బెయిలు ఇస్తే నిందితుడు పరారయ్యే అవకాశం, సాక్షులను బెదిరించే ప్రమాదం, సాక్ష్యాలను తారుమారు చేసే పరిస్థితి, నిందితుడి వయసు, లింగం, ఆరోగ్య స్థితి- వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బెయిలు మంజూరు చేయడమా, మానడమా అనేది కోర్టులు నిర్ణయించాలి. ఒక పేద కూలీకి బెయిలు మంజూరు చేయడానికి పూచీకత్తుగా పది వేల రూపాయలు కట్టాలని నాలుగు దశాబ్దాల క్రితం ఓ కేసులో నిర్దేశించారు. దానిపై అప్పట్లో తీవ్ర ఆవేదన వెలిబుచ్చిన జస్టిస్‌ కృష్ణయ్యర్‌- ‘న్యాయవిపణిలో స్వేచ్ఛ అనేది పేదలకు అందని అతి ఖరీదైన సరకైపోయింది’ అని వ్యాఖ్యానించారు.

సమతౌల్యం కీలకం

బెయిలు రద్దు, తిరస్కరణ అనేవి వేర్వేరు అంశాలు. అందువల్ల వాటి విషయంలో న్యాయస్థానాలు సైతం భిన్నమైన పంథాలను అనుసరించాలి. బెయిలు మంజూరు దరఖాస్తును పరిశీలించేటప్పుడు- నిందితుడు బెయిలు నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉందా అన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ క్రమంలో కొద్దిమేరకు ఉదారంగా వ్యవహరించవచ్చు. బెయిలు రద్దుపై మాత్రం న్యాయస్థానాలు కఠిన వైఖరిని అనుసరించకతప్పదు. నిందితుడు బెయిలు నిబంధనలను ఉల్లంఘిస్తే, దాన్ని రద్దు చేయాల్సి వస్తుంది. బెయిలు కోరే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని దిల్లీ హైకోర్టు గతంలో తీర్మానించింది. వ్యక్తి స్వేచ్ఛకు, సమాజ ప్రయోజనాలకు మధ్య ఘర్షణ లేని రీతిలో బెయిలు మంజూరు లేదా తిరస్కరణ జరగాలి. ఆ రెండింటినీ న్యాయమూర్తులు సమతుల్య పరచాలి. విచక్షణాధికారం పేరిట ఏకపక్ష నిర్ణయాలు వాంఛనీయం కాజాలవు!  

- పీవీఎస్‌ శైలజ 

(సహాయ ఆచార్యులు, మహాత్మాగాంధీ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కరెంటు కోతలతో దేశానికి ఉక్కపోత

‣ రక్షణ రంగంలో డ్రోన్ల విజృంభణ

‣ విదేశీ వాణిజ్యం కొత్తపుంతలు

‣ సమష్టి కృషితోనే పేదరికం నుంచి బయటకు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం