• facebook
  • whatsapp
  • telegram

సంక్లిష్ట సమయంలో స్నేహ మంత్రం

బంగ్లా ప్రధాని భారత పర్యటన

 

 

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా నాలుగు రోజుల పర్యటనకు భారత్‌ రానున్నారు. సెప్టెంబర్‌ అయిదు నుంచి ఎనిమిదో తేదీ వరకు దిల్లీ, అజ్‌మేర్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ల ఆతిథ్యం స్వీకరించడంతో పాటు, ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. అధికార యంత్రాంగం, వ్యాపార, వాణిజ్యవేత్తల భారీ బృందంతో వస్తున్న హసీనా- బహుముఖ ప్రయోజనాలు లక్షిస్తున్నారు. ఈ పర్యటన వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ జనాభాలో 13.1శాతం (సుమారు 2.8కోట్లు) ఉన్న హిందువుల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యగా విశ్లేషణలు వస్తున్నాయి. గతేడాది మార్చిలో పశ్చిమ్‌ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ అనూహ్యంగా ఢాకాలో పర్యటించారు. ఆ దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలతో పాటు బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ శతజయంతి వేడుకలకు హాజరయ్యారు. బెంగాల్‌లో సుమారు కోటి జనాభా గల మతువా వర్గంవారు తమ మూలపురుషుడిగా భావించే హరిచంద్‌ ఠాకూర్‌ జన్మస్థలాన్ని సందర్శించారు. దీన్ని మతువా ఓటర్ల మనసు చూరగొనే చర్యగా అప్పట్లో మీడియా విశ్లేషించింది. ఈ రెండు ఉదాహరణలు ఇరుదేశాల ప్రజల ఆలోచనా ధోరణుల్లోని సారూప్యతలకు అద్దం పడుతున్నాయి. వేల ఏళ్లుగా భాష, సంస్కృతి, సంప్రదాయాల్లోని ఏకరూపత భారత్‌, బంగ్లాల బంధాన్ని పటిష్ఠంగా నిలిపింది. ఇటీవల ఈ సంబంధాల్లో కొంత అంతరం వచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలు బంగ్లాకు ఆగ్రహం తెప్పించాయి. అక్కడి మైనారిటీ హిందువులపై దాడులు, చైనాతో బంగ్లా చెట్టపట్టాల్‌ దిల్లీ అసంతృప్తికి కారణమయ్యాయి.

 

ఇండియా చొరవతోనే పాకిస్థాన్‌ నుంచి విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్‌- భారత్‌ ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ విధానానికి ప్రధాన మూలస్తంభంగా నిలిచింది. ఈ దఫా హసీనా పర్యటనకు పూర్వరంగంగా, ఉమ్మడి నదుల పరస్పర ప్రయోజనాలకు 1972లో నెలకొల్పిన సంయుక్త నదీ కమిషన్‌ (జేఆర్‌సీ) ఉన్నతాధికారులు ఆగస్టులో సమావేశమయ్యారు. తీస్తా, పద్మా, కుషియార్‌ సహా 54 నదుల్లో వాటాల పంపకంపై అంగీకారానికి వచ్చారు. సుంకాలులేని స్వేచ్ఛావాణిజ్యానికి వీలుగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ-సెపా)పై చర్చలను శీఘ్రతరం చేయాలని బంగ్లా యోచిస్తోంది. భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల మధ్య వాహనాల రాకపోకలకు రహదారులను (బీబీఐఎన్‌ ప్రాజెక్టు) అనుసంధానించాలని భారత్‌ తలపోస్తోంది. 1965 వరకు ఉన్న రైల్వే లైన్లను పునరుద్ధరించాలని, ఇరు దేశాల నడుమ మరో మూడు రైళ్లు నడపాలని కోరుకొంటోంది.

 

పేద దేశాల జాబితా నుంచి మధ్యాదాయ దేశాల పట్టికలో చేరిన బంగ్లాదేశ్‌ వృద్ధి రేటులో పురోగమిస్తోంది. ఇరుదేశాల నడుమ వాణిజ్య విలువ 2021లో సుమారు 86 వేల కోట్ల రూపాయలకు చేరింది. చేనేత, వస్త్రపరిశ్రమ, సాగు, కృత్రిమ మేధ, ఉపగ్రహ ప్రయోగాలు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తదితర అంశాల్లోనూ పొరుగు దేశానికి సాయపడాలని భారత్‌ భావిస్తోంది. సైనిక సహకారంపై ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చేందుకు ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే ఇటీవల ఢాకాలో పర్యటించారు. గ్యాస్‌ దిగుమతిపై ప్రధానుల భేటీలో ఒప్పందాలు కుదరనున్నాయి. ఇండియా-బంగ్లా సంయుక్తంగా నిర్మించిన 1,320 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంటును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 4,096 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు వివాదాన్ని 2015లో శాశ్వతంగా పరిష్కరించుకున్న మోదీ-హసీనా ద్వయం, చొరబాట్లపై కట్టుబాట్లు నిర్దేశించుకోవాలి. రేపటి ఎన్నికల్లో అధికార అవామీ లీగ్‌ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ గెలిచినా భారత్‌-బంగ్లా సంబంధాల్లో పెడపోకడలు పొడచూపకుండా కాపాడుకోవడం ఇరుదేశాల కర్తవ్యం.

 

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర రవాణా, పరస్పర సహకార లక్ష్యంతో ఆవిర్భవించిన క్వాడ్‌ వేదిక విస్తరణకు చైనా అడ్డుపడుతోంది. బంగ్లాను క్వాడ్‌లో చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు ఆదిలోనే అడ్డుపుల్ల వేసింది. బంగ్లా నుంచి సుమారు 98శాతం దిగుమతులపై సుంకాలను ఎత్తివేసింది. తనకు భారంగా పరిణమిస్తున్న రొహింగ్యా శరణార్థుల వలసలకు అడ్డుకట్ట వేయాలన్న ఢాకా అభ్యర్థనతో మయన్మార్‌ను కట్టడి చేస్తోంది. బంగ్లాదేశ్‌ను ‘దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామి’గా చైనా అభివర్ణిస్తుంటే, ‘ఒన్‌ చైనా’ విధానానికి ఢాకా వంత పాడుతోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బీఆర్‌ఐ) సహా మౌలిక వసతుల కల్పనకు ఆ దేశంలో చైనా పెట్టుబడులు గుమ్మరిస్తోంది. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో బంగ్లా సహా దక్షిణాసియా దేశాలతో చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడం ద్వారానే చైనా దూకుడుకు భారత్‌ ముకుతాడు వేయగలదు.

 

- బోండ్ల అశోక్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పటిష్ఠ నిఘా... దేశానికి రక్షాకవచం

‣ సాగరయుద్ధంలో స్వదేశీఅస్త్రం

‣ శాశ్వత సభ్యత్వం ఇంకెప్పుడు?

‣ చుక్కాని కరవైన హస్తం పార్టీ

‣ ప్రమాదంలో పాల ఉత్పత్తి

‣ నదుల్లో గరళప్రవాహం

‣ చైనా యుద్ధోన్మాద విన్యాసాలు

‣ సాగు బాగుకు సాంకేతిక సోపానం

Posted Date: 05-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం