• facebook
  • whatsapp
  • telegram

మోయలేని పన్నుల భారం

సరళీకరిస్తేనే దేశార్థికానికి శ్రేయం

భారతదేశంలో అసలు సిసలు పన్నుల సంస్కరణలు 1991లో మొదలయ్యాయి. నాటి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాజా చెల్లయ్య కమిటీగా పేరుపడిన పన్నుల సంస్కరణల సంఘం (టీఆర్‌సీ) కీలక సిఫార్సులు చేసింది. భారతదేశంలో అంతవరకు 11 రకాల పన్నుల శ్లాబులు ఉండేవి. 1973-74లో అత్యధిక వ్యక్తిగత ఆదాయ పన్ను రేటు 85 శాతం. దానికి సర్‌ఛార్జీని కలుపుకొంటే 97.75 శాతంగా లెక్కతేలేది. 1974-75లో ఇది 77 శాతానికి, 1985-86లో 50 శాతానికి తగ్గింది. చెల్లయ్య కమిటీ సిఫార్సులపై 11 పన్ను శ్లాబులను మూడుకు (20, 30, 40శాతాల చొప్పున) తగ్గించారు. సంపద పన్నును అయిదు శాతం నుంచి ఒక్క శాతానికి తగ్గించారు. 1997-98 వచ్చేసరికి ఆదాయ పన్ను శ్లాబులను 10, 20, 30శాతాలకు మార్చారు. 1990-91లో వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితి రూ.22 వేలుగా ఉండేది. 2014-15 వచ్చేసరికి రూ.2.5 లక్షలకు పెరిగింది.

ఆదాయ నష్టం 

మరోవైపు, కంపెనీలపై ఒకప్పుడు 65 శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్ను రేటు క్రమంగా 50, 40, 25శాతాలకు తగ్గింది. 2017లో కేంద్రం వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) ప్రవేశపెట్టి అందులో కేంద్ర ఎక్సైజు, సర్వీసు, రాష్ట్ర పన్నులనూ కలిపేసింది. 1990-91 వరకు 300శాతం వరకు ఉన్న కస్టమ్స్‌ సుంకాన్ని చెల్లయ్య కమిటీ సిఫార్సుపై 150 శాతానికి, అక్కడి నుంచి క్రమంగా 2005-06లో 15 శాతానికి తగ్గించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, బహుళజాతి కంపెనీలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపుతూ పన్ను ఎగవేయడాన్ని అరికట్టాలి. రూ.250 కోట్లకన్నా ఎక్కువ స్థూల లాభం ఆర్జించే కంపెనీలకూ  వివిధ రాయితీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం సంభవిస్తోంది. భారత ఆర్థిక ఇబ్బందులకు ఇదే మూల కారణం. 2015-16 వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా వదులుకున్న ఆదాయం దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలదాకా ఉండేది. ఈ నష్టాన్ని క్రమంగా లక్ష కోట్ల రూపాయలకు తగ్గిస్తామంటూ 2014లో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. కానీ, అది ఆచరణలోకి రాలేదు. పన్నులకు ముందు లాభం రూ.250 కోట్లు, అంతకన్నా ఎక్కువగా ఉన్న 300 కంపెనీల మూలంగా ప్రభుత్వానికి 62 శాతం మేర ఆదాయ నష్టం సంభవించింది. ఈ కంపెనీలు వాస్తవంగా చెల్లించిన పన్ను కేవలం 20.5 శాతం. ఇతర కంపెనీలు 33 శాతం పన్నుకు తోడు విద్యా సెస్సు కూడా చెల్లించాల్సి వచ్చింది. దేశంలో 10 అతిపెద్ద కంపెనీలకు ఏటా పన్ను రాయితీలు కల్పిస్తుండటం వల్ల ప్రభుత్వం కోల్పోయే ఆదాయం- షెడ్యూల్డ్‌ కులాలు, తెగల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించే మొత్తం నిధులకన్నా చాలా ఎక్కువ. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌లపై 2014-15లో ఎక్సైజు పన్నుల ద్వారా రూ.99 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2020-21 వచ్చేసరికి అది రూ.3.73 లక్షల కోట్లకు పెరిగిపోయింది. ఇది ఏడేళ్లలో 277 శాతం పెరుగుదల. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లూ గత మూడేళ్లలో బాగా పెరిగిపోయాయి. 2020లో అవి కార్పొరేట్‌ పన్ను వసూళ్లను మించాయని ‘కాగ్‌’ నివేదిక తెలిపింది. 2019-2020లో 13 లక్షల ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు కాగా 2020-21లో అవి 15 లక్షలకు పెరిగాయి. బడా కంపెనీలు ఉద్యోగాలను సృష్టిస్తాయని, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని చెబుతున్న ఎన్డీయే ప్రభుత్వం వాటిపై పన్నులు తగ్గించి, సామాన్యులకు పెంచేసింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన 2014-15లో ఆదాయ పన్ను వసూళ్లు రూ.2.6 లక్షల కోట్లు. ఇప్పుడవి రూ.5.6 లక్షల కోట్లకు పెరిగి పోయాయి. ఇదే కాలంలో కార్పొరేట్‌ పన్నులు 28 శాతమే (రూ.4.3 లక్షల కోట్ల నుంచి రూ.5.5 లక్షల కోట్లకు) పెరిగాయి. 2014-15లో ఖజానాకు కార్పొరేట్‌ పన్నుల ద్వారా 34.5 శాతం వాటా సమకూరితే 2021-22లో అది 24.7 శాతానికి పడిపోయింది. కస్టమ్స్‌ ఆదాయం 15 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది. ఇదే కాలంలో వ్యక్తిగత ఆదాయ పన్నుల వాటా మాత్రం 20.8 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగిపోయింది.

కొనుగోలు శక్తి పెంచాలి

కంపెనీలకు పన్నులు తగ్గిస్తే ఉద్యోగాలు సృష్టిస్తాయని, పెట్టుబడులు పెంచుతాయని సర్కారు చెప్పినా, వాస్తవంలో అలాంటిదేమీ జరగలేదు. 2019లో కొత్తగా ఉద్యోగాలు వచ్చిపడిందేమీ లేకపోగా, 2020లో కొవిడ్‌ వల్ల ఉన్న ఉద్యోగాలూ ఊడిపోయాయి. కొవిడ్‌ లాక్‌డౌన్ల వల్ల సామాన్యులు నానా అగచాట్లకు లోనయ్యారు. కార్మికులను, ఉద్యోగులను తొలగించి వేతన వ్యయాల్ని తగ్గించుకోవడం ద్వారా కంపెనీలు లాభాలు పెంచుకోగలిగాయి. పరిశ్రమల్లో యాంత్రీకరణ జరగడం కంపెనీలకు మరింతగా కలిసి వచ్చింది. గడచిన కొన్నేళ్లలో కంపెనీలు బ్యాంకులకు కట్టాల్సిన రుణ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసింది. మొత్తం ఆరు లక్షల కోట్ల రూపాయల మేరకు రాయితీలు, రిబేట్లు ఇచ్చింది. దివాలా చట్టం సాయంతో పెద్ద కంపెనీలు చిన్న సంస్థలను కారుచౌక ధరలకే తీసేసుకున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడమూ ఎక్కువైంది. కార్పొరేట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో చెల్లించే దానికన్నా సామాన్య పౌరులు పరోక్ష పన్నులుగా చెల్లించే మొత్తమే ఎక్కువగా ఉంటోంది. పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం కాకుండా ఎన్నికల్లో గెలవడానికి తాయిలాల్లా ఖర్చు పెట్టే ధోరణి పెరుగుతోంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచినప్పుడు మాత్రమే గిరాకీ పెరిగి ఆర్థికాభివృద్ధి పుంజుకొని ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు వర్ధిల్లుతాయి. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీలను సరళీకరించడం ద్వారా దేశార్థికానికి కొత్త ఊపు వస్తుంది.

జేబులకు చిల్లులు

ఇంధనంపై పన్నులు, వ్యక్తిగత ఆదాయ పన్నులు, కార్పొరేట్‌ పన్నులకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే కంపెనీలకన్నా పౌరులే ఎక్కువ పన్నులు కడుతున్నట్లు తేలుతోంది. ఇంధన ధరలు నానాటికీ పెరుగుతుంటే కార్పొరేట్‌ పన్నులు తరిగిపోతున్నాయి. 2020-21లో పౌరుల నుంచి ప్రభుత్వ ఖజానాకు సమకూరినది రూ.4.69 లక్షల కోట్లయితే, కంపెనీల నుంచి వచ్చిన పన్నుల ఆదాయం రూ.4.57 లక్షల కోట్లు మాత్రమే. ప్రభుత్వం సాధారణ పౌరుల నుంచే గణనీయంగా ఆదాయం పెంచుకొంటోంది. గత యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన ఆయిల్‌ బాండ్లకు తాము చెల్లింపులు జరపాల్సి వస్తోంది కాబట్టి ఇంధన పన్నులు తగ్గించలేమని గతంలో స్పష్టం చేసిన ఎన్డీయే ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్‌ సుంకాన్ని కొంతమేర తగ్గించడం ఊరట కలిగించే అంశం. ఏదిఏమైనా ప్రభుత్వాలు నిరంతరం పౌరుల జేబులకు చిల్లులుపెడుతున్నాయనేది వాస్తవం.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మానవ హక్కులకు పాతర!

‣ అగ్రరాజ్యాలకు డ్రాగన్‌ సరికొత్త సవాలు

‣ డిజిటల్‌ అంతరాలకు సాంకేతిక పరిష్కారం

‣ ప్రగతి రథానికి చోదకశక్తి

‣ కచ్చితమైన గణాంకాలే వృద్ధికి పునాది

Posted Date: 23-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం