• facebook
  • whatsapp
  • telegram

ప్రగతి రథానికి చోదకశక్తి

జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం

భారతదేశం 1998 మే 11న మూడు అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ అణ్వస్త్ర దేశాల సరసకు సగర్వంగా చేరింది. తదుపరి సంవత్సరం 1999 నుంచి ఏటా మే నెల 11వ తేదీని ‘జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. ఆ రోజున సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి బోర్డు నవీకరణ సాధకులైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను సత్కరిస్తోంది. బండి చక్రాన్ని కనుక్కున్నప్పటి నుంచి ఇంటర్నెట్‌ వరకు మానవ నాగరికత సాంకేతికంగా ఎంతో పురోగమించింది. సాంకేతికతే నేడు అభివృద్ధికి ప్రధాన చోదక శక్తి. నిత్య జీవితంలో వాడుకలో ఉన్న ఫ్యాన్లు, స్మార్ట్‌ ఫోన్లు, విద్యుచ్ఛక్తి, వాహనాలు, కంప్యూటర్లు- అన్నీ సాంకేతిక వరప్రసాదాలే. సాంకేతిక సాధనాలు మన జీవితాలను సౌఖ్యవంతం, వేగవంతం చేస్తున్నాయి. బ్లాక్‌ చెయిన్‌, ప్రభావవంతమైన కృత్రిమ మేధ, ఏఐ క్లౌడ్‌ సేవలు, 5జీ, వేలాది ఉపగ్రహ సముదాయాలు, జన్యు ఎడిటింగ్‌, డ్రైవర్‌ లేని వాహనాలు, సింథటిక్‌ బయాలజీ వంటి అధునాతన ఆవిష్కరణలు రేపటి మానవ జీవితాన్ని సమూలంగా మార్చేయబోతున్నాయి.

నవ కల్పనలకు ఊతం

ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్‌) 2021 నివేదిక ప్రకారం నేడు 35,000 కోట్ల డాలర్లుగా ఉన్న అధునాతన సాంకేతికతల మార్కెట్‌ 2025కల్లా 3.20 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిపోనుంది. సాంకేతిక పరిజ్ఞానంలో మేటిగా నిలిచే దేశాలు ఈ మార్కెట్‌ను హస్తగతం చేసుకొంటాయి. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ కనెక్షన్లు 680 కోట్లకు చేరాయి. ఇది ప్రపంచ జనాభాకు దాదాపు సమానం. 40శాతం ప్రపంచ ప్రజలు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు పది శాతం విస్తరిస్తే జీడీపీ అదనంగా 1.4శాతం మేర పెరుగుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా. అంతర్జాతీయ పోటీ పెరిగిపోయిన ఈ రోజుల్లో నెగ్గుకురావడానికి సాంకేతిక దన్ను అవసరం. సాంకేతిక పరిజ్ఞానమే నవీకరణకు ఊపిరి. 2020 సంవత్సర ప్రపంచ నవీకరణ సూచీలో 48వ స్థానంతో సరిపెట్టుకున్న భారత్‌ 2021లో రెండు స్థానాలు ఎగబాకి 46వ స్థానాన్ని చేరుకుంది. అయితే భారత్‌ ఎక్కవలసిన మెట్లు ఇంకెన్నో ఉన్నాయి. అంతర్జాతీయంగా 10 అగ్రœగామి నవీకరణ సాధక దేశాల్లో ఒకటిగా రాణించాలి. ఈ వాస్తవాన్ని గుర్తెరిగిన భారత ప్రభుత్వం రీసెర్చ్‌ పార్క్‌లను, టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్లను విరివిగా ప్రోత్సహిస్తూ నవకల్పనకు ఊతమిస్తోంది. ప్రస్తుతం పరిశోధన-అభివృద్ధిపై స్థూల వ్యయం (గెర్డ్‌) మన జీడీపీలో కేవలం 0.66 శాతంగా ఉంది. 2025కల్లా దీన్ని  కనీసం రెండు శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్షిస్తోంది. భారత్‌లో ‘ఇంజినీరింగ్‌ ఆర్‌ అండ్‌ డి, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌’ మార్కెట్‌ పరిమాణం 2019లో 3,100 కోట్ల డాలర్లు. ఇది ఏటా 12శాతం చక్రీయ వృద్ధి రేటు నమోదు చేస్తూ 2025కల్లా 6,300 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. భారత్‌లో ఐటీ వ్యయం ఏటా ఏడు శాతం చొప్పున పెరుగుతోంది. 2022 చివరికల్లా మన ఐటీ వ్యయం 10,180 కోట్ల డాలర్లను అందుకొంటుంది. 2019లో అమెరికా ఐటీ వ్యయం 8,189 కోట్ల డాలర్లు మాత్రమేనని ఇక్కడ గుర్తుంచుకోవాలి. 2020 ఐటీయూ అంతర్జాతీయ సైబర్‌ భద్రతా సూచీలో భారత్‌ 37 స్థానాలు పైకి ఎగబాకి పదో ర్యాంకు సాధించింది. మొబైల్‌ ఇంటర్నెట్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, అడ్వాన్స్డ్‌ జినోమిక్స్‌ వంటి డజను సాంకేతిక రంగాల్లో భారత్‌ ముందడుగు వేస్తే, 2025కల్లా భారత జీడీపీకి 55,000 కోట్ల డాలర్ల నుంచి లక్ష కోట్ల డాలర్ల వరకు అదనంగా సమకూరుతుందని మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. 2022-23లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.4శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఫిక్కి సర్వే అంచనా వేసింది.

భవిష్యత్‌ ఆశాకిరణాలు

భవిష్యత్తులో మనం ధరించే దుస్తులే మన దైనందిన కార్యకలాపాలను అనుక్షణం నమోదు చేస్తాయి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌తో ఇది సాధ్యపడనుంది. 3డీ ప్రింటింగ్‌తో పారిశ్రామికోత్పత్తిలో విప్లవం సంభవిస్తుంది. మందుల సరఫరా, టెలీమెడిసిన్‌ వంటి కీలక విభాగాల్లో వైద్య రోబోలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వచ్చే రెండేళ్లలోనే సరకుల బట్వాడాకు డ్రోన్ల వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. 2028కల్లా యంత్రాలు మానవుల్లా ఆలోచించే సామర్థ్యాన్ని సంతరించుకోవచ్చు. మానవుడి మెదడుకు కంప్యూటర్‌కు మధ్య అనుసంధానత ఏర్పడుతుంది. 2030కల్లా మానవుడు కుజ గ్రహంపై కాలు మోపనున్నాడు. వచ్చే దశాబ్దంలో పాఠ్యపుస్తకాల స్థానాన్ని వర్చువల్‌ రియాలిటీ ఆక్రమిస్తుంది. 2030కల్లా స్మార్ట్‌ఫోన్లకు కాలం చెల్లిపోయి, వాటిస్థానంలో వర్చువల్‌ రియాలిటీ కళ్లద్దాలు వచ్చిచేరతాయి. రానున్న పదేళ్లలో డ్రైవర్‌ రహిత వాహనాలు సర్వసాధారణమైపోతాయి. అధునాతన సాంకేతికతలు భారతీయ వ్యవసాయ రంగానికి ఏటా 4,500 కోట్ల నుంచి 8,000 కోట్ల డాలర్ల వరకు అదనపు విలువను సమకూర్చగలవు. పది కోట్ల మందికిపైగా రైతుల ఆదాయాలను పెంచగలవు. ఆర్‌ఎఫ్‌ఐడీ... తదితర ట్రాకింగ్‌ సాంకేతికతలు మన రేవులు, గిడ్డంగుల సామర్థ్యాన్ని 50శాతం మేర ఇనుమడింపజేస్తాయి. ఈ మార్పులన్నింటినీ అందిపుచ్చుకొని ప్రపంచంలో మేటి సాంకేతిక శక్తిగా రాణించాలంటే భారతీయ విద్యా విధానాన్ని సమూలంగా రూపాంతరం చెందించాలి. నిపుణ మానవ వనరులను పెద్దయెత్తున తయారుచేసుకోవాలి. సాంకేతిక విజ్ఞాన రంగంలో నవీకరణ విప్లవం సృష్టించాలి.

పరిశోధనలకు పెరిగిన ప్రాధాన్యం

పారిశ్రామికీకరణ, సాంకేతిక వృద్ధిలో అగ్రగామిగా నిలవడానికి భారత్‌ పట్టుదలగా కృషి చేస్తోంది. 2022 మార్చిలో టొయోటా కంపెనీ భారత్‌లో తన మిరాయ్‌ హైడ్రోజెన్‌ ఫ్యూయల్‌ సెల్‌ కారును ఆవిష్కరించింది. ఈ కార్ల ఉత్పత్తి ఊపందుకోగానే వాటికి హైడ్రోజెన్‌ ఇంధనాన్ని సరఫరా చేయడానికి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సిద్ధంగా ఉంది. కేంద్ర సైన్స్‌, టెక్నాలజీ విభాగం జీఈ ఇండియాతో కలిసి అత్యాధునిక టెక్నాలజీ పరిశోధనలను చేపట్టనున్నాయి. ఇంధన, ఆరోగ్య రక్షణ, విమానయాన రంగాల్లో పరిశోధనలు చేపట్టడానికి రాగల అయిదేళ్లలో విద్యా సంస్థలకు దాదాపు 27 లక్షల డాలర్ల నిధులు అందుతాయి. 2021 జూన్‌లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) శత్రు డ్రోన్‌లను తుత్తునియలు చేసే సాంకేతికతను ఆవిష్కరించింది. ఈ ఏడాది ఇస్రో ప్రప్రథమంగా భారతీయులను అంతరిక్షంలోకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలో శాస్త్రసాంకేతిక రంగాల్లో అయిదు అగ్రశ్రేణి దేశాల్లో ఒకటిగా భారత్‌ను నిలపాలని ప్రభుత్వం లక్షిస్తోంది. శాస్త్రీయ పరిశోధన పత్రాల ప్రచురణలో భారత్‌ మూడో స్థానం ఆక్రమిస్తోంది. 2000 సంవత్సరంలో భారత్‌లో ప్రతి పది లక్షల జనాభాకు 110 మంది పరిశోధకులు ఉంటే- 2017కల్లా వారి సంఖ్య 255కి పెరిగింది. సైన్స్‌, ఇంజినీరింగ్‌లలో అమెరికా, చైనాల తరవాత అత్యధిక పీహెచ్‌డీలను భారత్‌లోనే ప్రదానం చేశారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కచ్చితమైన గణాంకాలే వృద్ధికి పునాది

‣ సాగు బాగుకు సేంద్రియ మార్గం

‣ అలీన పథం... ఆదర్శ మార్గం!

‣ కార్చిచ్చులు... అడవులకు పెనుముప్పు

‣ విచక్షణాధికారం పేరిట ఏకపక్ష నిర్ణయాలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం