• facebook
  • whatsapp
  • telegram

అలీన పథం... ఆదర్శ మార్గం!

ప్రపంచ దేశాలకు భారత్‌ నమూనా

 

 

ఒకప్పుడు భారతదేశం విశ్వగురువు. అపార సంపదకు నెలవు. విదేశీ శక్తుల దురాక్రమణతో పరిస్థితుల్లో తీవ్ర ప్రతికూల మార్పులు సంభవించాయి. 18వ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచ సంపదలో సుమారు 30శాతంగా లెక్కతేలిన భారతావని వాటా- 1947లో బ్రిటిష్‌ దాస్యశృంఖలాలను తెంచుకునే నాటికి మూడుశాతం కంటే తక్కువకు పడిపోయింది. అక్షరాస్యత, పారిశ్రామికీకరణ తదితర అంశాల్లోనూ వెనకబడింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ పాలన పగ్గాలు చేపట్టిన జవహర్‌లాల్‌ నెహ్రూ అలీన పథం రూపంలో దేశానికి మెరుగైన విదేశాంగ విధానాన్ని అందించారు. స్వదేశీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా ముందుకు సాగేందుకు అవకాశాలు తెరిచి ఉంచారు. నాడు ఆయన చూపిన దారి- ప్రస్తుతం ఉక్రెయిన్‌ సంక్షోభంలోనూ ఇండియా సహా పలు దేశాలకు అనుసరణీయమైన బాటగా మారిందనడంలో సందేహం లేదు.

 

ఆధిపత్య పోరుకు దూరంగా...

రెండో ప్రపంచ సమరం ముగిసి ప్రచ్ఛన్న యుద్ధం మొదలయ్యాక అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమి, సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలోని తూర్పు కూటముల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి చాలా దేశాలకు తలెత్తింది. అప్పుడప్పుడే వలస పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నవాటికి అది ఇబ్బందికరమైన అంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో 1955 నాటి బాండూంగ్‌ సదస్సులో అలీనోద్యమానికి (నాన్‌ అలైన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌-నామ్‌) బీజాలు పడ్డాయి. అటు అమెరికా, ఇటు సోవియట్‌లలో దేనితోనూ జట్టు కట్టకుండా స్వతంత్ర విధానాన్ని అనుసరించాలని పలు ఆఫ్రికా, ఆసియా దేశాలు అందులో నిర్ణయించుకున్నాయి. అప్పటి యుగొస్లేవియా (ప్రస్తుత సెర్బియా) రాజధాని బెల్‌గ్రేడ్‌ వేదికగా 1961లో జరిగిన సదస్సులో నెహ్రూ, నాటి ఈజిప్టు అధ్యక్షుడు గామల్‌ అబ్దెల్‌ నాసర్‌, యుగొస్లేవియా అధ్యక్షుడు జొసిప్‌ బ్రొజ్‌ టిటో తదితరులు నామ్‌కు పూర్తిస్థాయిలో నాంది పలికారు. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరాటంలో తమ దేశాలను సమిధలుగా మార్చబోమని స్పష్టీకరించారు. ఆలోచనల్లో, కార్యాచరణలో స్వతంత్రంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. వలసవాద, సామ్రాజ్యవాద విధానాలను వ్యతిరేకించాలని; ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాలని తీర్మానించుకున్నారు. దాదాపు పాతిక దేశాలతో ప్రారంభమైన ఈ అలీన కూటమి కాలక్రమంలో అనేక దేశాలను ఆకర్షించింది. ప్రస్తుతం ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. నామ్‌ క్రమంగా మన విదేశాంగ విధానాల్లో అత్యంత కీలకాంశంగా అవతరించింది. నామ్‌ అంటే క్రియారహితంగా ఉండటం కాదని, స్వతంత్ర విధానాలతో ప్రపంచ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడమని నెహ్రూ ప్రకటించారు.

 

 

వాషింగ్టన్‌, మాస్కోలతో సంబంధాలను సమతులపరచుకుంటూ వ్యవసాయం, విద్య, మిలిటరీ తదితర రంగాల్లో స్వప్రయోజనాలను దిల్లీ పరిరక్షించుకుంది. అమెరికా, రష్యా రెండూ ఇండియాకు ముఖ్యమే. సోవియట్‌ కాలం నుంచీ రష్యాతో మనకు సత్సంబంధాలున్నాయి. గతంలో అనేక విపత్కర పరిస్థితుల్లో ఆ దేశం మనకు అండగా నిలిచింది. 1971 నాటి భారత్‌-పాక్‌ యుద్ధం అందుకు ఓ ఉదాహరణ. అప్పట్లో పాక్‌కు మద్దతుగా నిలిచేలా బంగాళాఖాతంలో భారత కార్యకలాపాలను అడ్డుకునేందుకు నావికా బలగాలను పంపించాలని అమెరికా నిర్ణయించుకున్నప్పుడు- దానికి స్పందనగా హిందూ మహాసముద్రంలోకి రష్యా తన బలగాలను పంపింది. కశ్మీర్‌ వివాదాన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు పాక్‌ ఒత్తిడితో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, క్యూబా ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సోవియట్‌ తన వీటో అధికారంతో ఇండియాకు అండగా నిలిచింది. గోవా విమోచనకు మన దేశం చేపట్టిన మిలిటరీ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ 1961లో పోర్చుగల్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్నీ వీటో చేసింది. ఈ సహాయ సహకారాలను దిల్లీ మరువలేదు. మరోవైపు- ఇతర దేశాల నుంచీ ఆయుధాల కొనుగోలుకు దిల్లీ కొంతకాలంగా ప్రాధాన్యమిస్తున్నమాట వాస్తవమే అయినా- ఇప్పటికీ మనకు ప్రధాన ఆయుధ ఎగుమతిదారు రష్యాయే. 2016-2020 మధ్య ఇండియా ఆయుధ దిగుమతుల్లో దాదాపు సగం ఆ దేశం నుంచి వచ్చినవేనంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో రష్యా వైఖరిని భారత్‌ ఖండించడం సులువు కాదు.

 

అమెరికాతోనూ అనుబంధం

కొన్నేళ్లుగా అమెరికాతో ఇండియా వ్యూహాత్మక సంబంధాలు బలోపేతమయ్యాయి. వాషింగ్టన్‌ మనకు దగ్గరవుతుండటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు ముకుతాడు వేసేందుకు మన సహకారం ఎంతగా అవసరమో ఆ దేశానికి తెలుసు. భారత్‌లో అందుబాటులో ఉన్న భారీ విపణి కూడా ఆ దేశాన్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. 2020-21లో భారత్‌కు అమెరికా ఎగుమతుల విలువ నాలుగువేల కోట్ల డాలర్లు. 2020 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వాషింగ్టన్‌ భారత్‌లో 2,100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇంత పెద్ద మార్కెట్‌ను వదులుకోవడం అమెరికాకే కాదు- ఏ దేశానికైనా కష్టమే. అందుకే ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభంలో భారత్‌ విధానంపై కాస్త స్వరం పెంచినట్లు కనిపించిన బైడెన్‌ సర్కారు తరవాత తగ్గింది. క్వాడ్‌ భేటీలో, 2+2 చర్చల్లో ఇండియాను తప్పుపట్టేందుకు సాహసించలేదు. రష్యా విషయంలో ఇండియా వైఖరిని క్వాడ్‌ అంగీకరించిందని ఆస్ట్రేలియా ఇప్పటికే స్పష్టం చేసింది కూడా. వ్యవసాయం, సమాచార సాంకేతికత, శాస్త్ర విజ్ఞానం, మిలిటరీ వంటి రంగాల్లో  అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఈయూ వంటి శక్తుల సహకారం మనకింకా అవసరం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ యుద్ధంపై పూర్తిస్థాయిలో ఎవరో ఒకరి వైపు మొగ్గి... మరొకరికి ఆగ్రహం తెప్పించేందుకు దిల్లీ  సంసిద్ధంగా లేదు. ఇది ఆమోదించదగిన వ్యూహమే. ఐరాసలో 120కి పైగా దేశాలు రష్యా వైఖరిని ఖండించినా- వాటిలో దాదాపు 40 మాత్రమే మాస్కోపై ఆంక్షలు ప్రకటించాయి. నామ్‌ సభ్య దేశాల్లో సింగపూర్‌ మినహా మరే దేశమూ మాస్కోపై ఆంక్షలు విధించలేదు. తాము ప్రగతి పథంలో పయనించాలంటే అమెరికా, బ్రిటన్‌, ఈయూలతోపాటు రష్యా సహకారమూ ముఖ్యమని అవి భావిస్తుండటమే అందుకు కారణం. ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఇండియా తటస్థ విధానం అనుసరించడానికి మరో ప్రధాన కారణం- పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్‌ల నుంచి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉండటం. ఆ రెండు దేశాలను ఎదుర్కోవాలంటే భౌగోళికంగా రష్యా వంటి శక్తిమంతమైన దేశం అండ మనకు అవసరం. సుస్థిరత, ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా, ఆధిపత్య పోరుకు దూరంగా భారత్‌ అనుసరిస్తున్న వ్యూహాత్మక విదేశాంగ విధానం నేడు ఎన్నో దేశాలకు ఆదర్శప్రాయం.

 

ఉక్రెయిన్‌ సంక్షోభంలోనూ అదే తీరు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలోనూ ఇండియా అలీన పథాన్నే అనుసరిస్తోంది. దౌత్య చర్చలతో శాంతిమార్గంలో వివాదాన్ని పరిష్కరించుకోవాలని రష్యా, ఉక్రెయిన్‌లకు సూచిస్తోంది. రష్యా వైఖరిని ఖండించడం లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి ఇప్పటివరకు ఐక్యరాజ్య  సమితిలో ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలపై ఓటింగ్‌కు దిల్లీ దూరంగా ఉంది. ఇది అలీన విధానమే అయినా- నెహ్రూ క్రియాశీలక పాత్ర పోషించిన విధానం కావడంతో నామ్‌ పేరును నేరుగా ప్రస్తావించేందుకు మోదీ సర్కారు కొంత విముఖత చూపుతున్నట్లు కనిపిస్తోంది. వ్యూహాత్మక  స్వతంత్రతను పాటిస్తున్నట్లు మాత్రమే చెబుతోంది. అయితే చైనా, పాక్‌ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఐరాసలో ఉక్రెయిన్‌కు సంబంధించిన తీర్మానాలపై ఓటింగ్‌కు దూరంగా ఉంటూ పరోక్షంగా రష్యాకు మద్దతు   ప్రకటిస్తున్నాయి. ఇది ఇండియాకు కాస్త ఇబ్బందికరమే.

 

- మండ నవీన్‌ కుమార్‌ గౌడ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కార్చిచ్చులు... అడవులకు పెనుముప్పు

‣ విచక్షణాధికారం పేరిట ఏకపక్ష నిర్ణయాలా?

‣ కరెంటు కోతలతో దేశానికి ఉక్కపోత

‣ రక్షణ రంగంలో డ్రోన్ల విజృంభణ

‣ విదేశీ వాణిజ్యం కొత్తపుంతలు

‣ సమష్టి కృషితోనే పేదరికం నుంచి బయటకు

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-05-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం