• facebook
  • whatsapp
  • telegram

కల్తీని పారదోలితేనే ఆరోగ్య భారతం

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

దేశ సుస్థిరాభివృద్ధి సాధనలో ప్రజారోగ్యం కీలకపాత్ర పోషిస్తుంది. పౌష్టికాహార లభ్యత, వైద్యరంగంలో మౌలిక వసతులు, ఆహార భద్రత వంటివాటితో ప్రజారోగ్యానికి భరోసా లభిస్తుంది. ప్రజాశ్రేయస్సుకోసం నాణ్యమైన ఆహార లభ్యత అత్యావశ్యకం. కానీ నాణ్యమైన ఆహారం అందరికీ అందుబాటులో లేక- మానవ వనరులకు తీరని నష్టం కలుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ధరణిపై కలుషితాహారం తిని ఏటా 4.20లక్షల మంది మరణిస్తున్నారు. ప్రతీ పది మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. పేద, స్వల్ప ఆదాయం ఉన్న దేశాల్లో సురక్షితం కాని ఆహారం వల్ల ఉత్పాదక రంగంలో, వైద్య ఖర్చుల రూపేణా ప్రజలు ఏటా 11 వేల కోట్ల డాలర్లు నష్టపోతున్నారని అంచనా. ఈ దేశాల్లో ప్రతి సంవత్సరం అయిదేళ్లలోపు పిల్లలు 1.25లక్షల మంది అకాలమరణం చెందుతున్నారు. 40శాతం ప్రజలు ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.

అభివృద్ధికి ఆటంకం

కలుషితాహారం వల్ల కలిగే వ్యాధులతో ఆరోగ్య సంరక్షణ, దేశార్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. పర్యాటకం, వాణిజ్య రంగాలు నష్టపోయి, అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. సురక్షిత ఆహారం ప్రాధాన్యాన్ని తెలిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ సంయుక్తంగా ఏటా జూన్‌ ఏడో తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ‘సురక్షిత ఆహారం, మెరుగైన ఆరోగ్యం’ అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణలో సురక్షిత ఆహారం ప్రధాన పాత్రపోషిస్తుంది. కానీ హానికారక బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్న జీవులు ఉన్న ఆహారం తిని ప్రజలు సుమారు 200కు పైగా వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శిశువులు, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తులకు ఈ తరహా వ్యాధులతో ముప్పు ఎక్కువ. మెరుగైన ఆహార వ్యవస్థలను ప్రజలకు అందించడానికి ప్రభుత్వాలు, ఉత్పత్తిదారుల మధ్య సహాయ సహకారాలు, సమన్వయం అవసరం. భారత్‌లో కలుషితాహారంలోని వ్యాధి కారక క్రిములు ఏటా లక్షలాది ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. లిస్టెరియా ఇన్ఫెక్షన్లు స్త్రీలలో గర్భస్రావానికి, నవజాత శిశువుల మరణానికి కారణమవుతున్నాయి. హెపటైటిస్‌-ఎ వైరస్‌ కలుషితాహారం ద్వారా సంక్రమించి, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి సంభవిస్తోంది. సాధారణంగా పరాన్నజీవులు పలు రకాలుగా ఆహారపు గొలుసులోకి ప్రవేశించి తాజా ఉత్పత్తులను కలుషితం చేస్తాయి. పరిశ్రమల్లో, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే డయాక్సిన్లు అత్యంత విషపూరితంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. క్యాన్సర్‌ వ్యాప్తికి దోహదపడుతున్నాయి. పునరుత్పత్తి సమస్యలూ తలెత్తుతున్నాయి. సీసం, కాడ్మియం, పాదరసం వంటివి నరాల వ్యాధులను, మూత్రపిండాలకు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. వాటివల్ల నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. ఆహార కల్తీని అరికట్టి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వినియోగదారుల అలవాట్లలో మార్పులు, ఆధునిక జీవనశైలి, ఆదాయాల్లో పెరుగుదల వంటివి పెనుమార్పులకు కారణమయ్యాయి. నిల్వ ఉన్న, తయారైన ఆహారం తీసుకోవడం అధికమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆహారపు అలవాట్లు, అభిరుచులు సమూలంగా మారిపోతున్నాయి. బయట లభించే ఆహారంపై మోజు పెరుగుతోంది. ఆకట్టుకునే ప్రచారం, సొగసైన ప్యాకింగ్‌ వంటివి వినియోగదారులను ఊరిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆహారాన్ని విక్రయించడం పెచ్చుమీరింది. ఏం తినాలన్నా నిమిషాల్లో బయటినుంచి తెప్పించుకునే ధోరణులు పెరుగుతున్నాయి. కొందరు వ్యాపారులు సురక్షితం కాని, చౌకరకమైన, కల్తీ ఆహారాన్ని విక్రయిస్తూ ఉండటం వ్యాధుల విజృంభణకు దారితీస్తోంది.

ప్రభుత్వాలదే బాధ్యత!

దేశంలో అధిక శాతం ప్రజానీకానికి ఆహార ప్రమాణాలు, భద్రతలపై కనీస అవగాహన లేకపోవడం శోచనీయం. కల్తీ ఆహారకాటుకు గురికాకుండా పాటించాల్సిన ప్రమాణాలు, అనుసరించాల్సిన విధానాల గురించి వినియోగదారులకు సంపూర్ణ అవగాహన కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వాల చర్యలు నామమాత్రంగా ఉండటం అత్యంత బాధాకరం. అందరికీ సురక్షిత ఆహారాన్ని అందించడంలో ‘భారత ఆహార భద్రతా, ప్రమాణాల సంస్థ’ చొరవ తీసుకోవాలి. ఆహార తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, దిగుమతులను పర్యవేక్షించాలి. ‘ఆహార భద్రతా ప్రమాణాల చట్టం’ నియమ నిబంధనలను ప్రచారం చేయాలి. గ్రామీణులకు సరైన అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు, విక్రయశాలలు తగిన అనుమతులు పొందేలా చూడాలి. నిరంతరం తనిఖీలు నిర్వహించి, అక్రమాలకు పాల్పడినవారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాల పాత్రను పెంచి, ఆహార భద్రతను కట్టుదిట్టం చేయాలి. ప్రజారోగ్యం పరిఢవిల్లడానికి అవసరమైన అన్ని చర్యలూ సత్వరమే చేపట్టకపోతే కలుషితాహారం ఎందరి ప్రాణాలనో హరిస్తుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దానివల్ల ఉత్పాదకతకు విఘాతం కలుగుతుంది. తద్వారా దేశార్థికాభివృద్ధికీ ఆటంకాలేర్పడతాయి. దేశ ప్రజలకు ఆహార భద్రతతో కూడిన ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజా సంక్షేమాన్ని, సుస్థిరాభివృద్ధిని సాధించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం కావాలి. అప్పుడే ఆరోగ్య భారతావని సాకారమవుతుంది.

- ఎ.శ్యామ్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సవాళ్లు అధిగమిస్తేనే సమ్మిళిత అభివృద్ధి

‣ బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం

‣ ఖలిస్థానీ ముఠాలకు ఐఎస్‌ఐ దన్ను

‣ రైతుకు ద్రవ్యోల్బణం సెగ

‣ కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

‣ పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ

‣ నేపాల్‌తో బలపడుతున్న బంధం

Posted Date: 07-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం