• facebook
  • whatsapp
  • telegram

మరణశిక్షే పరిష్కారమా?

మనదేశంలో మరణశిక్షలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరణ శిక్ష విధించినంత మాత్రాన నేరాలు తగ్గిపోతాయనుకోవడం భ్రమ. అలాగే శిక్షను రద్దు చేసిన దేశాల్లో నేరాలు పెరిగిన దాఖలాలూ లేవు.

ఒకే సమస్యపై న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించడం చూస్తే- న్యాయమనేది రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు, ధర్మ సూత్రాల బట్టి జరుగుతుందా లేక జడ్జీల వ్యక్తిగత ఇష్టాయిష్టాల బట్టి జరుగుతుందా అని సామాన్య పౌరుడికి అనుమానం రాకమానదు. ఇదే అనుమానాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనేక కేసుల్లో వెలిబుచ్చిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మరణశిక్ష తీర్పులపై సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి సందేహాన్ని వ్యక్తం చేసింది. బి.ఎస్‌.అలోక్‌నాథ్‌ దత్తా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌ (2007), స్వామి శ్రద్ధానంద వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక (2008), సంతోష్‌ కుమార్‌ సతీశ్‌ భూషణ్‌ బరియార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (2009) కేసుల్లో తీర్పులే దీనికి ఉదాహరణ. ఈ ఏడాది ఏప్రిల్‌ 22న ఇర్ఫాన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ (2022) కేసులో జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం- న్యాయమూర్తులు లోతుగా విశ్లేషించకుండా మరణ శిక్షలు విధించడాన్ని తప్పుపట్టింది. అంతేకాకుండా, మరణ శిక్ష పడిన నేరస్థులు ఆ శిక్షను తమకు ఎందుకు వర్తింపజేయకూడదో కోర్టుకు విన్నవించుకునే అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం భావించింది. ఈ అవకాశాన్ని ఇవ్వడానికి ట్రయల్‌ కోర్టులు అనుసరించాల్సిన ఏకరూప మార్గదర్శక సూత్రాలను రూపొందించే అంశాన్ని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని త్రిసభ్య బెంచి తాజాగా నిశ్చయించింది. ముద్దాయికి మరణ శిక్ష పడిన తరవాతనే దాన్ని తనకు ఎందుకు వర్తింపజేయకూడదో వివరించే అవకాశమిస్తున్నారు. కానీ, ప్రాసిక్యూషన్‌కు మాత్రం విచారణ మొదలైనప్పటి నుంచి మరణ శిక్ష విధించాలంటూ వాదించే అవకాశం లభిస్తోంది. దీనివల్ల ముద్దాయికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి సుప్రీంకోర్టు ఉపక్రమించడం స్వాగతించాల్సిన అంశం. మనస్తత్వ నిపుణులు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు తదితరులతో చర్చించిన తరవాతనే ముద్దాయికి మరణ శిక్ష విధించే విషయమై తుది నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

అరుదుగానే...

న్యాయమూర్తులు మరణ శిక్ష విధించేముందు దానికి కారణాలేమిటో స్పష్టం చేయాలని భారతీయ నేర శిక్షాస్మృతి (1973)లోని 354 (3) సెక్షన్‌ నిర్దేశిస్తోంది. 354 (5) సెక్షన్‌ ఉరిశిక్షకు సంబంధించినది. సెషన్స్‌ కోర్టు మరణశిక్ష విధిస్తే దాన్ని హైకోర్టు నిర్ధారించాలి. ముద్దాయి క్షమాభిక్ష కోసం అర్జీ పెట్టుకుంటే, దానిపై తుది నిర్ణయం వెలువడే వరకు మరణ శిక్షను నిలిపి ఉంచాలి. ముద్దాయి నేరుగా సుప్రీంకోర్టుకు అప్పీలు చేసే అవకాశాన్ని రాజ్యాంగంలోని 134వ అధికరణ కల్పిస్తోంది. మరణ శిక్ష తీర్పులో పొరపాటు జరిగినా, కొత్త సాక్ష్యం వెలుగు చూసి సమీక్షించాల్సి వచ్చినా సుప్రీంకోర్టు బెంచి కాని, కనీసం ముగ్గురు జడ్జీల ధర్మాసనం కాని పరిమిత స్థాయిలో బహిరంగ విచారణ జరపవచ్చని 137వ రాజ్యాంగ అధికరణ అనుమతిస్తోంది. మహమ్మద్‌ ఆరిఫ్‌ వర్సెస్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ సుప్రీంకోర్టు కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశాన్ని స్పష్టం చేసింది. సైనిక సిబ్బందికి కోర్ట్‌ మార్షల్‌ ద్వారా మరణ శిక్ష విధించాలంటే కనీసం అయిదుగురు సీనియర్‌ అధికారులు తీర్పరులుగా కూర్చోవాలని త్రివిధ సాయుధ బలగాల చట్టాలు పేర్కొంటున్నాయి. మరణ శిక్షను ఎంతో అరుదుగా తప్ప విధించకూడదని బచ్చన్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఉద్ఘాటించింది. ప్రత్యామ్నాయ శిక్ష విధించడానికి, నేరస్థుడిని సంస్కరించడానికి అవకాశమే లేదని నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే అలాంటి శిక్ష విధించాలని స్పష్టీకరించింది. మరణ శిక్ష పడిన నేరస్థుడు క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి కాని, గవర్నర్‌కు కాని అర్జీ పెట్టుకోవడాన్ని రాజ్యాంగం సమ్మతిస్తోంది. ఈ పిటిషన్లపై తుది నిర్ణయం వెలువడటానికి సుదీర్ఘ కాలయాపన జరిగినట్లయితే శిక్షను తగ్గించాలని 2014లో శతృఘ్న చౌహాన్‌ కేసులో సుప్రీం తీర్పు ఇచ్చింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరణ శిక్ష విధింపు అనేది న్యాయమూర్తుల వ్యక్తిగత ఇష్టాయిష్టాల ఆధారంగా జరుగుతోందని జస్టిస్‌ కురియన్‌ బహిరంగంగా వెల్లడించారు.

అందరికీ అందని న్యాయం

భారత్‌లో కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలకు అతీతంగా న్యాయం జరుగుతుందని రాజ్యాంగం భరోసా ఇచ్చింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అది ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాకారం కాలేదు. మరణ శిక్ష పడిన పేదలు, ధనికుల తరఫున వాదించే వకీళ్ల విషయంలో ఎంతో తేడా కనిపిస్తోంది. పేదల తరఫున వాదించే వకీళ్లకు న్యాయశాస్త్ర ప్రావీణ్యం, వనరులు తక్కువ కావడంతో వారు న్యాయం కోసం గట్టిగా పోరాడలేకపోతున్నారు. నేరస్థులు స్థితిమంతులైతే వారి తరఫున ఉద్దండులైన వకీళ్లు రంగంలోకి దిగి మరణ శిక్షను కనీసం యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించగలుగుతారు. ఇంతకన్నా దుర్విచక్షణ ఏముంటుంది? కోర్టులు విధించే శిక్షలలో పునరావాసం, సహానుభూతి, సంస్కరణలకు అవకాశం ఉండాలి. నేరస్థులు గాడి తప్పిన తమ ఆలోచనా సరళిని యోగా, ధ్యానాలతో సరిదిద్దుకునే వెసులుబాటు ఉండాలి. గాంధేయ విలువలకు అనుగుణంగా నేరస్థుల హృదయాల్లో పరివర్తన తీసుకొచ్చి బాధ్యతాయుతులైన కుటుంబ సభ్యులుగా, పౌరులుగా నడుచుకునే అవకాశం ఇవ్వాలి.

భిన్న వాదనలు 

రాటుదేలిన నేరస్థులకు మరణ శిక్ష విధిస్తే ఇతరులను తీవ్ర నేరాలకు ఒడిగట్టకుండా నిరోధించవచ్చనేది కొందరి వాదన. ఎంతటి నేరచరితుడినైనా బాధ్యతాయుత పౌరుడిగా మార్చవచ్చని మరికొందరు వాదిస్తారు. న్యాయమూర్తులూ మానవ మాత్రులే కాబట్టి పొరపాటున మరణశిక్ష విధించే ప్రమాదమూ ఉంటుంది. మరణశిక్ష అమలైపోయాక అది తప్పని తేలినా చేయగలిగేదేమీ ఉండదు. రాజ్యాంగ ధర్మాసనాల తీర్పుల్లోనూ పొరపాట్లు దొర్లిన సందర్భాలు ఉన్నాయి. అసలు శిక్షలు విధించే ముందు నేరాలకు మూల కారణాలేమిటో అర్థం చేసుకోవాలి. పేదరికం, పెంపక లోపం, నిరక్షరాస్యత, సమాజం దూరంగా పెట్టడం వంటి కారణాలు వ్యక్తులను నేరాలకు పురిగొల్పుతాయి. దీన్ని అర్థం చేసుకుని వ్యక్తులను సంస్కరించడానికి ప్రయత్నించాలని, వారి పునరావాసానికి తోడ్పడాలనేది ఆలోచనాపరుల అభిప్రాయం.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత దౌత్యనీతికి పరీక్ష

‣ అవరోధాల సుడిలో మానవాభివృద్ధి

‣ ‘తీస్తా’ ఒప్పందంపై ప్రతిష్టంభన

‣ వాణిజ్య ఒప్పందాలపై ఆచితూచి...

‣ ఆత్మనిర్భరతే భారత్‌ కర్తవ్యం

‣ సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేనా?

Posted Date: 21-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం