• facebook
  • whatsapp
  • telegram

రైతుకు ద్రవ్యోల్బణం సెగ

గోధుమ ఎగుమతులపై నిషేధం

రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గోధుమలకు కొరత నెలకొనడంతో మనదేశ రైతులకు మంచి ఆదాయం దక్కే అవకాశం ఏర్పడింది. అయితే, గోధుమల ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించడంతో కర్షకుల ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. ప్రపంచ గోధుమ విపణిలో రష్యాకు 18 శాతం, ఉక్రెయిన్‌కు 12 శాతం వాటా ఉంది. ప్రస్తుత యుద్ధ వాతావరణం కారణంగా సముద్ర రవాణా, సరఫరా గొలుసు వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో ప్రపంచవ్యాప్తంగా గోధుమ నిల్వల సరఫరా తగ్గి, ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో గోధుమ ఎగుమతులు ఊపందుకొనే సువర్ణావకాశం భారత్‌కు లభించింది.

మనదేశంలో ఇటీవలి రబీ సీజన్‌లో గోధుమ దిగుబడులు వేసవి వేడి కారణంగా కొంతమేరకు తగ్గినా ఉత్పత్తి 10.6 కోట్ల టన్నులకు చేరుకుంది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో గోధుమ 0.74 కోట్ల టన్నులు, వరి 1.35 కోట్ల టన్నుల మేర నిల్వలున్నాయి. ప్రస్తుతం ప్రపంచ విపణిలో గోధుమ ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ మే నెలలో ఈజిప్టు, దక్షిణ కొరియా తదితర దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామని ప్రకటించింది. వివిధ దేశాల్లో అవకాశాలను అన్వేషించి ఎగుమతి కాంట్రాక్టులను కుదుర్చుకోవడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందాలను సైతం పంపించింది. గోధుమ ఎగుమతుల ద్వారా దాదాపు వెయ్యి కోట్ల డాలర్లను అర్జించవచ్చని ప్రభుత్వం ఆశించింది. గోధుమ ఉత్పత్తులకు ప్రపంచ విపణితోపాటు, దేశీయ మార్కెట్లోనూ ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సైతం దక్కక, గోధుమల్ని చౌకగా అమ్ముకుని, సాగు ఖర్చులు సైతం గిట్టుబాటుకాక నష్టపోయిన రైతాంగం సహజంగానే మెరుగైన ఆదాయం లభిస్తుందని ఆశపడింది. కాగా దేశంలో ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం దాదాపు 15 శాతానికి, చిల్లర ద్రవ్యోల్బణం ఎనిమిది శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని కారణంగా చూపుతూ వెంటనే గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఫలితంగా రేవుల్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న గోధుమ నిల్వలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఈజిప్టు తదితర దేశాలతో ఇప్పటికే చేసుకొన్న ఒప్పందాల్లో సగం మాత్రమే ఎగుమతి జరిగింది. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా దేశీయ మార్కెట్‌లో టన్ను గోధుమ ధర రూ.2400 నుంచి రూ.2100కి పడిపోయింది. రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పలు ప్రపంచ దేశాలు భారత చర్యను తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రపంచ గోధుమ మార్కెట్లలో 2020 వరకు కేవలం 0.54 శాతం వాటాతో ఉన్న భారత్‌ ఇటీవలి సంవత్సరాల్లోనే పుంజుకోవడం ప్రారంభించింది. ఇలాంటి దశలో నిషేధం విధించడంతో నిలకడైన ఎగుమతిదారుగా రావాల్సిన పేరుప్రతిష్ఠలు మసకబారాయి. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు పంట సీజన్‌లో రైతుల నుంచి మార్కెట్‌లో కొనుగోలు చేసిన గోధుమలు, ఆవాలు, సోయా, మొక్కజొన్నలను భారీగా నిల్వ చేశాయి. ఇందుకోసం ఆయా సంస్థలు లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, వంట నూనెల నిల్వ సామర్థ్యం కలిగిన భారీ గోదాములను, ప్రైవేటు రైల్వే లైన్లతోపాటు నిర్మించుకున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు మాత్రం రైతులకు నష్టం కలిగించే, కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేకూర్చే మార్కెటింగ్‌, నిల్వ, సరఫరాలతో కూడిన విధానాలనే కొనసాగిస్తున్నాయనే విమర్శలున్నాయి.

మార్కెట్‌ ధరకన్నా ఎఫ్‌సీఐ కొనుగోలు ధర (మద్దతు ధర) బాగా తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం చేపట్టే గోధుమ సేకరణ బాగా తగ్గిపోయింది. దీనివల్ల సర్కారు పేదలకు అందించే అంత్యోదయ, గరీబ్‌ కల్యాణ యోజన పథకాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఆహార చట్టంలో భాగంగా పేదలకు చౌకగా సరఫరా చేసే రేషన్‌ సరకుల పంపిణీ సైతం సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. దీనివల్ల అధిక ధరలతో సతమతమవుతున్న పేదల జీవన పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా క్వింటాలుకు రూ.500 బోనస్‌ను ప్రకటించాలి. వివిధ రైతు సంఘాలు డిమాండు చేస్తున్న విధంగా మద్దతు ధరలను పెంచాలి. దీని ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం  చేకూరడమే కాకుండా ప్రభుత్వ ఆహార పంపిణీ వ్యవస్థ పటిష్ఠంగా మారే అవకాశం ఉంటుంది.

- డాక్టర్‌ సోమఎస్‌.మార్ల 

(ముఖ్య శాస్త్రవేత్త, భారత వ్యవసాయ పరిశోధనా మండలి)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

‣ పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ

‣ నేపాల్‌తో బలపడుతున్న బంధం

‣ ఆగని పోరుతో సంక్షోభం తీవ్రం

‣ అడవులను కబళిస్తున్న కార్చిచ్చులు

‣ మోయలేని పన్నుల భారం

‣ మానవ హక్కులకు పాతర!

Posted Date: 31-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం