• facebook
  • whatsapp
  • telegram

సరిహద్దు ఉద్రిక్తతలు చల్లారేనా?

ఎస్‌సీఓ సదస్సు

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. చైనా అధినేత జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో పాటు మోదీ పాల్గొననుండటంతో ఈ శిఖరాగ్రం ఆసక్తికరంగా మారింది. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో 2020, 21 సదస్సులను దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, భారత్‌ చైనాల మధ్య గల్వాన్‌ ఘటనల అనంతరం ఉద్రిక్తతలు ఏర్పడటం... ఇటీవలే గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌ సెక్టార్లలో ఇరుదేశాలు తమ దళాలను వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. సమకాలీన ప్రపంచంలో ఉక్రెయిన్‌, తైవాన్‌ అంశాలు ఉద్రిక్తతలు రేకెత్తించాయి. అణ్వాయుధ పాటవం కలిగిన రష్యా, చైనాలు ఈ అంశాలపై సంయమనం కోల్పోయినట్లైతే ప్రపంచం ప్రమాదంలో పడుతుంది.

షాంఘై సహకార సంస్థలో కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లతో పాటు చైనా, రష్యా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐరోపా, ఆసియాలకు అనుసంధానంగా ఉండటంతో సంస్థ ప్రపంచంలో కీలకంగా మారింది. అయితే వాస్తవ పరిస్థితులను పరిగణిస్తే మనకు చైనాతో సరిహద్దు సమస్యలు, పాక్‌ నుంచి సీమాంతర ఉగ్రవాద సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఆయాదేశాలు ఎలాంటి కృషీ చేయడం లేదు. అఫ్గాన్‌లో తాలిబన్ల పునరాగమనంతో మనకు కాబుల్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1996లో ‘షాంఘై అయిదు’ కూటమిగా ఉన్న చైనా, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, రష్యా, తజికిస్థాన్‌లు- షాంఘై సహకార సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. అనంతరం ఉజ్బెకిస్థాన్‌ సభ్యత్యం పొందింది. 2017లో భారత్‌, పాక్‌ చేరికతో సభ్యదేశాల సంఖ్య ఎనిమిదికి చేరింది. పరిశీలక హోదాలో అఫ్గానిస్థాన్‌, బెలారస్‌, ఇరాన్‌, మంగోలియా; చర్చల భాగస్వామి హోదాలో అజర్‌బైజన్‌, ఆర్మేనియా, కాంబోడియా, నేపాల్‌, తుర్కియే, శ్రీలంక ఉన్నాయి. ఈ కూటమిని నాటో కూటమికి వ్యతిరేకంగా రూపొందించినట్లు కొందరు పేర్కొంటున్నా- కూటమిలోని దేశాలకు ఎలాంటి సైనిక ఒడంబడికలు లేవు. ఈ సమావేశాల్లో ఇరాన్‌కు సభ్యత్వం ఇచ్చే అవకాశముంది.

షాంఘై సహకార సంస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చైనాకు ప్రపంచ ఆర్థికశక్తిగా బలపడాలన్నది ప్రగాఢవాంఛ. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌లో భాగమైన చైనా-పాకిస్థాన్‌ నడవా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌నుంచి వెళుతుండటాన్ని భారత్‌ ప్రశ్నిస్తోంది. ఈ మార్గం ఆక్రమిత కశ్మీర్‌ద్వారా నిర్మించడం కచ్చితంగా భారత సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని అంతర్జాతీయ వేదికలపై నిలదీసింది. ఎస్‌సీఓలోని కీలకాంశాలైన అనుసంధానత, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలు కూటమిలోని దేశాలను ఆర్థికంగా బలీయం చేస్తాయని బీజింగ్‌ చెబుతోంది. అయితే ఈ ముసుగులో డ్రాగన్‌ విస్తరణవాదాన్ని అంగీకరించేది లేదని దిల్లీ ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు ఉత్తర, దక్షిణ ప్రపంచాన్ని అనుసంధానం చేసే కీలక ప్రాజెక్టులైన అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా నడవా మార్గం ఆసియాన్‌-భారత్‌లను రష్యా మీదుగా ఐరోపాతో కలుపుతుంది. వ్లాదివొస్తోక్‌-చెన్నై సముద్ర నడవాలో రష్యాతో అనుసంధాన మార్గాలు పూర్తికావాలంటే భారత్‌ చేయూత తప్పనిసరి. అందుకనే ఎస్‌సీఓలోని ప్రధాన దేశాలైన రష్యా, చైనాలు దిల్లీతో సత్సంబంధాలకు కృషి చేస్తున్నాయి. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయగల సత్తా మన టెక్‌ కంపెనీలకు ఉండటంతో- డ్రాగన్‌ గుత్తాధిపత్యానికి కళ్లెం వేసేందుకు కూటమిలోని దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి. 2020 సదస్సులో అంకురాల కోసం ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలన్న సూచనకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపారు. డిజిటల్‌ సాంకేతికత సాయంతో పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించవచ్చని నిపుణులు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది ఎస్‌సీఓ సమావేశాలు దిల్లీలో జరగనున్నాయి. దీంతో సమర్కండ్‌ సమావేశాల చివర్లో భారత్‌కు అధ్యక్ష హోదా అప్పగించనున్నారు. మధ్య ఆసియాతో వాణిజ్య సంబంధాల పెంపు భారత్‌కు అత్యంత ఆవశ్యకం. ఇరాన్‌ ద్వారా మధ్య ఆసియాకు చేరే అవకాశాలు మనకు చాబహార్‌ద్వారా లభిస్తున్నాయి. దీంతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం పెట్రోలియం, గ్యాస్‌ల ధరలు పెరుగుతుండటం భారత ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతోంది. దీంతో రష్యా, మధ్యాసియా దేశాలు తమ చమురు సరఫరాల ద్వారా ఈ లోటును భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు చతుర్భుజ కూటమిలో కీలక పాత్రలో ఉన్న భారత్‌ దౌత్యనీతి నైపుణ్యంతో ఎస్‌సీఓలోనూ ప్రధాన భూమిక పోషించడం విశేషం. సమర్కండ్‌లో జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపే అవకాశముంది. ఈ సమావేశం ఉభయ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు దోహదం చేస్తుందేమో చూడాలి!

- కొలకలూరి శ్రీధర్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పాలనలో తగ్గుతున్న జనభాగస్వామ్యం

‣ సాగురంగానికి నీటి కొరత ముప్పు

‣ అభివృద్ధి పథంలో భారత్‌

‣ సంక్లిష్ట సమయంలో స్నేహ మంత్రం

Posted Date: 16-09-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం