• facebook
  • whatsapp
  • telegram

అనర్థాలకు ఆలవాలం!

భూతాపానికి కళ్లెంతోనే భవితవ్యం

భూతాపం, వాతావరణ మార్పులు... రెండు దశాబ్దాలుగా పత్రికలు, ప్రసార మాధ్యమాలు, అంతర్జాతీయ వేదికలపై హోరెత్తుతున్న పదాలివి. ఐక్యరాజ్యసమితి, భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తల్ని కలవరపరుస్తున్న అంశాలివి. ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాలు. నిజంగా మన భూమికి ఏదైనా జరిగిందా అన్నది సామాన్యుల మదిలో మెదిలే పెద్ద ప్రశ్న! దీనికి జవాబు కాస్త వెనక్కి తిరిగి చూస్తే దొరుకుతుంది. 30 ఏళ్ల క్రితం నాటి మానవ జీవన, ఆరోగ్య పరిస్థితుల్ని- నేటి కాలమాన పరిస్థితులతో పోల్చి చూస్తే అప్పటికి, ఇప్పటికి సంభవించిన మార్పులేవో ఇట్టే తెలిసిపోతాయి. రుతువులు గతి తప్పాయని, ప్రకృతి విపత్తులు పెరిగాయని, ఉష్ణోగ్రతలు అధికమయ్యాయని,  ప్రజారోగ్యానికి సవాళ్లు అధికమయ్యాయని అవగతమవుతుంది. అంటే శీతోష్ణస్థితి, రుతు క్రమం, మానవ జీవనంలో పెను మార్పులు వచ్చాయన్నది సుస్పష్టం. వీటన్నింటికీ మూల కారణం పర్యావరణంలో వచ్చిన మార్పులు, భూతాపమేనన్నది అందరూ అంగీకరించాల్సిన సత్యం. ఐరాస అంతర ప్రభుత్వ వాతావరణ మార్పుల కేంద్రం (ఐపీసీసీ2013) నివేదిక ప్రకారం... భూతాపానికి మానవ చర్యలే ప్రధాన కారణం.

విపత్కర పరిస్థితులు

భూతాప పర్యవసానాలను ఆధునిక ప్రపంచం ఇప్పటికే అనేక రూపాలుగా చవిచూస్తోంది. రుతువులు గతి తప్పడం, ఉష్ణోగ్రతలు పెరగడం, భీకర కరవులు, వరదల బీభత్సం, మంచు ఖండాలు కరిగిపోవడం, పగడపు దిబ్బలు మాయం కావడం, ద్వీప దేశాలు మునిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగడం, కొత్త రోగాలు ప్రబలడం లాంటి ఎన్నో విపత్కర పరిస్థితులు అన్ని దేశాలనూ పీడిస్తున్నాయి. ఏటికేడు వాతావరణంలో ఉష్ణోగ్రతలు, కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో భూతాపం ఒక డిగ్రీ సెల్సియస్‌ మేర పెరిగింది. 21వ శతాబ్దంలో 14 అత్యంత ఉష్ణ సంవత్సరాల్లో 13 నమోదయ్యాయి. 2100 నాటికి సముద్ర మట్టాలు 3.6 అడుగుల మేర పెరుగుతాయని అంచనా. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉష్ణోగ్రతలు, ఉద్గారాలు మరింతగా పెరిగిపోయి మానవ జీవనం, జీవ వైవిధ్యం పెను ప్రభావానికి గురవుతాయని అంతర్జాతీయ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాలు వాతావరణ అత్యవసర పరిస్థితి ఎదుర్కొంటాయని ఇటీవల ఐరాస ప్రకటించింది. ఈ శతాబ్దంలో విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా నాలుగు లక్షల 80 వేల మంది చనిపోతారని జర్మన్‌వాచ్‌ అంచనా వేసింది.

భూతాప వ్యాప్తిలో అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలన్నింటిదీ... తిలాపాపం తలా పిడికెడు. ఇందులో అమెరికా, చైనా, భారత్‌, ఐరోపా, ఆస్ట్రేలియా ముందువరసలో ఉన్నాయి. ప్రపంచ ఉద్గారాల్లో వీటి వాటా 91శాతం. ఈ తరుణంలో భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనంటూ ఐరాస తొలిసారి 1992లో ధరిత్రీ సదస్సు నిర్వహించింది. యూఎన్‌డీపీ, యూఎన్‌ఎఫ్‌సీసీసీ, ఐపీసీసీ విభాగాలను ఏర్పాటు చేసింది. 1995 క్యోటో ప్రొటోకాల్‌, 2015 ప్యారిస్‌ ఒప్పందం, 2019లో వాతావరణ ప్రతిస్పందన సమావేశం వరకు- అనేక ఒప్పందాలు, సదస్సులు జరిగాయి. 2030 నాటికి ఏ దేశం ఎంతమేరకు కాలుష్య ఉద్గారాలు తగ్గిస్తాయో పేర్కొంటూ ప్రతిజ్ఞ చేశాయి. కానీ వాస్తవంగా సాధించింది మాత్రం శూన్యం. భూతాప కట్టడి కాగితాల్లోనే కాగిపోతోంది. అగ్ర- పేద దేశాల మధ్య సమన్వయం కొరవడి, నిధుల సేకరణ కష్టమై, సమస్యకు కారణం మీరంటే మీరంటూ నేతలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. కరోనా వంటి ఊహకందని ఎన్నో ఉత్పాతాలకు భూతాపమే కారణం. దీన్ని సమర్థంగా కాచుకొని ఎదుర్కోవడంపైనే మానవాళి మనుగడ, ఆహార, జల, ఆరోగ్య భద్రత ఆధారపడి ఉన్నాయి. 2030నాటికి ఉష్ణోగ్రత మరో రెండు డిగ్రీలు పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో 1.5 డిగ్రీలకు మించకుండా చూసుకోవడం నేడు ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాలు.

చేయిచేయి కలిస్తేనే...

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉద్గారాలను నియంత్రించడం అగ్రదేశాల కర్తవ్యం. ఇది ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధుల బాధ్యత మాత్రమే కాదు. భూమిపై నివసించే అందరిదీ! ప్రభుత్వాల స్థాయిలో శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలి. బొగ్గు, గ్యాస్‌, ఇంధన వినియోగాన్ని సగానికిపైగా తగ్గించి... వాటి స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించి అందుబాటులోకి తేవాలి. శుద్ధ ఇంధన ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలి. ఇంధన సమర్థ సంస్థలు, పరిశ్రమలు తదితరాల్లో పెట్టుబడులు పెట్టాలి. సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను పెద్దయెత్తున నెలకొల్పాలి. ప్రతి ఇల్లూ ఒక సౌర విద్యుత్‌ కేంద్రంగా మారేలా చూడాలి. జాతీయ, ప్రాంతీయ వాతావరణ విధానాలు అమలు పరచాలి. ముఖ్యంగా అడవులు, నీటి రక్షణకు పెద్ద పీట వేయాలి. ఎందుకంటే భూతాపాన్ని తగ్గించగలిగేది పచ్చదనం, అడవులే. 33శాతం అటవీ విస్తీర్ణ లక్ష్యం చేరేలా అడవుల నరికివేతకు అడ్డుకట్ట వేసి సామాజిక వనాల విస్తరణకు పటిష్ఠ కార్యాచరణ చేపట్టాలి. ప్రతి వ్యక్తీ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలి. సామాన్యులు, సెలబ్రిటీలను ఆకర్షిస్తున్న గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌వంటి సామాజిక మొక్కలు నాటే ఉద్యమంలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలి. నీటి పొదుపు-జల సంరక్షణకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలి. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఖనిజ నిక్షేపాల తవ్వకాల్లో హేతుబద్ధత పాటించాలి. అంతిమంగా భూమి, ఇంధనం, పరిశ్రమలు, భవనాల నిర్మాణం, రవాణా, నగరాల జీవనంలో మార్పులు వస్తేగానీ భూతాపం తగ్గదు. ఈ విశ్వం మనది అనుకుని ముందుకు సాగితే, పర్యావరణ హితకరమైన పద్ధతులు ఆచరిస్తే- భూతాపమే కాదు... పర్యావరణ సవాళ్లు ఏవైనా సమసిపోతాయి. విశాలమైన ధరణీతలం ప్రశాంత ఆవాసమవుతుంది. భావి తరాలకు సుస్థిర జీవన భద్రత లభిస్తుంది. ఆ దిశగా అడుగులు పడాలని ఆకాంక్షిద్దాం.

కరవైన ప్రశాంత జీవనం

భూమి, అడవులు, సహజ వనరులు, నీరు, వాతావరణం అన్నీ 19వ శతాబ్దం ముందు వరకు సవ్యంగా, స్వచ్ఛంగానే ఉన్నాయి. 150 ఏళ్ల క్రితం వరకు ఉష్ణోగ్రతలు స్థిరంగానే ఉండేవి. పారిశ్రామికీకరణ, అడవుల విధ్వంసం, అపరిమితంగా గనుల తవ్వకాలు, శిలాజ ఇంధనాల వాడకం, పట్టణీకరణ, ఎడారీకరణ, రసాయన సేద్యం, ప్లాస్టిక్‌ వినియోగం పెరిగాకే పర్యావరణంలో విపరీత మార్పులు సంభవించాయి. బొగ్గు, ఇంధనం, సహజవాయువు వినియోగం పెరిగిపోయి తద్వారా వచ్చే కార్బన్‌-డై-ఆక్సైడ్‌ వాతావరణంలో అధికంగా కలిసిపోయి భూమి వేడెక్కుతోంది. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ప్రత్యక్ష, పరోక్ష కారణం భూతాపమే. ఇది విసరిన పంజాతో నేడు పర్యావరణ, జల, ఆహార, ఆరోగ్య, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, ఉద్యోగ- ఉపాధి భద్రత పెను ప్రమాదంలో పడింది. ప్రజలకు ప్రశాంత జీవనం కరవైంది.

- ఎం.కరుణాకర్‌ రెడ్డి
(‘వాక్‌ ఫర్‌ వాటర్‌’ వ్యవస్థాపకులు)

Posted Date: 16-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం