• facebook
  • whatsapp
  • telegram

ఆగని పోరుతో సంక్షోభం తీవ్రం

సరఫరా వ్యవస్థలు ఛిన్నాభిన్నం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి పర్యవసానాలను ప్రపంచం ఇప్పటికే చవిచూస్తోంది. ఇది ఇంతటితో ఆగదు. దీర్ఘకాలంలో దుష్పరిణామాలు మరింతగా కనిపించే అవకాశం ఉంది. ఇంధనం, ఆహారం, ఎరువులు తదితర అంశాల్లో ఈ రెండు దేశాలకు కీలక ప్రాధాన్యం ఉంది. కరోనావల్ల ప్రపంచం అతలాకుతలమైంది. ఆ వెంటనే వచ్చిపడిన తాజా యుద్ధం పేద, మధ్యతరగతి ప్రజలను మరిన్ని ఇక్కట్లపాలు చేస్తోంది. ప్రత్యేకించి తక్కువ ఆదాయం గల దేశాలు, ఆహారోత్పత్తులు తగినంతగా లేక దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ప్రజల జీవన పరిస్థితులు మరింతగా దిగజారనున్నాయి. మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కోనున్నాయి. ఆహార భద్రత ప్రధాన సవాలు కానుంది. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్‌ను దూరం చేసేందుకు రష్యా చేస్తున్న ఈ దాడి వెనక రాజకీయ కారణాలున్న నేపథ్యంలో యుద్ధం ఎంత కాలం సాగుతుందనేది తేలేలా లేదు. ఉక్రెయిన్‌ లొంగిపోవడం, విజయం దక్కిందంటూ క్రెమ్లిన్‌ వెనక్కి మరలడం, రష్యాలో ప్రభుత్వపరంగా మార్పులు సంభవించడం వంటి పరిణామాలు సంభవిస్తే తప్ప ఇప్పట్లో పరిష్కారం లభించేలా లేదు. ఈ ప్రభావం ప్రపంచ ఆహార వ్యవస్థతోపాటు అనేక రంగాలపై ప్రసరించనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2007-08లో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2010-11లో వచ్చిన ప్రపంచ ఆహార సంక్షోభం, దానికి కొనసాగింపుగా అరబ్‌ ఆందోళనలు, సిరియాలో యుద్ధం పర్యవసానంగా వలసలు, ప్రజలు నిరాశ్రయులయ్యాక, తాజాగా యుద్ధం రూపంలో మరో సంక్షోభం తలెత్తింది.

కీలక ప్రాధాన్యం

రష్యా, ఉక్రెయిన్‌లకు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులకు సంబంధించి కీలక ప్రాధాన్యం ఉంది. ప్రపంచ చమురు ఉత్పత్తి, ఎగుమతిలో రష్యా మూడో అతి పెద్ద దేశం. సహజ వాయువు పరంగా రెండో పెద్ద ఉత్పత్తిదారు. ఎగుమతిలో అతి పెద్ద దేశం. బొగ్గు ఎగుమతిలో మూడో అతి పెద్ద దేశం. గోధుమ ఎగుమతిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. పొద్దు తిరుగుడు నూనె ఎగుమతిలో రెండోస్థానం. ఉక్రెయిన్‌ సైతం అంతర్జాతీయ మార్కెట్‌కు ముఖ్యమైనదే. ఆ దేశం అతి పెద్ద పొద్దుతిరుగుడు నూనె ఎగుమతిదారు. మొక్కజొన్నలో నాలుగు, గోధుమలో అయిదో స్థానం. మొత్తం ఎరువుల ఎగుమతిలో రష్యాది అగ్రస్థానం, నైట్రోజన్‌ ఎరువుల ఎగుమతిలో రెండోస్థానం. పొటాషియం ఎగుమతిలో మూడో స్థానం. నికెల్‌, ప్లాటినం, టైటానియం, అల్యూమినియం, కాపర్‌, యురేనియం వంటి ఖనిజాల వాణిజ్యంలో రష్యాకు ప్రాధాన్యముంది. ప్రస్తుత యుద్ధం, ఆంక్షల ఫలితంగా సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని లండన్‌లోని ‘రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌’ అధ్యయనం వెల్లడించింది. ఇదంతా రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సంక్షోభానికి త్వరలో ముగింపు పలక్కపోతే అంతర్జాతీయ మార్కెట్‌పై పెను ప్రభావం పడటంతోపాటు, ఆర్థిక రంగం, సమాజంపైనా తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి. రష్యా అంతర్జాతీయ సమాజానికి దూరమయ్యేకొద్దీ మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉంది. కొవిడ్‌ కారణంగా నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రంగా మారుతుంది.

వాణిజ్యం, అభివృద్ధిపై ఐరాస నిర్వహించిన సమావేశం అంచనా ప్రకారం 2022 ఆరంభంలో పొద్దుతిరుగుడు నూనె, విత్తనాలకు సంబంధించి ప్రపంచ వాణిజ్యంలో సగం వాటా రష్యా, ఉక్రెయిన్‌లే కలిగి ఉన్నాయి. గోధుమ, బార్లీలో నాలుగోవంతు, మొక్కజొన్న, ఆవాలులో ఆరోవంతు వాటా పొందాయి. ఆహార కొరతను ఎదుర్కొనే ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియాలకు ఈ రెండు దేశాల నుంచే ఎగుమతులు అధికం. సోమాలియాకు నూరు శాతం గోధుమల ఎగుమతి ఈ రెండు దేశాల నుంచే జరుగుతుంది. ఈజిప్ట్‌కు 80శాతం, సూడాన్‌కు 75శాతం, లావోస్‌కు 90శాతం వెళ్తుంది. చైనా, భారత్‌లకు పొద్దుతిరుగుడు నూనె 95శాతం వాటినుంచే అందుతుంది. ఆరోవంతు పొటాషియం ఎరువులు, పదోవంతు నైట్రోజన్‌ ఎగుమతుల వాటా రష్యాదే. బెలారస్‌ నుంచీ ఆరోవంతు పొటాషియం ఎగుమతులు జరుగుతాయి. రష్యాకు అండగా ఉన్నందుకు బెలారస్‌పైనా ఆర్థిక ఆంక్షలున్నాయి. రష్యా, బెలారస్‌ కలిసి ప్రపంచంలో మూడో వంతు పొటాషియాన్ని ఎగుమతి చేస్తున్నాయి. ఇందులో సగం కెనడా, అమెరికాలకే వెళ్తుంది.

ఇంధన రంగంలోనూ...

2020లో ప్రపంచ బొగ్గు వ్యాపారంలో 15 శాతం, చమురులో పదిశాతం, గ్యాస్‌లో ఎనిమిది శాతం రష్యాకు వాటా ఉంది. ఐరోపా సమాఖ్య 90 శాతం సహజ గ్యాస్‌ను దిగుమతి చేసుకొంటుంది. ఇందులో రష్యా వాటా 41 శాతం. చైనాకు చమురు సరఫరాలో రెండోస్థానం, గ్యాస్‌ సరఫరాలో నాలుగో స్థానం రష్యాదే. చైనా రష్యాకు రెండో అతిపెద్ద బొగ్గు మార్కెట్‌. రష్యా నుంచి చైనాకు సహజ వాయువు ఎగుమతి 2030 నాటికి భారీగా పెరుగుతుందని అంచనా. ఇందుకోసం కొత్త పైపులైన్లు నిర్మిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి- అంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేసింది. చమురు, గ్యాస్‌, ఎరువులు, ఆహార ధాన్యాల ధరలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాల ధరలు ఎనిమిది నుంచి 22శాతం దాకా పెరిగే అవకాశం ఉందని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. దాని ప్రభావం తక్కువ ఆదాయ వర్గాలపై ఎక్కువగా పడనుంది. తక్కువ ఆదాయం పొందే రైతులు నష్టపోతారు. ఎరువుల కొరత వల్ల దిగుబడులూ తగ్గే ముప్పుంది. పౌష్టికాహార లోపంతో బాధపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎఫ్‌ఏఓ అంచనా. కొన్ని దేశాలకు ఆహార ధాన్యాల దిగుమతుల వ్యయం మరింతగా పెరగనుంది. యుద్ధం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ధరలపై అంత అధికంగా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఆంక్షల భారం

రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షల ప్రభావం రానున్న రోజుల్లో తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. చమురు, గ్యాస్‌పై రష్యాకు ఆదాయం రాకుండా చేయాలని పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరుకల్లా చమురు, బొగ్గు కోసం రష్యాపై ఆధార పడబోమని బ్రిటన్‌ పేర్కొంది. ఐరోపా సమాఖ్య(ఈయూ) రష్యా గ్యాస్‌ దిగుమతులపైనే ఆధారపడింది. దాంతో యుద్ధ ప్రభావం ఈయూపైనే ఎక్కువగా ఉంటుంది. ఒక పక్క సరఫరాలో తగ్గుదల, ఇంకోపక్క ఉక్రెయిన్‌ నుంచి భారీగా వలసలతో ఈయూ దేశాలపై ఒత్తిడి పెరగనుంది. అయినప్పటికీ ఈ ఏడాది ఆఖరుకల్లా రష్యన్‌ గ్యాస్‌ను 60శాతానికి తగ్గిస్తామని ఆ దేశాలు చెబుతున్నాయి. గోధుమ, మొక్కజొన్న, ఇతర పప్పు దినుసుల ఎగుమతిని రష్యా ఇప్పటికే నిలిపివేసింది. ఈ ప్రభావం కొన్ని దేశాలపై తీవ్రంగా ఉండవచ్చు.

- ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మోయలేని పన్నుల భారం

‣ మానవ హక్కులకు పాతర!

‣ అగ్రరాజ్యాలకు డ్రాగన్‌ సరికొత్త సవాలు

‣ డిజిటల్‌ అంతరాలకు సాంకేతిక పరిష్కారం

‣ ప్రగతి రథానికి చోదకశక్తి

‣ కచ్చితమైన గణాంకాలే వృద్ధికి పునాది

Posted Date: 23-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం