• facebook
  • whatsapp
  • telegram

కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

దక్షిణ చైనా సముద్రంలో దూకుడు

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని దక్షిణ చైనా సముద్రం గత 20 ఏళ్లుగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. పసిఫిక్‌ మహాసముద్రంలో భాగమైన దక్షిణ చైనా కడలి 35 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దానిపై పూర్తి ఆధిపత్యానికి డ్రాగన్‌ దేశం అర్రులు చాస్తోంది. మత్స్య సంపద, ముడిచమురు, గ్యాస్‌ నిల్వలు అపారంగా పోగుపడిన ఆ ప్రాంతాన్ని తన ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏటా 3.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన వర్తకం ఆ సముద్రం మీదుగా సాగుతోంది. జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియాలకు 80శాతానికి పైగా ముడి చమురు ఆ మార్గంలోనే అందుతోంది. ముఖ్యంగా తన జాతీయ భద్రతకూ దక్షిణ చైనా కడలి వ్యూహాత్మకమైనదిగా డ్రాగన్‌ భావిస్తోంది.

అంతర్జాతీయ చట్టాలకు గండి

సముద్ర చట్టంపై ఐక్యరాజ్య సమితి ఒడంబడిక (యూఎన్‌సీఎల్‌ఓఎస్‌) ప్రకారం చైనాకు దాదాపు ముప్ఫై లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర భూభాగాలు ఉన్నాయి. తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో 200 నాటికల్‌ మైళ్ల ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్‌) అందులో భాగం. ఈఈజెడ్‌ పరిధిలో మత్స్య సంపద, ముడి చమురు, ఇతర ఖనిజ వనరుల అన్వేషణ, సమీకరణలకు డ్రాగన్‌ దేశానికి సార్వభౌమ హక్కులున్నాయి. ప్రాదేశిక సముద్రంలో 12 నాటికల్‌ మైళ్లదాకా అది తన కార్యకలాపాలను నిర్వహించవచ్చు. అయితే, దక్షిణ చైనా సముద్రంలోని దీవులన్నీ తనవేనని చైనా వితండవాదానికి దిగుతోంది. జన చైనా ఆవిర్భావానికి ముందు 1947లో కొమింగ్‌టన్‌ హయాములో రూపొందించిన మ్యాపును దానికి సాక్ష్యంగా చూపుతోంది. దక్షిణ చైనా కడలిలో చైనా పరిధిని తొమ్మిది గీతలతో ఆ పటం సూచిస్తుంది. తైవాన్‌, వియత్నామ్‌, ఫిలిప్పీన్స్‌, బ్రునై, మలేసియాల ఈఈజెడ్‌లు, పలు వివాదాస్పద దీవులు చైనా చూపిస్తున్న మ్యాపు పరిధిలోకే వస్తాయి. అలా ఇరవై లక్షల కిలోమీటర్లకు పైగా సముద్ర ప్రాంతం వివాదాస్పదంగా మారింది.

దక్షిణ చైనా సముద్రాన్ని తన గుప్పిట పట్టేందుకు డ్రాగన్‌ అంతర్జాతీయ చట్టాలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతోంది. అందులోని పగడపు దీవులను ధ్వంసం చేస్తూ సొంతంగా దీవులను నిర్మిస్తోంది. ఈ చర్యలకు చైనా తీర రక్షక దళం (సీసీజీ), నావికాదళం దన్నుగా నిలుస్తున్నాయి. సీసీజీ ఉద్దేశపూర్వకంగా మత్య్సకారుల నావలను ముంచేస్తోంది. మత్స్యకారులను అపహరించి వారిని విడుదల చేయడానికి ధనం డిమాండు చేస్తోంది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఇతర దేశాల ఈఈజెడ్‌లలో మత్స్య, ముడి చమురు లీజులు, నౌకాదళ చట్టాల అమలు వంటి వాటిలోనూ సీసీజీ తలదూరుస్తోంది. దానికితోడు ప్రజా సాయుధ దళాల సముద్ర మిలీషియా (పీఏఎఫ్‌ఎంఎం) తన అక్రమ కార్యకలాపాలతో ఉద్రిక్తతలను మరింతగా పెంచుతోంది. యూనిఫాం లేని ఈ సైనిక దళం చైనా ప్రభుత్వ అధీనంలో పనిచేస్తోంది. చైనా సుప్రీంకోర్టు విదేశీయుల హక్కుల్లో జోక్యం చేసుకునేలా 2016 ఆగస్టులో తన పరిధిని విస్తరించింది. తద్వారా దక్షిణ చైనా సముద్రంలో చేపల వేట సాగించే ఇతర దేశాల నౌకలను చైనా నియంత్రించే, వాటిని ఇబ్బందులకు గురిచేసే అవకాశం దక్కినట్లయింది. అంతర్జాతీయ చట్టాలకు గండికొట్టేలా 2021 ఫిబ్రవరిలో చైనా నూతన సముద్ర పోలీసు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద ప్రాంతాల్లోకి వచ్చే విదేశీ నౌకలపై సీసీజీ మారణాయుధాలను ప్రయోగించే అవకాశం కల్పించడం దాని ప్రధాన ఉద్దేశం.

స్వీయ శాసనాల అమలు

అమెరికా, ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలువరించే పనిలో తలమునకలై ఉండగా, డ్రాగన్‌ తన దృష్టిని ఆగ్నేయ దిక్కుకు మళ్ళించింది. యుద్ధసన్నద్ధ తరహాలో సైనిక కార్యకలాపాల ద్వారా దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు సమాయత్తమైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన వెంటనే, డ్రాగన్‌ ఏకపక్షంగా వారం పాటు టాంకిన్‌ గల్ఫ్‌లో సైనిక విన్యాసాలను నిర్వహించింది. వియత్నామ్‌ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని ప్రాంతాల్లోనూ వాటిని చేపట్టింది. కేవలం సైనిక కార్యకలాపాలతోనే కాకుండా, సమర్థ దౌత్య మార్గాల్లోనూ దక్షిణ చైనా కడలిని గుప్పిట పట్టేందుకు డ్రాగన్‌ ఆరాటపడుతోంది. గతంలో చైనా దుష్కృతాలపై పోరాడిన ఫిలిప్పీన్స్‌ సైతం చైనా జిత్తుల్లో చిక్కి దానికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ చట్టాలను కాదని డ్రాగన్‌ తన సొంత శాసనాలను అమలుచేస్తోంది. తద్వారా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని యత్నిస్తోంది. అగ్రరాజ్యంగా ఎదుగుతున్న తరుణంలో, సొంత ప్రయోజనాలకే బీజింగ్‌ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. చైనా విస్తరణ కాంక్షకు అడ్డుకట్ట వేయడానికి ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్‌, అమెరికాలతో ‘క్వాడ్‌’ కూటమి ఏర్పాటైంది. ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, అమెరికాలతో ‘ఆకుస్‌’ కూటమి కొలువుతీరింది. అయినా దౌత్య మార్గాలు, సైనిక బలంతో దక్షిణ చైనా కడలిపై నియంత్రణకు చైనా తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా జరిగిన ‘క్వాడ్‌’ సదస్సులో డ్రాగన్‌ను సమర్థంగా నిలువరించడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనాను నిలువరించాలంటే అమెరికా, దాని మిత్ర దేశాలు డ్రాగన్‌ బాటలోనే సాగాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సొంతంగా పేర్లు

డ్రాగన్‌ ఆగడాలపై 2013 జనవరిలో ఫిలిప్పీన్స్‌ యూఎన్‌సీఎల్‌ఓఎస్‌లో భాగంగా ఏర్పాటైన మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. చైనా చెబుతున్న పాతకాలం మ్యాపు చెల్లదని ఆ ట్రైబ్యునల్‌ 2016లో తేల్చింది. ఆ తీర్పును పెడచెవిన పెట్టిన డ్రాగన్‌- తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. దక్షిణ చైనా సముద్రంలో పౌర నౌకలకు తరచూ ఆటంకం కలిగిస్తోంది. 2020 ఏప్రిల్‌లో చైనా కావాలనే పారాసెల్‌ దీవుల సమీపంలో వియత్నాం మత్స్యకారుల నౌకను ముంచివేసింది. దక్షిణ చైనా కడలిలో తన ప్రాబల్యాన్ని విస్తరించేందుకు వివాదాస్పద దీవుల్లో కొత్త పరిపాలనా ప్రాంతాలు, నూతన చట్టాలను బీజింగ్‌ రూపొందిస్తోంది. 2020 ఏప్రిల్‌లో చైనా పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ వివాదాస్పద దీవుల్లో రెండు కొత్త జిల్లాలు, పాలనా శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. 25 దీవులు, 55 సముద్ర గర్భ పర్వతాలు, శిఖరాలకు కొత్తగా పేర్లు పెట్టింది. అలా వాటిపై తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ

‣ నేపాల్‌తో బలపడుతున్న బంధం

‣ ఆగని పోరుతో సంక్షోభం తీవ్రం

‣ అడవులను కబళిస్తున్న కార్చిచ్చులు

‣ మోయలేని పన్నుల భారం

‣ మానవ హక్కులకు పాతర!

Posted Date: 27-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం