• facebook
  • whatsapp
  • telegram

వ్యర్థాల దహనం... అనర్థదాయకం!

 

 

పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనం సమస్య మళ్ళీ మొదలైంది. వ్యర్థాలను దహనం చేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తొలగించాలంటే, అందుకయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో దహనం చేయక తప్పదని కుండబద్దలు కొడుతున్నారు.

 

ఏటా శీతాకాలానికి ముందు పంజాబ్‌లో పంట వ్యర్థాలను భారీ మొత్తంలో దహనం చేయడంతో దేశ రాజధాని దిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో తలెత్తుతోంది. ఇప్పుడు దిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రభుత్వాలే ఉండటంతో, ఈ సమస్యకు తగిన పరిష్కారం సాధించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) భావిస్తోంది. పంట వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేయాలనే ఉద్దేశం తమకూ లేదని, అయితే ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తే భారీగా ఖర్చవుతుందనేది రైతుల వాదన. ఈ సమస్యపై ఆప్‌ ప్రభుత్వానికి అవగాహన ఉన్నా, ఇంతవరకూ సరైన పరిష్కార మార్గంతో ముందుకు రాలేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఏక్తా చెబుతోంది. క్వింటాలుకు రూ.100 లేదా ఎకరాకు కనీసం రూ.2,500 చొప్పున ఇస్తే పంట వ్యర్థాలను దహనం చేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంబిస్తామన్నది రైతుల మాట. పంట వ్యర్థాల దహనాన్ని నియంత్రించడానికి పంజాబ్‌ వ్యవసాయ శాఖాధికారులు సమావేశం నిర్వహించి చర్చలు జరిపినా ఫలితం కనబడలేదు. 

 

తప్పని నిరీక్షణ

ఈసారి ఎలాగైనా ఈ సమస్యను నియంత్రించగలమని పంజాబ్‌ ప్రభుత్వం ధీమాగా కనిపిస్తున్నా, రైతు సంఘాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. పంట వ్యర్థాలను తొలగించడానికి అయ్యే ఖర్చులు చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. అలాకాకుండా, వ్యర్థాల దహనానికి పాల్పడే రైతులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే హెచ్చరించాయి. ఎకరాకు రైతులకు రూ.2,500 చొప్పున ఇస్తామని పంజాబ్‌ ప్రభుత్వం మొదట్లో చెప్పింది. ఇందులో రూ.1,500 కేంద్రం భరిస్తే మిగిలిన వెయ్యి రూపాయలు దిల్లీ, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించలేదని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఎంతమేర చెల్లిస్తారన్న దాంతో తమకు సంబంధం లేదని, ఎకరాకు రూ.2,500 చెల్లిస్తేనే దహనానికి బదులుగా, ఇతరత్రా పద్ధతుల్లో వ్యర్థాల తొలగింపునకు కృషి చేస్తామని రైతు నాయకులు స్పష్టీకరిస్తున్నారు. పంజాబ్‌లో వరిపంటను చాలావరకు కంబైన్డ్‌ హార్వెస్టర్లతోనే కోస్తారు. అది కొంతవరకే కోస్తుంది. దాంతో పొలంలో కొంతమేర వరి మొదళ్లు మిగిలిపోతాయి. వరి కోతలకు, తరవాతి సీజన్‌లో గోధుమ వేయడానికి రైతులకు మూడు వారాల సమయమే మిగులుతుంది. అంత తక్కువ సమయంలో మొదళ్లను వదిలించుకోవాలంటే దహనమే సులభమైన మార్గంగా భావిస్తున్నారు. పైగా, దహనం తరవాత వెలువడే బూడిద వల్ల భూసారం పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. వరి పంటను హార్వెస్టర్లతో కోయడం వల్ల వ్యర్థాలు తప్పనిసరిగా మిగులుతాయి. దానికితోడు పంటకు నీటి వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళించగలిగితే రెండు సమస్యలూ చాలావరకు తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, ప్రత్యామ్నాయ పంటలు వేస్తే వాటికి మద్దతుధర ఇచ్చే విషయంలో ప్రభుత్వం నుంచి కచ్చితమైన హామీ కావాలన్నది రైతు సంఘాల డిమాండు. రైతులంతా వరికి బదులు పెసరపంట వేయాలని, మొత్తం పంటను తామే కొంటామని పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వం కోరింది. కానీ, అలా వేసిన రైతుల్లో దాదాపు 80శాతం దాకా ప్రైవేటు వ్యాపారులకే కారుచౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రభుత్వాన్ని నమ్మి ఎలా ముందుకెళ్ళాలని రైతులు మండిపడుతున్నారు. వరి నాట్లు వేయడం కాకుండా నేరుగా విత్తనాలు చల్లే పద్ధతి పాటిస్తే ఎకరాకు రూ.1,500 చొప్పున ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఆ డబ్బుల కోసం రైతులకు ఇప్పటికీ ఎదురు చూపులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల వైపు మరలేందుకు పంజాబ్‌ రైతులు మొగ్గుచూపడం లేదు.

 

ఫలించని ప్రత్యామ్నాయాలు

కంబైన్డ్‌ హార్వెస్టర్లతో పంట కోసిన తరవాత మిగిలే వరి మొదళ్లను కాల్చకుండా డీకంపోజర్‌ లాంటివి చల్లితే సత్ఫలితాలు ఉంటాయని వ్యవసాయాధికారులు చెబుతున్నా, అవి అంతగా విజయవంతం కాలేదు. ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ ఏవో కొన్ని పద్ధతులు చెబుతున్నా, వాటిలో ఏవీ పెద్దగా ఫలితాలనివ్వడంలేదు. మొదళ్లు మిగలకుండా పూర్తిస్థాయిలో వరిగడ్డి మొత్తాన్ని కోసే యంత్రాలను సబ్సిడీ మీద రైతులకు అందిస్తామని పంజాబ్‌ ప్రభుత్వం చెబుతోంది. ఈ సీజన్‌ కోసం దాదాపు లక్ష వరకు ఇలాంటి యంత్రాలను సిద్ధం చేశామని చెబుతోంది. ఈ యంత్రాలపై మాత్రం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఇవైనా సత్ఫలితాలు అందించి, పంట వ్యర్థాల దహనాల కట్టడికి దోహదం చేస్తే రాబోయే శీతాకాలంలో దిల్లీ, పరిసర ప్రాంతాలకు కాలుష్యం బాధ కొంతవరకైనా తగ్గుతుంది.

 

- కామేశ్వరరావు పువ్వాడ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మరణశిక్షే పరిష్కారమా?

‣ భారత దౌత్యనీతికి పరీక్ష

‣ అవరోధాల సుడిలో మానవాభివృద్ధి

‣ ‘తీస్తా’ ఒప్పందంపై ప్రతిష్టంభన

‣ వాణిజ్య ఒప్పందాలపై ఆచితూచి...

‣ ఆత్మనిర్భరతే భారత్‌ కర్తవ్యం

‣ సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేనా?

Posted Date: 21-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం