• facebook
  • whatsapp
  • telegram

పటిష్ఠ నిఘా... దేశానికి రక్షాకవచం

సంస్కరణలు, సమన్వయం అత్యవసరం

\

భారత్‌ ప్రపంచ దేశాల్లో ప్రబల ఆర్థిక శక్తిగా, భౌగోళిక రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. ఈ తరుణంలో దేశంలోని నిఘా సంస్థల్లోని లోపాలను సవరించుకోకపోతే పొరుగు దేశాల ప్రాయోజిత కార్యకలాపాల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం కష్టమవుతుంది. దేశంలో విభిన్న రకాల నిఘా, సమాచార సేకరణ సంస్థలు, వ్యవస్థలున్నాయి. ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), పరిశోధన, విశ్లేషణ విభాగం (రా), డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (డీఐఏ), జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌టీఆర్‌ఓ) వంటివి ఉన్నాయి. వీటిలో డీఐఏ తప్ప మిగిలినవి ‘నిఘా సంస్థల (హక్కుల పరిమితి) చట్టం-1985’ ప్రకారం పనిచేస్తుంటాయి. వీటిలోని ఉద్యోగులు ‘అధికార రహస్యాల చట్టం-1923’కు లోబడి ఉంటారు. కీలకమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకునే అవకాశం వారికి ఉండదు.

మెరుపులు... మరకలు

భారత నిఘా సంస్థలు దేశీయంగా, విదేశాల్లో చాలా విజయాలను నమోదు చేశాయి. ఇందులో పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) పాత్ర గణనీయం. 2009లో నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లలో తీవ్రవాదుల ఏరివేతకు రా, ఐబీ సంయుక్తంగా 400 ఆపరేషన్లలో పాల్గొన్నాయి. ముజిబుర్‌ రహమాన్‌, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్యల సమాచారాన్ని ‘రా’ ముందుగా తెలుసుకోలేకపోయిందనే విమర్శ ఉంది. 1999లో కార్గిల్‌ చొరబాట్లు, ముంబయిలో (26/11) దాడులు, 2020లో లద్దాఖ్‌లో చైనా ఆక్రమణలను గుర్తించడంలోనూ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనా, పాకిస్థాన్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. భారత్‌ ప్రభావాన్ని, శక్తిని ప్రపంచానికి తెలియజెప్పడంలో ‘రా’ కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్‌టీఆర్‌ఓతో పాటు అన్ని సంస్థలకు సొంత సాంకేతిక వ్యవస్థలున్నాయి. సైన్యం, వైమానిక, నావికాదళాలకు కూడా నిఘా విభాగాలున్నాయి. ఇవన్నీ సాధారణ కార్యాచరణల్లో సరైన విజయాలనే నమోదు చేస్తున్నా- కొన్ని లోపాల వల్ల వ్యూహాత్మక నిఘాలో అప్పుడప్పుడు విఫలమవుతున్నాయి. వీటిలో నియామకాలు, సమన్వయం, జవాబుదారీతనం, పర్యవేక్షణ లోపాలను సరిదిద్దడానికి సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముంది. ఇందుకోసం 2000లో కార్గిల్‌ సమీక్ష కమిటీ, 2011లో రక్షణ, భద్రతా సంస్కరణలపై నరేష్‌చంద్ర కమిటీ, 2012లో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలిసిస్‌ (ఐడీఎస్‌ఏ)’ కార్యదళం నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి.

నిధులు, వసతుల కొరత అధికంగా ఉన్న భారత్‌ వంటి సువిశాల దేశంలో సమాచార సేకరణ సులభం కాదు. 2013లో పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం- ఐబీకి కేటాయించిన వాస్తవ బలగం 26,867 మందిలో ఎనిమిది వేల స్థానాలు ఖాళీ. ‘రా’లో పోలీసు శాఖ నుంచి తాత్కాలిక బదిలీ (డిప్యుటేషన్‌)పై వచ్చినవారే అధికం. అమెరికాలోని సీఐఏ, బ్రిటన్‌లోని ఎంఐ-6 మాదిరిగా సొంత బలగం ఉండాలని విధాన రూపకర్తలు భావించారు. నియామకాల్లో భాషా నైపుణ్యాలు, వ్యూహాత్మక అంశాలు, సాంస్కృతిక పరిజ్ఞానం, సాంకేతికతపై పట్టు ఉన్న యువతకు ప్రాధాన్యమివ్వాలి. సీఐఏ, ఎఫ్‌బీఐలు సైబర్‌ సెక్యూరిటీలో ప్రావీణ్యమున్నవారిని ప్రోత్సహిస్తున్నాయి. బ్రిటన్‌లో జీసీహెచ్‌క్యూ సైతం భవిష్యత్తులో నియమించుకోవడానికి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్‌ ప్రోగ్రామింగ్‌ను నేర్పిస్తోంది. భారత్‌ ఆ దిశగా చొరవ చూపాలి. సమాచారాన్ని స్వల్ప వ్యవధిలో అన్ని నిఘా వ్యవస్థలు క్రోడీకరించుకుని... తగిన కార్యాచరణను అనుసరించినప్పుడే విజయాలు సాధ్యం. ఇందులో సమన్వయం ప్రధానం. ఇతర నిఘా వ్యవస్థలతోనూ, రాష్ట్రాల పోలీసులతోనూ ‘రా’కు అంతగా సమన్వయం లేదు. కొన్ని కమిటీల సలహాలు, సూచనలపై ఆధారపడి పార్లమెంటు వీటిని పర్యవేక్షిస్తోంది. అమెరికాలోని సీఐఏ, రష్యాలోని ఎఫ్‌ఐఎస్‌, బ్రిటన్‌లోని ఎంఐ-5, ఎంఐ-6లకు కార్యనిర్వహణ, ఆర్థిక, శాసన సంబంధ అంశాల్లో చట్టపరమైన జవాబుదారీతనం ఉంది. భారత్‌ కూడా అటువంటి అంశాలపై దృష్టి సారించాలి.

సాంకేతిక స్వావలంబన కీలకం

దేశంలోని గూఢచార సంస్థలన్నింటినీ సంయుక్త నిఘా కమిటీ (జేఐసీ) పర్యవేక్షిస్తుంది. ఇందులో రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, రా, ఐబీ ప్రతినిధులతో పాటు త్రివిధ దళాల నిఘా సంస్థల సంచాలకులు ఉంటారు. వీటి కార్యకలాపాల అంచనా, లక్ష్యాలను నిర్దేశించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. సరైన కార్యాచరణకు ముందు అన్ని రకాల సూచనలు, సమాచారాన్ని క్రోడీకరించి చర్యలు చేపట్టడానికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. సమన్వయానికి, జవాబుదారీతనానికి జాతీయ నిఘా సలహాదారును నియమించాలని కార్గిల్‌ సమీక్షా కమిటీకి నేతృత్వం వహించిన భద్రతా నిపుణుడు కె.సుబ్రహ్మణ్యం సూచించారు. భద్రత, నిఘా సాంకేతికతల్లో అమెరికా, ఇజ్రాయెల్‌ సాధించిన ప్రగతి ప్రపంచ గుర్తింపు పొందింది. 2030 నాటికి చైనా ప్రపంచంలో అత్యంత పెద్ద పరిశోధన, అభివృద్ధి దేశంగా రూపొందనుంది. ప్రధానంగా నిఘా, జాతీయ భద్రతాపరమైన అంశాలపైనే దృష్టిసారించనుంది. నిఘాపరమైన సాంకేతికత విషయంలో ఇజ్రాయెల్‌, అమెరికాలపైనే భారత్‌ ఆధారపడుతోంది. సొంతంగా దీన్ని సాధించడానికి, జాతీయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులను పెంచాలి. భారత నిఘా వ్యవస్థల్లోని లోపాలను సరిదిద్ది- చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.

ఐబీ: ఇది 1887లో భారత రాజకీయ నిఘా కార్యాలయం పేరిట ఏర్పాటైన సంస్థ. స్వాతంత్య్రానంతరం ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)గా ఏర్పడింది. హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పనిచేస్తుంది. దేశం లోపల నిఘాతో పాటు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ప్రపంచంలోని అయిదు ఉత్తమ నిఘా సంస్థల్లో ఐబీ ఒకటి. ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి వీలుగా దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరముంది.

రా: చైనా యుద్ధం (1962), పాకిస్థాన్‌ (1965) యుద్ధ సమయాల్లో సమాచారాన్ని సేకరించడంలో ఐబీ విఫలమైందనే ఉద్దేశంతో పరిశోధన, విశ్లేషణ (రా) విభాగాన్ని 1968లో ఏర్పాటుచేశారు. విదేశాల్లో గూఢచర్యం చేసే ఈ సంస్థ ప్రధానమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో పనిచేస్తోంది. బంగ్లాదేశ్‌ ఏర్పాటులో ‘రా’ ఒక సాధనంలా ఉపయోగపడింది. సిక్కిం భారత్‌లో విలీనం కావడంలో, ఖలిస్థాన్‌ తీవ్రవాదులకు పాక్‌ మద్దతును అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించింది.

ఎన్‌టీఆర్‌ఓ: జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్‌టీఆర్‌ఓ) 2004లో సాంకేతిక నిఘా సంస్థగా ఏర్పాటైంది. జాతీయ భద్రతా సలహాదారు, ప్రధానమంత్రి కార్యాలయాల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. గూఢచార ఉపగ్రహాలు, విమానాలు, మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీ)ల నుంచి సాంకేతిక సమాచారాన్ని సేకరించడం దీని లక్ష్యం.

డీఐఏ: కార్గిల్‌ యుద్ధం తరవాత 2002లో రక్షణ మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో ‘డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (డీఐఏ)’ని ఏర్పాటుచేశారు. సాయుధ బలగాల మధ్య సైనిక నిఘా సమన్వయ సాధన దీని లక్ష్యం. సైనిక నిఘా సంస్థల్లోని వ్యూహాత్మక లోపాలను ఇది సక్రమంగా గుర్తించలేకపోయిందనే విమర్శలున్నాయి.

- బి.కె.కిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాగరయుద్ధంలో స్వదేశీఅస్త్రం

‣ శాశ్వత సభ్యత్వం ఇంకెప్పుడు?

‣ చుక్కాని కరవైన హస్తం పార్టీ

‣ ప్రమాదంలో పాల ఉత్పత్తి

‣ నదుల్లో గరళప్రవాహం

‣ చైనా యుద్ధోన్మాద విన్యాసాలు

‣ సాగు బాగుకు సాంకేతిక సోపానం

Posted Date: 05-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం