• facebook
  • whatsapp
  • telegram

ఖలిస్థానీ ముఠాలకు ఐఎస్‌ఐ దన్ను

పటిష్ఠ నిఘాతోనే దేశ రక్షణ

భారత్‌లో అస్థిర పరిస్థితులను పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) తనకు అనుకూలంగా మలచుకోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంద్వారా దేశీయంగా అలజడులు సృష్టించడానికి, ఖలిస్థానీ ఉద్యమాన్ని పునరుద్ధరించడానికి ఐఎస్‌ఐ పావులు కదిపింది. గతేడాది గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వెనక ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఖలిస్థానీ ఉద్యమాన్ని పునరుద్ధరించేందుకు స్థానిక ముఠాలను ఐఎస్‌ఐ ఎంపికచేసుకొని, వారిని విద్రోహ శక్తులుగా మార్చింది. రైతు ఉద్యమంలోకి వారిని ప్రవేశపెట్టి ఎర్రకోట దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేసింది. తద్వారా దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఐఎస్‌ఐ కుట్ర పన్నింది.

పాక్‌ కుయుక్తులు

రైతు ఉద్యమానికి మద్దతుగా గతంలో కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లలో కొన్ని ఖలిస్థానీ ముఠాలు నిరసన ప్రదర్శనలు జరిపాయి. అంతర్జాతీయంగా ఇండియా పరువును మసకబార్చేందుకు ఐఎస్‌ఐ అలాంటి చవకబారు జిత్తులు వేసినట్లు నిఘాసంస్థలు తేల్చాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని భారత హై కమిషన్‌ కార్యాలయం ముందు గతంలో వేల సంఖ్యలో నిరసనకారులు ఖలిస్తానీ జెండాలను ప్రదర్శించారు. ఐఎస్‌ఐ నిధులు అందించే సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగిన పరమ్‌జీత్‌ పన్ను ఆ నిరసనల్లో పాల్గొన్నారు. పఠాన్‌కోట్‌లోని సైనిక కంటోన్మెంట్‌ గేటు వద్ద గతేడాది నవంబర్‌లో జరిగిన గ్రెనేడ్‌ దాడి వెనకా పాకిస్థాన్‌ హస్తం ఉంది. పాక్‌ దన్నుతో స్థానిక నేరగాళ్లు ఆ దుశ్చర్యకు పాల్పడ్డారు. నిరుడు పంజాబ్‌ సరిహద్దు సమీపంలో 42 గుర్తు తెలియని డ్రోన్లు గాలిలో చక్కర్లు కొడుతూ కనిపించాయి. గుర్తించని డ్రోన్లు మరెన్నో! పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ సరిహద్దుల నుంచి పేలుడు పదార్థాలు, చిన్న ఆయుధాలను డ్రోన్ల సాయంతో పంజాబ్‌లోకి తరలిస్తున్నారు. అలా డ్రోన్లద్వారా ఆయుధాలు అందుకున్న నలుగురు ఖలిస్థానీ తీవ్రవాదులను హరియాణాలోని కర్నాల్‌లో ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. గత సంవత్సరం ఆగస్టులో పంజాబ్‌ పోలీసులు ఖలిస్థాన్‌ నాయకుడు జర్నైల్‌ సింగ్‌ బింద్రన్‌వాలే మేనల్లుడి కుమారుడైన గుర్‌ముఖ్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లో పలు ఉగ్రదాడులకు ఐఎస్‌ఐతోపాటు పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఇతర ఖలిస్థాన్‌ అనుకూల ముష్కర ముఠాల సాయాన్ని గుర్‌ముఖ్‌ తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. రైతు ఉద్యమ సమయంలో భారత నిఘా సంస్థలు ఐఎస్‌ఐ కదలికలను పసిగట్టి స్థానిక పోలీసులకు సమాచారం అందించాయి. మహారాష్ట్ర సైబర్‌ సెల్‌తో సహా ఇతర భద్రతా విభాగాలు రైతు ఉద్యమంపై గట్టి నిఘా పెట్టాయి. సామాజిక మాధ్యమాల్లో ఖలిస్థాన్‌తో సంబంధం ఉన్న పన్నెండు వేలకుపైగా పోస్టులను మహారాష్ట్ర సైబర్‌ సెల్‌ గుర్తించింది. సంబంధిత సోషల్‌ మీడియా ఎకౌంట్లలో అధికభాగాన్ని చాలా కాలం క్రితమే తెరచినా, అవి వినియోగంలో లేవు. రైతు ఉద్యమ సమయంలో అకస్మాత్తుగా అవన్నీ క్రియాశీలంగా మారాయి. పాశ్చాత్య దేశాలనుంచి పనిచేస్తున్న ఖలిస్థాన్‌ అనుకూల ముఠాలతో పొంచి ఉన్న ముప్పుపై ఇటీవల హడ్సన్‌ సంస్థ నివేదిక సైతం హెచ్చరించింది. వాటికి పాకిస్థాన్‌ నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ‘ఖలిస్థాన్‌ కాషాయ జెండాను ఎగరేద్దాం... మోదీ త్రివర్ణ పతాకాన్ని నిరోధిద్దాం’ ప్రచారానికి పది లక్షల డాలర్లను ఇవ్వనున్నట్లు ఈ ఏడాది జనవరిలో అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్‌ అనుకూల ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ సంస్థ ప్రకటించింది. ఇండియా వేగంగా స్పందించడంతోపాటు క్షేత్రస్థాయి అననుకూల పరిస్థితులతో ఆ ప్రణాళికలకు అడ్డుకట్ట పడింది.

అక్రమంగా ఆయుధాలు

దేశీయంగా ఖలిస్థాన్‌ ఉద్యమానికి సరైన మద్దతు లేకపోయినా- కొన్ని గ్రూపులు ఉత్తర అమెరికా, ఐరోపాల నుంచి పనిచేస్తూ దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసిన నెల తరవాత గతేడాది లూధియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. ఆ దాడిలో కీలక సూత్రధారి, సిక్కు వేర్పాటువాది జస్విందర్‌ సింగ్‌ను భారత్‌ సమాచారం మేరకు జర్మనీలో అక్కడి భద్రతా విభాగాలు అరెస్టు చేశాయి. ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న జస్విందర్‌- పాక్‌ సరిహద్దుల నుంచి పంజాబ్‌లోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. వివాదాస్పద ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ ఉద్యమంలో జస్విందర్‌ను కీలక సభ్యుడిగా తేల్చింది. ఇండియాను లక్ష్యంగా చేసుకున్న జిహాదీ, ఖలిస్థాన్‌ మూకలకు దశాబ్దాలుగా ఐఎస్‌ఐ దన్నుగా నిలుస్తోంది. భారత నిఘా సంస్థలు సకాలంలో సమర్థంగా స్పందిస్తుండటంతో ఐఎస్‌ఐ ఆటలు సాగడంలేదు. ఇటీవలి కాలంలో ఐఎస్‌ఐ దన్నుతో విధ్వంసక ముఠాల కార్యకలాపాలు ఊపందుకొంటున్నాయి. ఈ తరుణంలో నిఘా సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

- నీరజ్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రైతుకు ద్రవ్యోల్బణం సెగ

‣ కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

‣ పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ

‣ నేపాల్‌తో బలపడుతున్న బంధం

Posted Date: 31-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం