• facebook
  • whatsapp
  • telegram

మానవ హక్కులకు పాతర!

రాజద్రోహ చట్టానికి చెల్లుచీటీ ఇవ్వాల్సిందే

 

 

వలస పాలనతోపాటు చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోవలసిన రాజద్రోహ చట్టం ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకు కారణం- మన ప్రభుత్వాలు దాన్ని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడమే. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లో రాజద్రోహానికి సంబంధించిన 124 (ఏ) సెక్షన్‌ను బ్రిటిష్‌ పాలకులు గాంధీజీ, తిలక్‌, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమరయోధులపై ప్రయోగించారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాతా మన ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థులపైన, మానవ హక్కుల ఉద్యమకారులు, పాత్రికేయులు, కార్టూనిస్టులు, చివరికి విద్యార్థులపైనా ఈ సెక్షన్‌ను ప్రయోగించాయి. ఇటీవల ముంబయిలో ముఖ్యమంత్రి నివాసం ఎదుట హనుమాన్‌ చాలీసా పఠిస్తామంటూ ఒక పార్లమెంటు సభ్యురాలు, ఆమె ఎమ్మెల్యే భర్త ప్రకటించగానే పోలీసులు వారిని అరెస్టు చేసి జైలులో పెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించి శివసేన నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేయించడానికి ఆ దంపతులు కుట్ర పన్నారంటూ రాజద్రోహ నేరం బనాయించారు. ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రత్యర్థుల అణచివేతకు రాజద్రోహ చట్టం దుర్వినియోగంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని మించినవారు లేరంటూ శివసేన ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 124ఏ సెక్షన్‌ విచ్చుకత్తిని విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలోని భాజపాయేతర ప్రభుత్వాలూ రాజద్రోహం అస్త్రాన్ని ఝళిపించడంతో కేంద్రానికి బుద్ధి వచ్చిందని రౌత్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ చదరంగంలో రాజద్రోహ చట్టం పాచికగా మారిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనమేమి కావాలి? సాగు చట్టాలపై రైతుల ఉద్యమం, పౌరసత్వ చట్ట సవరణలపై నిరసనోద్యమం సందర్భంగా రాజద్రోహ నేరారోపణలు పెచ్చుమీరాయి. ఈ దురాగతాన్ని నివారించడానికి రాజద్రోహ చట్టాన్ని రద్దు చేయాలంటూ అనేకమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.

 

తాత్కాలికంగా నిలిపివేత

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాజద్రోహ నిబంధనలను పునస్సమీక్షిస్తున్నామని మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రమాణపత్రం సమర్పించింది. దీంతో సమీక్ష పూర్తయ్యేవరకు 124ఏ సెక్షన్‌ అమలును నిలిపివేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. వలస పాలన కాలంనాటి 1,500 పైచిలుకు చట్టాలను తొలగించిన ఎన్డీయే ప్రభుత్వం రాజద్రోహ సెక్షన్‌ రద్దు పరిశీలనకూ ఉపక్రమించడం అభినందించాల్సిన విషయమే. మరోవైపు, ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు రాజద్రోహ నిబంధన అమలును సుప్రీంకోర్టు నిలిపివేయడం ముదావహం. ప్రభుత్వం, పార్లమెంట్ల అధికార పరిధిలో సుప్రీం నేరుగా జోక్యం చేసుకోకుండానే పౌరులకు రాజద్రోహ నేరారోపణల నుంచి తాత్కాలికంగానైనా రక్షణ కల్పించింది. జాతీయ భద్రత అవసరాలను విస్మరించకుండానే రాజ్యాంగం హామీ ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛ, భావప్రకటన హక్కులకు, ఉదార ప్రజాస్వామ్యానికి రక్షకురాలిగా నిలిచింది. రాజద్రోహ నిబంధన సుప్రీం పరిశీలనకు రావడం ఇదే మొదటిసారి కాదు. 1962లో కేదార్‌నాథ్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో హింసాకాండను రెచ్చగొట్టే మాటలు, చేతలను మాత్రమే రాజద్రోహంగా పరిగణించాలని సుప్రీం పేర్కొంది. రాజద్రోహ నిబంధనను కొట్టివేయకుండా దాని అమలును పరిమితం చేసింది. అయితే, నిరంకుశ చట్టాలను రద్దు చేయకుండా ఏదో ఒక రూపంలో కొనసాగనిచ్చినంత కాలం వాటి దుర్వినియోగం కొనసాగుతూనే ఉంటుంది.

 

ప్రజాస్వామ్య వ్యవస్థే శాశ్వతం

రాచరిక వ్యవస్థలు ఏలిన రోజుల్లో రాజును కూలదోయడానికి కుట్ర పన్నడాన్ని రాజద్రోహంగా పరిగణించి కఠినంగా శిక్షించేవారు. పేరుకు రాచరికమైన ఆధునిక బ్రిటన్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్న తరవాత రాజద్రోహ చట్టాన్ని రద్దు చేశారు. కానీ, భారత్‌లో బ్రిటిష్‌ వలస ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టం ఇప్పటికీ కొనసాగుతోంది! నేడు రాచరికం స్థానాన్ని ప్రజాస్వామ్యం ఆక్రమిస్తోంది. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పాలన అందించాలి. ఫలితాలు చూపాలి. ప్రభుత్వమనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతినిధి మాత్రమే. ప్రభుత్వాలు మారినా ప్రజాస్వామ్యం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. మెజారిటీ పొందిన పార్టీ లేదా పార్టీలతో ఏర్పడే ప్రభుత్వం చేపట్టే విధానాల లొసుగులను, వైఫల్యాలను ఎండగట్టడం ప్రతిపక్షాల ప్రజాస్వామిక హక్కు. ప్రతిపక్షాలు ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తమను గెలిపించాలని ఓటర్లను కోరతాయి. ఓటర్ల అంతిమ తీర్పు ప్రభుత్వాలను మార్చేస్తుంది. రాజద్రోహ నిబంధన కింద దీన్ని నేరంగా పరిగణించడం ప్రజాస్వామ్యానికి గోరీకట్టి నియంతృత్వాన్ని తలకెత్తుకోవడమే అవుతుంది. కాబట్టి ఐపీసీలో రాజద్రోహ నిబంధన ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. 1860లో బ్రిటిష్‌ పాలకులు తీసుకొచ్చిన రాజద్రోహ సెక్షన్‌ భారతీయుల స్వేచ్ఛానురక్తిని చిదిమేయడానికి ఉద్దేశించినది. స్వతంత్ర భారతదేశంలోనూ పాలకులు స్వప్రయోజనాల కోసం ఈ సెక్షన్‌ను కొనసాగనిస్తున్నారు. రాజద్రోహం అనేది మన శాసన పుస్తకాల్లో ఉన్నంతవరకు ఏ ప్రభుత్వమైనా సరే దాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉంటుంది. ఈ దేశ ప్రజాస్వామ్య సంస్కృతిని నాశనం చేస్తుంది. అసలు ప్రభుత్వం రాజద్రోహ నిబంధనను పునస్సమీక్షిస్తామనడంలోనే దాని లోపభూయిష్ఠత బయటపడుతోంది. దీన్ని రద్దు చేయడానికి ఇక పార్లమెంటే పూనుకోవాలి. రాజద్రోహ నిబంధనను రద్దు చేసినంత మాత్రాన ప్రాథమిక హక్కులకు పూర్తి భరోసా ఏర్పడదు. దానితోపాటు అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ), జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ), జమ్మూకశ్మీర్‌ ప్రజా భద్రతా చట్టం వంటివాటినీ పునస్సమీక్షించాల్సిన అవసరం ఉంది.

 

సుప్రీం విజ్ఞప్తే శిరోధార్యం

కేంద్ర ప్రభుత్వ పునస్సమీక్ష పూర్తయ్యేవరకు కొత్త రాజద్రోహం కేసులను నమోదు చేయకూడదని ‘ఆదేశించాల్సిందిపోయి’, ‘ఆశిస్తున్నట్లు’ సుప్రీంకోర్టు మర్యాద పూర్వకమైన పదజాలాన్ని ఉపయోగించడం కొంత సందిగ్ధానికి తావిచ్చింది. అయితే సుప్రీం ఆదేశంలో ఈ పదజాలానికి ముందు వాక్యాలను పరిశీలిస్తే సందిగ్ధత తొలగుతుంది. కేంద్ర ప్రభుత్వం (రాజద్రోహ నిబంధనను పునస్సమీక్షిస్తామని) స్పష్టంగా ప్రకటించినందు వల్ల కొత్త కేసుల నమోదును నిలిపేస్తున్నామని సుప్రీంకోర్టు ఉద్ఘాటించడం దాని సాధికార స్వరాన్ని ప్రతిధ్వనిస్తోంది. ఔచిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు సూటిగా కాకుండా నర్మగర్భంగా ఈ ఆదేశం జారీ చేసింది. ఏదిఏమైనా సుప్రీంకోర్టు ఆశలు, విజ్ఞప్తులకు సైతం ఆదేశాలకున్నంత సాధికారత ఉంటుంది. వాటిని భవిష్యత్తులో కోర్టులు, పోలీసులు తప్పక పాటించాల్సిందే. ఎగువ కోర్టు ‘విజ్ఞప్తి’ దిగువ కోర్టులకు, పోలీసులకు శిరోధార్యం. రాజద్రోహ నిబంధన రాజ్యాంగబద్ధతపై సుప్రీం తుది తీర్పు వెలువడేంతవరకు ఆ నిబంధన కింద కొత్త కేసులు నమోదు చేయకపోవడం పోలీసుల విధి.

 

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ అంతరాలకు సాంకేతిక పరిష్కారం

‣ ప్రగతి రథానికి చోదకశక్తి

‣ కచ్చితమైన గణాంకాలే వృద్ధికి పునాది

‣ సాగు బాగుకు సేంద్రియ మార్గం

‣ అలీన పథం... ఆదర్శ మార్గం!

‣ కార్చిచ్చులు... అడవులకు పెనుముప్పు

‣ విచక్షణాధికారం పేరిట ఏకపక్ష నిర్ణయాలా?

Posted Date: 20-05-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం