• facebook
  • whatsapp
  • telegram

చైనా యుద్ధోన్మాద విన్యాసాలు

తైవాన్‌ ఆక్రమణకు తహతహ

 

 

తైవాన్‌ను చైనా ఏదో ఒకనాడు ఆక్రమించుకోవడం ఖాయమని అందరూ ఊహించేదే. ఆ పని ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రశ్న. చైనా తన సైన్యం, నౌకలు, విమానాలను పెద్దయెత్తున తైవాన్‌ తీరంలో మోహరించి భారీ విన్యాసాలు జరపడం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది. రోజూ విన్యాసాలు జరుపుతూనే ఏదో ఒక రోజు అకస్మాత్తుగా తైవాన్‌ మీద చైనా విరుచుకుపడుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏకకాలంలో భూమి, సముద్ర జలాల మీదుగా సైన్యాన్ని పెద్దయెత్తున తైవాన్‌కు చేరవేసే సామర్థ్యం చైనాకు లేనందువల్లే దండయాత్ర ఆలస్యమవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉభయచర సామర్థ్యాన్ని సంతరించుకోవడానికే బీజింగ్‌ దక్షిణ చైనా సముద్రంలోని దీవులను ఆక్రమించి, కృత్రిమ దీవులను నిర్మించి వాటిలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోందని వివరిస్తున్నారు. ఇటీవలే చైనా కొత్తగా రంగంలోకి దింపిన విమాన వాహక నౌక కూడా తైవాన్‌లోకి సైనికులను ఉరికించడానికి తోడ్పడుతుంది.

 

ఎన్నో కారణాలు...

ఇటీవల సంభవించిన మూడు పరిణామాలు చైనాను కదనానికి కాలుదువ్వేలా చేస్తున్నాయి. అవి- అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించడం; చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి తోడు బీజింగ్‌ నుంచి అప్పులు తీసుకున్న దేశాలు రుణ కిస్తీలను చెల్లించలేకపోవడం; త్వరలో చైనా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు సన్నాహాలు మొదలుపెట్టడం. ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తిన సమయంలోనే తైవాన్‌పై కత్తి ఝళిపించాలని చైనా నిర్ణయించుకోవడం కాకతాళీయం కాదు. ప్రపంచంలో ఆర్థికంగా, సైనికంగా అత్యంత శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించడానికి చైనా పాలకులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్ళారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ), సముద్ర సిల్క్‌ రోడ్‌ పథకాలను చేపట్టి అనేక దేశాలకు రుణాలిచ్చి, ఆ దేశాల్లో సహజ వనరులను గుప్పిటపట్టి, నిరంకుశ పాలకులకు మద్దతు ఇచ్చారు. ఈ విధంగా చైనా తన ప్రాబల్యాన్ని క్రమక్రమంగా విస్తరించుకుంది. బీఆర్‌ఐ పథకం ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఆర్థికాభివృద్ధిని, భారీ ఉద్యోగావకాశాలను కొనితెస్తుందని ఆశించారు. పాకిస్థాన్‌లో చేపట్టిన గ్వాదర్‌ రేవు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేశారు. ఈ పెట్టుబడులు 2017లో 43 కోట్ల డాలర్ల నుంచి 2030కల్లా 3000 కోట్ల డాలర్లకు పెరుగుతాయని, పాకిస్థాన్‌లో 12 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని భావించారు. ఆ అంచనాలేవీ వాస్తవం కాలేదు. శ్రీలంకలో హంబన్‌టోట రేవుతోపాటు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులకు చైనా ఇచ్చిన రుణాలు లంకను దివాలా తీయించి, ప్రభుత్వం దిగిపోవడానికి కారణమయ్యాయి. అఫ్గానిస్థాన్‌ను బీఆర్‌ఐ ఛత్రం కిందకు తీసుకురావాలనుకున్నా ఆ దేశంలో అస్థిర పరిస్థితులు అడ్డుపడుతున్నాయి. ఆఫ్రికాలోనూ బీఆర్‌ఐ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. ఏతావతా బీఆర్‌ఐ ప్రాజెక్టులకు రుణాలిచ్చిన చైనా బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న దేశాలు, సంస్థలు ఒక్క 2020-21లోనే 5200 కోట్ల డాలర్ల రుణ కిస్తీలను చెల్లించలేకపోయాయి. రానున్న రెండు మూడేళ్లలో మరో 38,500 కోట్ల డాలర్ల రుణాల ఎగవేత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. జీరో కొవిడ్‌ అంటూ చైనాలో అసలు ఒక్క కొవిడ్‌ కేసూ ఉండకూడదనే ఉద్దేశంతో కఠిన రీతిలో లాక్‌డౌన్లను అమలు చేయడం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తోంది. ఇన్ని సమస్యల మధ్య షీ జిన్‌పింగ్‌ మూడోసారి దేశాధ్యక్ష పదవిని అధిష్ఠించాలనుకొంటున్నారు. బహుశా జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తైవాన్‌ మీద దండెత్తి చైనీయుల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం అనువుగా ఉంటుందని కమ్యూనిస్టు పాలకులు భావిస్తుండవచ్చు. సంక్షోభాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి రాజకీయ నాయకులకు యుద్ధం అమోఘ సాధనమని చరిత్ర చెబుతోంది. మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను నిలువరిస్తున్న అమెరికా, ఐరోపా సమాఖ్య(ఈయూ)లకు తైవాన్‌ విషయంలో జోక్యం చేసుకునే ఓపిక, తీరిక ఉండవని బీజింగ్‌ అంచనా.

 

అప్రమత్తత తప్పదు

చైనా దూకుడు ఇతర పొరుగు దేశాల మాదిరిగానే భారత్‌కూ సమస్యలు సృష్టిస్తోంది. చైనా ఆమధ్య మాల్దీవుల్లో తమ టీవీ ప్రసారాలకు అనుమతి పొందింది. ఇటీవలే ఒక చైనా గూఢచారి నౌక భారత్‌ అభ్యంతరాలను లెక్కచేయకుండా శ్రీలంక రేవులో లంగరు వేసింది. ఇలా ప్రపంచం దృష్టిని మళ్ళించి తైవాన్‌పై బీజింగ్‌ దాడికి దిగే ప్రమాదం ఉందనే ఆందోళన పెరుగుతోంది. తైవాన్‌ సమీపంలో పదేపదే సైనిక విన్యాసాలు చేస్తూ ఉంటే ఇదేదో రోజువారీ వ్యవహారమేనని, పెద్దగా పట్టించుకోనక్కర్లేదని మిగతా ప్రపంచం ఏమరుపాటులోకి జారిపోవచ్చు. అదే సరైన అదనుగా చైనా దండయాత్రకు దిగవచ్చు. యుద్ధం జరిగితే భారతదేశానికి భద్రతాపరంగానే కాదు, ఆర్థికంగానూ చిక్కులు తలెత్తుతాయి. భారత్‌కు కావలసిన సెమీకండక్టర్లలో 75 శాతాన్ని తైవాన్‌ సరఫరా చేస్తోంది. డిజిటల్‌ భారత నిర్మాణానికి మైక్రోప్రాసెసర్లు, చిప్‌లు చాలా కీలకం. మరోవైపు భారతదేశానికి చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా. యుద్ధం ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీసే మాట నిజమే కానీ- హిందూ మహాసముద్రంలో, హిమాలయాల్లో చైనా కదలికల పట్ల భారత్‌ అప్రమత్తంగా ఉండక తప్పదు. భారతదేశ ఎగుమతి దిగుమతుల్లో 95 శాతం సముద్ర మార్గంలోనే జరుగుతాయి. దీన్ని కాపాడుకోవడానికి భారత్‌ తన నౌకాదళాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలి.

 

అమెరికాను అధిగమించే యత్నం

ప్రస్తుత చైనా కమ్యూనిస్టు పాలకులు 1911కి ముందున్న చైనా సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టారా అన్న ప్రశ్న అంతటా ప్రతిధ్వనిస్తోంది. క్రీస్తుపూర్వం తమ ఏలుబడిలో ఉన్న దేశాలూ మళ్ళీ తమ సార్వభౌమత్వంలోకి రావాలన్నది చైనా పాలకుల మంకుపట్టు. 1949లో చైనా ప్రధాన భూభాగం కమ్యూనిస్టు పార్టీ పాలనలోకి వెళ్లగా, అంతర్యుద్ధంలో ఓడిపోయిన చాంగ్‌ కై షేక్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ అప్పటి ఫార్మోజా దీవి(తైవాన్‌)కి పరారై అక్కడ సొంత ప్రభుత్వం ఏర్పరచుకుంది. రష్యా, చైనా తప్ప మిగిలిన దేశాల మద్దతుతో తైవాన్‌ మనుగడ సాగించింది. ప్రచ్ఛన్న యుద్ధంలో సోవియట్‌ యూనియన్‌ మీద పైచేయి సాధించడానికి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ 1970లలో చైనాతో సాధారణ సంబంధాలను ఏర్పరచుకున్నారు. అప్పుడే తైవాన్‌ చైనాలో అంతర్భాగమని గుర్తించారు. రెండింటి విలీనం శాంతియుతంగా జరగాలన్నది అమెరికా షరతు. తరవాత సోవియట్‌ విచ్ఛిన్నం కాగా, చైనా ఆర్థిక సంస్కరణలు చేపట్టి నేడు ప్రపంచంలో రెండో ప్రబల ఆర్థిక శక్తిగా నిలుస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి చెక్కుచెదరకుండా బయటపడిన చైనా ఈ శతాబ్దంలోనే ఆర్థికంగా అమెరికాను అధిగమించాలనుకొంటోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాగు బాగుకు సాంకేతిక సోపానం

‣ ఉగ్రవాదంపై ఉక్కుపాదం

‣ మయన్మార్‌లో అరాచకం

‣ లింగ సమానత్వం... ప్రగతికి మార్గం!

‣ జీవవైవిధ్య నెలవులు

Posted Date: 26-08-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం