• facebook
  • whatsapp
  • telegram

నీటి సంరక్షణ తక్షణ కర్తవ్యం

ప్రపంచ జల దినోత్సవం

ప్రకృతి ప్రసాదిత జలానికి ప్రత్యామ్నాయం లేదు. అమూల్యమైన ఈ సహజ వనరును పరిరక్షించుకుంటూ పొదుపుగా, సమర్థంగా వాడుకుంటేనే జల సంక్షోభాలను ఎదుర్కోగలం, కొరతను అధిగమించగలం. ఏటికేడు నీటి అందుబాటు-అవసరం మధ్య అంతరం భారీగా పెరుగుతోంది. ఒకవైపు జనాభాతోపాటు నీటి వినియోగం పెరిగిపోతుండగా, మరోవైపు వర్షాలు తగ్గిపోయి భూగర్భ జలాలపై ఒత్తిడి అధికమై తాగునీటికి కటకట ఏర్పడుతోంది. ముఖ్యంగా భారత్‌లో వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలు రెట్టింపై ఏటికేడు నీటి కొరత తీవ్రమవుతోంది. రానున్న  నీటి ముప్పుపై ముందుగానే మేల్కొని తదనుగుణంగా చర్యలు చేపట్టకపోతే ప్రపంచం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఐరాస జల విభాగం హెచ్చరించింది. మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ భూగర్భ జల వనరుల మదింపు కేంద్రం (ఐజీఆర్‌ఏసీ)- ‘కంటికి కనిపించని భూగర్భ జలాన్ని సద్వినియోగంద్వారా కనిపించేలా చేద్దాం’ అనే నినాదంతో ప్రజలకు పిలుపిచ్చింది.

పెరుగుతున్న ఒత్తిడి

వైవిధ్య వాతావరణం, అడవులు, నదులు కలిగిన మన దేశంలో వర్షపాతం అధికమే. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో ఏటికేడు వర్షాలు, వర్షపాతం తగ్గిపోతున్నాయి. కురిసిన వర్షంలో అధిక శాతం వృథాగా పోవడం, నిల్వ చేసుకోవడానికి తగిన  సదుపాయాలు లేకపోవడం, వర్షాలు అన్నిచోట్లా సమానంగా కురవకపోవడం వంటి కారణాలతో భూగర్భ, ఉపరితల జలాలపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా అధిక వినియోగం, కరవుల వల్ల ఉపరితల నీటి లభ్యత తగ్గిపోవడం, మూలిగే నక్కపై తాటి పండులా నదీ జలాలు కలుషితం కావడం వల్ల ప్రజలు తప్పనిసరిగా భూగర్భ జలాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రపంచమంతా కలిపి వినియోగించే భూగర్భ జలాల్లో కీలకవాటా మనదే. ఇందులో సింహభాగం సేద్య రంగానిదే. దేశంలో ఇప్పటికీ వ్యవసాయం కోసం భూగర్భ జలాలపై అధికంగా ఆధారపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సగం తాగునీటి అవసరాలకు భూగర్భ జలాలే ఆధారం. పర్యావరణ వ్యవస్థల సుస్థిరత, నదుల్లో కనీస ప్రవాహాలకు అవి ఆలవాలం. సురక్షిత తాగునీరు అందుబాటులో లేని వారికీ అవి పరిష్కారం. కీలకమైన తాగునీటికి మూలమైన పాతాళ జలం ప్రమాదకర స్థాయిలో తరిగిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు, ఉపరితల నీరు ఆవిరవుతోంది. గోరుచుట్టుపై రోకటి పోటులా పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో కాలుష్యం పోటెత్తి నీటి వనరులు కలుషితమవుతున్నాయి. వివిధ పరిశ్రమల నుంచి వచ్చే భారలోహాలతో భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి. ఇక మోతాదుకు మించిన రసాయన   ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ప్రమాదకర మూలకాలు భూగర్భంలో పేరుకుపోతున్నాయి. దీనికితోడు సముద్ర పరీవాహక ప్రాంతాల్లో ఖాళీ అవుతున్న భూగర్భ పొరల్లో ఉప్పునీరు చేరుతోంది. అమృతతుల్యమైన జలం విలువ అపారం. వ్యవసాయం, పరిశ్రమ, విద్యుత్‌ ఉత్పత్తి వంటి ఏ రంగంలోనైనా దాని పాత్ర వర్ణనాతీతం. జీవజాలానికి ప్రాణావసరమైన నీటిని సంరక్షించడం, భావి తరాల కోసం పొదుపు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ పరిమిత వనరు అపరిమిత అవసరాలను తీర్చాలంటే జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించాలి. నీటి లభ్యత సమాచారం ఆధారంగా తాగు, సాగు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నీటి నిర్వహణ ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఈ విషయంలో జాతీయ భూభౌతిక   సంస్థ-ఎన్‌జీఆర్‌ఐ పరిశోధనల ఫలితాలు అనుసరణీయం.

సాంకేతిక ఆసరా

గడచిన అయిదు దశాబ్దాలుగా సీఎస్‌ఆర్‌ఐ-ఎన్‌జీఆర్‌ఐ భూగర్భ జలాల వినియోగం, నీటి అన్వేషణ, లభ్యత, నిర్వహణపై పరిశోధనలు చేస్తోంది. సుస్థిర తాగు, సాగు నీటి అవసరాల కోసం మేలైన నిర్వహణ ప్రక్రియలు, అంతర్జాతీయ నూతన సాంకేతిక పద్ధతులను పరిచయం చేసింది. ఇటీవల భూగర్భంలోని నీటి ఆనవాళ్ల గుర్తింపు, జలమట్టాల అంచనా కోసం సరికొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఈ రెండు సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాతి పొరలు అధికంగా ఉండే చోట నీటి లభ్యత గురించి అన్వేషిస్తున్నాయి. భూభౌతిక పరికరాల ద్వారా భూగర్భ జలాలు ఎక్కడ ఉన్నాయో, బోరు ఎక్కడ వేయాలో సూచిస్తున్నాయి. దీనివల్ల బోరు నీటిని సమర్థంగా వినియోగించుకోవచ్చు. గ్రామ, మండల స్థాయుల్లో జలశోషణ చెరువులు నిర్మించడం ద్వారా భూగర్భ జలమట్టాలను గణనీయంగా పెంచే విధానాలు రూపొందించింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలోని మందోళ్లగూడెంలో 2003లో జలశోషణ చెరువు నిర్మించి గరిష్ఠంగా భూపొరల్లోకి నీరు ఇంకేలా ఏర్పాట్లు చేయగా, భూగర్భ జలాలు బాగా రీఛార్జి అయ్యాయి. 2003లో 20 మీటర్లకంటే తక్కువగా ఉన్న భూగర్భ జలాలు, 2016 నాటికి 10 మీటర్లు పైకి వచ్చాయి. దీని ఆధారంగా దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా నీటి నమూనాను రూపొందించారు. ఈ అనుభవ పాఠాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో బిందు, తుంపర సేద్యం ద్వారా సమర్థ నీటి వినియోగాన్ని ప్రోత్సహించాలి. పరిశ్రమల్లో 80శాతం శుద్ధిచేసిన నీటి వాడకాన్ని తప్పనిసరి చేయాలి. నదుల్లోకి గరళ జలాలు కలవకుండా చర్యలు తీసుకోవాలి. వర్షపునీటిని ఒడిసిపట్టాలి. భూగర్భం నుంచి తీసుకునే నీటికి రెట్టింపు జలాన్ని నేలలోకి ఇంకించాలి. ఇందుకోసం ఇంకుడు గుంతలు, బోరు రీఛార్జ్‌ ఛాంబర్లు, పంట కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. పట్టణాలు, నగరాల్లో వర్షం నీటిని నిల్వచేసే భూగర్భ ట్యాంకుల నిర్మాణం తప్పనిసరి చేయాలి. ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతకు పెద్దపీట వేస్తూ జీవజలాన్ని ప్రజలకు సరఫరా చేయాలి. కంటికి కనిపించని భూగర్భ జలాన్ని పది కాలాలపాటు కాపాడుకుంటేనే మానవ జాతికి భవిష్యత్తు!

హరించుకుపోతున్న నాణ్యత

ఏటికేడు నీటి అవసరాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత నీటి లభ్యత, వర్షపాతాల పరిస్థితులనుబట్టి చూస్తే భవిష్యత్తులో తీవ్ర కొరత ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు నీటి నాణ్యతపరంగా అధ్వాన స్థితిలో ఉన్నాం. దేశంలో సరఫరా అవుతున్న నీటిలో ఎక్కువ శాతం కాలుష్య కారకమే. నీటి వనరుల్లోకి శుద్ధి చేయకుండా వ్యర్థ జలాలు వదలడమే ఇందుకు కారణమవుతోంది. వ్యర్థాల ఉత్పత్తి, శుద్ధికి మధ్య వ్యత్యాసం భారీగా ఉంటోంది. దేశంలో నీటి, మురుగు శుద్ధి కేంద్రాల పనితీరు, నిర్వహణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ నీటి నాణ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. దేశంలో కోట్ల మందికి సురక్షితమైన నీరు అందడం లేదు. నీటి సంబంధ రోగాలతో ఏటా లక్షలసంఖ్యలో చిన్నారులు మృత్యుఒడికి చేరుతున్నారు.

- ఎం.కరుణాకర్‌రెడ్డి 

(‘వాక్‌ ఫర్‌ వాటర్‌’ వ్యవస్థాపకులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సిలబస్‌ అంతా చదవాలి.. ప్రశ్నలు సాధన చేయాలి!

‣ ఇంటర్మీడియట్‌తో నౌకాదళం కొలువులు

‣ విజయాన్ని నిర్ణయించే వ్యక్తిత్వ పరీక్ష!

‣ IIT Madras‌: ఐఐటీ మద్రాస్‌ ఆన్‌లైన్‌ బీఎస్సీ

‣ అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌ అలా సాధించారు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 22-03-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం